భూమికి కవల.. అందమైన దేవత!

భూమిని దాటి అవతలి గ్రహాల్లో జీవం ఉందా లేదా అనే అంశంపై శతాబ్దాలుగా అనేక పరిశోధనలు సాగుతున్నాయి.

Published : 12 Apr 2024 00:56 IST

ప్రపంచ భూగోళ శాస్త్రం 

భూమిని దాటి అవతలి గ్రహాల్లో జీవం ఉందా లేదా అనే అంశంపై శతాబ్దాలుగా అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సౌరవ్యవస్థ నిర్మాణం, పరిణామం, గతిశీలతలకు సంబంధించిన పలు విశేషాలు వెల్లడయ్యాయి. సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి పరిధిలో నిర్దిష్టమైన కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రత, వాతావరణం, భ్రమణ, పరిభ్రమణ కాలాలు, ఉపగ్రహాల సంఖ్య పరంగా వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ గ్రహాల భౌతిక స్వరూపాలు, వాటిపై ఉన్న విభిన్న వాతావరణ పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. గ్రహచలనాలతో ఏర్పడే పరికల్పనలతోపాటు వాటి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, పడమర సూర్యోదయం జరిగే గ్రహాలు, అతి ప్రకాశవంతమైనవి, అత్యంత శీతల స్థితి కలిగినవి మొదలైన ఆసక్తికర వివరాలను తెలుసుకోవాలి.

గ్రహాలు- ప్రత్యేక లక్షణాలు

1) బుధుడు: సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. దీన్ని రోమన్లు నైపుణ్య, వాణిజ్య దేవుడిగా వ్యవహరిస్తారు. సౌర కుటుంబంలో అన్నింటికంటే చిన్నది కావడంతో ‘శాటిలైట్‌ ప్లానెట్‌’ (ఉపగ్రహ గ్రహం) అని పిలుస్తారు. దీనికే ‘అపోలో’ అనే పేరు కూడా ఉంది. బుధుడికి ఉపగ్రహాలు లేవు. భ్రమణ కాలం 58 రోజులు, పరిభ్రమణ కాలం 88 రోజులు. బుధుడి ఉపరితలంపై వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది. 56.8 రోజులు పగలు, 56.8 రోజులు రాత్రులుగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 427ాది, రాత్రి ఉష్ణోగ్రత -185ాది నమోదవుతాయి. సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసాలున్న గ్రహం (612ాది).

2) శుక్రుడు:  ఇది సౌర కుటుంబంలో అత్యంత  ప్రకాశవంతమైన, వేడి గ్రహం. ఉష్ణోగ్రత 600 డిగ్రీల సెం.గ్రే. ఉంటుంది. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఇదే. దీనికి వేగుచుక్క, ముసుగు గ్రహం, ఉదయ తార, సంధ్యా తార అనే పేర్లున్నాయి. ఈ గ్రహం చుట్టూ దట్టమైన మేఘావరణం ఉంటుంది. 95% కార్బన్‌ డై ఆక్సైడ్‌, సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌తో కూడిన మబ్బుల్లాంటి వాతావరణం ఉంది. దీని కారణంగా ఈ గ్రహ ఉపరితలం వైపు ప్రసరించే సౌరవికిరణంలో దాదాపు 70% పరావర్తనం చెందుతుంది. ఇది సౌరకుటుంబంలో అత్యంత ఆల్బిడో పరిమాణం ఉన్న గ్రహం (70%). దీని ఆత్మభ్రమణ కాలం 243 రోజులు, పరిభ్రమణ కాలం 225 రోజులు. ఇంత కన్నా ఎక్కువ ఆ కాలాలు ఉన్న గ్రహలు, ఉపగ్రహాలు లేవు. శుక్రుడి భ్రమణం తూర్పు నుంచి పడమరకు (సవ్య దిశ) ఉంటుంది. అందుకే ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ గ్రహాన్ని గ్రీకులు అందమైన దేవతగా భావిస్తారు. దీని పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రత భూమిని పోలి ఉండటంతో భూమికి కవల అంటారు.

3) భూమి: ఏకైక జీవ గ్రహం. జలయుత గ్రహం, నీలి గ్రహం కూడా. సౌర కుటుంబంలోనే ‘ప్రత్యేక గ్రహం’. భూమి వయసు దాదాపు 4.5 బిలియన్‌ సంవత్సరాలు. భూగోళం సగటు ఉష్ణోగ్రత 14.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌. భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 40,066 కి.మీ. (24,897 మైళ్లు). ధ్రువాల వద్ద చుట్టుకొలత 39,992 కి.మీ. (24,814 మైళ్లు). భూమధ్యరేఖ వద్ద భూవ్యాసం 12,756 కి.మీ. (7,926 మైళ్లు), ధ్రువాల వద్ద భూవ్యాసం 12,714 కి.మీ. (7,900 మైళ్లు). భూ కక్ష్య పొడవు 965 మిలియన్‌ కి.మీ. ఇది అత్యంత సాంద్రత ఉన్న గ్రహం (5.5 గ్రా./సి.సి.). గ్రహాల్లో సూర్యుడి నుంచి దూరం ప్రకారం భూమి మూడోది, పరిమాణం పరంగా అయిదోది. భూమి ఆకారం జియాయిడ్‌. అంటే భూమధ్యరేఖా ప్రాంతాలు ఉబ్బెత్తుగా ఉండి,  ధ్రువాల వద్ద అణిగినట్టు ఉంటుంది. భూకక్ష్య దీర్ఘవృత్తాకార మార్గంలో ఉండటంతో సూర్యుడికి, భూమికి మధ్య దూరం మారుతూ ఉంటుంది. భూమికి ఉన్న ఏకైక
ఉపగ్రహం చంద్రుడు.

పరిహేళి లేదా రవినీచ: ఇది సూర్యుడికి, భూమికి మధ్య కనిష్ఠ దూరాన్ని తెలియజేస్తుంది. భూమి తన కక్ష్యా  మార్గంలో జనవరి 3న ఈ స్థానంలోకి వస్తుంది. ఈ స్థితిలో భూమికి, సూర్యుడికి మధ్య కనిష్ఠ దూరం 147 మిలియన్‌ కిలోమీటర్లు. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి.
అపహేళి లేదా రవిఉచ్చ: ఇది సూర్యుడికి, భూమికి మధ్య గరిష్ఠ దూరాన్ని తెలియజేస్తుంది. జులై 4న భూమి ఈ స్థితిలోకి వస్తుంది. అప్పుడు భూమి, సూర్యుడికి మధ్య గరిష్ఠ దూరం 152 మిలియన్‌ కిలోమీటర్లు. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలో తక్కువగా ఉంటాయి.

చంద్రుడు: చంద్రుడు భూమి పరిమాణంలో నాలుగో వంతు. దీని గురుత్వ బలం భూమి గురుత్వబలంలో ఆరో వంతు ఉంటుంది. అందుకే చంద్రుడిలో వాతావరణం లేదు. చంద్రుడి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81వ వంతు. భూగోళం తరహాలోనే చంద్రుడు తన చుట్టూ తాను భ్రమణం చేస్తుంటాడు. చంద్రుడి భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానం. అందుకే చంద్రుడి ఒక అర్ధభాగం మాత్రమే ఎప్పుడూ మనకు కనిపిస్తుంది. చంద్రగోళపు అవతలి అర్ధభాగం అసలు కనిపించదు. చంద్రుడి భ్రమణ, పరిభ్రమణ కాలాలను రెండు రకాలుగా లెక్క కట్టవచ్చు. 1) స్థిర నక్షత్రాల సాపేక్షత ద్వారా చంద్రుడు భూమిని 27 1/3 రోజుల్లో చుట్టి తిరిగి వస్తాడు. దీన్నే చాంద్ర నక్షత్ర మాసమని పిలుస్తారు. 2) సూర్యుడి సాపేక్షత ద్వారా చంద్రుడు భూమి చుట్టూ  తిరగడానికి కొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. దీన్నే చాంద్రమాన మాసమని అంటారు. దీనికి 29 1/2 రోజులు పడుతుంది.

చంద్రుడు స్వయంప్రకాశం లేని చిన్న ఖగోళమూర్తి. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టేకాలం 1.3 సెకన్లు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉండటం వల్ల చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంత కాలం భూమికి దగ్గరగా, మరికొంత కాలం భూమికి దూరంగా ఉంటాడు. భూమికి దగ్గరగా ఉండే స్థితిని పెరిజీ అంటారు. ఈ స్థితిలో చంద్రుడికి, భూమికి మధ్యదూరం 3,64,000 కిలోమీటర్లు. భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. ఈ స్థితిలో భూమికి, చంద్రుడికి మధ్యదూరం 4,06,000 కిలోమీటర్లు. భూమికి, చంద్రుడికి మధ్య సగటు దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడి ఉపరితలంపై ఎత్తయిన శిఖరం ‘లిబ్‌ నిట్జ్‌’ (10,670 మీటర్లు).

  •  1969, జులై 20న మొదటిసారిగా నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌, మైకెల్‌ కొలైన్స్‌ అనే ఖగోళ పరిశోధకులను చంద్రుడి పైకి తీసుకెళ్లిన అమెరికన్‌ ఉపగ్రహం అపోలో శ్రీఖి. ఈ వాహకనౌక చంద్రుడిపై మారియస్‌ అనే ప్రదేశంలో దిగింది. అప్పటినుంచి ఈ ప్రదేశాన్ని శాంతి సముద్రం (sea of Tranquality) అని పిలుస్తున్నారు.  
  •  చంద్రుడి ఉపరితలాన్ని, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి భారతదేశం చంద్రయాన్‌ - 1, 2, 3 లను ప్రయోగించింది.

4) అంగారకుడు (కుజుడు): దీన్నే రెడ్‌ ప్లానెట్‌ లేదా అరుణ గ్రహం అంటారు. డస్ట్‌ ప్లానెట్‌/ఫియరీ ప్లానెట్‌ అని కూడా పిలుస్తారు. కారణం ఈ గ్రహంపై తరచూ అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించడం వల్ల వాతావరణంలో దుమ్ము, ధూళి రేణువులు అధిక పరిమాణంలో చేరతాయి. కుజుడిపై అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ ఒలంపస్‌ (24,000 మీటర్లు). ఈ గ్రహాన్ని యుద్ధదేవుడిగా భావిస్తారు. ఇక్కడ జీవి ఉండొచ్చని అనుకుంటున్నారు. దీని అక్షం, ఆత్మభ్రమణం, దినప్రమాణం భూమిని పోలి ఉన్నందువల్ల రుతువులు, రాత్రింబవళ్ల తేడాలు ఇక్కడ కూడా సంభవిస్తున్నాయి. అంగారకుడిపై జీవరాశిని పరిశీలించేందుకు 2011, నవంబరు 26న అమెరికా ‘క్యూరియాసిటీ’ అనే నౌకను పంపింది. ఈ గ్రహ ఆత్మభ్రమణ కాలం 24 గంటల 37 నిమిషాలు. పరిభ్రమణ కాలం 687 రోజులు. దీని ఉపగ్రహాలు 2.అవి 1) ఫోబస్‌ 2) డెమోస్‌.

5) బృహస్పతి (గురుడు): సౌర కుటుంబంలో అతిపెద్ద, అతిబరువైన గ్రహం. దీన్నే ‘నక్షత్ర గ్రహం’గా కూడా పిలుస్తారు. సౌరకుటుంబంలో అతితక్కువ ఆత్మభ్రమణ కాలం ఉన్న గ్రహం (9 గంటల 50 నిమిషాలు). దీని కోణీయ ద్రవ్యవేగం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ గ్రహాన్ని ‘రూలర్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ హెవెన్‌’ అంటారు. దీని వాతావరణం హైడ్రోజన్‌ (90%), అమ్మోనియా, మీథేన్‌ లాంటి విషపూరిత వాయువులతో ఉంది. అందుకే దీన్ని ‘గ్యాస్‌ జెయింట్‌’ అని వ్యవహరిస్తారు. ఇది ఎర్రటి మచ్చలున్న గ్రహం. సౌర కుటుంబంలో రెండో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం బృహస్పతి (79). అందులో ముఖ్యమైనవి గనిమెడ, కాలిస్టో, యూరోఫో, ఈవో. ఈ నాలుగింటిని ‘గెలిలీయో ఉపగ్రహాలు’ అని పిలుస్తారు. దీని ఉపగ్రహాల్లో అతిపెద్దది గనిమెడ. ఇది సౌరకుటుంబంలోనే అతిపెద్ద ఉపగ్రహం. బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్న గ్రహం.

6) శని (శాటర్న్‌): దీన్ని సౌరకుటుంబ మణిహారంగా పిలుస్తారు. ‘గాడ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’గా పేర్కొంటారు. దీని చుట్టూ దుమ్ము, ధూళి రేణువులతో కూడిన 3 అందమైన వలయాలు అలంకరణ వస్తువుల్లా ఏర్పడి ఉండటంతో అందమైన గ్రహంగా పేర్కొంటారు. సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం (82). వీటిలో అతి పెద్దది టైటాన్‌. దీన్ని సౌర కుటుంబంలోని రెండో అతిపెద్ద ఉపగ్రహంగా పరిగణిస్తున్నారు. దీని వాతావరణం నారింజ వర్ణంలో కనిపిస్తుండటంతో ‘ఆరెంజ్‌ ప్లానెట్‌’ అని కూడా అంటారు. శని గ్రహ వాతావరణ సంఘటనం బృహస్పతిని పోలి ఉంటుంది. ఈ గ్రహాన్ని క్రూయల్‌, గోల్డెన్‌ ప్లానెట్‌గా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత ఉన్న గ్రహం.

7) వరుణుడు (యురేనస్‌): గ్రీన్‌ ప్లానెట్‌, ‘గాడ్‌ ఆఫ్‌ ది స్కై’ అని పిలుస్తారు. కారణం ఈ గ్రహ వాతావరణంలో మీథేన్‌ వాయువు   అధికంగా ఉంటుంది. శుక్ర గ్రహం మాదిరిగా ఇది తూర్పు నుంచి  పడమరకు భ్రమణం చేస్తుంది. దీని అక్షం 98ాల కోణంతో ఒకవైపు వాలి ఉండటంతో ఈ గ్రహంపై అతిదీర్ఘ పగలు, అతిదీర్ఘ రాత్రులు  ఏర్పడతాయి (48 సంవత్సరాలు). అందుకే ఈ గ్రహాన్ని గతితప్పిన గ్రహం అంటారు. దీని పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు.      ఉపగ్రహాల సంఖ్య 27. వీటిలో ముఖ్యమైనవి మిరిందా, ఉమ భ్రిల్‌, ఏరియల్‌, టిటానియా.

8) ఇంద్రుడు (నెప్ట్యూన్‌): ఇది ఎక్కువగా వరుణ గ్రహంతోపాటు ఇతర ప్రధాన గ్రహాలను పోలిన గ్రహం. 165 ఏళ్లలో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేస్తుంది. 16 గంటల్లో తన అక్షంపై ఒక భ్రమణం చేస్తుంది. దీనికి 14 ఉపగ్రహాలున్నాయి. అందులో ముఖ్యమైనవి ట్రిటాన్‌, నెరియడ్‌. దీన్నే నిర్మానుష గ్రహంగా పేర్కొంటారు.

రచయిత:  జయకర్‌ సక్కరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని