వారి వారసత్వ పోరు.. వీరి సామ్రాజ్య కాంక్ష వెరసి వరుస యుద్ధాలు

భారతదేశ చరిత్ర భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన విదేశీయులు తర్వాతి కాలంలో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భావించారు. ఇక్కడి భూభాగంపై తమ సామ్రాజ్య స్థాపన కోసం అనేక యుద్ధాలు చేశారు. ఇందులో ఆంగ్లేయుల పాత్ర ముఖ్యమైంది.

Published : 13 Apr 2024 00:51 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ
పరీక్షల ప్రత్యేకం

భారతదేశ చరిత్ర భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన విదేశీయులు తర్వాతి కాలంలో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భావించారు. ఇక్కడి భూభాగంపై తమ సామ్రాజ్య స్థాపన కోసం అనేక యుద్ధాలు చేశారు. ఇందులో ఆంగ్లేయుల పాత్ర ముఖ్యమైంది. వీరు తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా స్థానిక రాజులతో రణాన్ని కోరారు.ఈ క్రమంలోనే బెంగాల్‌ను ఆక్రమించి, దక్షిణాపథంలోని మైసూరును చేజిక్కించుకుని, ఒక్కో రాజ్యాన్ని గెలుస్తూ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను బ్రిటిష్‌వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. తర్వాత వీరి చూపు మరాఠా సామ్రాజ్యంపై పడింది. మరాఠాలతో వీరు మూడు యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు - వాటి ఫలితాలపై పరీక్షార్థులకు అవగాహన అవసరం.

ఆంగ్లో - మరాఠా యుద్ధాలు (క్రీ.శ. 1775 - 1819)

భారతదేశంలో ఇంగ్లిష్‌ - ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్‌ చేసిన వారిలో మరాఠాల పాత్ర కీలకం. శివాజీ నేతృత్వంలోని మరాఠాల్లో జాతీయస్ఫూర్తి, దేశభక్తి పెల్లుబికింది. ఇది అతని మరణానంతరమూ చాలా సంవత్సరాలు సజీవంగా ఉంది. కర్ణాటక, మైసూర్‌ పాలకులపై విజయాలు సాధించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు మరాఠీల అధీనంలోని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వ్యూహరచన చేశారు. దీని ఫలితమే క్రీ.శ. 1775 - 1819 కాలంలో జరిగిన ఆంగ్లో - మరాఠా యుద్ధాలు. అమెరికా స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న కాలంలోనే ఈ మరాఠా యుద్ధాలు జరిగాయి. వారన్‌ హేస్టింగ్స్‌, కారన్‌వాలీస్‌, వెల్లస్లీ లాంటి సమర్థులైన గవర్నర్‌ జనరళ్ల కార్యదీక్ష, కుటిల రాజనీతి, సామ్రాజ్య కాంక్షకి తోడు మరాఠాల్లో నెలకొన్న అనైక్యత, అంతర్గత కలహాలు వారి పతనానికి, ఓటమికి కారణమయ్యాయి.

మొదటి ఆంగ్లో - మరాఠా యుద్ధం (క్రీ.శ. 1775 - 82)

పీష్వా బాలాజీ బాజీరావు రెండో కుమారుడైన పీష్వా మాధవరావు (క్రీ.శ. 1761 - 72) 1772లో మరణించాడు.

 • మరాఠాల్లో నెలకొన్న ఆంతరంగిక సమస్యలు, మాధవరావు తర్వాత పీష్వా కావాలనే అతడి పినతండ్రి రఘునాథరావు ఆకాంక్ష మరాఠాల్లో అంతఃకలహాలను తీవ్రమయ్యేలా చేశాయి.
 • క్రీ.శ. 1773 ఆగస్టు 30న పీష్వా నారాయణరావును హత్య చేయించిన రఘోబా తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు.
 • మూడో పానిపట్టు యుద్ధం నుంచి బతికి బయటపడిన బాలాజీ పండిట్‌ని నానాఫడ్నవీస్‌ అని పిలిచేవారు.
 • నారాయణరావు భార్య గంగాబాయి మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే నానాఫడ్నవీస్‌ వర్గమంతా ఆ శిశువునే పీష్వాగా గుర్తించాలని పట్టుపట్టడంతో రఘోబా ఇంగ్లిష్‌ వారి సహాయం కోరాడు. దీంతో యుద్ధం ప్రారంభమైంది.

సంధి ఒప్పందాలు - యుద్ధం

కంపెనీకి, రఘోబాకు మధ్య 1775లో సూరత్‌ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం సాల్సెట్టి, బసేన్‌, బ్రోచ్‌, సూరత్‌ జిల్లా నుంచి వచ్చే ఆదాయంలో కొంత తమకు ఇవ్వాల్సిందిగా ఆంగ్లేయులు కోరారు.

 • కంపెనీవారి ఖర్చును రఘోబా భరించే షరతు మీద 2500 మంది సేనలను ఇచ్చారు. ఈ విధంగా రఘోబా, కంపెనీవారు నానాఫడ్నవీస్‌ వర్గంతో యుద్ధం చేశారు.
 • 1773 రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ అనుమతి లేకుండా బొంబాయి, మద్రాసు గవర్నర్లు స్థానిక సంస్థానాధిపతుల కుదుర్చుకునే సంధులు లేదా యుద్ధాల్లో పాల్గొనకూడదు.
 • స్వతహాగా సామ్రాజ్యవాది అయిన వారన్‌ హేస్టింగ్స్‌ ఆ షరతులను లెక్క చేయలేదు. అయితే కలకత్తా గవర్నర్‌ సలహా మండలి బొంబాయి ప్రభుత్వ చర్యను ఖండించింది.
 • దీంతో 1775లో కంపెనీవారు రఘోబా తరఫున ఆరస్‌ మైదానంలో విజయం సాధించినా, తమ విధానం వల్ల దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
 • రఘోబా, కంపెనీ మధ్య 1776 మార్చి 1న పురందర్‌ సంధి జరిగింది. సూరత్‌ సంధి రద్దు, సాల్సెట్టి, బ్రోచ్‌ ఆదాయం కంపెనీ వారికి దాఖలు పడటం, యుద్ధ ఖర్చులకు కంపెనీకి పూనా వారు రూ.1200000 ఇవ్వడం ఈ సంధిలోని ముఖ్యమైన షరతులు.
 • బొంబాయి ప్రభుత్వం, పూనా వర్గం ఇరువురూ పురందర్‌ సంధిని అంగీకరించలేకపోయారు.
 • బొంబాయి ప్రభుత్వం సంధిని ఉల్లంఘించి రఘోబాకు ఆశ్రయమిచ్చింది.
 • నానాఫడ్నవీస్‌ పశ్చిమ భారత్‌లో ఒక ఓడరేవు ఇస్తానని ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్‌ లూచిన్‌ను (ఫ్రెంచ్‌వారు) ఆహ్వానించాడు.
 • ఫ్రెంచ్‌వారి రాకతో ఏర్పడిన అనుమానాలతో బొంబాయి ప్రభుత్వ విధానాలు ఉన్నతాధికారుల ఆమోదం పొందాయి. దీంతో పురందర్‌ సంధితో ఆగిన యుద్ధం మళ్లీ ప్రారంభమైంది.
 • 1779 జనవరి 9న కాక్‌బర్న్‌ నాయకత్వంలోని ఆంగ్ల సేనలు పశ్చిమ కనుమల్లోని తెలెగాం వద్ద మహారాష్ట్రుల సేనలను ఎదుర్కొన్నాయి.
 • ఈ యుద్ధంలో బొంబాయి ప్రభుత్వం ఓడిపోయింది. ఈ యుద్ధం తర్వాత వడ్గాం ఒప్పందం జరిగింది.
 • ఈ ఒప్పందంలో భాగంగా 1773 నుంచి కంపెనీవారు పొందిన భూభాగం అంతా తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. బ్రోచ్‌ జిల్లాలో సింధియా ఆదాయం పొందేటట్లు, బెంగాల్‌ నుంచి బయలుదేరిన కంపెనీలు తిరిగి వెనక్కి రావడానికి తీర్మానం చేసుకున్నారు.
 • వడ్గాం ఒప్పంద షరతులను వారన్‌ హేస్టింగ్స్‌ అంగీకరించలేదు. మహారాష్ట్రులను విడగొట్టాలని అతడు నిర్ణయించుకున్నాడు.
 • 1780 ఫిబ్రవరి 15 నాటికి గొగార్డ్‌ ఆహ్మదాబాద్‌ను జయించి, 1780 డిసెంబరు 11న బసేన్‌ను ముట్టడించాడు. ఈలోగా సింధియాకు శత్రువైన గోహాడ్‌రాణాకు సహాయంగా కంపెనీ పోఫా నాయకత్వంలో సేనలను పంపింది.
 • 1780 ఆగస్టు 3న గ్వాలియర్‌ను ఆక్రమించిన ఆంగ్లేయులు, 1781 ఫిబ్రవరి 16న సింధియాను సిప్రి వద్ద ఓడించారు.
 • ఈ చర్యలతో బ్రిటిష్‌ వారి పలుకుబడి పెరగడంతోపాటు మహారాష్ట్ర సేనల అనైక్యత, అసమర్థత బహిర్గతమయ్యాయి.
 • సింధియా ప్రతిపాదనతో మహారాష్ట్రులు కంపెనీవారితో సంధి కుదుర్చుకున్నారు. అదే 1782 మే 17న కుదిరిన సాల్బే సంధి.

రెండో ఆంగ్లో - మరాఠా యుద్ధానికి ముందు పరిణామాలు

1796లో రఘోబా కుమారుడైన రెండో బాజీరావు పీష్వాగా, నానాఫడ్నవీస్‌ మంత్రిగా నియమితులయ్యారు.

 • గ్వాలియర్‌ పాలకుడైన దౌలత్‌రావ్‌ సింధియా, ఇండోర్‌ పాలకుడైన యశ్వంత్‌రావ్‌ హోల్కార్‌ అసమర్థులు కావడంతో నిజాం ఖర్దాలో తాను పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి పొందాడు.
 • 1796 నాటికి పీష్వా, నానాఫడ్నవీస్‌ల వైరం, నిజాం, మహారాష్ట్రుల మధ్య శత్రుత్వం, గ్వాలియర్‌, ఇండోర్‌ పాలకుల అసమర్థత బ్రిటిష్‌ కంపెనీ విస్తరణకు మార్గం సులువైంది.
 • 1798లో గవర్నర్‌ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన లార్డ్‌ వెల్లస్లీ (మార్నింగ్టన్‌ సంస్థానాధిపతి) సామ్రాజ్యవాదతత్వం మూర్తీభవించిన వ్యక్తి.
 • వెల్లస్లీ ప్రతిపాదించిన సైన్య సహకార ఒడంబడికను మహారాష్ట్రులు అంగీకరించలేదు.
 • 1800 మార్చి 13న నానాఫడ్నవీస్‌ మరణించడంతో సింధియా, హోల్కార్‌లు అతడి స్థానం విషయంలో ఘర్షణ పడ్డారు.
 • పీష్వా రెండో బాజీరావు, యశ్వంత్‌రావు హోల్కార్‌ సోదరుడైన విఠూజీని హత్య చేశాడు.
 • దీంతో యశ్వంత్‌రావు సింధియా పీష్వా సేనలను ఓడించి పూనాను ఆక్రమించాడు.
 • పీష్వా రెండో బాజీరావు బసేన్‌లో శరణార్థి అయ్యాడు.
 • యశ్వంత్‌రావు అమృతరావు (రఘోబా దత్తపుత్రుడు) కుమారుడైన వినాయకరావును  పీష్వాగా నియమించాడు.

ఫలితాలు

సాల్బే సంధి ప్రకారం, సాల్సెట్టి కంపెనీ భాగాల్లో కలిసింది. మాధవరావు నారాయణను పీష్వాగా గుర్తించారు. రఘునాథరావుకు భరణం (పెన్షన్‌) ఇచ్చారు. పశ్చిమ ప్రాంతాలన్నీ సింధియాకు దక్కాయి.

 • ఈ ఒప్పందాలు మహారాష్ట్రులకు, కంపెనీకి మధ్య పూర్తిస్థాయి శాంతిని చేకూర్చలేదు.
 • సాల్బే సంధి కారణంగా పీష్వా అభద్రతకు లోనైతే, సింధియా అధికారం మరింత పెరిగి రాజకీయ అసమతౌల్యతకు దారితీసింది.
 • మహారాష్ట్రుల్లో గ్వాలియర్‌లో మహాదాజీ సింధియా, ఇండోర్‌లో హోల్కార్‌ భార్య అహల్యాబాయి, పూనాలో నానాఫడ్నవీస్‌ శక్తిమంతులుగా తయారయ్యారు.
 • రాజపుత్రులు, జాట్లపై సింధియా అధికారం మరింత విస్తృతమైంది.
 • అక్బర్‌కు భైరాంఖాన్‌ మాదిరిగా నానాఫడ్నవీస్‌ తన భద్రతా విధానంతో పీష్వాకు నమ్మినబంటు అయ్యాడు.
 • ఈ స్థితిలో 1794లో మహాదాజీ సింధియా మృతి, 1795లో అహల్యాబాయి మృతి, 1797లో తుక్కోజీ హోల్కార్‌ మృతి మహారాష్ట్ర పాలనా వ్యవస్థలో శూన్యాన్ని ఏర్పర్చాయి.
 • టిప్పుసుల్తాన్‌తో చేసిన యుద్ధాల్లో కంపెనీవారు నిజాంను, మహారాష్ట్రులను కలుపుకొని అతడికి వ్యతిరేకంగా త్రైపాక్షిక కూటమిని ఏర్పర్చుకున్నారు. కానీ అనతికాలంలోనే కంపెనీని శత్రువుగా భావించి నిజాం, మహారాష్ట్రులు ఒకటైపోయారు.
 • టిప్పుసుల్తాన్‌ వల్ల ముప్పు లేదని భావించిన నిజాం మహారాష్ట్రులతో 1795లో ఖర్దాలో యుద్ధం చేశాడు. కానీ ఈ యుద్ధంలో నిజాం ఓడిపోయాడు.
 • నిజాం బలహీనతలు తెలిసిన కంపెనీ వారు ఈ యుద్ధంలో ప్రేక్షక పాత్ర వహించారు.
 • గ్వాలియర్‌, ఇండోర్‌లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, మహారాష్ట్రలో ఎక్కువ భాగం నానాఫడ్నవీస్‌కు దక్కడం రెండో ఆంగ్లో - మరాఠా యుద్ధానికి దారితీశాయి.

రచయిత,  డాక్టర్‌వి.రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని