అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ కోసం అరవై ఉపగ్రహాల కూటమి!

ఇది హరికేన్లు, తుపాన్ల పరిశీలన కోసం నాసా ఏర్పాటు చేసిన మిషన్‌. ఇందులో నాలుగు క్యూబ్‌ సాట్ల కూటమితో తయారైన భూ దిగువ కక్షలో తిరిగే నౌకలు లేదా విమానాలు(4 cube sats in three low earth orbital planes) ఉంటాయి.

Published : 14 Apr 2024 00:32 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా అంశాలు/అంతరిక్ష రంగం - డైనమిక్స్‌

గ్లోబల్‌ స్పేస్‌ మిషన్స్‌ (2023-24)

TROPICS మిషన్‌

ది హరికేన్లు, తుపాన్ల పరిశీలన కోసం నాసా ఏర్పాటు చేసిన మిషన్‌. ఇందులో నాలుగు క్యూబ్‌ సాట్ల కూటమితో తయారైన భూ దిగువ కక్షలో తిరిగే నౌకలు లేదా విమానాలు(4 cube sats in three low earth orbital planes) ఉంటాయి.

  • ఈ ప్రాజెక్టు ద్వారా కర్కటరేఖ, మకరరేఖ మధ్య ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ఆర్ధ్రత లేదా తేమ, వర్షపాతాన్ని గంటగంటకు గుర్తించవచ్చు.
  • ఇది ట్రోపోస్పియర్‌ ప్రాంతంలోని థర్మోడైనమిక్స్‌ను పరిశీలిస్తుంది.
  • భూమిపై ఏర్పడే విపత్తులను, ఉష్ణ మండల తుపాన్లను అధ్యయనం చేయడం ఈ మిషన్‌ ముఖ్య లక్ష్యం.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా పంపిన TEMPO (Tropospheric Emissions: Monitoring of Pollution Satellite) ఉపగ్రహం ఉత్తర అమెరికా ప్రాంతంలోని వాతావరణ కాలుష్య కారకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి గంట వ్యవధిలో అందిస్తుంది.

క్యూరియాసిటీ రోవర్‌

నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్‌ కుజ (మార్స్‌) గ్రహం నుంచి అందమైన ఛాయాచిత్రాన్ని పంపించింది.

  • దీన్ని 2012లో నాసాకి చెందిన మార్స్‌ సైన్స్‌ లాబరేటరీ మిషన్‌ ద్వారా పంపించారు.
  • మార్స్‌ మీదకి పంపిన సమర్థమైన, అత్యంత పెద్దదైన రోవర్‌గా దీన్ని అంతరిక్ష శాస్త్రజ్ఞులు భావిస్తారు.

ఈ మిషన్‌ లక్ష్యాలు:

  • కుజ గ్రహంపై జీవఉనికిని గుర్తించడం
  • ఆ గ్రహంలోని వాతావరణాన్ని పరిశోధించడం
  • మార్స్‌ భూస్వరూపాలను అధ్యయనం చేయటం

ఇతర దేశాల మార్స్‌ మిషన్స్‌: 

  • ఇండియా - మంగళ్‌యాన్‌
  • అమెరికా సంయుక్త రాష్ట్రాలు - Perseverance, ఇన్సైట్స్‌
  • యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - హోప్‌
  • చైనా - Tianwen - 1
  • రష్యా - మార్స్‌ 2, మాస్‌ 3

APEP మిషన్‌

APEP - Atmospheric Perturbations around the
Eclipse Path

సూర్యగ్రహణ సమయంలో అకస్మాత్తుగా సూర్యకాంతి తగ్గిపోవడం వల్ల ఊర్ధ్వ వాతావరణ పొరల్లో జరిగే పరిణామాలను గుర్తించటం కోసం ఈ మిషన్‌ను ప్రయోగించారు.

  • 2023 అక్టోబరు 14న సంభవించే సూర్యగ్రహణాన్ని ఈ ప్రయోగానికి అనుకూలంగా ఎంచుకొని మూడు రాకెట్లను పంపించారు
  • ఈ రాకెట్లలో ఐనోస్పియర్‌ సాంద్రతను, ఉష్ణోగ్రతను, ఎలక్ట్రిక్‌, మ్యాగ్నటిక్‌ క్షేత్రాల ప్రభావాన్ని కొలిచే పరికరాలను అమర్చారు.
  • సూర్యగ్రహణ సమయంలో చంద్రుడి పరిమాణం సూర్యుడి కంటే తక్కువగా ఉండటంతో సూర్యుడి నుంచి వెలువడే సూర్యకాంతి 10 శాతం తగ్గుతుంది.
  • ఈ కాంతి అదృశ్యాన్ని(Diminishing Light), ఇతర ప్రభావాలను ఈ మిషన్‌ ద్వారా అధ్యయనం చేయనున్నారు.

ఆర్టిమిస్‌ ఒప్పందం

అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో భారతదేశం 27వ దేశంగా సంతకం చేసింది.

  • ప్రస్తుతం ఇందులో 27 సభ్య దేశాలు ఉన్నాయి.
  • 1967లో రూపొందించిన బాహ్య అంతరిక్ష ఒప్పందంలోని కీలక అంశాలను తిరిగి కచ్చితత్వంతో అమలు చేయటానికి కావాల్సిన ఆవశ్యకతను ఈ ఒప్పందం పునరుద్ఘాటించింది.
  • 1979లో ప్రతిపాదించిన చంద్రగ్రహ ఒప్పందాన్ని సవరిస్తూ చంద్రగ్రహాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఈ ఒప్పందం ద్వారా సూచించారు. ఖగోళ వస్తువుల పరిమిత వినియోగాన్ని ఇందులో ప్రతిపాదించారు.
  • 2020లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏడు ఇతర సభ్య దేశాలతో కలిసి 2025 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం.
  • చైనా, రష్యా దేశాలు ప్రారంభించాలనుకున్న ఇంటర్నేషనల్‌ లూనార్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ (ILRS) ప్రతిపాదనను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది.

వోయేజర్‌ (Voyager) మిషన్‌

నాసాతో వారానికిపైగా సంబంధం కోల్పోయి, ఎలాంటి సమాచారం అందించకపోవడంతో వార్తల్లో నిలిచిన మిషన్‌.

  • భూమితో అత్యధిక కాలం సంబంధాలను కలిగి ఉన్న స్పేస్‌ ప్రోబ్‌గా Voyager - 2 చరిత్ర సృష్టించింది.
  • వోయేజర్‌ - 1, 2 మిషన్లు టెలివిజన్‌ కెమెరాలు, ఇన్‌ఫ్రారెడ్‌, ఆల్ట్రావయొలెట్‌ సెన్సార్లు, మ్యాగ్నెటో మీటర్లు, ప్లాస్మా డిటెక్టర్లను ఉపకరణాలుగా కలిగి ఉన్నాయి.
  • ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం అంగారక, శని గ్రహాలపై ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయటం.

సాటిలైట్‌ బ్రాండ్‌ బాండ్‌ టెక్నాలజీ

దీన్నే సాటిలైట్‌ టెలిఫోన్‌ లేదా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బాండ్‌ వ్యవస్థగా పిలుస్తారు.

  • భూదిగువ కక్ష్యలో లేదా లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO)లో ఉన్న ఉపగ్రహాల కూటమి (సాటిలైట్‌ కన్‌స్టలేషన్‌) ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
  • దీనికి ఉదాహరణగా స్టార్‌ లింక్‌, కూపర్‌ (kuiper), వన్‌వెబ్‌లను పేర్కొనవచ్చు.
  • భూదిగువ కక్ష్యలో 500 నుంచి 1200 కిలోమీటర్ల వరకు ఉన్న ఉపగ్రహాలు సమర్థవంతంగా పనిచేయటానికి ఈ వ్యవస్థ సహకరిస్తుంది.
  • తక్కువ ఎత్తులో ఉన్న ఉపగ్రహాలు అతి తక్కువ జాప్యం, అత్యధిక వేగం కలిగిన టెలిఫోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగలవు.

OSIRIS-REx - మిషన్‌

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన నాసా 2023లో ఈ మిషన్‌ను చేపట్టింది.
ఈ ప్రాజెక్టు ద్వారా బెన్ను అనే ఆస్టరాయిడ్‌ను పరిశీలించి దాని నుంచి నమూనాను తీసుకువచ్చారు.

Psyche మిషన్‌  

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన నాసా దీన్ని చేపట్టింది.

  • ఇది మార్స్‌, జూపిటర్‌ గ్రహాల మధ్య ఉన్న సైక్‌ అనే ఆస్టరాయిడ్‌ను పరిశోధించటానికి చేపట్టిన ప్రయోగం.
  • ఈ ఆస్టరాయిడ్‌లో నికెల్‌, ఇనుము కలిగిన లోహ స్వభావం ఉందని ఇప్పటికే పరిశోధకులు భావిస్తున్నారు.

Shenzou 16

చైనాలోని టియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ మిషన్‌ను చేపట్టారు.

  • ఈ మిషన్‌లో భాగంగా ముగ్గురు మానవులను కక్ష్యలోకి పంపించారు.
  • దీనితో మొత్తంగా 17 మంది మానవులను కక్ష్యలోకి పంపిన దేశంగా చైనా ప్రపంచ రికార్డును నమోదు చేసింది.

ఆర్టీమిస్‌-2

ఈ మిషన్‌ ద్వారా చంద్రుడి మీదకి నలుగురు మానవులను పది రోజులపాటు పంపటానికి నాసా నిర్ణయించింది.
నాసా ప్రతిపాదనల ప్రకారం ఒక మహిళనూ ఈ ప్రయోగంలో పంపించనున్నారు.

JUICE మిషన్‌

JUICE - JUpiter ICy moons Explorer

దీన్ని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ 2023 ఏప్రిల్‌ 14న ఏరియన్‌ ఫైవ్‌ రాకెట్‌ ద్వారా ఫ్రెంచ్‌ గయానా నుంచి పంపించింది.
ఈ మిషన్‌ అంగారక గ్రహాన్ని 2031కి చేరుకుంటుందని అంచనా. ఈ ప్రయోగాన్ని ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌, స్పేస్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి.
లక్ష్యం: ఈ మిషన్‌లో భాగంగా అంగారక గ్రహ మూడు అతి పెద్ద ఐసీ మూన్లయిన గని మేడ్‌, యూరోపా, క్యాలిష్టోను అధ్యయనం చేయనున్నారు.

  • దీని ద్వారా అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులు మానవ జీవనానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో అంచనా వేస్తారు. ఆ గ్రహంపైనున్న వాతావరణం, నీటి జాడలను అధ్యయనం చేస్తారు.
  • అక్కడి భూస్వరూపాల ఉనికిని పరిశీలించి మానవ జీవనానికి ఆ ప్రాంతం ఏ మేరకు అనుకూలమో తెలుసుకోనున్నారు.
  • అంగారక గ్రహ ఆవిర్భావం, చరిత్ర, పరిణామాన్ని కూడా ఈ ప్రయోగాల ద్వారా అంచనా వేయవచ్చు.

వైపర్‌

ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న నీటిని సర్వే చేయనున్నారు.

పోలార్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ రోవర్‌ ద్వారా చంద్రుడిపై ఉన్న అస్థిర స్వభావాన్ని కూడా అంచనా వేయనున్నారు.

స్టార్‌ లింక్‌

అంతరిక్ష రంగంలోనే ప్రపంచ స్థాయిలో దిగ్గజ ప్రైవేటు సంస్థ అయిన స్పేస్‌ఎక్స్‌ 60 ఉపగ్రహల కూటమితో 2015లో స్టార్‌లింక్‌ ప్రాజెక్టును ప్రారంభించింది.

  • ఈ ప్రాజెక్టు లక్ష్యం అత్యంత తక్కువ ధరలో, నమ్మకమైన, అంతరాయం లేని, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందించటం.
  • ఈ ప్రాజెక్టు ద్వారా మారుమూల ప్రాంతాల్లో, కష్టసాధ్యమైన భౌగోళిక స్వరూపాల్లో అంటే మొబైల్‌ టవర్లు, కేబుల్స్‌ ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లోనూ ఉపగ్రహ ఆధారిత సిగ్నల్స్‌తో ఇంటర్నెట్‌ను అనుసంధానిస్తారు.
  • జియో స్టేషనరీ ఉపగ్రహాల అనుసంధానంతో ఏర్పాటు చేసే ఇంటర్నెట్‌ వ్యవస్థ అత్యధిక జాప్యాన్ని (600 మిల్లీ సెకండ్లలో సమాచారాన్ని చేరవేస్తుంది) కలిగి ఉంటుంది. భూ దిగువ కక్ష్యలో ఉపగ్రహాలను వీటికి వినియోగించడం వల్ల 20 నుంచి 30 సెకండ్ల వ్యవధిలో డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేస్తాయి.
  • స్పేస్‌ఎక్స్‌ సంస్థ రానున్న కాలంలో 12 వేల నుంచి 42 వేల ఉపగ్రహాలను నెలకొల్పి ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను విస్తరించాలని భావిస్తోంది.
  • స్టార్‌ లింక్‌ అత్యాధునిక ఇంటర్నెట్‌ సహాయంతో సమాచారం అత్యంత వేగంగా బదిలీ అవ్వడమే కాకుండా, భవిష్యత్తులో జరిగే డ్రోన్‌ యుద్ధాల్లోనూ కీలక పాత్ర పోషించనుంది.
  • భూమిపై అత్యధిక భాగాన్ని కవర్‌ చేసే జియో స్టేషనరీ ఉపగ్రహాలను స్టార్‌ లింక్‌ లేదా టెలిఫోన్‌ వ్యవస్థకు వినియోగించకపోవడం వల్ల అంతరిక్షంలో అధిక సంఖ్యలో ఈ సేవలకు ఉపగ్రహాలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువ అవుతాయని పరిశోధకుల భావన.

రచయిత: రేమల్లి సౌజన్య విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని