సామాజిక వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణం!

ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహమే కుటుంబం. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. సమాజ నిర్మాణం, సామాజిక సంస్థకు మూలమైన కుటుంబం మానవజాతి పరిణామక్రమంలో శాశ్వత బంధంగా మారింది.

Published : 15 Apr 2024 00:56 IST

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు

ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహమే కుటుంబం. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. సమాజ నిర్మాణం, సామాజిక సంస్థకు మూలమైన కుటుంబం మానవజాతి పరిణామక్రమంలో శాశ్వత బంధంగా మారింది. సామాజిక శాస్త్రంలో అతి ముఖ్యమైన భావనలైన కుటుంబం, కుటుంబ వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. కుటుంబం పుట్టిన తీరు, దానిపై సామాజికవేత్తల అభిప్రాయాలు, కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


కుటుంబ వ్యవస్థ

మాజంలోని ప్రాథమిక సమూహాల్లో కుటుంబం ముఖ్యమైంది. సమాజ శాస్త్రంలో కుటుంబం ఒక సంస్థగా, పరిమితిగా పరిగణనలో ఉంది. సమాజ నిర్మాణాన్ని స్థూలంగా పరిశీలించడంలో కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. కుటుంబ విధానం నిర్మాణంలో, విధుల్లో చాలా మార్పులు చెందుతూ వస్తోంది. చారిత్రకంగా కుటుంబం అనేక మార్పులు చెందుతున్నా సమాజంలో దీని ప్రాముఖ్యం పెరిగింది. ప్రతి వ్యక్తి కుటుంబంలో సభ్యుడు. కుటుంబం లేనిదే వ్యక్తికి మనుగడ లేదు. సమాజంలో బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి కావాల్సిన శిక్షణ కుటుంబంలోనే లభిస్తుంది.

చారిత్రక నేపథ్యం:  కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా అది వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. వ్యక్తి జీవితంలో అధిక భాగం దీంతోనే గడుస్తుంది. అన్నిరకాల మానవ సమూహాల్లో అతి ప్రధానమైన ప్రాథమిక సమూహమే కుటుంబం. మానవ సామాజిక జీవితానికి పునాది ఈ వ్యవస్థ. వివాహంలాగే కుటుంబ వ్యవస్థ విశ్వజనీనమైంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది.

వ్యక్తులు దినచర్యను కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తారు. సమాజాల్లోని సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా కుటుంబ సంబంధాలు కూడా వివిధ రూపాల్లో ఉన్నాయి. సాధారణంగా దంపతులు, వారి పిల్లలు కలిసి జీవిస్తే దాన్ని కుటుంబంగా పిలుస్తుంటారు. ఆదిమ సమాజాల కుటుంబం కూడా ఇదే రకంగా ఉంటుంది. అయితే 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అన్న చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది. ఏంగెల్స్‌, కార్ల్‌మార్క్‌, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబాన్ని మానవ పరిణామ క్రమంలో బలపడిన బంధంగా పేర్కొన్నారు.

కుటుంబం-అర్థం: ఫ్యామిలీ అనే పదం Famulus అనే రోమన్‌ పదం నుంచి ఏర్పడింది. Famulus అంటే సేవకుడని అర్థం. Familiya అనే లాటిన్‌ పదం నుంచి Family అనే పదం ఏర్పడిందని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం. Familiya అంటే కుటుంబం అని, అయితే ఆ కుటుంబంలో సేవకులు లేదా బానిసలు, కుటుంబసభ్యులు కలిసి ఉండేదని అర్థం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్తసంబంధాల ద్వారా బంధుత్వం ఉంటుంది. సామాజిక వ్యవస్థ నిర్మాణాత్మకమైన, ప్రాథమిక మూలప్రమాణం కుటుంబం.

  • అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం: మే 15.
  • అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం: 1994 (ఐరాస ప్రకటన)

కుటుంబం సామాజిక ప్రకార్యాలు

మానవజాతి చరిత్రలో అతి ప్రాచీనమైన, ప్రముఖమైన సామాజిక వ్యవస్థే కుటుంబం. అది పలు రకాల విధులు నిర్వహిస్తుంది.

1) ఆర్థిక ప్రకార్యం: కుటుంబానికి సుఖాన్ని ఇచ్చేవి ఆస్తిపాస్తులు. పూర్వ కాలంలో కుటుంబం తనకు కావాల్సిన వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి వినియోగించుకునేది. భారతీయ సమష్టి కుటుంబంలో వ్యక్తులంతా కలిసి పనిచేసి  పరస్పర సహకారంతో ఆనందాన్ని పంచుకునేవారు.

2) ధార్మిక ప్రకార్యం: సభ్యులకు మత సంబంధమైన శిక్షణను కుటుంబం ఇస్తుంది. పెద్దల నుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకోవడానికి, మత సంబంధమైన శిక్షణ అవసరం. దైవారాధన, యజ్ఞయాగాదులు, మత ఉపదేశాలు మొదలైనవి పూర్వం ఎక్కువగా ఉండేవి. నేడు లౌకిక రాజ్యం కావడంతో వ్యక్తుల్లో మత భావాల గాఢత తగ్గింది. నాడు కుటుంబాల్లో ప్రార్థనా సమావేశాలు నిత్యం సంప్రదాయంగా జరిగేవి. ప్రస్తుతం అవి చాలా వరకు తగ్గిపోయాయి.

3) విద్యా ప్రకార్యం: ఒకప్పుడు పిల్లలకు విద్యాబోధన కుటుంబాల్లోనే అధికంగా జరిగేది. పిల్లలకు వ్యక్తిగత శిక్షణ ఇచ్చే అవకాశం ఎక్కువగా తల్లికే ఉండేది. కానీ నేడు అనేక విద్యాసంస్థలను ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేయడంతో ఈ బాధ్యత కుటుంబానికి చాలావరకు తగ్గిపోయింది. నాటి వృత్తులు కులం మీద ఆధారపడటంతో వృత్తి శిక్షణ కుటుంబ సభ్యులకు అవసరమయ్యేది. ఇప్పుడు ఆ బాధ్యతను అనేక సాంకేతిక, వైజ్ఞానిక, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి.

4) ఆరోగ్య ప్రకార్యం: పూర్వం ఆరోగ్య, వైద్య సంబంధమైన విధులను కుటుంబం నిర్వహించేది. సభ్యుల అనారోగ్యం, ఇతర అస్వస్థతలను  నివారించే బాధ్యత కుటుంబంపై ఉండేది. కానీ, నేడు ఆస్పత్రులు, ఆరోగ్య సదుపాయాలు అధికం కావడంతో ఆ విధులను ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి అప్పట్లో సభ్యులకు వినోదావకాశాలను కుటుంబమే కల్పించేది. నేడు ఆ విధులను చలనచిత్రాలు, క్లబ్బులు, క్రీడాసంఘాలు మొదలైనవి నిర్వహిస్తున్నాయి.

5) నిర్వహణ: ప్రతి కుటుంబం కొంత ఆర్థిక ఉపాధితో ఉంటుంది.  కుటుంబంలో సభ్యులను పోషించడానికి భార్యాభర్తలు కృషి చేస్తూ, వీలైన సౌకర్యాలు కల్పించి తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు.

6) సంక్రమణ: తల్లిదండ్రుల అనంతరం వారి ఆర్థిక, సామాజిక హోదా   పిల్లలకు సంక్రమిస్తుంది. వారు తమ కుటుంబ స్థాయికి అనుగుణంగా   సమాజంలో స్థానం పొందుతారు.


కుటుంబ వ్యవస్థపై సామాజికవేత్తల అభిప్రాయాలు

  • రక్తసంబంధాన్ని అనుసరించి మొదట్లో కొన్ని గుంపులుండేవి. - సమ్నర్‌, కెల్లర్‌
  • మొదట్లో కుటుంబం లేదు. తల్లులు, వారి పిల్లల సమూహం మాత్రమే ఉండేది. తర్వాత కుటుంబం అభివృద్ధి చెందింది. - బ్రిఫాల్ట్‌
  • మొదటి నుంచే కుటుంబం ఉండేది. - వెస్టర్‌ మార్క్‌ (‘హిస్టరీ ఆఫ్‌ హ్యూమన్‌ మ్యారేజ్‌ - గ్రంథం).
  • కుటుంబం, సమూహం లేదా గుంపు అనేవన్నీ అవినాభావ సంబంధాలతో అభివృద్ధి చెందాయి. - మాలినోస్కీ
  • మొదట్లో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. - హెర్నీ, సమ్నర్‌, మెయిన్‌
  • మొదట్లో మానవజాతి స్వైరత (Promiscuity) దశలో ఉండేదని, ఆ తర్వాత మాతృస్వామిక కుటుంబ సంస్థ అభివృద్ధి చెందింది - బెకోఫెన్‌
  • కుటుంబం మూడు దశలుగా అభివృద్ధి చెందింది. - మోర్గాన్‌

కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాలు

1) విశ్వజనీనత: మానవజాతి క్రమాభివృద్ధిలో అన్ని దశల్లోనూ కుటుంబం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబానికి చెంది ఉంటాడు. పక్షులు, జంతువుల సమాజాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయనేందుకు ఆధారాలున్నాయి.

2) మిథున సంబంధం: కుటుంబ సంస్థలో ప్రధాన లక్షణం స్త్రీ పురుష సాంగత్యం. జీవిత భాగస్వాములైన భార్యాభర్తలిద్దరూ అనుబంధంతో జీవితకాలమంతా కలిసి ఉండవచ్చు లేదా కారణాంతరాల వల్ల పరిమిత కాలం వరకే దంపతులుగా ఉండవచ్చు.

3) నామకరణ పద్ధతి: ప్రతి కుటుంబాన్ని గుర్తు పట్టడానికి వీలుగా దానికి ఒక పేరు ఉంటుంది. కలిగే సంతానానికి పేర్లు పెట్టడం కూడా ఒక పద్ధతిని అనుసరించి జరుగుతుంది. పిల్లలకు పేర్లు పెట్టడంలో తల్లిదండ్రులు, మత, రాజకీయ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యాన్ని గణనలోకి తీసుకునే విషయంలో కూడా తేడాలున్నాయి. కొన్నిచోట్ల మాతృ వంశీయ విధానం ఉంటే, మరికొన్నిచోట్ల పితృవంశీయ విధానం ఉంటుంది.

4) ఆర్థిక సదుపాయాలు: భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబానికి ఆర్థిక వనరులుంటాయి. భూవసతి, వ్యాపారం/ఉద్యోగం ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల్లో కుటుంబాల మధ్య తేడాలు ఉంటాయి.

5) ఉమ్మడి నివాసం: ప్రతి కుటుంబానికి విశ్రాంతి తీసుకోవడానికి, నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి, పిల్లలు, పెద్దలు నివసించడానికి ఒక నివాసం అవసరం.

6) ఆవేశ ప్రాతిపదిక: మానవుడి భౌతికావసరాలు, సుఖాలు, కోరికలు లాంటివాటిపై కుటుంబం ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుల సంగమం, సంతానాన్ని పొందడం, ప్రేమతో పెంచడం, భార్యాభర్తలు ప్రేమతో  గడపడం, ఆర్థిక, సామాజికపరంగా రక్షణ కల్పించుకోవడం మొదలైనవన్నీ కుటుంబ వ్యవస్థలో ప్రధానం.

7) తీర్చిదిద్దే ప్రభావం: వ్యక్తులను, వారి ప్రవర్తనలను కుటుంబం ప్రభావితం చేస్తుంది.

8) పరిమితమైన పరిమాణం: నాగరిక సమాజ సంస్థలన్నింట్లో కుటుంబం పరిమాణంలో చిన్నది. భార్యాభర్తలు, సంతానం ఆ కుటుంబంలో ఉంటారు. అందుకే అది సహజంగానే పరిమితంగా ఉంటుంది. పూర్వం సమష్టి కుటుంబాల్లో సేవకులు, బంధువులు కలిసి ఉన్నప్పుడు కుటుంబ పరిమాణం పెద్దదిగా ఉండేది.

9) సమాజంలో కీలక స్థానం: మానవ సమాజాల్లోని అనేక సంస్థలు వృద్ధి చెందుతూ, మార్పులకు లోనవుతూ ఉంటాయి. వీటన్నింటిలోకి కుటుంబ సంస్థ ప్రధానమైందే కాకుండా కేంద్ర స్థానంలో ఉంటుంది.

10) సభ్యుల బాధ్యత: కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమానురాగాలతో ఉంటూ ఒకరికోసం మరొకరు త్యాగాలు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల క్షేమమే  పరమార్థంగా జీవిస్తుంటారు.

11) సామాజిక నిబంధన: కుటుంబం తన సభ్యులను వివిధ దశల్లో నియంత్రిస్తుంది. ప్రవర్తన నేర్పుతుంది. పిల్లలను నియంత్రించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా హద్దుల్లో ఉంచుతుంది. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా చేస్తుంది.

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని