అస్థిర కేంద్రక ముడిపదార్థాలే అణు ఇంధన ఖనిజాలు

ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు. అవి ఒక నిర్ణీత ప్రాంతంలో లేదా రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వివిధ పరిస్థితుల వల్ల ఖనిజాలు పలు రకాలైన భౌగోళిక వాతావరణంలో ఉంటాయి.

Published : 16 Apr 2024 00:35 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ

ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు. అవి ఒక నిర్ణీత ప్రాంతంలో లేదా రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వివిధ పరిస్థితుల వల్ల ఖనిజాలు పలు రకాలైన భౌగోళిక వాతావరణంలో ఉంటాయి. ఇవి మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి. రసాయన ధర్మమైన ద్రావణీయత, భౌతిక ధర్మమైన రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు.

ఖనిజాలు, శక్తి వనరులు
ఖనిజాల రకాలు/వర్గీకరణ

 • ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడువేల రకాలకు పైగా ఖనిజాలు ఉన్నాయి.
 • రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

1) లోహ ఖనిజాలు (Metalic Mineralsz)
2) అలోహ ఖనిజాలు (Non -Metalic Minerals)

లోహ ఖనిజాలు

లోహ ఖనిజాలను తిరిగి ఫెర్రస్‌ లోహ ఖనిజాలు, నాన్‌ ఫెర్రస్‌ లోహ ఖనిజాలుగా విభజించవచ్చు.

ఫెర్రస్‌ లోహ ఖనిజాలు (Ferrous Metallic Minerals):

ఈ ఖనిజాలు ముడి ఇనుము లోహాన్ని కలిగి ఉంటాయి.

ఇవి కఠినంగా ఉండి తమ ద్వారా వేడిని, విద్యుత్‌ను ప్రసరింపజేస్తాయి. వీటికి మెరిసే స్వభావం ఉంటుంది.
ఉదా: ఇనుము, మాంగనీస్‌, నికెల్‌, టంగ్‌స్టన్‌ మొదలైనవి.

నాన్‌ఫెర్రస్‌ ఖనిజాలు: వీటిలో ఇనుము ఉండదు.
ఉదా: ఇసుక, నైట్రేట్స్‌, రత్నాలు, వజ్రాలు, బంగారం, వెండి, రాగి మొదలైనవి.

అలోహ ఖనిజాలు: వీటిలో ఎటువంటి లోహాలు ఉండవు

ఉదా: సున్నపురాయి, జిప్సం మొదలైనవి.

అలోహ ఖనిజాల నిల్వల్లో, ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి కలిగి ఉంది.

ఇంధన ఖనిజాలు: మండే స్వభావం ఉన్న ఖనిజాలు. శక్తి అవసరాల కోసం వీటిని వినియోగిస్తారు. భారతదేశంలో వీటి కొరత ఎక్కువ.

ఉదా: నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలే.
అణు ఇంధన ఖనిజాలు (Nuclear Fuel Minerals): ఇవి శక్తిని రేడియేషన్‌ రూపంలో వెదజల్లే అస్థిర కేంద్రక ముడిపదార్థాలు.

భారత్‌లో వీటి లభ్యత తక్కువ.

ఉదా: యురేనియం, థోరియం, ఇల్మనైట్‌ మొదలైనవి.

మైనింగ్‌

భూమి లోపలి పొరల నుంచి ఖనిజాలను తవ్వి తీయడాన్ని మైనింగ్‌ అంటారు. ఖనిజాల మైనింగ్‌ లేదా ఖనిజాల వెలికితీత కింది విధానాల్లో జరుగుతుంది.

బహిరంగ మైనింగ్‌ (Open Cast Mining): గోతులు తవ్వి, గుట్టలు పేల్చి, కొండలు తొలిచి ఖనిజాలను వెలికి తీసే పద్ధతి.

దీనికి ఖర్చు తక్కువ. ఈ పద్ధతి ద్వారా రోజుకి 10 వేల టన్నుల ఖనిజాలను వెలికి తీయవచ్చు.

భూగర్భ మైనింగ్‌ (Shaft Miningz): భూ ఉపరితలానికి చాలా లోతులో ఉండే ఖనిజాలను వెలికి తీయడానికి భూగర్భ సొరంగాలను నిర్మించి, ఖనిజాలను వెలికితీసే పద్ధతి.

ఈ పద్ధతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ పద్ధతి ద్వారా రోజుకి 1500 టన్నుల వరకు ఖనిజాలను వెలికి తీయవచ్చు.


ఖనిజాల విస్తరణ

 • వివిధ రకాల శిలల్లో ఖనిజాలు నిక్షిప్తమై ఉంటాయి.
 • కొన్ని ఖనిజాలు అగ్ని శిలల్లో, కొన్ని రూపాంతర శిలల్లో, మరికొన్ని అవక్షేప శిలల్లో ఉంటాయి.
 • సాధారణంగా లోహ ఖనిజాలు పెద్ద పీఠభూములను ఏర్పర్చిన అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో ఉంటాయి.
 • అగ్ని, రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలకు ఉదాహరణ: ఉత్తర స్వీడన్‌లోని ఇనుము నిక్షేపాలు, దక్షిణాఫ్రికాలోని ఇనుము, నికెల్‌, ప్లాటినం నిక్షేపాలు మొదలైనవి.
 • అవక్షేప శిలా మైదానాల్లో, తరుణ ముడత పర్వతాల్లో సున్నపురాయి లాంటి లోహరహిత ఖనిజాలుంటాయి.
 • ఫ్రాన్స్‌లోని కాకసస్‌ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాలు, జార్జియా, ఉక్రెయిన్‌లోని మాంగనీస్‌ నిక్షేపాలు, అల్జీరియాలోని ఫాస్ఫేట్‌ నిక్షేపాలు వీటికి ఉదాహరణలు. బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేప పొరల్లో లభిస్తాయి.

ఖనిజాల ఉపయోగాలు:

 • దేశంలో పరిశ్రమల స్థాపనకు ఖనిజ నిల్వలే ఆధారం.
 • రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినమైనవి. వీటిని పలు రకాల ఆభరణాల్లో ఉపయోగిస్తారు.

బాక్సైట్‌: దీన్ని అల్యూమినియం నుంచి తీస్తారు. ఇది ‘విశ్వ ఖనిజం’గా పేరొందింది. అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటంతో మన జీవితాల్లో ముఖ్యమైన ఖనిజంగా మారింది. ఆటో మొబైల్స్‌, విమానాలు, బాటిల్‌ తయారీ పరిశ్రమ, విద్యుత్‌ తీగలు, భవనాలు, వంట సామగ్రి తయారీ, ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో బాక్సైట్‌ను ఉపయోగిస్తారు. బాక్సైట్‌ నిల్వ లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయి.

రాతినార లేదా ఆస్‌బెస్టాస్‌: ఇది వేడిని నిరోధించే పదార్థం. ఇళ్లు, పరిశ్రమల నిర్మాణంలో పై కప్పుగా విస్తృతంగా వాడతారు. దీన్ని ఉపయోగించి పనిచేసే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతటా దీన్ని నిషేధిస్తున్నారు. సిమెంట్‌ రేకులు, తారు, పెయింటింగ్‌, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు.


క్రోమియం: స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీకి ఉపయోగిస్తారు.

ఇది తుప్పు పట్టదు. కాబట్టి దీన్ని అన్నం వండటానికి, ఆమ్లాలు లాంటి పారిశ్రామిక ద్రవాల నిల్వకు ఉపయోగిస్తారు.


రాతినార లేదా ఆస్‌బెస్టాస్‌: ఇది వేడిని నిరోధించే పదార్థం. ఇళ్లు, పరిశ్రమల నిర్మాణంలో పై కప్పుగా విస్తృతంగా వాడతారు. దీన్ని ఉపయోగించి పనిచేసే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతటా దీన్ని నిషేధిస్తున్నారు. సిమెంట్‌ రేకులు, తారు, పెయింటింగ్‌, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు.


బాక్సైట్‌: దీన్ని అల్యూమినియం నుంచి తీస్తారు. ఇది ‘విశ్వ ఖనిజం’గా పేరొందింది. అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటంతో మన జీవితాల్లో ముఖ్యమైన ఖనిజంగా మారింది. ఆటో మొబైల్స్‌, విమానాలు, బాటిల్‌ తయారీ పరిశ్రమ, విద్యుత్‌ తీగలు, భవనాలు, వంట సామగ్రి తయారీ, ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో బాక్సైట్‌ను ఉపయోగిస్తారు. బాక్సైట్‌ నిల్వ లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయి.


ముఖ్యమైన ఖనిజాలు

మైకా: ఇది మెరిసే ఖనిజం.

విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది సన్నని పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్‌ నిరోధకం.

ముగ్గురాయి లేదా బెరైటీస్‌: ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని తీస్తారు. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియాన్ని ఉపయోగిస్తారు. ముడిచమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి బెరైటీస్‌ను వినియోగిస్తారు. గాజు (వాష్‌బేసిన్‌) సెరామిక్‌ వస్తువులు తయారు చేయడానికి ఫెల్డ్‌ స్పార్‌ అనే ఖనిజాన్ని ఉపయోగిస్తారు. ఇది తెలంగాణలో ఎక్కువగా లభిస్తుంది.

బెరైటీస్‌, డోలమైట్‌, సున్నపురాయి, క్వార్ట్జ్‌, ఫెల్డ్‌ స్పార్‌ ఖనిజాలు తెలంగాణలో ఎక్కువగా లభిస్తాయి. దక్షిణ భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్న రాష్ట్రం - తెలంగాణ.


ప్రాంతాలు - లభించే ఖనిజాలు

ఆసియా

 • చైనా, భారతదేశాలు అధిక మొత్తంలో ఇనుప నిక్షేపాలను కలిగి ఉన్నాయి.
 • భారతదేశంలో ఖనిజాలు అసమానంగా విస్తరించి ఉన్నాయి.
 • ఉత్తర భారతదేశంలోని విశాలమైన మైదానాల్లో ఆర్థికంగా, విలువైన ఖనిజాలు ఇంచుమించుగా లేవు. దానికి భిన్నంగా ద్వీపకల్ప భాగంలో లోహ, అలోహ, ఇంధన ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.
 • ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువగా తగరాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు: చైనా, మలేసియా, ఇండోనేసియా.
 • సీసం, యాంటిమోని, టంగ్‌స్టన్‌ ఉత్పత్తుల్లో చైనా ప్రథమస్థానంలో ఉంది.

ఐరోపా: ఇనుపధాతు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఐరోపా ఖండం అగ్రస్థానంలో ఉంది.

 • రష్యా, ఉక్రెయిన్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌ల్లో ఇనుపధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. తూర్పు ఐరోపా, యురేషియా భూభాగంలో రాగి, సీసం, జింక్‌ నిక్షేపాలు ఎక్కువ.
 • ప్రపంచంలో ఎలాంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్‌
 • ఒక శిల నీలిరంగులో ఉంటే దానిలో రాగి కలిసి ఉందని అర్థం.

ఉత్తర అమెరికా: ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు మూడు జోన్లలో ఉన్నాయి. అవి:

కెనడా ప్రాంతం: ఇక్కడ ఇనుప ధాతువు, నికెల్‌, బంగారం, యురేనియం, రాగి లభిస్తాయి.

అపలేచియన్‌ పర్వత ప్రాంతం: ఈ పర్వతాలు ఖండానికి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ బొగ్గు విరివిగా లభిస్తుంది.

పశ్చిమ కార్డిలరాస్‌: వీటినే రాఖీ పర్వతాలు అంటారు.

ఇక్కడ రాగి, సీసం, బంగారం, వెండి నిక్షేపాలు ఎక్కువ.

ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్‌. ఈ సరస్సు చుట్టూ విరివిగా లభించే ఖనిజం ఇనుము.

దక్షిణ అమెరికా: ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువు అధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్‌.

ఈ ఖండంలోని బొలీవియా తగరం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అటకామా ఎడారిలో లభించే ఖనిజం నైట్రేట్స్‌. వెనెజులా, అర్జెంటీనా, చిలీ, కొలంబియా దేశాలు పెట్రోలియానికి ప్రసిద్ధి.

ఆఫ్రికా: ఆఫ్రికా అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది.

ఇది ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినాల ఉత్పత్తిలో ముందుంది. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌ (లిట్‌ వాటర్స్‌రాండ్‌) - బంగారానికి ప్రసిద్ధి. కింబర్లీ వజ్రాలకు పేరెన్నికగలది.
గినియా తీరంలో బాక్సైట్‌ నిల్వలు ఎక్కువ.

నైజీరియా, అంగోలా, లిబియా దేశాల్లో పెట్రోలియం లభిస్తుంది.

ఆస్ట్రేలియా: ప్రపంచంలోనే అతి పురాతన శిలలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి.

 • ఇవి 4300 మిలియన్‌ సంవత్సరాల క్రితం నాటివి అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్‌ సంవత్సరాల తరువాత ఏర్పడ్డాయి.
 • ప్రపంచంలో బాక్సైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసేది ఆస్ట్రేలియా. సీసం, జింక్‌, మాంగనీస్‌ ఖనిజాలు ఈ ఖండంలో పుష్కలంగా ఉన్నాయి.
 • పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గూర్లి, కూల్గార్డిల్లో బంగారు నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయి.

అంటార్కిటికా: ట్రాన్స్‌ అంటార్కిటికా ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్‌ చార్లెస్‌ పర్వతాల సమీపంలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని