వివేకవంతమైన వనరుల వినియోగం!

ప్రకృతిలోని సహజ వనరులను పొదుపుగా వినియోగించుకుని అభివృద్ధి చెందుతూ, ఆ వనరులను తర్వాతి తరాలకు అందించడమే సుస్థిరాభివృద్ధి. ఈ విధానంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు.

Published : 16 Apr 2024 00:36 IST

పర్యావరణ అంశాలు

ప్రకృతిలోని సహజ వనరులను పొదుపుగా వినియోగించుకుని అభివృద్ధి చెందుతూ, ఆ వనరులను తర్వాతి తరాలకు అందించడమే సుస్థిరాభివృద్ధి. ఈ విధానంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల కృషితో రూపుదిద్దుకున్న ఈ భావనపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. వనరుల వృథా జరగకుండానే పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సాధించేందుకు నిపుణులు చేసిన సూచనలు, లక్ష్యాలు, సంబంధిత నివేదికల ముఖ్యాంశాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో దేశం పరిస్థితి, రాష్ట్రాల భాగస్వామ్యం గురించి అర్థం చేసుకోవాలి.

సుస్థిరాభివృద్ధి

ర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ధి స్థానంలో తీసుకొచ్చిన విధానమే సుస్థిరాభివృద్ధి. దీనినే నిలకడతో కూడిన అభివృద్ధి అని కూడా అంటారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1983లో నార్వే ప్రధాని బ్రంట్‌ల్యాండ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘పర్యావరణం - అభివృద్ధి’ సదస్సులో పర్యావరణవేత్తలు సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. ఈ నివేదికను ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ పేరుతో 1987లో ఆమోదించగా, 1988 నుంచి అమల్లోకి వచ్చింది.

బ్రంట్‌ల్యాండ్‌ నిర్వచనం ప్రకారం ‘‘ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ, భవిష్యత్తు తరాలకు వనరులు మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించుకుంటూ సాధించే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’’. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఉండాలని సుస్థిరాభివృద్ధి సూచిస్తుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థికవృద్ధి ఒక్కటే సరిపోదు. వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యత ఏర్పరిచి అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుత కాలంలో అభివృద్ధి ప్యూహాలు, సమాజం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణాలు సామూహిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మానవ జనాభా పెరిగేకొద్దీ అధికమవుతున్న అవసరాల కోసం అభివృద్ధి పేరుతో సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు, వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. దీని కారణంగా భూమి మీద పేదరికం, తాగునీటి సమస్య, అంటువ్యాధులు ప్రబలడం లాంటి సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీంతో భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

సుస్థిరాభివృద్ధిలోని ప్రధానాంశాలు:  1) వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించకూడదు. 2) పునరుత్పత్తి చెందని ఇంధనవనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే, కాలుష్యరహిత ఇంధన వనరులను వినియోగించాలి. 3) పర్యావరణం విలీనం చేసుకోగలిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి వదలకూడదు. 4) అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్నివర్గాల ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా ఉండాలి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు:  1) అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, విద్య, ఆరోగ్యం, నాణ్యమైన పర్యావరణం, సమన్యాయాన్ని పెంపొందించడం, వనరుల సమాన పంపిణీ, భవిష్యత్తు తరాల కనీస అవసరాలు తీర్చడానికి వనరులు అందుబాటులో ఉండే ప్రస్తుత అభివృద్ధి విధానాలను తీర్చిదిద్దడం మొదలైన అంశాలు సుస్థిరాభివృద్ధిలో సమ్మిళితం అయ్యాయి. 2) సహజ వనరులను ప్రస్తుత అవసరాలకు ఏ రేటులో వినియోగిస్తామో, అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించే విధంగా చర్యలు చేపట్టాలి. 3) అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉండాలి. అంటే ఆర్థికాభివృద్ధి భావితరాల జీవన ప్రమాణాలను దెబ్బతీయకూడదు. 4) కాలుష్యరహిత, పునరుత్పాదిత, చౌకగా లభ్యమైన శక్తి వనరుల వినియోగాన్ని పెంపొందించి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. 6) గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్ర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. 7) సుస్థిరాభివృద్ధికి దోహదపడే విధంగా సముద్ర ఉత్పత్తులు, సముద్ర వనరుల పరిరక్షణ జరగాలి. 8) అడవుల పరిరక్షణతో పాటు ఎడారీకరణ, భూసార క్షీణతను అరికట్టాలి. 9) సుస్థిరాభివృద్ధి దిశలో ప్రపంచ భాగస్వాములను ప్రోత్సహించడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థంగా అమలుచేయాలి.

సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం: 2002 జొహెన్నస్‌బర్గ్‌ సదస్సులో ఐక్యరాజ్యసమితి 2005 - 2015 దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్య’గా ప్రకటిస్తూ ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యాలను పేర్కొంది. అవి - 1) పర్యావరణం పట్ల ప్రజల దృక్పథంలో మార్పులు తీసుకురావాలి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అయ్యే విధంగా కనీస అవసరాలకు మాత్రమే వనరులను వినియోగించుకునేట్లు ఆలోచనల్లో మార్పులు తేవాలి. 2) ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతులను, నవకల్పనలను ప్రోత్సహించాలి. 3) ప్రతి వయోవర్గం వారికి ఆరోగ్యకర జీవనాన్ని అందించాలి. 4) సమ్మిళిత, సమానత్వ, నాణ్యతతో కూడిన విద్యను అందించి అందరికీ జీవితకాల అభ్యసన అవకాశాలు కల్పించాలి. 5) లింగ సమానత్వాన్ని సాధించి బాలికలు, మహిళలకు సాధికారత కల్పించాలి. 6) అందరికీ మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ సుస్థిరంగా లభ్యమయ్యే విధంగా చూడాలి. 7) చౌకగా ఉండే, విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులను అందించాలి. 8) నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా ఉండే విధంగా ప్రజల భాగస్వామ్యంతో నగరాల అభివృద్ధి జరగాలి. 9) మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత, సుస్థిర పారిశ్రామికీకరణ నవకల్పనను అందించాలి. 10) దేశంలో లోపల, వెలుపల అంతరాలను తగ్గించాలి. 11) సుస్థిర నగరాలు, పల్లెలు సమ్మిళిత ఆర్థికవృద్ధిని పెంపొందించాలి. ఉత్పాదకతతో కూడిన ఉపాధి, సంపూర్ణ ఉద్యోగిత కల్పించాలి. 12) సుస్థిరాభివృద్ధికి వీలుగా మహాసముద్ర, సముద్ర జలవనరులను సంరక్షించాలి. 13) సుస్థిర వినియోగం,  ఉత్పత్తి విధానాలను పెంపొందించాలి. 14) పర్యావరణ మార్పు ప్రభావాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలి.15) భౌగోళిక జీవావరణాన్ని సంరక్షించడం, పునరుద్ధరించడం, మెరుగుపరచడం, అడవుల నిర్వహణ, ఎడారీకరణను నిరోధించడం, భూ క్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని నిలిపివేయడం లాంటివి చేయాలి. 16) సుస్థిర అభివృద్ధికి శాంతియుత సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించాలి. అందరికీ న్యాయం అందేలా చూడటంతోపాటు అన్నిస్థాయుల్లో జవాబుదారీతనం ఉండే విధంగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 17) సుస్థిర అభివృద్ధిలో సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధార నివేదిక (2020-21): దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను నీతిఆయోగ్‌ చూస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2020-21 మూడో ఎడిషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి స్థాయి ఆధారంగా ఈ నివేదిక వాటిని 4 విభాగాలుగా విభజించింది.అవి - 1)0-49 మార్కులు: ఆకాంక్షిత రాష్ట్రాలు 2) 50-64 మార్కులు: ప్రతిభావంత రాష్ట్రాలు 3) 65-99 మార్కులు: పురోగామి రాష్ట్రాలు 4) 100 మార్కులు: లక్ష్యసాధక రాష్ట్రాలు

జాతీయ విశ్లేషణ: దేశం మొత్తంగా సుస్థిరాభివృద్ధి స్కోరు 2018-2019తో పోలిస్తే 6 పాయింట్లు మెరుగుపడింది. 2019లో 60 నుంచి 2020-21లలో 66కి చేరింది. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిభావంత విభాగంలో, 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పురోగామి విభాగంలో ఉన్నాయి. 2020లో క్లీన్‌ ఎనర్జీ, పట్టణ ప్రగతికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి సూచీలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. అయితే పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, మెరుగైన ఉపాధి, ఆర్థిక వృద్ధి రంగాల్లో బాగా వెనుకబడి ఉంది.

రాష్ట్రాలవారీగా పనితీరు: సుస్థిరాభివృద్ధి నివేదిక మూడో ఎడిషన్‌లో కేరళ, చండీగఢ్‌ 75 స్కోరుతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ 72 స్కోరుతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 72 పాయింట్లు, తెలంగాణ 69 పాయింట్లతో పురోగామి విభాగంలో ఉన్నాయి. తీరప్రాంత రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ 79 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బిహార్‌, ఝార్ఖండ్‌, అస్సాం తక్కువ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి. నీ ప్రతిభావంతమైన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మిజోరం, పంజాబ్‌, హరియాణా, త్రిపుర, అండమాన్‌ - నికోబార్‌ దీవులు, దిల్లీ, జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌, లక్షద్వీప్‌ నిలిచాయి. నీ ప్రపంచంలో అటవీ విస్తీర్ణ పరంగా భారతదేశం 10వ స్థానంలో ఉంది. 2011-20 దశాబ్ద కాలంలో అటవీ పెరుగుదల రేటులో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక సాంద్రత ఉన్న అడవులు పెరగడమే దీనికి కారణం.

నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019-20 పురోగామి విభాగంలో 10 ఉండగా, 2020-21లో 22 ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ
ప్రతిభావంత (50-64) విభాగంలో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని