కరెంట్‌ అఫైర్స్‌

డిస్కస్‌ త్రోలో లిత్వేనియా అథ్లెట్‌ మికోలాస్‌ అలెక్‌నా (21) కొత్త రికార్డు సృష్టించాడు. 2024, ఏప్రిల్‌ 15న రమోనా (అమెరికా)లో జరిగిన ఒక్‌హోమా సిరీస్‌ టోర్నమెంట్లో డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరి, అతడు స్వర్ణం నెగ్గాడు.

Published : 17 Apr 2024 00:43 IST

డిస్కస్‌ త్రోలో లిత్వేనియా అథ్లెట్‌ మికోలాస్‌ అలెక్‌నా (21) కొత్త రికార్డు సృష్టించాడు. 2024, ఏప్రిల్‌ 15న రమోనా (అమెరికా)లో జరిగిన ఒక్‌హోమా సిరీస్‌ టోర్నమెంట్లో డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరి, అతడు స్వర్ణం నెగ్గాడు. ఈ క్రమంలో జార్గెన్‌ స్కట్‌ (జర్మనీ, 74.08 మీ.) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. జార్గెన్‌ 1986లో ఈ రికార్డు సృష్టించాడు.


ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల (బిజీయెస్ట్‌ ఎయిర్‌పోర్ట్స్‌ 2023) జాబితాలో దిల్లీ విమానాశ్రయం (ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) పదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్‌ జాక్సన్‌ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం దక్కించుకుంది. దుబాయ్‌, డాలస్‌ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) వరల్డ్‌ తెలిపింది.

10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో అయిదు అమెరికాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది.


2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్‌ డాలర్ల (రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో దిగుమతులు కూడా 715.97 బి.డాలర్ల (సుమారు రూ.59.42 లక్షల కోట్ల) నుంచి 5.41% తగ్గి 677.24 బి.డాలర్ల (సుమారు రూ.56.22 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 240.17 బి.డాలర్లు (సుమారు రూ.19.93 లక్షల కోట్లు)గా నమోదైంది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


మాదిరి ప్రశ్నలు

ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) 2024లో భారత్‌ ఎంత శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచనా వేసింది? (ఓఈసీడీ గణాంకాల ప్రకారం 2023లో చైనా వృద్ధిరేటు 5.2 శాతం, బ్రెజిల్‌ వృద్ధిరేటు 3 శాతం, భారత్‌లో మాత్రం అది ఏకంగా 6.3 శాతం. 2024లో చైనా 4.7 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ఓఈసీడీ అంచనా వేసింది.)

జ: 6.1 శాతం


ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రి వర్గ సమావేశాన్ని (ఎంసీ13) 2024, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు అబుధాబీలో నిర్వహించారు. ఈ సమావేశం అజెండాలోని ప్రధానాంశాలేవి?

జ: ఈ సమావేశాన్ని నాలుగు ప్రధాన అజెండాలతో నిర్వహించారు. అవి: 1) మత్స్య రాయితీలపై అంతుచిక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ముగించడం. 2) అప్పీలేట్‌ బాడీ పునరుద్ధరణ - తద్వారా వివాద పరిష్కార యంత్రాంగంగా డబ్ల్యూటీఓ కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి పునరుద్ధరించడం. 3) భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలు డిమాండ్‌ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్‌ స్టాక్‌ హోల్డింగ్‌ (ఆహార భద్రత కోసం ప్రభుత్వం ధాన్యాన్ని నిల్వ చేయడం) సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవడం. 4) పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ మిషన్‌లపై కస్టమ్స్‌ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపును నిర్ధారించడం.


స్వయం సహాయక సంఘాల నుంచి లక్ష మంది మహిళలను  ఎంపిక  చేసి  కాఫీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది?

జ: కర్ణాటక


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని