రాబడిలో రాష్ట్రాల వాటా... నిర్ణయించేది విత్త సంఘాలే!

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఆదాయం నుంచి రాష్ట్రాలకు తగిన వాటాను నిర్ణయించి, పంపిణీ చేస్తారు. ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం, అదనపు ఎక్సైజ్‌ సుంకం, రైల్వే ప్రయాణికులు, సరకు రవాణాపై కేంద్రం పన్ను విధిస్తుంది.

Updated : 17 Apr 2024 01:12 IST

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ
భారత విత్త సంఘం - కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఆదాయం నుంచి రాష్ట్రాలకు తగిన వాటాను నిర్ణయించి, పంపిణీ చేస్తారు. ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం, అదనపు ఎక్సైజ్‌ సుంకం, రైల్వే ప్రయాణికులు, సరకు రవాణాపై కేంద్రం పన్ను విధిస్తుంది. వీటి ద్వారా వచ్చే రాబడి నుంచి రాష్ట్రాలకు వాటా కేటాయించే బాధ్యత ఆర్థిక సంఘానిది. ఆదాయ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటాను రాష్ట్ర జనాభా, విస్తీర్ణం, అవస్థాపన సౌకర్యాల సూచీ, తలసరి ఆదాయాల వ్యత్యాసాల ప్రాతిపదికన ఒక్కో ఆర్థిక సంఘం ఒక్కో విధంగా సూచించింది.

కేంద్ర పన్నుల రాబడి విభజన పంపిణీ: ఎక్సైజ్‌ సుంకం రాబడిలో వాటా
అధిక శాతం జనాభా వినియోగించే వస్తువులపై విధించే ఎక్సైజ్‌ సుంకం కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడిని ఇస్తుంది. ఈ రాబడిలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంటుంది.
ఎ) రాబడిలో రాష్ట్రాల వాటా

 • 1952 - 57లో కేవలం మూడు వస్తువులపై విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని 1966 - 69 తర్వాత 45 వస్తువులపై విధించారు. ఈ రాబడిలో నుంచి రాష్ట్రాలకు వాటా కల్పించేవారు.
 • 1979 తర్వాత ఏడో ఆర్థిక సంఘం కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలన్నింటిలో రాష్ట్రాలకు వాటా కల్పించింది.
 • ఈ సుంకం రాబడిలో 20% రాష్ట్రాలకు చెందాలని మొదటి ఆర్థిక సంఘం నిర్ణయించగా, అది 40% ఉండాలని 7వ విత్త సంఘం, 47.5% గా ఉండాలని పదో ఆర్థిక సంఘం తెలిపాయి.

బి) రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రాతిపదిక

 • ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల ప్రయోజనాల కోసం మొదటి ఆర్థిక సంఘం ఎక్సైజ్‌ సుంకం రాబడిలో 40% జనాభా ప్రాతిపదికన, 60% ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికపై పంపిణీ చేయాలని సూచించింది.
 • పలు ఆర్థిక సంఘాలు వివిధ ప్రాతిపదిక సూత్రాలను సిఫార్సు చేశాయి. చివరికి 10వ ఆర్థిక సంఘం సూచనలు అమలు చేస్తున్నారు. ఈ సూత్ర నియమాల ప్రకారం రాష్ట్రాల వాటా (47.5%)లోని 40% పైన సూచించిన ఆదాయ పన్ను రాబడి ప్రాతిపదికన పంపిణీ చేయాలని నిర్ణయించారు.
 • మిగిలిన 7.5% ఎక్సైజ్‌ సుంకం రాబడిని లోటు బడ్జెట్‌ రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు.

అదనపు ఎక్సైజ్‌ సుంకం రాబడిలో రాష్ట్రాల వాటా

 • అమ్మకం పన్ను స్థానంలో అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తున్నారు.
 • కేంద్ర ఎక్సైజ్‌ సుంకంతో పాటు పంచదార, పొగాకు, నూలు వస్త్రాలు మొదలైన వస్తువులపై కేంద్రం అదనపు ఎక్సైజ్‌ సుంకం వసూలు చేసేది. ఇవి అంతర్‌రాష్ట్ర వాణిజ్య వస్తువులు కాబట్టి వీటికి ప్రత్యేకత ఉండేది.
 • 1956 జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్రాలు ఈ వస్తువులపై ఎలాంటి పన్ను విధించకుండా అదనపు ఎక్సైజ్‌ సుంకం వసూలు చేయాలని నిర్ణయించారు.
 • ఆ రాబడిని విత్త సంఘాలు సూచించిన ప్రాతిపదికపై కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
 • మొదటిసారి రెండో ఆర్థిక సంఘం అదనపు ఎక్సైజ్‌ సుంకం రాబడి పంపిణీని అధ్యయనం చేసి రెండు సిఫార్సులు చేసింది. అవి

1) 1956 - 57 నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన అదనపు ఎక్సైజ్‌ సుంకం రాబడిలో అమ్మకం పన్ను విధించడం వల్ల ఏ రాష్ట్రానికి ఎంత రాబడి వస్తుందో అంత రాబడిని ఆయా రాష్ట్రాలకు తప్పక చెల్లించాలి.

2) మిగులు అదనపు ఎక్సైజ్‌ సుంకం రాబడిని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవాలి.

 • 5వ ఆర్థిక సంఘం వరకు మిగులు అదనపు ఎక్సైజ్‌ సుంకం రాబడిని ఈ పన్ను రాబడి స్థాయి, జనాభాల ప్రాతిపదికలపై పంపిణీ చేయాలని సిఫార్సు చేశాయి.
 • 7వ ఆర్థిక సంఘం అదనపు ఎక్సైజ్‌ సుంకాల రాబడిని జనాభా, రాష్ట్ర జాతీయోత్పత్తి ఆధారంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
 • తర్వాతి కాలంలో ఆర్థిక విత్త సంఘాలన్నీ ఇదే సూత్రాన్ని అమలు చేశాయి.


రైల్వే ప్రయాణికుల ఛార్జీల రాబడిలో రాష్ట్రాల వాటా

 • రాజ్యాంగంలో 269 అధికరణ ప్రకారం కేంద్రం రైల్వే ప్రయాణికుల చార్జీలపై, సరకు రవాణాపై పన్ను విధించి రాబడిని రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
 • 1957 నుంచి రైల్వే టికెట్‌పై చార్జీ, పన్ను వివరాలు ఉండేవి. ప్రయాణ చార్జీలో పన్నును కలిపివేయడంతో ఈ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు రాబడిలోటు భర్తీ చేయడానికి విరాళాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. 1971లో తిరిగి పాత పద్ధతిని ప్రవేశపెట్టి, 1973లో మరలా రద్దు చేసి విరాళాల పద్ధతిని ప్రారంభించారు. 1973లో పాత పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వ రైల్వే రాబడి మొత్తంలో 10.7% పన్ను రాబడిగా రాష్ట్రాలకు లభిస్తూ ఉండేది. తర్వాతి కాలంలోనూ విరాళాల పద్ధతిలో రైల్వే రాబడి మొత్తంలో 10.7% పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు వాదించాయి. ఈ వాదనను రైల్వేశాఖ తిరస్కరించింది. 8వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 95 కోట్లు విరాళంగా చెల్లించాలని నిర్ణయించింది.
 • 10.7% ప్రాతిపదికపైనే 9వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 150 కోట్ల విరాళం సిఫార్సు చేయగా, 10వ ఆర్థిక సంఘం 380 కోట్ల విరాళాన్ని సిఫార్సు చేసింది.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు సహాయక విరాళాలు

పెరుగుతున్న సంక్షేమ పథకాల వ్యయాన్ని భరించడానికి వీలు కల్పిస్తూ రాజ్యాంగంలో 275 అధికరణ కింద విత్త సంఘాల సిఫార్సు ద్వారా ప్రతి అయిదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు సహాయక విరాళాలు మంజూరు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలోటును భర్తీ చేయడానికి, అంతర్‌రాష్ట్ర ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, స్థానిక పాలనా సంస్థల అభివృద్ధికి కేంద్రం రాష్ట్రాలకు సహాయ విరాళాలు మంజూరు చేస్తుంది.


కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు

 • 1951-52లో కేంద్రం రాష్ట్రాలకు 70 కోట్లు, 1951-56లో 800 కోట్ల రుణాలు మంజూరు చేసింది.
 • ఆరో విత్త సంఘం రుణ చెల్లింపుల్లో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, చెల్లింపు కాలాన్ని 20 నుంచి 30 సంవత్సరాల వరకు పెంచింది.
 • 13వ ఆర్థిక సంఘం రెవెన్యూలోటు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల జాతీయోత్పత్తిలో 68% మించకూడదని, కేంద్ర ప్రభుత్వ రుణాలు 45%, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు 25 శాతానికి తగ్గించింది.
 • వివిధ విత్త సంఘాలు కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా క్రమంగా పెంచాయి.
 • ఆదాయపన్ను రాబడిలో వాటాను 85% వరకు, ఎక్సైజ్‌ సుంకం రాబడిలో వాటాను 45% పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కుదుటపడింది.
 • కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తం విత్త వనరుల గరిష్ఠ పరిమితి 38% చేరింది.

ఎస్టేట్‌ సుంకం రాబడిలో రాష్ట్రాల వాటా

 • 1953 నుంచి కేంద్రం ఎస్టేట్‌ సుంకం వసూలు చేసి, రాబడిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బదిలీ చేశారు.
 • ఎస్టేట్‌ సుంకం రాబడిలో ఒక శాతం కేంద్రపాలిత ప్రాంతాలకు, మిగిలింది రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 2వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
 • 4వ విత్త సంఘం 2% కేంద్రపాలిత ప్రాంతాలకు, 98% రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది.
 • 7వ విత్త సంఘం రాష్ట్రాల్లోని ఆస్తుల స్థూల విలువ నిష్పత్తి ప్రకారం ఆయా రాష్ట్రాలకు ఎస్టేట్‌ సుంకం రాబడిని పంపిణీ చేయాలని సూచించింది.
 • 8వ ఆర్థిక సంఘం కూడా ఈ సూత్రాలనే సిఫార్సు చేసింది.
 • ఎస్టేట్‌ సుంకం ఎగవేత వల్ల రాబడి తక్కువగా ఉండటమే కాకుండా పన్ను వసూలు ఖర్చులు ఎక్కువ కావడంతో 1985 మార్చి నుంచి ఈ సుంకాన్ని రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని