ప్రజా ప్రయోజన సంరక్షణ సమూహాలు!

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. విభిన్న భావజాలాలు, ఆసక్తులు, ప్రాంతీయ ఆకాంక్షలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓటర్లను సమీకరించడం, విధానాలను రూపొందించడం, ప్రభుత్వాలను జవాబుదారీతనంతో పని చేసే విధంగా చూడటంలో ప్రధానంగా వ్యవహరిస్తాయి.

Published : 19 Apr 2024 00:59 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. విభిన్న భావజాలాలు, ఆసక్తులు, ప్రాంతీయ ఆకాంక్షలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓటర్లను సమీకరించడం, విధానాలను రూపొందించడం, ప్రభుత్వాలను జవాబుదారీతనంతో పని చేసే విధంగా చూడటంలో ప్రధానంగా వ్యవహరిస్తాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ చారిత్రక రాజకీయ వారసత్వం, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పటుత్వం, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రాంతీయ పార్టీల చొరవ శక్తిమంతమైన దేశ ప్రజాస్యామ్యంలోని వైవిధ్యాన్ని, బహుముఖత్వాన్ని చాటుతున్నాయి. ప్రజలను సంఘటిత పరిచి, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసే రాజకీయ పార్టీ అర్థం, రకాలు, లక్షణాలను, ప్రభావాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. జాతి ప్రయోజనాల సంరక్షణలో పార్టీల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.


రాజకీయ పార్టీలు

ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. ఇవి ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేస్తాయి. రాజకీయ చైతన్యాన్ని కలిగించి ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.

రాజకీయ పార్టీ - అర్థ వివరణ: జాతి ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో ఒకే రకమైన రాజకీయ దృక్పథాలను కలిగి ఉండి, రాజ్యాంగబద్ధంగా రాజకీయ అధికారాన్ని సాధించడానికి కృషిచేసే కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని ‘రాజకీయ పార్టీ’గా పేర్కొనవచ్చు. ప్రపంచంలో 3 రకాల పార్టీ వ్యవస్థలు ఉన్నాయి.

ఏక పార్టీ వ్యవస్థ: ఒకే రాజకీయ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తూ ఇతర రాజకీయ పార్టీలను నియంత్రించడమో లేదా పరిమితులు విధించడమో చేసే విధానాన్ని ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో ప్రతిపక్ష పార్టీలకు, ప్రత్యామ్నాయ పార్టీలకు అవకాశం ఉండదు. రాజకీయ స్వేచ్ఛ కొరవడుతుంది.

  • ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇందులో ప్రత్యామ్నాయ ప్రభుత్వ విధానాలకు   అవకాశం ఉండదు.
  • ప్రస్తుతం ఏక పార్టీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల్లో చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఎరిత్రియా, లావోస్‌ ఉన్నాయి.

ద్విపార్టీ వ్యవస్థ:  ద్విపార్టీ వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన నిర్వహిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన విధానాలకు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.

  • ద్విపార్టీ వ్యవస్థలో ప్రభుత్వ విధానాలకు సుస్థిరత ఉంటుంది. ప్రజలకు కచ్చితమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యాలకు ఒక రాజకీయ పార్టీ బాధ్యత వహిస్తుంది.
  • ద్విపార్టీ విధానం అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో అమలులో ఉంది.

బహుళ పార్టీ వ్యవస్థ: ప్రభుత్వాల ఏర్పాటు, పరిపాలనలో పోటీపడేందుకు రెండు కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడే వ్యవస్థను బహుళపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ దృక్కోణాలను కలిగి ఉంటాయి.

  • ఇక్కడ ప్రత్యామ్నాయాల ఎంపికలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. పరిపాలనలో నియంతృత్వానికి అవకాశం ఉండదు. భిన్నమైన ప్రజాభిప్రాయం వ్యక్తీకరణకు వీలు కలుగుతుంది.
  • దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలవారికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనే స్వేచ్ఛ ఉంటుంది.
  • ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీల్లో నిరంతర చీలికలు, కలయికలు; సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు సర్వసాధారణం.
  • ఈ విధానం భారత్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ దేశాల్లో అమలులో ఉంది.

రాజకీయ పార్టీల లక్షణాలు:   రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై తమ విధానాలను స్పష్టంగా రూపొందించుకుంటాయి. విదేశాంగ, సంక్షేమ, ఆంతరంగిక, ఆర్థిక, పారిశ్రామిక తదితర విధానాలను ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేకంగా తమ ప్రాధాన్య క్రమంలో ప్రజలకు వివరిస్తాయి.

  • ప్రభుత్వ పరిపాలనా విధానాలపై అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు కృషిచేస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ తమ పరిపాలనా విధానాల ఫలితంగా ప్రజలు ఎంత మేరకు లబ్ధిపొందారు, సంక్షేమ ఫథకాల అమలు వల్ల కలిగిన ప్రయోజనాలను వివరిస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, తద్వారా సంభవించే అనర్థాలను వివరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తాయి.
  • జాతి ప్రయోజనాలను పరిరక్షించడం రాజకీయపార్టీల లక్ష్యంగా ఉంటుంది. వాటిని విస్మరించిన రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు.
  • రాజ్యాధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు కృషి చేస్తాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంది.

సాధారణ ఎన్నికలు - రాజకీయ పార్టీల ప్రభావం

స్వాతంత్య్రానంతరం లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఘన విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించడంతో పాటు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభ పక్ష నాయకుడిగా, ప్రధాన మంత్రిగా దేశ రాజకీయాలను శాసించారు. బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికలు, 1962లో జరిగిన మూడో సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి గండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ స్వల్ప మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు/ కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

  • 1971లో ‘గరీబీ హఠావో నినాదం’తో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభకు జరిగిన తొలి మధ్యంతర ఎన్నికల బరిలో నిలిచింది. 351 స్థానాలు గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. 1971 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగింది.
  • 1977లో లోక్‌సభకు జరిగిన ఆరో సాధారణ ఎన్నికల అనంతరం దేశ రాజకీయల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. జనతాపార్టీ 298 స్థానాలను గెలుపొంది మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • 1979లో జనతాపార్టీలో సంభవించిన అంతర్గత విభేదాల కారణంగా మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చరణ్‌ సింగ్‌ ప్రధానమంత్రి పదివిని చేపట్టి లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమై 23 రోజులకే పదవిని కోల్పోయారు.
  • 1980లో లోక్‌సభకు జరిగిన ఏడో సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 352 స్థానాలను గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. 1984, అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు.
  • ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్‌సభకు జరిగిన ఎనిమిదో సాధారణ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 414 స్థానాలు గెలుపొంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ 2 స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవతరించింది.
  • 1989లో లోక్‌సభకు జరిగిన తొమ్మిదో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీ పొందలేకపోయింది. దీంతో ‘హంగ్‌ పార్లమెంటు’ ఏర్పడింది. జనతాదళ్‌ పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ కూటమి ద్వారా వి.పి.సింగ్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదం వ్యవహారంలో వి.పి.సింగ్‌ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పతనమైంది. 1989 నుంచి దేశంలో సంకీర్ణ శకాల యుగం ప్రారంభమైంది.
  • 1991లో లోక్‌సభకు జరిగిన పదో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించనప్పటికీ పి.వి.నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ తన రాజకీయ చాతుర్యంతో అయిదేళ్లు పూర్తిగా నిర్వహించారు.
  • 1996లో లోక్‌సభకు జరిగిన పదకొండో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఈ సభా కాలంలో బీజేపీ తొలిసారిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 13 రోజులకే ప్రభుత్వం పతనమైంది. తర్వాత హెచ్‌.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ ప్రధాని పదవులు చేపట్టినప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు.
  • 1998లో బీజేపీకి చెందిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పన్నెండో లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏఐఏడీఎంకే తన మద్దతును ఉపసంహరించడంతో ప్రభుత్వం పతనమైంది.
  • 1999లో పదమూడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌’ (ఎన్డీయే) పేరుతో కూటమిని ఏర్పాటు చేసి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • 2004లో జరిగిన పద్నాలుగో సాధారణ ఎన్నికలు, 2009లో జరిగిన పదిహేనో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ)గా ఏర్పడి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపింది.
  • 2014లో లోక్‌సభకు జరిగిన పదహారో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుపొందింది. అయినప్పటికీ ఎన్డీయే కూటమిగా ఏర్పడి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • 2019లో లోక్‌సభకు జరిగిన పదిహేడో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ ఎన్డీయే కూటమిని ఏర్పాటుచేసి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా పొందలేకపోయింది.

రచయిత: బంగారు సత్యనారాయణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని