కరెంట్‌ అఫైర్స్‌

ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది.

Updated : 20 Apr 2024 01:15 IST

తర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండోస్థానంలో ఉంది. స్టార్‌ రేటింగ్‌తో ‘స్కైట్రాక్స్‌’ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తోంది. 2023లో ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా ఛాంగి మొదటి స్థానంలో ఉంది.


స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్‌ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్‌ 2024, ఏప్రిల్‌ 18న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌)లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు.


టైమ్‌ మ్యాగజీన్‌ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి అలియాభట్‌, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఇందులో చోటు పొందారు.


దేశ జనాభా 2024లో సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌-2024 నివేదికలో అంచనా వేసింది. 144.17 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రస్థానంలో, 142.5 కోట్లతో చైనా రెండోస్థానంలో ఉంటాయని వెల్లడించింది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


మాదిరి ప్రశ్నలు

2024, ఫిబ్రవరిలో ప్రబోవో సుబియాంటో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? (జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి ఈయన పోటీ చేశారు. 17 వేలకు పైగా ద్వీపాల దేశమైన ఇక్కడ అధ్యక్ష, ఉపాధ్యక్ష, నేషనల్‌, ప్రొవిన్షియల్‌, రీజినల్‌, సిటీ స్థాయిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకేసారి జరగడం ఈ దేశంలో ప్రత్యేకత.)

జ: ఇండోనేసియా


ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని నెదర్లాండ్స్‌లోని వాగె నింగెన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం అంచనా వేసింది? (చైనా, మధ్య యూరప్‌, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం పది వేల పై చిలుకు నదీ బేసిన్లు, సబ్‌ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిలో 3061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికి రాకుండా పోనుందని అధ్యయనం హెచ్చరించింది.)

జ: 2050


2024, ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు ‘ఇండియా ఎనర్జీ వీక్‌ (ఐఈడబ్ల్యూ)’ను ఎక్కడ నిర్వహించారు? (ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులకు సంబంధించిన ఒప్పందాన్ని 2048 వరకు పొడిగిస్తూ ఖతార్‌ ఎనర్జీతో దేశీయ దిగ్గజం పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఈ సదస్సులో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.)

జ: గోవా


భారత్‌ 24 ‘ఇగ్లా - ళీ పోర్టబుల్‌ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌’ సిస్టమ్‌లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది?

జ: రష్యా  


కజకిస్థాన్‌లోని అస్తానాలో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ)  భద్రతామండలి కార్యదర్శుల ఎన్నో విడత సమావేశం జరిగింది?

జ: 19వ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని