స్వదేశీ రాజుల అనైక్యతే... బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణకు నిచ్చెన..

సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఆంగ్లేయులు తమ రాజనీతి, సైనిక బలం, రాజ్యకాంక్షలతో భారత్‌లోని ఒక్కో రాజ్యంపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. భారతదేశ రాజులతో సఖ్యంగా ఉంటూనే, సమయానుకూలంగా పావులు కదిపారు.

Published : 20 Apr 2024 01:11 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర

సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఆంగ్లేయులు తమ రాజనీతి, సైనిక బలం, రాజ్యకాంక్షలతో భారత్‌లోని ఒక్కో రాజ్యంపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. భారతదేశ రాజులతో సఖ్యంగా ఉంటూనే, సమయానుకూలంగా పావులు కదిపారు. ఈ క్రమంలో పలు యుద్ధాలు చేశారు. వాటిలో ఆంగ్లో-మరాఠా యుద్ధాలు ముఖ్యమైనవి. మరాఠాల్లో నెలకొన్న అంతర్గత కలహాలు, వారిలో వారికే పీష్వా స్థానంపై ఆశ బ్రిటిష్‌ వారికి అవకాశం కల్పించాయి. క్రీ.శ. 1775 - 1819 వరకు మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాలు జరగ్గా, క్రీ.శ 1775 - 82 మధ్య మొదటి యుద్ధం జరిగింది. దీని తర్వాత జరిగిన రెండు యుద్ధాల్లోనూ స్వదేశీ రాజుల ఓటమి, ఆంగ్లేయుల విజయంతో మరాఠా సామ్రాజ్యంపై బ్రిటిష్‌ వారి ఆధిపత్యం కొనసాగింది.

ఆంగ్లో - మరాఠా యుద్ధాలు (క్రీ.శ. 1775 - 1819)
రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (క్రీ.శ. 1803 - 05)

ఘోబా కుమారుడైన రెండో బాజీరావు పీష్వాగా, నానాఫడ్నవీస్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఇరువురి వైరం, నిజాం-మహారాష్ట్రుల మధ్య శతుత్వ్రం, ఇండోర్‌, గ్వాలియర్‌ పాలకుల అసమర్థత బ్రిటిష్‌ కంపెనీ విస్తరణకు మార్గాన్ని సుగమం చేసింది.

 • నానా మరణానంతరం అతడి స్థానం కోసం సింధియా, హోల్కార్‌లు ఘర్షణ పడ్డారు. పీష్వా సేనలను యశ్వంత్‌రావు, సింధియా ఓడించి పూనాను ఆక్రమించారు.
 • పీష్వా రెండో బాజీరావు బసేన్‌లో శరణార్థి అయ్యాడు.
 • యశ్వంత్‌రావు అమృతరావు (రఘోబా దత్తపుత్రుడు) కుమారుడైన వినాయకరావును పీష్వాగా నియమించాడు.

యుద్ధం తీరుతెన్నులు

బసేన్‌లో శరణు పొందిన రెండో బాజీరావు లార్డ్‌ వెల్లస్లీ కోరుకున్న సైన్యసహకార ఒడంబడికకు అంగీకరించాడు. 1802 డిసెంబరు 31న బసేన్‌ సంధి జరిగింది.
1. ఈ సంధి ప్రకారం కనీసం 6000 పదాతిదళం, ఆ నిష్పత్తిలో భారతీయ, ఐరోపా సేనలు ఉన్న తుపాకీ దళం శాశ్వతంగా పీష్వా వద్ద ఉండాలి.
2. వాటి ఖర్చుల నిమిత్తం సాలీనా రూ.2600000 శిస్తు ఇచ్చే భూమిని కంపెనీకి ఇవ్వాలి.
3. ఇతర ఐరోపా జాతుల వారితో ఏ రకమైన సంబంధాలు ఉండకూడదు.

 • నానాఫడ్నవీస్‌ వివేకం, దూరదృష్టితో సంరక్షించిన మహారాష్ట్రుల రాజకీయ అస్తిత్వాన్ని బాజీరావుఖిఖి రక్షణ పేరుతో నాశనం చేశాడు.
 • 1803 మే 13న బాజీరావుఖిఖి పీష్వాగా తిరిగి పదవి పొందాడు.
 • ‘పశ్చిమ భారతదేశంలో కంపెనీవారి స్థితిని ఈ సంధి పూర్తిగా మార్చివేసి, లిప్తకాలంలో కంపెనీ బాధ్యతలను త్రిగుణీకృతం చేసింది’ అని డీన్‌హట్టన్‌ అభిప్రాయపడ్డారు.
 • బసేన్‌ ఒప్పందం తర్వాత యుద్ధం ఉండదని వెల్లస్లీ భావించాడు.
 • దౌలత్‌రావ్‌ సింధియా, బీరార్‌కు చెందిన రెండో రఘోజీ భోంస్లే, యశ్వంత్‌రావు తమ పక్షానికి వస్తారని అతడు ఆశించాడు.
 • హోల్కార్‌ యుద్ధంలో పాల్గొనలేదు. గైక్వాడ్‌ తటస్థంగా ఉండిపోయాడు. అయితే పీష్వాపై సింధియా, భోంస్లేలు యుద్ధం సాగించారు.
 • మహారాష్ట్రులు ఎక్కువ పదాతి దళాన్ని కలిగి ఉండేవారు. అయినా ఆంగ్లేయుల చేతిలో వీరు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
 • లేక్‌ గుజరాత్‌, బుందేల్‌ఖండ్‌, ఒరిస్సాలపై దాడి చేశాడు. మహారాష్ట్రులు సైనిక బలం చాలక మళ్లీ ఓడిపోయారు.
 • వెల్లస్లీ 1803 ఆగస్టు 12న అహ్మద్‌నగర్‌ని ఆక్రమించి, అస్సయే యుద్ధంలో సింధియా, భోంస్లేల సంయుక్త సైన్యాన్ని 1803 సెప్టెంబరు 23న ఓడించాడు. బుర్హాన్‌పూర్‌, అసీర్‌ఘర్‌, అర్గాం, గావిల్ఘర్‌ల వద్ద ఇంగ్లిష్‌ సేనలు విజయం సాధించాయి.
 • ఓటమి పాలైన భోంస్లే, సింధియాలు విడివిడిగా సైనిక ఒప్పందాలు చేసుకున్నారు.
 • బీరార్‌కు చెందిన భోంస్లే 1803 డిసెంబరు 17న దేవ్‌గాం ఒప్పందం చేసుకుని, బాలాసోర్‌తో సహా కటక్‌, వార్దా నదికి పశ్చిమంగా ఉన్న ప్రాంతాన్ని కంపెనీపరం చేశాడు.
 • నాగ్‌పుర్‌కు మాన్‌స్టువర్ట్‌ ఎల్ఫిజ్స్‌ను ప్రతినిధిగా పంపారు.
 • సింధియా 1803 డిసెంబరు 30న సుర్జి అర్జున్‌గాం ఒప్పందం చేసుకున్నాడు. దీనిప్రకారం గంగా, యమున అంతర్వేదిలోని ప్రాంతాలను, జయపూర్‌, జోధ్‌పూర్‌, గొహడ్‌లకు ఉత్తరంగా ఉన్న రాజపుత్ర భాగాలను, అహ్మద్‌నగర్‌, బ్రోచ్‌, అజంతా కొండలకు పశ్చిమంగా ఉన్న భాగమంతటినీ కంపెనీపరం చేశాడు.
 • ఈ ప్రాంతానికి జాన్‌మాల్కంను ప్రతినిధిగా నియమించారు.
 • సింధియా 1804లో సైన్యసహకార ఒడంబడికకు అంగీకరించి సరిహద్దుల్లో 6000 మంది సేనలను ఉంచాలని ఒప్పుకున్నాడు.
 • హోల్కార్‌ అనతికాలంలోనే కంపెనీతో యుద్ధం చేశాడు.
 • మాన్సన్‌ను ముకుందా కనుమ వద్ద ఓడించి, ఢిల్లీ మీద కూడా దాడి చేశాడు.
 • 1804 నవంబరు 17న హోల్కార్‌ లేక్‌ చేతిలో ఓడిపోయాడు. కానీ లేక్‌ భరత్‌పూర్‌ దుర్గాన్ని ఆక్రమించలేక ఓటమి పొందాడు.
 • 1805 ఏప్రిల్‌ 10న భరత్‌పూర్‌ రాజు కంపెనీతో సంధి చేసుకున్నాడు. కంపెనీవారు వెల్లస్లీని వెనక్కి పిలవడంతో రెండో మహారాష్ట్ర యుద్ధం ముగిసింది.

ఫలితాలు

 • సర్‌ జార్జ్‌బార్లో సింధియాతో 1805 నవంబరు 23న సంధి చేసుకున్నాడు.
 • గ్వాలియర్‌, గొహడ్‌లు సింధియాకు వదలడం, చంబల్‌ నదికి ఉత్తరంగా ఆక్రమించే హక్కును వదులుకోవడం, రాజపుత్ర సంస్థానాలతో కంపెనీ ఒప్పందాలు చేసుకోకూడదనేవి సంధి షరతులు.
 • లేక్‌ హోల్కార్‌ను అమృత్‌సర్‌ వరకు తరమగా, సిక్కులు హోల్కార్‌కు సాయపడలేదు. 1806 జనవరి 2న హోల్కార్‌తో శాంతి సంధి చేసుకున్నారు.
 • దాని ప్రకారం టోంక్‌, రాంపూరా, బూందీ, కూచ్‌, బుందేల్‌ఖండ్‌, చంబల్‌ నదికి ఉత్తర ప్రాంతాలపై హోల్కార్‌ హక్కులు పోయాయి.
 • రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం మహారాష్ట్ర నాయకుల్లో స్ఫూర్తిని, అస్తిత్వాన్ని పూర్తిగా నశింపజేసింది.
 • బ్రిటిష్‌ వారి ఆజ్ఞలను స్థానిక రాజులు శిరసావహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆంగ్లేయుల ఆధిపత్య తీరు

యుద్ధాలన్నింటిలోను కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్స్‌, సైనిక అధికారులు మహారాష్ట్రులను చిన్నచూపు చూశారు.

 • ‘మహారాష్ట్రుల్లో పీష్వా నుంచి సామాన్య వ్యక్తి వరకు ఒక్కడూ ఒక్క షిల్లింగ్‌ కూడా లేనివారని వెల్లస్లీ అనగా, సింధియా సేనల తర్ఫీదు, దుస్తులు లాంటివి బలిపశువుకు చేసే అలంకారాలని మన్రో పేర్కొన్నాడు.
 • దౌలత్‌రావు సింధియా అవివేకం, యశ్వంత్‌రావు హోల్కార్‌ విషయంలో పీష్వా రెండో బాజీరావు అసమర్థత మహారాష్ట్రులపై కంపెనీ విజయాన్ని సులభతరం చేశాయి.
 • మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాలతో మొత్తం ద్వీపకల్ప ప్రాంతం, నర్మదా, యమునా మధ్య ప్రాంతం, గుజరాత్‌, మాళ్వాలు అన్నీ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి లొంగిపోయాయి.
 • రాజపుత్ర, వాయవ్య సరిహద్దు ప్రాంతాలను కంపెనీ ఆక్రమించుకోవడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి.
 • గంగా, యమునా మైదానంలో అయోధ్య, రోహిల్‌ఖండ్‌ రాష్ట్రాలను కంపెనీ ఆక్రమించుకుంది.
 • ఈ విధంగా క్రీ.శ. 1757 - 99 మధ్య కాలంలో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ కర్ణాటక, బెంగాల్‌, మైసూరు, మరాఠా ప్రాంతాలను ఆక్రమించాయి.
 • మొగల్‌ చక్రవర్తుల అధికారం ఈ కాలంలో నామమాత్రంగా మిగిలింది.

మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (క్రీ.శ. 1817-19)

ఆంగ్లేయులు - మరాఠాలకు మధ్య చివరి యుద్ధం లార్డ్‌ హేస్టింగ్స్‌ కాలంలో ప్రారంభమైంది.

 • జశ్వంత్‌రావు హోల్కార్‌ తన సోదరుడు కాశీరావును, దాయాది ఖండేరావును చంపి, ఉచితానుచితాలు తెలియని స్థితిలో 1811 అక్టోబరు 20న మరణించాడు.
 • ఇండోర్‌ సంస్థానం తులసీబాయి, బలరాంసేఠ్‌, అమీర్‌ఖాన్‌ల నాయకత్వంలో ఉండేది.
 • బరోడాకు చెందిన గైక్వాడ్‌ సైన్య సహకార ఒడంబడికను ఉల్లంఘించాలనుకున్నాడు.
 • రఘోజీ భోంస్లే రాజ్యంపై పఠాన్లు, పిండారీల దాడులు ఎక్కువయ్యాయి. పీష్వాగా ఉన్న రెండో బాజీరావు త్రయంబక్‌జీ డాంగ్లియా ప్రభావానికి లోనయ్యాడు.
 • గైక్వాడ్‌ ప్రధానమంత్రి గంగాధరశాస్త్రిని త్రయంబక్‌జీ హత్య చేయించాడు. అయితే గంగాధరశాస్త్రి కంపెనీకి మిత్రుడు.
 • ఈ చర్యలతో ఆంగ్లేయులు రెండో బాజీరావును ఠాణాకోటలో  బంధించారు. ఒక ఏడాది తర్వాత పీష్వా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
 • అమీర్‌ఖాన్‌, పిండారీలు, మహరాష్ట్రులు ఒక కూటమిగా చేరి కంపెనీ వారిని ఎదిరించాలని భావించారు.
 • 1813-23లో గవర్నర్‌ జనరల్‌గా ఉన్న హేస్టింగ్స్‌ వీరికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాడు.
 • క్రీ.శ. 1817 జూన్‌ 13న పూనా సంధితో పీష్వా అధికారాలు తగ్గిపోయాయి. పీష్వా మహరాష్ట్రుల నాయకత్వం కోల్పోయాడు.
 • సింధియా గ్వాలియర్‌ సంధి ప్రకారం పిండారీలను అణచడంలో కంపెనీకి స్వయంగా సహకరించాల్సి వచ్చింది.
 • 1816 మార్చి 22న రెండో రఘోజీ భోంస్లే మరణంతో పార్మోజీ ఆ రాజ్యానికి వారసుడయ్యాడు. ఇతడు అసమర్థుడు.

యుద్ధం - ఫలితాలు

పీష్వా, బ్రిటిష్‌ సేనలకు ఖిర్కి వద్ద జరిగిన యుద్ధంలో పీష్వా ఓడిపోయాడు.

 • నాగ్‌పుర్‌లో అప్పాసాహెబ్‌, ఇండోర్‌లో రెండో మల్హర్‌రావు తిరుగుబాట్లు చేశారు.
 • సితబాల్డి యుద్ధంలో నాగ్‌పుర్‌ సేనలు, మహౌద్‌పూర్‌ యుద్ధంలో హోల్కార్‌ సేనలు ఓటమిపాలయ్యాయి.
 • అప్పాసాహెబ్‌ కాందిశీకుడై 1840లో జోధ్‌పూర్‌లో మరణించాడు.
 • పీష్వా ఖర్కి యుద్ధం తరవాత కోరేగాం, అష్టిల వద్ద మరో రెండు యుద్ధాలు చేసినా ఓడిపోయాడు.
 • క్రీ.శ. 1818లో రెండో బాజీరావు సాలీనా 800000 రూపాయల పింఛనుతో కాన్పూర్‌ వద్ద బితార్‌లో గడిపాడు.
 • అతని భూభాగం బ్రిటిష్‌ నియంత్రణలోకి వెళ్లింది.
 • త్రయంబక్‌జీ డాంగ్లియా చునార్‌లో యావజ్జీవ శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
 • మాందసోర్‌ సంధి ప్రకారం హోల్కార్‌ రాజపుత్ర రాజ్యాలపై హక్కులు కోల్పోయాడు. నర్మదా నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని కంపెనీకి ఇచ్చేశాడు.
 • టోంక్‌కు అమీర్‌ఖాన్‌ను నవాబుగా గుర్తించారు. ఇండోర్‌లో బ్రిటిష్‌ ప్రతినిధిగా శాశ్వతంగా నియమితుడయ్యాడు.
 • పీష్వా రాజ్యం క్షీణించి సతారా లాంటి చిన్న రాజ్యం ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని