నిరుపయోగ ఉపగ్రహాలను కూలుస్తూ.. అంతరిక్ష వ్యర్థాలను తొలగిస్తూ..

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL), అమెరికాకు చెందిన శాటిలాజిక్‌ ఇంక్‌ (Satellogic Inc) సంయుక్తంగా భారత సైనిక అవసరాలను తీర్చేందుకు రూపొందించిన తొలి ప్రైవేట్‌ శాటిలైట్‌, TSAT-1Aని స్పేస్‌ఎక్స్‌ సంస్థకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌తో ప్రయోగించారు.

Updated : 21 Apr 2024 01:37 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ : తాజా అంశాలు

TSAT-1A

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL), అమెరికాకు చెందిన శాటిలాజిక్‌ ఇంక్‌ (Satellogic Inc) సంయుక్తంగా భారత సైనిక అవసరాలను తీర్చేందుకు రూపొందించిన తొలి ప్రైవేట్‌ శాటిలైట్‌, TSAT-1Aని స్పేస్‌ఎక్స్‌ సంస్థకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌తో ప్రయోగించారు.

  • భారత్‌ తన సైనిక అవసరాల కోసం శాటిలైట్‌ టెక్నాలజీని వినియోగించడంతో పాటు రోదసీ రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో ప్రయోగించిన టీశాట్‌- 1ఏ ఉపగ్రహం ఒక మీటర్‌ కంటే తక్కువ (0.5 - 0.8 మీ.) రిజల్యూషన్‌తో కచ్చితమైన ఛాయాచిత్రాలను తీయనుంది.
  • ఈ ఉపగ్రహం ప్రాథమికంగా భారత ప్రభుత్వం, సాయుధ దళాలకు తోడ్పాటు ఇవ్వనుంది.
  • బ్యాండ్‌ వ్యాగన్‌-1 మిషన్‌లో భాగంగా 50 కేజీల కంటే తక్కువ ద్రవ్యరాశి కలిగిన టీశాట్‌-1ఏని మరో 10 ఇతర ఉపగ్రహాలతో పాటు 2024, ఏప్రిల్‌ 7న నాసాకి చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు.
  • కర్ణాటకలోని వేమగల్‌ కేంద్రంలో రూపొందించిన టీశాట్‌-1ఏ ఉపగ్రహాన్ని TASL దిగువ భూకక్ష్య (LEO)లో ప్రవేశపెట్టింది. తన తయారీ కేంద్రంలో మరో 25 LEO ఉపగ్రహాలను తయారుచేసి వాణిజ్యపరమైన సేవలను అందించేందుకు టీఏఎస్‌ఎల్‌ భారత్‌లో ఒక గ్రౌండ్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయనుంది.

ఆకాశ్‌-NG క్షిపణి

2024 జనవరి 12న ఉపరితలం నుంచి గగనతలానికి ఎగిరే ఆకాశ్‌ కొత్తతరం (New generation - NG) క్షిపణిని డీఆర్‌డీవో, ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌), చండీపుర్‌లో విజయవంతంగా పరీక్షించింది.
తక్కువ ఎత్తులో వేగంగా ఎగురుతున్న, మానవరహిత గగన లక్ష్యాన్ని ఇది చేధించింది. మిస్సైల్‌ కలిగి ఉన్న మొత్తం ఆయుధ వ్యవస్థ లక్ష్యాన్ని సమర్థవంతంగా అడ్డగించి, ధ్వంసం చేసింది.
ఆకాశ్‌ కలిగి ఉన్న దేశీయ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌, లాంచర్‌, మల్టీఫంక్షన్‌ రాడార్‌, కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థల పనితీరును పరీక్షించారు.
కొత్త తరానికి చెందిన ఆకాశ్‌ - NG క్షిపణి సుమారు 40 కి.మీ. పరిధిలోని 10 లక్ష్యాలను ఏకకాలంలో ఎదుర్కొంటుంది.

POEM- 3 పునఃప్రవేశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో PSLV రాకెట్‌లోని నాలుగో అంచె (PS4) ను ఒక అంతరిక్ష ప్రయోగ వేదికగా ఉపయోగించి రికార్డు సృష్టించడమే కాకుండా, దాన్ని తిరిగి భూవాతావరణంలోకి పునఃప్రవేశం చేయించింది. కక్ష్యల్లో ఎలాంటి వ్యర్థాలు లేకుండా చేసి మరో మైలురాయిని అందుకుంది.

  • రాకెట్‌లోని అంచెల్లో ఇంధనం పూర్తిగా మండిన తరువాత అవి కింద పడిపోతాయి. అలా కాకుండా PSLV రాకెట్‌లోని నాలుగో అంచె ఉపగ్రహాలను అంతరిక్షంలో నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత కొంతకాలం కక్ష్యలో తిరుగుతూ అందులోని ప్రయోగ మాడ్యూళ్లకి వేదికగా ఉంటుంది. దీన్నే PSLV Orbital Experimental Module (POEM) అంటారు. ఇప్పటివరకు మూడు POEM ప్రయోగాలను ఇస్రో విజయవంతం చేసింది.
  • 2024 జనవరి 1న చేపట్టిన PSLV- C58 లేదా  XPoSat ఎక్స్‌పోశాట్శ్‌ మిషన్‌లో తొమ్మిది ప్రయోగ మాడ్యూళ్లు కలిగిన POEM- 3 ని అంతరిక్షంలోకి పంపించారు. దీన్ని 2024 మార్చి 21న తిరిగి భూవాతావరణంలోకి తీసుకువచ్చి(re-entry) పసిఫిక్‌ మహాసముద్రంలో కూల్చివేశారు. దీంతో అంతరిక్ష వ్యర్థాలను (Space debries) తగ్గించడంలో ఇస్రో తన వంతు పాత్రను పోషించింది.
  • దీనికంటే ముందు ఇస్రో 2023 మార్చి 7న కక్ష్యలో నిరుపయోగంగా తిరుగుతున్న మెగాట్రాపిక్స్‌ 1 అనే ఉపగ్రహ కక్ష్యను నియంత్రిత చర్యల ద్వారా క్రమంగా తగ్గిస్తూ భూవాతావరణంలోకి ప్రవేశింపజేశారు.
  • అధిక సాంద్రతతో కూడిన భూవాతావరణంలో ముక్కలుగా విడిపోయి పసిఫిక్‌ మహాసముద్రంలో నిర్దేశిత ప్రాంతంలో కూలిపోయింది.
  • 2011 అక్టోబరు 12న ప్రయోగించిన వాతావరణ అధ్యయన శాటిలైట్‌ మెగాట్రాపిక్స్‌ -1ని ఇస్రో, ఫ్రాన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ CNES సంయుక్తంగా రూపొందించాయి. ఉపగ్రహంలో మిగిలిపోయిన 120 కేజీల ఇంధనాన్ని వినియోగించి ఇరవైసార్లు కక్ష్య పరిధిని తగ్గించి దీన్ని సాధించారు.

LUPEX

జపాన్‌ అంతరిక్ష సంస్థ (JAXA- Japan Aerospace Exploration Agency) ఇస్రో సంయుక్తంగా చేపట్టనున్న చంద్రయాన్‌ని పోలిన మిషన్‌ LUPEX (లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్శ్‌).
ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి ధ్రువ ప్రాంతాలను అన్వేషించనున్నారు.
చంద్రుడిపై ఉన్న మంచు, నీటి వనరులను అన్వేషించడం LUPEX ప్రాథమిక లక్ష్యం.
మిషన్‌కి కావాల్సిన రోవర్‌, లాంచ్‌ వెహికిల్‌ (రాకెట్‌)ని జపాన్‌ సమకూర్చితే భారత్‌ ల్యాండర్‌ని అభివృద్ధి చేయడమే కాకుండా ఆపరేట్‌ చేయనుంది.
LUPEX రోవర్‌లో జపాన్‌తో పాటు భారత్‌, అమెరికా యూరప్‌లు అభివృద్ధి చేసిన పరికరాలు ఉండనున్నాయి.
చంద్రుడి ఉపరితలంపై తిరిగే రోవర్‌లలోని పరికరాలు చంద్రుడిపై నుంచి మట్టిని లేదా ఇతర పదార్థాలను పరిశోధించడమే కాకుండా కొంత పరిమాణాన్ని భూమికి తీసుకురానున్నాయి.
2025 నాటికి చేపట్టే LUPEX మిషన్‌ 2040 నాటికి భారతీయుడిని చంద్రమండలానికి పంపే యాత్రకి ఒక ముందస్తు మిషన్‌ కానుంది.

నూతన రాకెట్‌ ప్రయోగ కేంద్రం

తక్కువ ఎత్తులో ఉండే ధ్రువీయ కక్ష్య (Polarorbit)లోకి ఉపగ్రహాలను తక్కువ ఇంధన ఖర్చుతో సమర్థవంతంగా పంపేందుకు ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడులోని కులశేఖర పట్టణంలో నెలకొల్పుతోంది.

  • ఇస్రో ప్రస్తుతం అన్ని రకాల రాకెట్‌ ప్రయోగాలను శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ)లోని రెండు లాంచ్‌ ప్యాడ్‌ల్లోనే నిర్వర్తిస్తోంది.
  • శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ల విడిభాగాలు భారత్‌కి సమీపంలో దిగువన ఉండే శ్రీలంకలో పడకుండా ఉండేందుకు ప్రయోగానంతరం రాకెట్‌ దిశను 40ా కోణంలో మార్చాల్సి ఉంటుంది. దీన్నే డాగ్‌లెగ్‌ మాన్యువర్‌ అంటారు. ఈ కారణంగా రాకెట్‌ ప్రయాణ దూరం, ఇంధనం ఖర్చు గణనీయంగా పెరుగుతాయి.
  • ఎక్కువ దూరం వెళ్లే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల విషయంలో ఇలాంటి ఇంధన ఖర్చును ఉపేక్షించినా, తక్కువ ఎత్తులోని కక్ష్యల్లోకి వెళ్లే పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ (Small Satellite Launch Vehicle) రాకెట్ల విషయంలో ఇంధన వృథాని పరిగణించాల్సిందే.
  • అధిక సంఖ్యలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో ఇందుకు తగ్గ కొత్త ప్రయోగ కేంద్రాన్ని కులశేఖర పట్టణంలో ఏర్పాటు చేస్తోంది.
  • SDSC - SHAR కేంద్రాన్ని పెద్ద తరహా ఉపగ్రహాల ప్రయోగానికి, కులశేఖర పట్టణం స్పేస్‌ పోర్ట్‌ నుంచి చిన్న తరహా ఉపగ్రహాల(SSLV)ను ప్రయోగించడం ద్వారా ఇస్రో వాణిజ్య ప్రయోగాల సంఖ్యను మరింతగా పెంచనుంది.
  • కులశేఖర పట్టణం సముద్రానికి, భూమధ్యరేఖకు సమీపంలో ఉండటంతో రాకెట్లను దారి మరల్చకుండా నేరుగా పంపేందుకు అత్యంత అనువుగా ఉంటుంది.
  • రాకెట్‌ ప్రయోగ కేంద్రాలను భూమధ్యరేఖకు సమీపంలోనే ఏర్పాటు చేస్తారు. దీంతో భూమి ఆత్మభ్రమణ వేగం (తూర్పు) దిశలో రాకెట్‌ని మరింత సులువుగా, తక్కువ ఖర్చుతో ప్రయోగించవచ్చు.

ఉగ్రమ్‌(Ugram)

ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) తొలిసారి ప్రైవేట్‌ రంగ సంస్థతో కలిసి ‘ఉగ్రమ్‌’ అనే పేరుతో అస్సాల్ట్‌ (దాడి చేసే) రైఫిల్‌ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది.

  • దీన్ని భారత సైనిక దళాలు, పారామిలటరీ, రాష్ట్రాల పోలీసు బలగాలు వినియోగించనున్నాయి.
  • డీఆర్‌డీవో విభాగమైన ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ), హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ద్విప (దీ‌్రi్ప్చ) ఆర్మర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కాలం చెల్లిన INSAS రైఫిల్స్‌ స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు.
  • నాలుగు కేజీల కంటే తక్కువ ద్రవ్యరాశిని, 500 మీటర్ల వ్యాప్తిని కలిగిన ఉగ్రమ్‌ రైఫిల్‌ రష్యా నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్న తిరీ203 రైఫిల్స్‌ కొరతను తీర్చనుంది.

పుష్పక్‌  - RLV

ఉపగ్రహ ప్రయోగాల్లో జరిగే అధిక వ్యయాన్ని, అంతరిక్షంలో వ్యర్థాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇస్రో రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ (RLV) ని అభివృద్ధి చేస్తోంది.

  • ఇందులో భాగంగా పునఃవినియోగ రాకెట్‌ పుష్పక్‌ -RLV ను మూడోసారి విజయవంతంగా ల్యాండ్‌ చేసింది.
  • విమానాన్ని పోలి, రెక్కలను కలిగిన పుష్పక్‌-RLVను 2024 మార్చి 22న కర్ణాటక చిత్రదుర్గ ప్రాంతంలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ATR) లో విజయవంతంగా పరీక్షించారు.
  • భారత నావికా దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ సహాయంతో పుష్పక్‌-RLV ని 4.5 కి.మీ.ల ఎత్తు నుంచి జారవిడవగా, దాంట్లోని ప్యారాచూట్‌, బ్రేకులు, స్టీరింగ్‌ వ్యవస్థల ఆధారంగా అది నిర్దిష్ట ప్రదేశంలో ల్యాండ్‌ అయ్యింది.
  • ఇలాంటి ప్రయోగాలను 2016, ఏప్రిల్‌ 2023లోనూ నిర్వహించారు.
  • రామాయణంలో కనిపించే పుష్పక విమానాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీనికి పుష్పక్‌ అనే పేరు పెట్టారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని