కరెంట్‌ అఫైర్స్‌

అండర్‌ - 19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ - 2024 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు అండర్‌ -19 ప్రపంచ కప్‌ విజేతగా నిలవడం ఇది ఎన్నోసారి?

Updated : 22 Apr 2024 01:32 IST

మాదిరి ప్రశ్నలు

అండర్‌ - 19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ - 2024 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు అండర్‌ -19 ప్రపంచ కప్‌ విజేతగా నిలవడం ఇది ఎన్నోసారి?

జ: నాలుగోసారి (దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరిగిన తాజా ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 79  పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు గతంలో 1988, 2002, 2010లోనూ విజేతగా నిలిచింది. అండర్‌-19 ప్రపంచ కప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలవడం ఇది నాలుగోసారి. 2006, 2016, 2020లో భారత జట్టు ఫైనల్‌లో ఓడింది. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో  భారత్‌పై నెగ్గడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్‌లోనూ తలపడ్డాయి. రెండుసార్లు భారత జట్టే గెలిచింది.)


ఫైనాల్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ‘గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌ 2024’లో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఎన్నో స్థానంలో నిలిచింది? (ఈ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ మన దేశంలో మొదటి స్థానంలో, ఆసియా దేశాల్లో అయిదో స్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ 39వ స్థానంలో ఉంది.)

జ: 31వ


ఏ దేశంలో లిథియం అన్వేషణకు భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘ఖాంజి బిదేశ్‌ ఇండియా లిమిటెడ్‌ (కేఏబీఎల్‌)’కు ఇటీవల అనుమతి లభించింది? (ఈ మేరకు ఇండియా, ఈ దేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఇండియా ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న లిథియంలో 54 శాతం వరకు చైనా నుంచే వస్తోంది. తాజా ఒప్పందం వల్ల డ్రాగన్‌ దేశంపై ఇండియా అధికంగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ లిథియం అన్వేషణ చేపట్టడం, మైనింగ్‌ ప్రాజెక్ట్‌ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్ట్‌ వ్యయం దాదాపు రూ.200 కోట్లు. శుద్ధ ఇంధన సాంకేతికతలు, ముఖ్యంగా రీఛార్జ్‌ చేయగల బ్యాటరీల అభివృద్ధిలో లిథియం కీలకంగా నిలుస్తుంది. సౌర, పవన తదితర ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల ద్వారా అందే విద్యుత్తును నిల్వ చేయడానికి లిథియం అయాన్‌ బ్యాటరీలను విస్తృతంగా వినియోగిస్తారు.)

జ: అర్జెంటీనా

 


కరెంట్‌ అఫైర్స్‌

జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌గా నళిన్‌ ప్రభాత్‌ 2024, ఏప్రిల్‌ 19న నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. నళిన్‌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని వీఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఈ దళం చూస్తుంది.


బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్‌ 2024, ఏప్రిల్‌ 19న ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌లను అందించేందుకు భారత్‌ రెండేళ్ల కిందట 37.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికింద మన దేశం మూడు బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్‌. భారత వాయుసేనకు చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు మన దేశం చేరవేసింది.


నంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) 2024, ఏప్రిల్‌ 17న ‘ఆర్యభట్ట’ అవార్డుతో సత్కరించింది. ఏఎస్‌ఐ ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలో’ గుర్తింపు కూడా ఇచ్చింది. దేశంలో ఆస్ట్రోనాటిక్స్‌ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్‌ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఆయనకు గతంలో ‘భాస్కర’ అవార్డు లభించింది. ఈ రెండు అవార్డులను దక్కించుకున్న శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని