చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు!

ధారాళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం, సమయపాలన అలవాటు చేయడం, పోటీ తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ప్రతిభాపాటవాలను సమాజానికి తెలియజేయడం మొదలైన నైపుణ్యాలను, సామర్థ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడానికి అనేక రకాల కార్యక్రమాలను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తుంటాయి.

Published : 22 Apr 2024 00:58 IST

టీఆర్‌టీ - 2024
తెలుగు మెథడాలజీ

ధారాళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం, సమయపాలన అలవాటు చేయడం, పోటీ తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ప్రతిభాపాటవాలను సమాజానికి తెలియజేయడం మొదలైన నైపుణ్యాలను, సామర్థ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడానికి అనేక రకాల కార్యక్రమాలను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తుంటాయి. వాటిపై కాబోయే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. పిల్లలు తమ అవసరాలు, సమస్యలు, సందేహాలను వ్యక్తీకరించడానికి అనుసరించే పద్ధతులను తెలుసుకోవాలి. అందుకు తగిన మూల్యాంకనం, పర్యవేక్షణ విధానాలనూ నేర్చుకోవాలి. 


రాష్ట్రాల్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు

పిల్లలంతా చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల సాధనకు రూపొందించిందే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. దీన్ని 2005 - 06లో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) రూపొందించింది. ఈ కార్యక్రమంలో మూల్యాంకనాన్ని మూడు సార్లు నిర్వహించాలి.

1) ప్రారంభ స్థాయి నిర్ధారణ - జులై
2) మధ్యంతర స్థాయి మూల్యాంకనం - నవంబరు  
3) వార్షిక మూల్యాంకనం - మార్చి

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో మధ్యంతర, వార్షిక మూల్యాంకన పత్రాలను రూపొందించే బాధ్యత రాష్ట్రస్థాయి వారిది. దీన్ని పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షిస్తారు.

  • స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయి పర్యవేక్షణ అధికారి-ప్రధానోపాధ్యాయుడు (ఎస్‌సీహెచ్‌ఎమ్‌).
  • మండల స్థాయి పర్యవేక్షణ అధికారి- ఎంఈవో.
  • డివిజన్‌ పర్యవేక్షణ అధికారి- డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌.
  • జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి డీఈవో, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌, డైట్‌ స్టాఫ్‌.

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో పని విభజన: పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుంటే మొదటి ఉపాధ్యాయుడు 1, 2, 3 తరగతులకు; రెండో ఉపాధ్యాయుడు 4, 5 తరగతులకు బోధించాలి. ఒక ఉపాధ్యాయుడు, ఒక వాలంటీర్‌ ఉంటే ఉపాధ్యాయుడు 1, 2, 5 తరగతులకు; వాలంటీర్‌ 3, 4 తరగతులకు బోధించాలి.

  • ప్రారంభ పరీక్షలో గొణగకుండా, ధారాళంగా, తప్పులు లేకుండా చదివితే వారికి ‘ఎ’ గ్రేడ్‌ ఇవ్వాలి.

వినూత్న కార్యక్రమాలు

బడిబాట: ఇది విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన ప్రత్యేక లేదా వినూత్న కార్యక్రమం.

  • ఈ కార్యక్రమంలో భాగంగా ఆవాస ప్రాంతంలోని 5 నుంచి 14 ఏళ్ల బాలబాలికలను గుర్తించి నమోదు చేస్తారు.
  • బడిబాటలో బాలకార్మికులు, బాలికల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
  • విద్యార్థుల హాజరు బాధ్యత పాఠశాలదే.  

వార్షికోత్సవం: విద్యా సంవత్సరం చివర మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే వినూత్న కార్యక్రమం.

  • ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆ సంవత్సరం సాధించిన ప్రగతిని నివేదిక రూపంలో తెలియజేస్తారు.  

బాలల సంఘాలు:

1) ఆరోగ్య పరిశుభ్రత కమిటీ  
2) సాంస్కృతిక ప్రచార కమిటీ
3) గ్రంథాలయ కమిటీ
4) రివ్యూ కమిటీ

గోడపత్రిక: పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మకతను పెంపొందించేది గోడపత్రిక.

  • పిల్లలు నేర్చుకున్న, సేకరించిన విషయాలను ప్రదర్శించడానికి; సృజనాత్మకతకు, ఊహలకు సాధిత రూపాలు, రచనాశక్తిని ప్రదర్శించడానికి దోహదపడుతుంది.
  • ప్రతి తరగతిలో దీన్ని నిర్వహించవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక గోడపత్రిక; 6, 7, 8 తరగతులకు మరొక గోడపత్రికను నిర్వహించాలి.
  • దీని ద్వారా పిల్లల అభిరుచులు, ఆసక్తులను ప్రదర్శించవచ్చు. దీన్ని సమాచార సాంస్కృతిక కమిటీ నిర్వహిస్తుంది.
  • ఈ పత్రికలో ప్రతిరోజు పాత వాటిని తొలంగించి కొత్త అంశాలను ప్రదర్శించాలి.

పాఠశాల తపాలా పెట్టె: పాఠశాలలో పిల్లలకు ఎదురవుతున్న కష్ట నష్టాలు, ఇబ్బందులను స్వేచ్ఛగా వెల్లడించడానికి ఇది దోహదపడుతుంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

టీచరు డైరీ: ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా చేసిన వాటిని నమోదు చేసుకోవడానికి దోహదపడుతుంది. దీనివల్ల  ఉపాధ్యాయుడికి తరగతి గది నిర్వహణ సులభమవుతుంది. విద్యార్థుల సామర్థ్యాల ప్రగతి నమోదుకు కూడా ఉపయోగపడుతుంది.

పిల్లల డైరీ: పిల్లలు మూడో తరగతి నుంచి డైరీ రాయడం మొదలు పెట్టాలి. దీనివల్ల వారిలో సమయపాలనా దృక్పథం అలవడుతుంది. నెలకోసారి పిల్లల డైరీని పర్యవేక్షించాలి.

భాషోత్సవం: ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో నిర్వహిస్తారు. భాషోత్సవంలో వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, క్విజ్‌, బొమ్మలు గీయడం లాంటి అంశాలు ఉంటాయి. ఇది పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి కలగడానికి దోహదపడుతుంది.

పఠనోత్సవం: దీన్ని నవంబరులో నిర్వహిస్తారు. ఇది వార్తా పత్రికలు, వార పత్రికలు, కథల పుస్తకాలు, పద్యాలు, గేయాలు చదివించే కార్యక్రమం.

భాషామేళ/పాఠశాల మేళ: దీన్ని ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలి. పిల్లలు తయారు చేసిన సామగ్రిని ప్రదర్శనకు పెట్టి తమ విద్యార్థుల ప్రతిభాపాఠవాలు సమాజానికి తెలియచేసే కార్యక్రమం. సహకార భావన, ఆలోచనాశక్తి, కలుపుగోలు ధోరణి, నాయకత్వ లక్షణాలు పెరిగే కార్యక్రమం.

చిన్నారుల సభ: దీన్ని ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలి. పాఠశాల, ఉపాధ్యాయులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో; అసెంబ్లీని వైవిధ్య భరితంగా నిర్వహించడం లాంటి వాటి గురించి మాట్లాడించే కార్యక్రమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని