స్ఫూర్తిని పొంది.. సమరంలో చేరి!

ఆంగ్లవిద్య ఆంధ్ర ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచి భారత జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు దోహదపడింది. ఇక్కడి నేతలు అనేక పత్రికలు, సంస్థలను ఏర్పాటు చేసి జనాన్ని పోరాటాల వైపు నడిపించారు. కాంగ్రెస్‌ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించారు.

Updated : 22 Apr 2024 04:36 IST

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

ఆంగ్లవిద్య ఆంధ్ర ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచి భారత జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు దోహదపడింది. ఇక్కడి నేతలు అనేక పత్రికలు, సంస్థలను ఏర్పాటు చేసి జనాన్ని పోరాటాల వైపు నడిపించారు. కాంగ్రెస్‌ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించారు. వందేమాతరం ఉద్యమంలో స్వదేశీ సమితి సాయంతో యువతకు పారిశ్రామిక శిక్షణ ఇచ్చారు. జాతీయ నేతలు అరెస్టయినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ దశలో అతివాద నాయకుల పర్యటనలు ఆంధ్రలో మరింత స్ఫూర్తిని పెంచాయి. ఆ ప్రభావాలతో కొందరు బ్రిటిష్‌ పోలీసులకు ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్ని దేశాంతర కారాగార శిక్షలు అనుభవించారు. స్వతంత్ర పోరాటంలో సమిధలుగా మారారు.


ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి

తీరాంధ్రలో విద్యావ్యాప్తితో పాటు తెలుగు పత్రికా రంగం అభివృద్ధి చెందడంతో ప్రజా జీవితం వేగంగా మార్పులకు గురైంది. జనం రాజకీయ ప్రయోజనాల కోసం   ఉద్యమించారు. ఆంధ్రలో జాతీయ ఉద్యమం ప్రబలడానికి ఆంగ్ల విద్యావ్యాప్తి ప్రధాన  కారణంగా నిలిచింది. అందులో భాగంగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి.

1) మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ (1852): దీన్ని గాజులు లక్ష్మీ నర్సుచెట్టి స్థాపించారు..కార్యదర్శి సోమసుందర శెట్టియార్‌. ఇది కలకత్తాలో స్థాపించిన ఇండియన్‌ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థగా పని చేసింది. దానితో వచ్చిన విభేదాల కారణంగా మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌గా విడిపోయి స్వతంత్ర సంస్థగా ఏర్పడింది. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది.

2) మద్రాసు మహాజన సభ (1884): దీన్ని పి.రంగయ్య నాయుడు స్థాపించారు. మొదటి అధ్యక్షులుగా వ్యవహరించారు. కార్యదర్శి పి. ఆనందాచార్యులు. ఈ సభ ప్రధాన లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారం. మొదటి సమావేశానికి తెలుగు జిల్లాల నుంచి చాలామంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి అనుబంధంగా వెలుగులోకి వచ్చిన సభల్లో ముఖ్యమైంది కాకినాడ సాహితి సభ. ఐసీఎస్‌ వయోపరిమితిని పెంచాలని, ఐసీఎస్‌ పరీక్షలను ఇంగ్లండ్‌, భారత్‌లో ఒకేసారి నిర్వహించాలని కోరుతూ ఇంగ్లండ్‌లోని భారత సెక్రటరీకి రెండు సార్లు అర్జీలను సమర్పించింది.

  • 1885లో ఎ.ఒ. హ్యూమ్‌ స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) మొదటి సమావేశానికి మద్రాసు మహాజన సభ ప్రతినిధులు హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహించారు. 72 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర నుంచి ఈ సభకు పి.ఆనందాచార్యులు (చిత్తూరు), కేశవ పిళ్లై (అనంతపురం), పి. రంగయ్య నాయుడు, వెంకటసుబ్బారాయుడు, నరసింహ నాయుడు వెళ్లారు. వీరందరూ మద్రాసులో స్థిరపడిన ఆంధ్రులు.
  • 1886లో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన కలకత్తాలో రెండో ఐఎన్‌సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 436 మంది పాల్గొనగా, వారిలో ఆంధ్ర నుంచి 21 మంది ఉన్నారు.  

పి. ఆనందాచార్యులు: 1884లో మద్రాసు మహాజన సభ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1884లో ఆవిర్భవించిన మద్రాసు మహాజన సభకు కార్యదర్శిగా పనిచేశారు. 1891లో పి. ఆనందాచార్యుల అధ్యక్షతన నాగ్‌పుర్‌లో ఏడో ఐఎన్‌సీ సమావేశం జరిగింది. దీంట్లో ఎ.పి. పార్థసారధి నాయుడు, న్యాపతి సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించారు. ‘వైజయంతి’ అనే సారస్వత మాస పత్రికను స్థాపించారు.

కృష్ణా జిల్లా సభలు:

  • 1885లో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్‌ వివిధ జిల్లా సభల ఏర్పాటుకు కారణమైంది. కృష్ణా జిల్లా సభలు జరగడానికి రామస్వామి గుప్త ఎంతో కృషి చేశారు. మొదటి సభ 1892 ఆగస్టులో రామస్వామి గుప్త అధ్యక్షతన గుంటూరులో జరిగింది. (ఆనాడు గుంటూరు కృష్ణా జిల్లాలో భాగం). రెండో సభ మచిలీపట్నం (1893)లో, మూడో సభ ఏలూరు (1894)లో జరిగింది. మూడో సభ వ్యవసాయ పన్నుల పెంపునకు నిరసనగా జరిగింది. పన్నులు తగ్గించకపోతే భూమిని సాగుచేయకూడదని నిర్ణయించారు.
  • కృష్ణా జిల్లా సభల తరహాలో గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి సభలు జరిగాయి. మొదటి సభ న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన 1895, మే 30 నుంచి జూన్‌ 1 వరకు కాకినాడలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇలాంటి సభలు అన్ని జిల్లాల్లో పుంజుకున్నాయి.

వందేమాతర ఉద్యమం (1905):

  • బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ ఉద్యమం అనతి కాలంలోనే భారతదేశం మొత్తం వ్యాపించింది. గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పరిపాలన సౌలభ్యం కోసం బెంగాల్‌ను మత ప్రాతిపదికన (హిందూ, ముస్లిం) రెండు భాగాలుగా విభజించారు. ఈ విభజన గురించి తొలుత ‘సంజీవని’ పత్రికలో ప్రచురితమైంది. దీని సంపాదకుడు కృష్ణకుమార్‌ మిత్ర. బెంగాల్‌ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని శోక దినం లేదా సంతాప దినం లేదా విషాద దినం అని అంటారు. రవీంద్రనాథ్‌ ఠాకుర్‌ హిందూ ముస్లింల ఐక్యతకు గుర్తుగా అక్టోబరు 16ను రక్షాబంధన్‌ దినంగా ప్రోత్సాహించారు.
  • బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా 1905లో మద్రాసు బీచ్‌లో జి. సుబ్రమణ్యం అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అయ్యదేవర కాళేశ్వర రావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కోమర్రాజు లక్ష్మణరావు, గొల్లపూడి సీతారామ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ఆంధ్రలో వందేమాతర ఉద్యమానికి నాంది పలికింది.
  • బెంగాల్‌లో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమానికి నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ. అందులో భాగంగా పికెటింగ్‌,  విదేశీ వస్త్రాలను తగులబెట్టడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. దీన్నే ‘స్వదేశీ ఉద్యమం’ అని కూడా అంటారు. బాలగంగాధర్‌తిలక్‌, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌ ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు.
  • ఈ ఉద్యమ కాలంలో మద్రాసు వద్ద కొందరు ప్రముఖులు పరిశ్రమల సంఘం స్థాపించారు. ఒక స్వదేశీ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ఏర్పాటులో న్యాపతి సుబ్బారావు, కె. వెంకట  రమణరావు ప్రధానపాత్ర పోషించారు. ఈ సమయంలో పారిశ్రామిక శిక్షణ కోసం విద్యార్థులను జపాన్‌కు పంపడానికి కర్నూలులో చందాలు వసూలు చేశారు.
  • 1906లో సురేంద్రనాథ్‌ బెనర్జీ అరెస్టు కాగా రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, గుత్తి ప్రాంతాల్లో నిరసనలు చేశారు.‘వందేమాతరం - మనదే రాజ్యం’ అని నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో బిపిన్‌ చంద్రపాల్‌ పర్యటన కాలంలో జరిగిన ఉద్యమాలు:  కృష్ణాపత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన ముట్నూరి కృష్ణారావు కోరికపై అతివాదులు బిపిన్‌ చంద్రపాల్‌ను ఆంధ్రకు పంపారు. పాల్‌ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించారు. కృష్ణాపత్రిక మచిలీపట్నం కేంద్రంగా 1902లో ప్రారంభమైంది. బిపిన్‌ చంద్రపాల్‌ మొదటగా విజయనగరం, విశాఖల్లో పర్యటించారు. కాకినాడ పర్యటనలో వేదాంతం, స్వరాజ్యంపై పాల్‌ ఉపన్యసించారు.ఈయన పర్యటన సందర్భంగా ఏర్పడిన సంస్థ వందేమాతర రక్షణ లీగ్‌. బిపిన్‌ పర్యటన తర్వాత కాకినాడలో జరిగిన సంఘటనను ‘కాకినాడ దొమ్మికేసు’గా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ కెంప్‌, వందేమాతరం అని నినాదం చేసిన కొంపల్లి కృష్ణారావు అనే పిల్లవాడిని  దండించి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాడు. ఈ సంఘటన తర్వాత కెంప్‌ కార్యాలయాన్ని స్థానికులు ధ్వంసం చేశారు. ఇది ఆంధ్రాలో నమోదైన మొదటి క్రిమినల్‌ కేసు. చివరకు బాలుడైన కృష్ణారావును గాయపరిచినందుకు కెంప్‌నకు రూ.300 జరిమానాను విధించి, కడపకు బదిలీ చేశారు. బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రిలో చేసిన ఉపన్యాసాలకు అత్యంత ప్రజాదరణ లభించింది. ఫలితంగా బాలభారతి సమితి ఏర్పడింది. ఈ సమితి స్వరాజ్‌ ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. రాజమండ్రి వద్ద ఒక జాతీయ కళాశాల ప్రారంభమైంది. దీన్ని బెంగాల్‌ జాతీయ విద్యా కేంద్రానికి అనుబంధం చేయాలని బిపిన్‌ చంద్రపాల్‌ రూ. 1000 విరాళం ఇచ్చారు. పాల్‌ పర్యటనలో రాజమండ్రి వద్ద స్వదేశీ దుకాణాలను ఏర్పాటు చేశారు. వందేమాతరం ఉద్యమానికి ప్రభావితులైన గాడిచర్ల హరి సర్వోత్తమరావుతో సహా అనేకమంది ఉపాధ్యాయ, విద్యార్థులను రాజమండ్రి కళాశాల నుంచి ప్రిన్సిపల్‌ మార్క్‌ హంటర్‌ బహిష్కరించారు. స్వతంత్ర సంగ్రామంలో భాగంగా జైలు జీవితం గడిపిన తొలి తెలుగు వ్యక్తి గాడిచర్ల. ఈయన దత్త మండలాలకు రాయలసీమ అనే పేరు పెట్టారు.

కోటప్ప కొండ సంఘటన: కోటప్పకొండ ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉంది. దీని పూర్వపు పేరు త్రికూట మలయ పర్వతం. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 1909, ఫిబ్రవరి 18న జరిగిన వేడుకలకు సమీప కొత్తరెడ్డి పాలెం గ్రామస్థుడు గాదె చిన్నపరెడ్డి తన ఎద్దులతో వచ్చాడు. పెద్దఎత్తున జనం పోగవడంతో బ్రిటిష్‌ పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఆ సంఘటనలో చిన్నపరెడ్డి ఎద్దులు గాయపడ్డాయి. దాంతో అతడు, తన అనుచరులతో పోలీసులకు ఎదురు తిరిగాడు. ఈ ఘటనలో ఒక జవాను, ఇద్దరు బాలురు మరణించారు. అదే అదనుగా సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించే చిన్నపరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత విచారణలో ఉరిశిక్ష విధించి, అమలు చేశారు.

తెనాలి బాంబు కేసు: ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఉన్న కంచర్లపాలెం గ్రామానికి చెందిన చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు, వెంకట్రాయుడు తదితరులు బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. అందులో భాగంగా వాళ్లు బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారు. అప్పట్లో చెన్నై వెళ్లే ఒక రైలును పేల్చి వేయడానికి పథకం వేశారు. దీని కోసం బాంబును సిద్ధం చేశారు. ఒకసారి పరీక్షించే ఉద్దేశంతో కంచర్లపాలెం-కఠెవరం కాలువ గట్టుపై అమర్చారు. ప్రమాదవశాత్తు చెన్నుగాడు అనే బాలుడు ఆ బాంబు తొక్కి మృతి చెందాడు.సంచలనంగా మారిన ఈ సంఘటనపై విచారించిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1909, ఏప్రిల్‌ 6న నిందితులను అరెస్టు చేసింది. తర్వాత విచారణలో వారికి దేశాంతర కారాగార శిక్షను విధించింది. ఈ విధంగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఆంధ్ర ప్రజలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నాటి జాతీయోద్యమంలో పాల్గొని సమిధలుగా మారారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని