మూలధనమంటే.. వస్తురాశిని పెంచడమే

దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఒక దేశంలో జాతీయోత్పత్తి పెరుగుదలే ఆర్థికాభివృద్ధి. ఈ క్రమంలో జరిగే వృద్ధి, అభివృద్ధి ప్రక్రియపై మానవ దృక్పథాల్లో, సంస్థల్లో, సిద్ధాంతపరమైన భావ ప్రకటనల్లో మార్పులు ఏర్పడతాయి.

Published : 16 May 2024 01:03 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఒక దేశంలో జాతీయోత్పత్తి పెరుగుదలే ఆర్థికాభివృద్ధి. ఈ క్రమంలో జరిగే వృద్ధి, అభివృద్ధి ప్రక్రియపై మానవ దృక్పథాల్లో, సంస్థల్లో, సిద్ధాంతపరమైన భావ ప్రకటనల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పులను ఆధునికీకరణ అంటారు.


ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

గున్నార్‌ మిర్దాల్‌ - ఆధునికీకరణ అంశాలు

మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో పయనించడమే ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నారు గున్నార్‌ మిర్దాల్‌. ఈ ఆర్థికవేత్త ఆధునికీకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అవి:

హేతువాదం: శతాబ్దాల సాంప్రదాయిక అలవాట్ల స్థానంలో కొత్త ఆలోచన, ఆచరణ, ఉత్పత్తి, పంపిణీ, వినియోగ పద్ధతులను పాటించడమే హేతువాదం. ఇందులో ముఖ్యమైనది శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పర్చుకోవడం.

ప్రణాళికా రచన: ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని ప్రారంభించి, స్వయంపోషక పంథాలో నడిపేందుకు విధాన చర్యలను హేతువాద దృక్పథంతో సమన్వయపరిచే మార్గాలను అన్వేషించడం.

సామాజిక, ఆర్థిక సమానత్వం: ఆస్తిలో, ఆదాయాల్లో, అవకాశాల్లో, హోదాలో అధిక సమానత్వాన్ని ప్రోత్సహించడం.

మెరుగుపడిన సంస్థలు, దృక్పథాలు: ప్రభుత్వ సంస్థల పనితీరును మెరుగుపరిచి ‘మంచి పరిపాలన’ అందించాలి. ఈ పంథాలో పేదవర్గానికి అనుకూలత లభించాలి. దృక్పథాల విషయంలో ఆధునిక మానవుడు కింద పేర్కొన్న విలువలను సాధించాలి.

1. సమర్థత
2. కష్టపడి పనిచేయడం
3. క్రమపద్ధతిని అనుసరించడం
4. వేళకు రావడం
5. పొదుపును అలవర్చుకోవడం
6. నిజాయతీ
7. సహకార దృష్టిని, దీర్ఘకాలిక దృక్పథాన్ని అలవర్చుకోవడం.

  • అన్ని ఉత్పత్తి రంగాల్లో ఆధునిక శాస్త్రాన్ని, సాంకేతికతను అమలు చేయడాన్ని ఆధునికీకరణ అంటారు.
  • దీని ద్వారా ఉత్పత్తితో సహా ఉత్పాదకతను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వస్తు సేవలను చౌకగా అందిస్తారు.

ఆర్థిక స్థిరత్వం

దేశంలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత వృద్ధి ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.

  • రెండో ప్రణాళిక తర్వాత దేశంలో ధరల పెరుగుదల చాలాకాలం వరకు కొనసాగింది. దీన్ని అదుపులో పెట్టి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ప్రణాళికవేత్తలు ప్రయత్నించారు.
  • సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వ వృద్ధిని, ఆర్థికాభివృద్ధిని సాధించడం దీనిలో భాగం.

సుస్థిరాభివృద్ధి

పర్యావరణం - అభివృద్ధి అంశాలపై ప్రపంచ స్థాయి కమిషన్‌-1987 (బ్రంట్‌ లాండ్‌ కమిషన్‌) ఒక  నివేదిక సమర్పించింది. ఇందులో ‘భావితరాల వారు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్తమాన తరం వారు తమ అవసరాలను తీర్చుకోగలిగిన అభివృద్ధి ప్రక్రియే సుస్థిరాభివృద్ధి’ అని నిర్వచించింది. అంటే భవిష్యత్తు తరాల అవసరాల విషయంలో రాజీ లేకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం.

  • సుస్థిరాభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం.
  • భవిష్యత్తు తరాలు నష్టపోకుండా పర్యావరణ, మానవ, భౌతిక మూలధన నిల్వలను పరిరక్షిస్తూ, పెంపొందిస్తూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే సుస్థిరాభివృద్ధి లక్ష్యం.

ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు

ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి:

1. ఆర్థికపరమైన అంశాలు:

ఎ) మూలధన కల్పన, ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి
బి) సహజ వనరులు
సి) వ్యవసాయ స్వరూపం
డి) విక్రయమయ్యే వ్యవసాయ మిగులు
ఇ) పరిశ్రమల స్వరూపం
ఎఫ్‌) నిర్మాణపరమైన మార్పులు, వ్యవస్థాపన సాంకేతిక ప్రగతి, శ్రమ విభజన
జి) విదేశీ వర్తకం హెచ్‌) ఆర్థిక వ్యవస్థ

2. ఆర్థికేతర అంశాలు:

ఎ) మానవ వనరులు  
బి) రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలు
సి) సామాజిక అంశాలు

ఆర్థికపరమైన అంశాలు: వృద్ధిని లేదా అభివృద్ధిని నిర్ణయించడంలో ఆర్థిక కారకాల్లో ఉత్పత్తి కారకాలే అతిముఖ్యమని ఆర్థికవేత్తలు అంగీకరించారు.

ఉత్పత్తి కారకాల్లోని మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

మూలధన కల్పన (Capital Accumulation): మూలధనం అంటే ద్రవ్యం, యంత్ర పరికరాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటిపై ఖర్చు చేసే ద్రవ్యాన్ని మూలధనం అంటారు.
ఒక దేశపు మూలధనమంటే వస్తురాశిని పెంచడం.

  • ప్రస్తుత సంపదలోని కొంత భాగాన్ని భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగించడమే మూలధనం.
  • మూలధనాన్ని (నిల్వ భావన) ఉపయోగించి ఆదాయాన్ని (ప్రవాహ భావన) పొందుతాం.
  • దీన్ని మానవ నిర్మిత కారకమని కూడా అంటారు.
  • ఈ ధనానికి గమనశీలత (Mobility) ఉంటుంది.

సమ్మిళిత వృద్ధి

ఆర్థిక వృద్ధి గమనాన్ని, తీరును సమ్మిళిత వృద్ధి తెలుపుతుంది. ఈ భావననే ప్రపంచ బ్యాంకు సుస్థిర సమ్మిళిత వృద్ధిగా పేర్కొంటుంది.

  • ఆర్థిక వృద్ధి క్రమంలో ప్రతిఫలాలు పంపిణీ చేయకుండా గతంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడమే సమ్మిళిత వృద్ధి లక్ష్యం.

సమ్మిళిత వృద్ధి అనేది ఒక విస్తృత భావన. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఇందులో అంతర్భాగాలు. వీటిలో ముఖ్యమైనవి.

1) వ్యవసాయ రంగంలో అభివృద్ధి
2) ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన
3) ప్రాంతీయ అసమానతల తగ్గింపు
4) న్యాయబద్ధమైన వృద్ధి మొదలైనవి.

సమ్మిళిత వృద్ధిలో భాగంగా జాతీయ స్థాయిలో 26 నిర్దేశిత ప్రమాణాలను కలిపి వివరించారు. వాటిలో కొన్ని..

1) ఆదాయం
2) పేదరికం
3) విద్య
4) ఆరోగ్యం
5) మహిళలు, పిల్లలు
6) అవస్థాపన సౌకర్యాలు (ఉదా: రవాణా)
7) పర్యావరణ రంగాలకు సంబంధించినవి.

  • ఆర్థిక వ్యవస్థ సమవృద్ధి మార్గంలో ముందుకు సాగడానికి ఈ లక్ష్య సాధన వీలు కల్పిస్తుంది.
  • 11వ ప్రణాళిక (2007 - 12)లో ‘సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి’ లక్ష్యానికి ప్రాధాన్యమిచ్చారు.
  • అర్థవంతమైన ఉపాధితో ప్రజల హోదాను పెంచి, వారి చేతికి నిరంతరం పెరిగే కొనుగోలు శక్తిని అందించడమే ఆర్థికాభివృద్ధి అని ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా అభిప్రాయపడ్డారు. ఇది పేదరికాన్ని తగ్గిస్తుంది. తద్వారా ప్రభుత్వం, ప్రైవేట్‌ ఖర్చుల ద్వారా అందించే విద్య, ఆరోగ్యం, ఇతర సదుపాయాలను ప్రజలందరూ పొందుతారు. అభివృద్ధి ద్వారా మాత్రమే ఆదాయం పెరిగి ప్రభుత్వ అవసరాలు తీరుతాయి, దారిద్య్ర నిర్మూలన జరుగుతుంది.

మూలధన వర్గీకరణ

నిజ మూలధనం: భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీలు. వీటినే వాస్తవిక మూలధనంగా పేర్కొంటారు.

మానవ మూలధనం: మానవుల నైపుణ్యం, వారి సామర్థ్యం.

వైయక్తిక మూలధనం: ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందింది.

సామాజిక మూలధనం: మొత్తం సమాజానికి చెందుతుంది.

స్థిర మూలధనం: మన్నిక కలిగి ఉత్పత్తిలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలు మొదలైనవి.

చర మూలధనం: ఉత్పత్తిలో ఒకసారి మాత్రమే ఉపయోగపడే శ్రామికులు, ముడి పదార్థాలు.

స్పర్శనీయ మూలధనం: భౌతికరూపంలో ఉండే మూలధనం.

అస్పర్శనీయ మూలధనం: గుడ్‌విల్‌, పేటెంట్‌ రైట్స్‌ లాంటివి.

మూలధన సంచయనం లేదా కల్పన: దేశంలో వాస్తవిక మూలధనం పెరిగితే, అంటే మూలధన వస్తువులు పెరిగితే మూలధన సంచయనం జరిగినట్లు అర్థం. మూలధన సంచయనం జరగాలంటే పొదుపు చేయాలి. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చాలి.

మూలధనం ప్రాధాన్యత: మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీనిపాత్ర ముఖ్యం.

  • మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  • మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి సాధించవచ్చు.
  • ఉద్యోగ అవకాశాల కల్పన సాధ్యమవుతుంది.
  • మూలధనం అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, ముడిసరుకులు, వేతనాలు, విద్యుత్‌ శక్తి, ఇంధనాలు మొదలైన వాటిపై చేసే ఖర్చు. ఇది ఉత్పత్తికి దోహదపడుతుంది.
  • రుణగ్రహీత మూలధన సేవలను ఉపయోగించుకున్నందుకు రుణదాతకు చెల్లించే వడ్డీ.
  • మూలధన కల్పన అంటే ఒక దేశ వాస్తవ మూలధన రాశిని పెంచడం. మూలధనరాశి (Capital Stock) అంటే ఏ ఒక్క కాలంలోనైనా చేకూరిన భౌతిక వస్తువుల మొత్తం పరిమాణం. ఇతర వస్తువుల ఉత్పత్తికి వీటిని ఉపయోగిస్తారు.
  • మూలధన సాంద్రత ఉన్న ఉత్పత్తి విధానం (Capital - Intensive Technique) అంటే మూలధనాన్ని అధికంగా వినియోగించే ఉత్పత్తి ప్రక్రియ.
  • మూలధన - ఉత్పత్తి - నిష్పత్తి  (Capital - Out Ratio - COR) అంటే మూలధనానికి, ఉత్పత్తికి సంబంధించిన నిష్పత్తి. ఒక యూనిట్‌ ఉత్పత్తిని సాధించేందుకు అవసరమయ్యే మూలధన యూనిట్లను ఈ నిష్పత్తి తెలుపుతుంది.
  • ఇది అదనపు యూనిట్‌ ఉత్పత్తికి కావాల్సిన అదనపు మూలధనం, ఆర్థిక వృద్ధిలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
  • ఆర్థికవేత్తల అభిప్రాయంలో ప్రధాన ఆటంకంగా ఉంటుంది. ఏ అభివృద్ధి ప్రణాళిక అయినా అవసరమైన పరిమాణంలో మూలధన సరఫరా లేకపోతే ఆ ప్రణాళిక విజయవంతం కాదు.
  • ఏదైనా ఒక దేశం గొప్ప ప్రగతిని సాధించాలంటే మూలధన సమీకరణ రేటును ఇంకా అధిక స్థాయికి పెంచుకోవాలి.
  • వృద్ధి గమనాన్ని వేగవంతం చేయాలనుకునే దేశం పెట్టుబడి స్థాయిని పెంచడంతో పాటుగా ఆదాయంలో ఎక్కువ నిష్పత్తిలో పొదుపు చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడిని పొందాలి. విదేశీ సహాయంపై అధికంగా ఆధారపడటం ఎక్కువ ప్రమాదకరం. కాబట్టి దీన్ని అనురించకపోవడం సమంజసం.

రచయిత
బండారి ధనుంజయ
విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని