స్వదేశీ పరిజ్ఞాన ఆయుధాలు.. వ్యూహాత్మక భద్రతా ఒప్పందాలు..

భారత రక్షణ రంగంలో డీఆర్‌డీఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరం సాంకేతికతను ఉపయోగించుకుంటూ దేశానికి కావాల్సిన ఆయుధాలను తయారుచేస్తోంది.

Published : 17 May 2024 01:31 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

భారత రక్షణ రంగంలో డీఆర్‌డీఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరం సాంకేతికతను ఉపయోగించుకుంటూ దేశానికి కావాల్సిన ఆయుధాలను తయారుచేస్తోంది. దీనిలో భాగంగా మన దేశం పలు కార్యక్రమాలను చేపడుతోంది. అంతేకాకుండా పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను, ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. పోటీ పరీక్షార్థులు రక్షణ రంగానికి చెందిన తాజా అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవడం అవసరం.

భారతదేశంలో రక్షణరంగ కార్యకలాపాలను రక్షణరంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా నిర్వహిస్తారు.

 • 1958లో టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌, డిఫెన్స్‌ రిసెర్చ్‌ కలయికతో డీఆర్‌డీఓ ఏర్పడింది.
 • దీని ముఖ్యకేంద్రం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ మోటో ‘బలస్య మూలం విజ్ఞానం’ (The Source Of strength is science)

భారత రక్షణ రంగం - కృత్రిమ మేధ

భారత రక్షణ రంగ పరిశ్రమల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టడానికి కావాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించి, సాంకేతికత ఫలాలను సరిహద్దు రక్షణలో  ఉపయోగించనున్నారు మానవ విచక్షణతో పనిచేసే యంత్రాల్లో (మెషిన్స్‌ విత్‌ హ్యూమన్‌ కాగ్నిషన్‌) వినియోగించి, సమర్థమైన కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారు.

రోడ్‌ మ్యాప్‌: నీతి ఆయోగ్‌, రక్షణరంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏఐ అనుసంధానిత సేవలను రక్షణ రంగంలో అందించడానికి కావాల్సిన ప్రణాళికా రచనను 2018లో రోడ్‌ మ్యాప్‌గా రూపొందించారు.

AIDef: రక్షణ రంగ ఆధారిత పరిశ్రమలు, స్టార్టప్‌ సంస్థల్లో కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన, ఏఐ ఆధారిత పరిష్కారాలను సూచించడానికి, వీటి ద్వారా రక్షణ రంగ అభివృద్ధిని అంచనా వేయటానికి ఈ సింపోజియాన్ని 2022 జులై 11న ఏర్పాటు చేశారు.

దీనికి సంబంధించిన మొదటి సమావేశంలో రక్షణ రంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రోబోటిక్స్‌, కృత్రిమ మేధ ఆధారిత ఇంటెలిజెన్స్‌ నిఘా వ్యవస్థలతో అత్యంత వినూత్నంగా అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత 75 రక్షణ రంగ ఉత్పత్తులను ప్రదర్శించారు.

డిఫెన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌: భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత ప్రాజెక్టులన్నింటికీ కావాల్సిన మార్గదర్శకాలను దీని ద్వారా అందిస్తారు.

డిఫెన్స్‌ ఏఐ ప్రాజెక్టు ఏజెన్సీ: చంద్రశేఖరన్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా రక్షణ రంగంలో ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవడానికి బడ్జెట్‌లో సుమారు 100 కోట్లు కేటాయించాలని, డిఫెన్స్‌ ఏఐ ప్రాజెక్టు ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా భారత రక్షణ రంగంలో కృత్రిమమైన సేవలను మరింత విస్తరించాలనుకున్నారు.

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) విభాగం కోసం వివిధ ప్రాంతాల్లో పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయనున్నారు.

 • సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (సీఏఐఆర్‌)ను బెంగళూరులో,
 • డీవైఎస్‌ఎల్‌ సంస్థలను దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో (బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌) ఏర్పాటు చేశారు.
 • డీఆర్‌డీఓ యంగ్‌ సైంటిస్టు లాబొరేటరీ (డీవైఎస్‌ఎల్‌) - ఏఐ,
 • డీఆర్‌డీఓ యంగ్‌ సైంటిస్ట్‌ లాబొరేటరీ (డీవైఎస్‌ఎల్‌)- కాగ్నిటివ్‌ టెక్నాలజీలను ఏర్పాటు చేయనున్నారు.

WARDEC (వార్‌గేమ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌): రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఆర్మీ ట్రైనింగ్‌ కమాండ్‌ సంయుక్తంగా మొట్టమొదటి సిమ్యులేషన్‌ ఆధారిత ట్రైనింగ్‌ సెంటర్‌ను WARDEC గా ఏర్పాటు చేయనున్నాయి.

అగ్ని-D: భారత మిలటరీ, బోర్డర్‌ సెక్యూరిటీ వ్యవస్థల్లోని ఆపదలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సర్వైలెన్స్‌వ్యవస్థ.

దీన్ని 2023లో ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద ఎయిర్‌షో అయిన ఏరో ఇండియాలో ప్రదర్శించారు. తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లో భద్రత కోసం దీన్ని వినియోగించనున్నారు.

విదేశీ వ్యవహారాలు

భారతదేశం రక్షణ రంగ వ్యయంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. మన దేశం కంటే ముందు వరుసలో వరుసగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా ఉన్నాయి.

 • ఆయుధాల దిగుమతుల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
 • ఈ దిగుమతుల్లో అగ్రభాగం సాంకేతిక సహకారం లేదా సంయుక్త తయారీ భాగస్వామ్యంగా చెప్పవచ్చు.

భారతదేశ ప్రస్తుత దిగుమతులు: SIPRI (స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) నివేదిక ప్రకారం భారతదేశ దిగుమతులు రష్యా నుంచి 45.1%, ఫ్రాన్స్‌ నుంచి 28.6%, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి 11.1%, ఇజ్రాయెల్‌ నుంచి 7.7%, దక్షిణ కొరియా నుంచి 2.8%, యూకే నుంచి 2%గా ఉన్నాయి.

 • 2018-22లో భారతదేశానికి అత్యధిక ఆయుధాలను ఎగుమతి చేసిన దేశం - అమెరికా.
 • SIPRI నివేదిక ప్రకారం, భారత్‌ గత 20 ఏళ్లలో 60 బిలియన్‌ డాలర్లకు పైగా, అంటే 65 శాతం దిగుమతులను రష్యా నుంచి చేసుకుంది.
 • భారతదేశంలో స్వదేశీకరణ లేదా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే ఆయుధాల కోసం 2021 బడ్జెట్‌లో భారత ఆయుధ కేటాయింపులో 64% వ్యయం స్వదేశీ ఆయుధాలకు ఖర్చు చేశారు.

విదేశీ ఒప్పందాలు

రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుధాలు, సాంకేతికత, ఇతర అవసరాల కోసం భారత్‌ పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇండియా - రష్యా: యూఎస్‌ఎస్‌ఆర్‌ కోల్డ్‌ వార్‌ సమయంలో భారతదేశానికి అత్యధిక మిలటరీ ఆయుధాలు సరఫరా చేసి భారత స్ట్రాటజిక్‌ పార్టనర్‌గా రష్యా కీలకపాత్ర పోషించింది.

 • భారత్‌కు తొలి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ను రష్యా 1988లో  అందించగా, అది తర్వాతి కాలంలో ఐఎన్‌ఎస్‌ చక్రగా మారింది.
 • 2021 - 2031 కాలానికిగానూ ఇరు దేశాలు ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం, మిలటరీ, సాంకేతిక భాగస్వామ్యం, రక్షణ రంగంలోని వివిధ స్థాయుల్లో సహకారం అందించుకుంటున్నాయి.
 • రష్యా, భారత్‌ త్రివిధ దళాల మధ్య ఇంద్ర అనే సంయుక్త విన్యాసం ద్వారా నూతన సాంకేతికతలు, ఆయుధాలు, తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి.

ఇండియా - యూఎస్‌:

GSOMIA - జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌ - 2002
LEMOA - లాజిస్టిక్స్‌ ఎక్ఛ్సేంజ్‌ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ - 2016
COMCOSA - కమ్యూనికేషన్స్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌ - 2018
BECA - బేసిక్స్‌ ఎక్ఛ్సేంజ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌

 • ఈ ఒప్పందాలన్నీ సమాచార వ్యవస్థ, లాజిస్టిక్స్‌ బదిలీ, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ తదితర అంశాలకు సంబంధించి భారత్‌ - అమెరికా మధ్య కుదిరాయి.
 • 2016లో అమెరికా రక్షణ రంగ సాంకేతికత సహకారాన్ని అత్యధికంగా ఇండియాకు అందించడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారత్‌ మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా గుర్తింపు పొందాయి.
 • ఇండియా, యూఎస్‌ 2+2 మినిస్టీరియల్‌ డైలాగ్‌ ఈ రెండు దేశాల రక్షణ రంగ భాగస్వామ్యాన్ని మరింత బలపరిచింది.
 • టైగర్‌ ట్రూఇంఫ్‌ వజ్రప్రహార్‌, మలబార్‌ లాంటి విన్యాసాలతో ఇరుదేశాల రక్షణ వ్యవస్థలు పరస్పరం సహకరించుకుంటున్నాయి

రక్షణ రంగంలో నూతన తరం సాంకేతికతలు

ఎమర్జింగ్‌ సాంకేతికతలైన కృత్రిమ మేధ, సైబర్‌ సాంకేతికత, 3్ట ప్రింటింగ్‌ సాంకేతికత మొదలైన వాటి అనుసంధానంతో భారత మిలటరీ, రక్షణ సంస్థలు మరింత వేగంగా దూసుకుపోతున్నాయి.

చాణక్య డిఫెన్స్‌ డైలాగ్‌: ఈ కార్యక్రమాన్ని 2023లో చేపట్టారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత అంశాలపై చర్చలు జరిపి జాతీయ, ప్రాంతీయ స్థాయిలో భద్రతాపరమైన సవాళ్లను నవీన సాంకేతికతల సహాయంతో పరిష్కరించడానికి కావాల్సిన విధివిధానాలను రూపొందించారు.

ఇంటిగ్రేటెడ్‌ అన్‌ మ్యాన్డ్‌ రోడ్‌ మ్యాప్‌: ఈ కార్యక్రమం ద్వారా భారత నావికా దళంలో మానవ రహిత వ్యవస్థలను అభివృద్ధి చేసి, విస్తరించడానికి కావాల్సిన సమగ్ర ప్రణాళికను రూపొందించారు.
ఈ మానవరహిత సాంకేతికత, భారత నావికాదళ వ్యవస్థల పరస్పర సహకారం, సంయుక్తీకరణతో భారత నావికాదళ ప్రమాణాలను పెంచనున్నారు.

ప్రాజెక్టు స్వావలంబన్‌: రక్షణ రంగ పరికరాలు, సాంకేతికతలను ఆత్మనిర్భర్‌ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించి స్వదేశీకరణను (ఇండిజినైజేషన్‌) బలపరిచి స్వయం సమృద్ధిని సాధించనున్నారు.

డిఫెన్స్‌ సైబర్‌ ఏజెన్సీ: 2018లో సైబర్‌వార్‌ ఫేర్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.

డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ: అంతరిక్ష ఆధారిత రక్షణ రంగ సేవలు అంటే స్పేస్‌ వార్‌ ఫేర్‌, ఉపగ్రహ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలను మరింత బలోపేతం చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు.

QUAD (క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌)

ఇది భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకున్న భద్రతా ఒప్పందం.

 • భారతదేశ మొదటి స్వదేశీ ఫైటర్‌ జెట్‌ అయిన LCA తేజస్‌కు అవసరమైన GE'sF404 ఇంజిన్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి మనదేశానికి పంపించారు.
 • MQ-9UAV (సీ గార్డియన్‌) పరస్పర సహకారం కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి భారత్‌కు అందుతోంది.
 • ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించే దిశగా మనదేశం పలు కార్యక్రమాలు చేపట్టింది.

మేక్‌ ఇన్‌ ఇండియా: రక్షణ రంగానికి కావాల్సిన ఆయుధాలు, పరికరాలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్నారు.

IDEX: ప్రైమ్‌-డిఫెన్స్‌ ఆధారిత స్టార్టప్‌ ప్రాజెక్టు కోసం దీన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం రూ. 1.5-10 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

SRIJAN: ఇండిజినైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో నెలకొల్పే MSMEలకు ఈ పోర్టల్‌ ద్వారా సహకారం అందించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడులో రెండు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని