వ్యాపారానికి అనుమతి అడిగి.. వ్యవస్థలను కొల్లగొట్టి..

ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు యుద్ధాల్లో విజయం సాధిస్తూ తమ అధికార పరిధిని దేశమంతటికీ విస్తరించారు. దీనికి తోడు ఆర్థికంగా ఎదగడానికి భారతదేశ రైతులపై అనేక పన్నులు విధించారు. వీటిలో భాగంగా శాశ్వత భూమిశిస్తు పద్ధతి, రైత్వారీ పద్ధతి, మహల్వారీ పద్ధతులను అవలంబించారు.

Published : 18 May 2024 00:56 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర

ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు యుద్ధాల్లో విజయం సాధిస్తూ తమ అధికార పరిధిని దేశమంతటికీ విస్తరించారు. దీనికి తోడు ఆర్థికంగా ఎదగడానికి భారతదేశ రైతులపై అనేక పన్నులు విధించారు. వీటిలో భాగంగా శాశ్వత భూమిశిస్తు పద్ధతి, రైత్వారీ పద్ధతి, మహల్వారీ పద్ధతులను అవలంబించారు. ఈ విధానాలతో స్వదేశీ రైతుల నుంచి భారీ మొత్తాల్లో పన్ను వసూలు చేశారు. వీటివల్ల కంపెనీ, జమీందార్లు, పన్ను వసూలుదార్లు లబ్ధిపొందగా, రైతులు నానాటికి దీనస్థితికి చేరుకున్నారు.

మహల్వారీ పద్ధతి

మహల్‌ అంటే మహారాష్ట్రుల కాలంలో ఒక పరిపాలనా విభాగం.

  • రాష్ట్ర పాలనలో విభాగాలుగా మహల్‌, పరగణాలు ఉండేవి.
  • శాశ్వత శిస్తు విధానం, జమీందారీ విధానాలను వ్యతిరేకించిన గ్రామీణ రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
  • దీంతో బ్రిటిష్‌ అధికారులు తమ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు 1822లో వారి అధీనంలో ఉన్న గంగానది లోయలో, వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో, పంజాబ్‌లో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు.
  • ఈ విధానంలో ఒక మహల్‌లోని గ్రామాల్లో స్థానిక జమీందార్లతో, సంప్రదాయకమైన వసూలుదార్లతో ఒక నిర్ణీత కాలానికి భూమిశిస్తును చెల్లించే విధంగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఇందులో వసూలుదార్లకు, జమీందార్లకు ఏ రకమైన వంశపారంపర్య హక్కులు ఇవ్వలేదు.
  • శిస్తురేటును కాలానుగుణంగా పెంచే హక్కు కంపెనీకి ఉంది.
  • మహల్వారీ వ్యవస్థలో గ్రామాల్లోని ఉన్నత వర్గాల వారే హోదా అనుభవించారు. లాభం కళ్లజూశారు.
  • రైతులకు ఏ విధంగానూ మేలు చేకూరలేదు.
  • 2/3వ వంతు పంటను శిస్తుగా చెల్లించాలని నిర్ణయించారు. అయితే విలియం బెంటింక్‌ కాలంలో 66% శిస్తుగా వసూలు చేశారు.
  • చాలా ప్రాంతాల్లో 50% శిస్తు వసూలు చేశారు.

బ్రిటిష్‌ పాలనలో రైతుల పరిస్థితి

మొగల్‌ చక్రవర్తుల కాలంలో అన్నదాతలకు ఉన్న కొన్ని సౌకర్యాలు కూడా ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో రైతులకు దక్కలేదు. దీనికి పలు కారణాలున్నాయి.

  • అనేక రకాల భూమిశిస్తు సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ భారతీయ రైతులు దుర్భర స్థితికి చేరారు.
  • బ్రిటిష్‌ ప్రభుత్వానికి లేదా జమీందార్లకు చెల్లించాల్సిన అధిక భూమిశిస్తు భారం, వడ్డీ వ్యాపారులకు చెల్లించాల్సిన భారీ మొత్తం రుణాలు తదితరాలు సామాన్య రైతులను అన్ని రకాలుగా కుంగదీశాయి.
  • రాబర్ట్‌ క్లైవ్‌, వారన్‌ హేస్టింగ్స్‌ కాలం నుంచే కంపెనీ అధీనంలో ఉన్న భూములను సాగు చేస్తున్న రైతుల నుంచి భూమిశిస్తును భారీ మొత్తంలో వసూలు చేశారు.
  • బెంగాల్‌ రాష్ట్రంలో మూడో వంతు ప్రదేశం క్రూర జంతువులు నివసించే అరణ్యసీమగా మారిందని నాటి గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ పేర్కొన్నాడు.
  • కారన్‌ వాలీస్‌ ప్రవేశపెట్టిన ‘శాశ్వత భూమిశిస్తు విధానం’ బెంగాల్‌, బిహార్‌ రైతులను అన్ని విధాలుగా దెబ్బతీసింది.
  • జమీందార్లు, గుత్తేదార్లు బలవంతపు సేవ లేదా బేగార్‌ విధానంతో వారి శ్రమను దోచుకున్నారు.
  • అధిక రెవెన్యూ (భూమిశిస్తు) వసూలుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనివల్ల రైతులపై పన్నుభారం ఎక్కువైంది.
  • పంట ఉత్పత్తి ఆశించినంతగా లేనప్పటికీ రైతుల నుంచి బలవంతంగా శిస్తు వసూలు చేసేవారు.
  • చాలా సందర్భాల్లో రైతులు తమ భూముల్లో కొంత భాగాన్ని విక్రయించి ప్రభుత్వ పన్నును చెల్లించారు.
  • ఇదేవిధంగా భూమిశిస్తును చెల్లించడానికి రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడ్డారు. అధిక వడ్డీరేట్లకు అప్పులు తెచ్చి, దాన్ని తీర్చలేక తమ భూములనే విక్రయించారు.
  • రెవెన్యూ అధికారులు, జమీందార్లు కొన్ని సందర్భాల్లో గడువులోగా భూమిశిస్తు చెల్లించలేని రైతుల భూములను వేలం వేసేవారు.
  • బ్రిటిష్‌ ప్రభుత్వ న్యాయ, పోలీస్‌ శాఖలు కూడా రైతుల హక్కుల రక్షణ కోసం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.
  • బెంగాల్‌ రాష్ట్రంలో రైతులు సాగు భూమిని ‘పైకాష్‌’ (నిర్ణీత కాలం కోసం) కౌలుకు తీసుకునేవారు.
  • శాశ్వతంగా కౌలుకు భూమిని తీసుకునే పద్ధతిని ‘ఖుద్‌ఖాస్తా’ అనేవారు.

వ్యాపార విధానం ఫ్రీ ట్రేడ్‌ పాలసీ

ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఒక సాధారణ వర్తక సంస్థగా భారతదేశంలో అడుగుపెట్టే నాటికి దేశం ఆర్థికంగా పటిష్ఠమైన స్థితిలో ఉంది.

  • వ్యవసాయ రంగం, స్వదేశీ, విదేశీ వ్యాపారంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించింది.
  • దేశంలో అత్యధిక ప్రాంతాలు అక్బర్‌ సామ్రాజ్యంలో భాగంగా రాజకీయ స్థిరత్వం, శాంతి భద్రతలతో ఉన్నాయి.
  • జహంగీర్‌ కాలంలో వర్తక స్థావరాల స్థాపన కోసం అనుమతి పొందిన కంపెనీ క్రమంగా తన వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంది.
  • ఔరంగజేబు మరణించే నాటికి ఇతర ఐరోపా కంపెనీలపై ఆధిక్యత సాధించింది.
  • క్రమంగా దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, సైనిక పరిస్థితులను అవగతం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు 1764 నాటికి బెంగాల్‌ రాష్ట్రంపై తమ అధికారాన్ని నెలకొల్పారు.
  • దినదినాభివృద్ధి చెందుతున్న తమ వర్తకాన్ని రక్షించుకుంటూ, భారతీయ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, కంపెనీ ఆదాయ మార్గాలను పెంచుకున్నారు.
  • రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం ఏర్పాటైన కొత్త వ్యవస్థ (గవర్నర్‌ జనరల్‌, కౌన్సిల్‌) ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఆర్థికంగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటానికి, దేశీయ వర్తకులను, వర్తకాన్ని, సహజ వనరులను హరించివేయడానికి కొత్త విధానాలు రూపొందించి, అమలు చేసింది.
  • దీంతో అంచనాలకు మించిన లాభాలు సాధించింది.
  • కంపెనీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు అవినీతి, లంచగొండితనానికి అలవాటు పడ్డారు. వీరు వ్యక్తిగత, చట్టవ్యతిరేక వ్యాపారాన్ని చేస్తూ భారతీయ పాలకులు, జమీందార్ల నుంచి భారీ మొత్తంలో బలవంతంగా కానుకలు, లంచాలు వసూలు చేసి శ్రీమంతులయ్యారు.

ఉదా: క్లైవ్‌ 34 ఏళ్ల వయసులో ఏడాదికి నలభైవేల పౌండ్ల ఆదాయాన్నిచ్చే ఆస్తిని సంపాదించుకుని మాతృదేశానికి వెళ్లాడు.

  • కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో 1773 నుంచి వచ్చిన గవర్నర్‌ జనరళ్లు ముఖ్యపాత్ర పోషించారు.
  • క్రీ.శ. 1757 - 1857 మధ్య శతాబ్ద కాలంలో కంపెనీ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక విధానాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలుగా నిర్వీర్యం చేశాయి. మాతృదేశమైన ఇంగ్లండ్‌ ప్రయోజనాలను రక్షించడానికి ఈ విధాన రూపకర్తలు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

పరిణామ దశలు

రమేష్‌ చంద్రదత్‌ అనే ప్రఖ్యాత భారతీయ ఆర్థిక చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం, బ్రిటిష్‌ ఆర్థిక విధాన పరిణామంలో మూడు ముఖ్య దశలును పేర్కొన్నారు. అవి:

  • 1757 - 1813 వరకు ఉన్న వాణిజ్య ప్రధాన దశ.
  • ఈ దశలో తమ మిగులు ధనాన్ని వెచ్చించి, భారతీయ వస్తువులను తక్కువ ధరలకు కొని, గుత్తాధికారంతో వాటిని ఐరోపా మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మేవారు.
  • భారీ లాభాలను సంపాదించడానికి కంపెనీ యంత్రాగం ఈ విధంగా కృషి చేసింది.
  • ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్‌ రాజ్యంలో పొందిన ఆదాయాన్ని ఎగుమతుల కొనుగోలు కోసం ఉపయోగిస్తూ, స్థానిక నేతలను రాజకీయ బెదిరింపులకు గురిచేసి, వారి ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మేలా బలవంతం చేశారు.
  • రెండో దశ క్రీ.శ. 1814లో ప్రారంభమై 1858లో ముగిసింది.
  • 18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ప్రారంభమై, దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం కారణంగా, ఇంగ్లండ్‌ ప్రభుత్వం స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రవేశపెట్టింది.
  • భారతదేశాన్ని బ్రిటిష్‌ దిగుమతులకు మార్కెట్‌గా, బ్రిటిష్‌ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకులను సరఫరా చేసే దేశంగా మార్చారు.
  • దీని ఫలితంగా భారతీయ సంప్రదాయ కుటీర పరిశ్రమలన్నీ సమూలంగా పతనమయ్యాయి.
  • బ్రిటిష్‌ నూలు వస్త్రాల దిగుమతుల విలువ 1813లో ఒక లక్ష పది వేల పౌండ్లు ఉండగా, 1856 నాటికి 63 లక్షల పౌండ్లకు చేరుకుంది.
  • అదేవిధంగా 1856లో భారతదేశం 43 లక్షల పౌండ్ల విలువైన నీలిమందును, ఏడు లక్షల డెబ్భైవేల పౌండ్ల విలువైన ముడి సిల్కు వస్త్రాలను ఎగుమతి చేయగలిగింది. కాగా భారతీయ వస్త్ర దిగుమతులపై భారీ సుంకాలను విధించారు.
  • మూడో దశ 1858 నుంచి కొనసాగింది.
  • ఈ దశలో బ్రిటిష్‌ వారిలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలు బాగా బలపడ్డాయి.
  • దేశంలో పెట్టుబడి మొత్తాల ఎగుమతి, బ్రిటిష్‌ వారి ఆధ్వర్యంలో బ్యాంకుల స్థాపన, ఎగుమతి, దిగుమతి సంస్థల స్థాపన పెద్ద ఎత్తున జరిగింది.
  • దీని పర్యవసానంగా మూడో దశలో ఇంగ్లండ్‌కు భారతదేశ ‘సంపద తరలింపు’ (డ్రెయిన్‌-ఆఫ్‌-వెల్త్‌) కార్యక్రమం ఉద్ధృతంగా సాగింది.

శిస్తు విధాన విశ్లేషణ

బ్రిటిష్‌ గవర్నర్‌ జనరళ్లు, రెవెన్యూ అధికారులు వారి పాలనా కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన కొత్త భూమిశిస్తు విధానాలతో కొన్ని ఫలితాలు పొందారు. అవి:

  • బ్రిటిష్‌ వారి అధికారం, పరిపాలనా వ్యవస్థ సుస్థిరమయ్యాయి.
  • మొగలుల కాలంలో పోలీస్‌, న్యాయ, రెవెన్యూ అధికారాలు చెలాయించిన సుబేదార్లు, జమీందార్లు తమ అధికారాలు కోల్పోయారు.
  • అప్పటివరకు స్వదేశీ రెవెన్యూ వసూలు అధికారాలు కలిగి ఉన్న సాయుధ బలగాలు రద్దయ్యాయి.
  • బ్రిటిష్‌ ఖజానాకు నిర్ణీత కాలానికి నిర్ణయించిన మొత్తం ఆదాయం చేకూరేది.
  • వారి భూమిశిస్తు విధానాల వల్ల స్వదేశీ నిధుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా పోయింది.
  • ఆంగ్లేయుల నుంచి హక్కులు పొందిన స్వదేశీ అధికారులు, జమీందార్లు, మహల్‌దార్లు అన్ని విధాలుగా బ్రిటిష్‌ సామ్రాజ్య రక్షకులుగా మారారు. వారు స్వదేశీ రైతుల క్షేమాన్ని విస్మరించారు.
  • రైత్వారీ, జమీందారీ, మహల్వారీ పద్ధతులు గతంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజులు, సుల్తానుల కాలంలో రైతులు పొందిన గౌరవాన్ని, స్వేచ్ఛను, ఆర్థిక రక్షణను కొల్లగొట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని