కంపెనీ స్వేచ్ఛా వాణిజ్యం వల.. వలస రాజ్యాల విలవిల!

ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు భారత్‌లో అనేక విధానాలు అవలంబించారు. పలు రకాల శిస్తులు ప్రవేశపెట్టారు. వీటి వల్ల కంపెనీ ఆర్థిక వ్యవస్థ బలపడగా, దేశీయ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు.

Published : 25 May 2024 01:37 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
భారత్‌ - బ్రిటిష్‌వారి ఆర్థిక విధానాలు

ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు భారత్‌లో అనేక విధానాలు అవలంబించారు. పలు రకాల శిస్తులు ప్రవేశపెట్టారు. వీటి వల్ల కంపెనీ ఆర్థిక వ్యవస్థ బలపడగా, దేశీయ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. బ్రిటిష్‌ వారు వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా ఎదిగారు. వీటితోపాటుగా వాణిజ్యవిధానాలను అమలు చేశారు. ఎగుమతులు, దిగుమతుల్లో ఆంక్షలు విధించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాలువలు పునరుద్ధరించారు. నీటి ప్రాజెక్టులు నిర్మించారు. వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.

వాణిజ్య విధానం

బ్రిటిష్‌ ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన వలస రాజ్యాల్లోని ప్రజల పట్ల ప్రారంభం నుంచే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ముఖ్యంగా అమెరికా స్వాతంత్య్ర పోరాటం (1776) తర్వాత భారతదేశంలోని ప్రజలు, వర్తకులు ఎల్లప్పుడూ తమ మాతృదేశాభివృద్ధి (ఇంగ్లండ్‌) కోసం కృషి చేయాలని, అన్ని రకాల కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దీని కోసం బ్రిటిష్‌ పాలనావేత్తలు రూపొందించిన నూతన విధానాన్నే మర్కంటలిజం అంటారు. 

 • ఈ విధానం ప్రకారం వలస రాజ్యాల్లోని ఉత్పత్తులు, లభించే ముడి సరకులన్నింటినీ ఇంగ్లండ్‌కు తప్ప వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదు. 
 • అదేవిధంగా తమ దేశ ఆర్థికాభివృద్ధి కోసం కేవలం ఇంగ్లండ్‌లో ఉత్పత్తి చేసిన వస్తువులు, వస్త్రాలు, ఇతర ఉత్పత్తులనే భారతీయులు కొనుగోలు చేయాలి. 
 • వలస రాజ్యాలు ఇంగ్లండ్‌ శత్రురాజ్యాలతో లేదా ఆ దేశానికి నష్టం కలిగించే ఇతర రాజ్యాలతో ఏ రకమైన వర్తక సంబంధాలు పెట్టుకోకూడదని పేర్కొన్నారు. ఈ విధానం లాభదాయకంగా కొనసాగడానికి వలస రాజ్యాల్లోని పరిశ్రమలు, వాణిజ్యం మీద అనేక కఠిన ఆంక్షలు, నిబంధనలు విధించారు.
 • ఐరోపా ఖండంలో 18వ శతాబ్దం ప్రారంభం నాటికి అనేక దేశాల్లో పారిశ్రామిక విప్లవం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.
 • లైసెజ్‌ ఫెయిర్‌ పాలసీ అనే ఫ్రెంచ్‌ భావన ‘మర్కంటలిజానికి’ మూలం.
 • దీనికి అర్థం స్వేచ్ఛా వాణిజ్య వ్యాపార విధానం. ఆర్థికపరమైన సమన్వయం ప్రకారం ప్రభుత్వం ఒత్తిడి ఏమాత్రం లేకుండా ఉత్పత్తిదారులు తమకు నచ్చిన, తోచిన రీతుల్లో వస్తూత్పత్తి చేసి, ప్రభుత్వ జోక్యం లేకుండా విక్రయించుకోవచ్చనేది ఈ సిద్ధాంతంలో ప్రధానమైంది.
 • ఈ సిద్ధాంతం పట్ల విశేషంగా ప్రభావితమైన తూర్పు ఇండియా కంపెనీ అధికారులు తమ వర్తకాన్ని, భూభాగాలను మరింత విస్తరింపచేయడానికి కృషి చేశారు. 
 • ఈ ఆశయం పెట్టుబడిదారీ విధానానికి పునాదులు వేసింది. క్రమంగా మర్కంటలిజం విజయవంతమై వలస రాజ్యాలపై ఇంగ్లండ్‌ ఆధిపత్యం నెలకొంది. ఈ విధానంతో కలిగిన దుష్ఫలితాలు: 1. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగులు కంపెనీ లెక్కలోకి రాకుండా తమ పెట్టుబడులతో ప్రైవేటుగా వ్యాపారం చేసి అధిక లాభాలు గడించారు. దీంతో దేశీయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. 

2. బ్రిటన్‌ వివేకం, నైపుణ్యం ఏ మాత్రం లేకుండా ప్రకృతి సిద్ధమైన సహజ వనరులను కొల్లగొట్టింది.

బ్రిటిష్‌ విధానాలు - భారత్‌పై ప్రభావం

బ్రిటిష్‌ ఉన్నతాధికారులు అనుసరించిన ఆర్థిక విధానాలతో గ్రామాల్లో తరతరాలుగా విరాజిల్లిన చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. 

 • పట్టణాలు, నగరాల్లోని చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 
 • డి.ఆర్‌.గాడ్గిల్‌ బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో భారతదేశంలో నగర పరిశ్రమలు నాశనం కావడానికి ముఖ్యంగా మూడు కారణాలను పేర్కొన్నారు.

1. స్థానికంగా బ్రిటిష్‌ వారి చేతిలో ఓడిపోయిన రాజవంశాల పరిపాలన అదృశ్యమవడం
2. భారతదేశంలో విదేశీ (బ్రిటిష్‌) పరిపాలన స్థిరపడటం.
3. బ్రిటిష్‌ పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని స్వదేశీ ఉత్పత్తులు తట్టుకోలేకపోవడం.

 • 30 ఏళ్ల కాలవ్యవధిలో భారతదేశంలోని మనిషికి లభించే ఆహారం 29% తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
 • బ్రిటిష్‌ ఆర్థిక దోపిడీకి ప్రకృతి వైపరీత్యాలు తోడై క్రీ.శ. 1925 - 34 మధ్యకాలంలో భారతదేశ తలసరి ఆదాయం ప్రపంచంలోకెల్లా అతి తక్కువగా నమోదైందని కోలిస్‌ క్లార్క్‌ అనే ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. 
 • ఇదే కాలంలో బ్రిటన్‌ తలసరి ఆదాయం మాత్రం అయిదు రెట్లు ఎక్కువగా పెరిగింది.

స్వేచ్ఛా వ్యాపార పద్ధతి

భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా ఎదిగింది. 

 • కంపెనీ అధికారులు తమ మాతృ దేశంలోని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడి రాజకీయ, ఆర్థిక విధానాలను మార్చారు. బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థను దృఢపరిచే విధంగా దేశీయ, విదేశీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు.
 • భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యానికి క్రీ.శ. 1813లో బ్రిటిష్‌ పార్లమెంటు చేసిన ఛార్టర్‌ చట్టం అడ్డుకట్ట వేసింది. ఈ చట్టం బ్రిటిష్‌ పౌరులందరికీ భారత్‌లో స్వేచ్ఛా వ్యాపారం చేసుకునే హక్కు కల్పించింది.
 • బ్రిటిష్‌ పెట్టుబడిదారులు తమ నిధులను వినియోగించి భారతదేశంలో ఆర్థిక కలాపాలను కొనసాగించడానికి అనుమతి పొందారు.
 • స్వేచ్ఛా వ్యాపారం ప్రవేశపెట్టడంతో భారతదేశంలోని ఓడరేవులు, మార్కెట్లు బ్రిటిష్‌ ఉత్పత్తిదారుల వశమయ్యాయి.
 • బ్రిటిష్‌ వస్తువులను చిన్న పట్టణాలకు, గ్రామాలకు సైతం చేరవేశారు.
 • బ్రిటిష్‌ పారిశ్రామిక ఉత్పత్తులు నిరాటంకంగా ఎలాంటి సుంకాలు లేకుండా మనదేశంలో ప్రవేశించాయి.

బ్రిటిష్‌ పాలనలో నీటిపారుదల సౌకర్యాలు

భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పిన బ్రిటిష్‌ అధికారులు వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను, దాని నుంచి కంపెనీ ఖజానాకు వస్తున్న భారీ ఆదాయాన్ని గుర్తించారు.

 • మధ్యయుగంలో ముస్లిం పాలకులు కల్పించిన నీటిపారుదల వసతులు, కాలువలు, ఆనకట్టలు, చెరువులు చాలా వరకు 18వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల కారణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.
 • క్రీ.శ. 1803 నుంచి కొందరు ఆంగ్లేయ అధికారులు వీటి పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
 • యమునా నదికి తూర్పు, పశ్చిమ దిశలో ఉన్న చెరువులు, కాలువల స్థితిగతులను సర్వే చేయడానికి ‘లార్డ్‌ మింటో’ పాలనా కాలంలో ప్రభుత్వం 1810లో ఒక కమిటీని నియమించింది. కానీ  పలు కారణాల వల్ల ఈ కమిటీ విఫలమైంది. 
 • క్రీ.శ. 1815లో లార్డ్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ హోదాలో ఉత్తర భారతదేశంలో పర్యటించి, అక్కడి నీటిపారుదల సౌకర్యాల స్థితిని తెలుసుకున్నాడు. 
 • పాత నీటిపారుదల వసతులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ హేస్టింగ్స్‌ ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. దీని ఫలితంగా ‘లెఫ్టినెంట్‌ బ్లేన్‌’ పశ్చిమ యమునా కాలువ పునరుద్ధరణ పనులు ప్రారంభించాడు. దీంతో ఢిల్లీకి నీటి వసతి ఏర్పడింది.
 • క్రీ.శ. 1823లో కల్నల్‌ జాన్‌కోల్విన్‌ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నీటిపారుదల శాఖ జనరల్‌ సూపరింటెండెంట్‌గా నియమితుడయ్యాడు. ఇతని కృషి వల్ల పశ్చిమ యమునా కాలువ పునరుద్ధరణ పనులు శీఘ్రగతిన పూర్తయ్యాయి.
 • క్రీ.శ. 1837లో ఉత్తర భారతదేశంలో సంభవించిన గొప్ప కరవు సమయంలో సుమారు ఒక మిలియన్‌ స్టెర్లింగ్‌ల విలువైన పంటలకు దీని వల్ల రక్షణ కలిగింది. దీని పొడవు 445 మైళ్లు. 
 • ఇదే విధంగా ఉత్తర భారతదేశంలోని ‘తూర్పు యమునా కాలువ’ పునరుద్ధరణ బాధ్యతను కల్నల్‌ రాబర్ట్, కల్నల్‌ బేర్ట్‌స్మిత్‌లు స్వీకరించి 1830 నాటికి పూర్తి చేశారు. 
 • ‘గంగా కాలువ’ పునరుద్ధరణ కోసం లార్డ్‌ ఆక్లాండ్‌ కృషి చేశాడు. కానీ ఇతడి వారసుడైన లార్డ్‌ ఇల్లిస్‌బ్రో ఈ పథకాన్ని రద్దు చేశాడు. లార్డ్‌ హార్డింజ్‌ కాలంలో తిరిగి ఈ పథకాన్ని మరోసారి ప్రారంభించారు. దీని పొడవు 898.5 మైళ్లు. దీనివల్ల 4.5 మిలియన్‌ ఎకరాల సాగు భూమికి నీటి వసతి కల్పించారు.
 • మే 1856 నాటికి గంగా కాలువ నిర్మాణానికి కంపెనీ చేసిన ఖర్చు 156000 స్టెర్లింగ్‌లు. దీనివల్ల లభించిన నీటితో సాగు చేసిన పంటల మొత్తం విలువ ఏడాదికి 150000 నుంచి 200000 స్టెర్లింగ్‌లు ఉంటుందని ఆనాటి నీటిపారుదల శాఖ డైరెక్టర్‌ కల్నల్‌ బేర్ట్‌స్మిత్‌ పేర్కొన్నారు. 
 • ఈ విధంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని పాత నీటిపారుదల కట్టడాలను పునరుద్ధరించి కొందరు బ్రిటిష్‌ అధికారులు గొప్ప పేరుపొందారు.
 • పంజాబ్‌ను కంపెనీ ఆక్రమించిన తర్వాత అక్కడి బారీదోబ్‌ కాలువను పునరుద్ధరించారు. లార్డ్‌ డల్హౌసీ, లార్డ్‌ జాన్, లారెన్స్‌లు ఈ నిర్మాణానికి శ్రద్ధ వహించి పూర్తి చేయించారు.

మద్రాస్‌ రాష్ట్రంలో ఆనకట్టలు

మద్రాస్‌ రాష్ట్రంలోని ఆంధ్రా ప్రాంతంలో నీటిపారుదల వసతుల అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన బ్రిటిష్‌ అధికారి ఆర్థర్‌ కాటన్‌ (1803-79).

 • ఇతడు గోదావరి నదిపై రాజమండ్రి వద్ద ఆనకట్ట కట్టాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాడు. 
 • 1846లో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి అనుమతించిన ప్రభుత్వం నిర్మాణ బాధ్యతనూ కాటన్‌కే అప్పగించింది. 
 • క్రీ.శ. 1847లో ప్రారంభమైన ఆనకట్ట నిర్మాణం 150000ల పౌండ్ల ఖర్చుతో 1852 నాటికి పూర్తయింది. దీని ఫలితంగా గోదావరి పరిసర ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అయ్యాయి.
 • తాను ఈ విజయాన్ని సాధించడంలో వీనం వీరన్న సహకారం ఇతోధికంగా ఉందని కాటన్‌ బహిరంగంగా ప్రశంసించాడు. - క్రీ.శ. 1850లో విజయవాడ వద్ద కృష్ణా నదిపై కెప్టెన్‌ ఓక్‌ నేతృత్వంలో కృష్ణా ఆనకట్ట నిర్మాణానికీ కాటన్‌ సలహాలు, సహకారం అందించారు. 1855 నాటికి నిర్మాణం పూర్తయింది. 
 • కృష్ణా ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ఈ ఆనకట్ట నిర్మాణం అనేక లాభాలు చేకూర్చింది. నేటికీ కోస్తా తీరంలోని ప్రజలు కాటన్‌ సేవలను గుర్తుచేసుకుంటుంటారు.
 • సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కృషి ఫలితంగా మధుర జిల్లాకు జీవనది అయిన పెరియార్‌ నదిపై ఒక ప్రాజెక్ట్‌ పూర్తిచేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని