అర్థం కాకపోయినా.. ఆకట్టుకునే తీరులో!

విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని, సాహిత్య పరిజ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియే పద్య బోధన. తెలుగు సాహిత్యంలో, కావ్యరచనలో విశిష్ట స్థానం సంపాదించుకున్న పద్యాన్ని నేటితరం పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా, ఆసక్తికరంగా చెప్పాల్సి ఉంటుంది.

Updated : 27 May 2024 01:43 IST

టీఆర్‌టీ - 2024 
తెలుగు మెథడాలజీ 

విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని, సాహిత్య పరిజ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియే పద్య బోధన. తెలుగు సాహిత్యంలో, కావ్యరచనలో విశిష్ట స్థానం సంపాదించుకున్న పద్యాన్ని నేటితరం పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా, ఆసక్తికరంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం పరీక్షార్థులు పద్యం లక్షణాలు, పద్యబోధన లక్ష్యాలు, దానితో విద్యార్థులకు కలిగే ఉపయోగాల గురించి మొదట తెలుసుకోవాలి. పద్యబోధనకు అనుసరించే విభిన్న పద్ధతులు, అందులో ఉత్తమమైన వాటిపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి.


పద్య బోధన

సాహితీ అభిమానులు పద్యానికి పెద్దపీట వేశారు. శ్రోతకు అర్థం కాకపోయినా పద్యం ఆకట్టుకుంటుంది. తాళలయాన్వితమై, అలంకారయుక్తమై హృద్యంగా ఉంటుంది.  సాహిత్యంలో పద్యానిది విశిష్ట స్థానం. భాషా బోధనలో కూడా పద్యబోధనకు ప్రాముఖ్యం ఉంది.

కావ్య నిర్వచనాలు

  • సహితములైన శబ్దార్థాలు కావ్యమ్‌ (శబ్దార్థ సహితౌకావ్యమ్) - భామహుడు
  • రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్‌ - జగన్నాథ పండితరాయలు
  • రసాత్మకమైన వాక్యం కావ్యమ్‌ - విశ్వనాథుడు
  • Poetry in a general sense, may be defined as the expression of imagination. (శక్తిమంతమైన భావాలు సహజంగా ఉప్పొంగడమే కవిత్వం) -షెల్లీ
  • Poetry is the spontaneous over flow of  powerful feelings. (భావనా వ్యక్తీకరణయే కవిత్వం) - వర్డ్స్‌వర్త్‌

పద్యబోధన ఉద్దేశాలు

  • ఆనందానుభూతి, రసానుభూతిని పొందేలా చేయడం.
  • సాహితీ విలువలు తెలిపి హృదయ వైశాల్యాన్ని పెంచడం.
  • సాహిత్యాభిరుచిని కలిగించి కావ్య పఠనాన్ని ప్రోత్సహించడం.
  • భాషా జ్ఞానాన్ని, సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించడం.
  • విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం.
  • రచనా కాలం నాటి పరిస్థితులు, విశ్వాసాలు, సంస్కృతి సభ్యతలను తెలపడం.
  • ఉదాత్త భావాలు, ఉత్తమ విలువలను స్థాపించడం.
  • సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి దోహదం చేయడం.
  • కావ్య విమర్శనా శక్తిని అభివృద్ధిపరచడం.
  • సముచిత మనోవైఖరులను పెంపొందించడం.

పద్య పాఠాల్లో ప్రసిద్ధ రకాలు

  • ప్రాచీన పద్యం
  • ఆధునిక పద్యం
  • కథాకావ్యం
  • గేయం
  • రుబాయీ
  • గజల్‌
  • అనువాద కవిత
  • పేరడీ
  • వచన కవిత
  • ముత్యాలసరం

పద్యబోధన పద్ధతులు

పూర్ణ పద్ధతి:

  • ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. 
  • ఈ పద్ధతిలో బోధిస్తున్నప్పుడు ఏకాంశంగా తీసుకున్న పద్య భావాన్ని స్థూలంగా పరిచయం చేయాలి. పద్యంలో ఎవరు ఎవరితో ఏ సందర్భంలో దేన్ని గురించి ప్రస్తావిస్తున్నారో తెలిసేలా చేయాలి.
  • పూర్ణపద్ధతిలో ప్రతి పదానికి అర్థం చెప్పడం కాకుండా పద్య భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • కఠిన పదాలకు అర్థాలను ఉపాధ్యాయులకు బోధించాలి.  ప్రత్యక్షంగా చెప్పకుండా వాక్య ప్రయోగాల ద్వారా విద్యార్థుల నుంచే రాబట్టాలి.
  • పద్యంలోని శబ్ద చమత్కారాన్ని, అర్థ చమత్కారాన్ని విద్యార్థులే గ్రహించి చెప్పేందుకు తగిన సన్నివేశాలను కల్పించాలి.
  • విద్యార్థులను వివిధ అభ్యసన కృత్యాల్లో నిమగ్నం చేస్తూ, వారికి క్లిష్టమైన అంశాలను వివరిస్తూ ఉపాధ్యాయులు బోధన సాగించాలి. 
  • పూర్ణ పద్ధతి అనేక బోధనా వ్యూహాలను ఇముడ్చుకుని ఉంటుంది. ఇది ఆధునికం, అనుసరణీయమైన బోధనా పద్ధతి.
  • పూర్ణ పద్ధతిలో పద్య బోధన చేస్తున్నప్పుడు ఆయా సందర్భాలకు తగిన కొన్ని బోధనా విధానాలను/ వ్యూహాలను ఉపాధ్యాయుడు వినియోగించుకోవాలి.

ఖండ పద్ధతి: 

  • ఇది పూర్ణ పద్ధతికి భిన్నమైంది. పద విభజన చేస్తూ, ప్రతి పదానికి అర్థం చెబుతూ, పద స్వరూప స్వభావాలను తెలుపుతూ, వివరిస్తూ సాగే పద్య బోధనా పద్ధతిని ఖండ పద్ధతి అంటారు. 
  • పద్యాన్ని ఖండాలుగా చేసి చెప్పడం, రసాస్వాదనకు అనుకూలం కాదు. 
  • ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు. 
  • విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేని ఈ సంప్రదాయక పద్య బోధనా విధానం అనుసరణీయమైంది కాదని విద్యావేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం.
  • ప్రత్యేక బోధనా పద్ధతులుగా అనుసరించలేకపోయినా ఉపయోగకరమైన మరికొన్ని పద్యబోధనా పద్ధతులు ఉన్నాయి. అవి..

పఠన పద్ధతి: 

  • ఇందులో పద్య పాఠ్యాంశాన్ని ఒకటి రెండుసార్లు ఆదర్శ పఠనం చేసి, కొందరు విద్యార్థులతో ప్రకాశ పఠనం చేయిస్తారు. 
  • ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం పద్యంలోని అంతస్సంగీతాన్ని లయాత్మకంగా, రాగతాళ యుక్తంగా, శ్రావ్యంగా, భావస్ఫోరకంగా వెలువరించడం వల్ల విద్యార్థుల్లో  రసానుభూతి కలుగుతుంది. అయితే ఈ ప్రత్యేక బోధనా పద్ధతి కూడా అనుసరణీయమైంది కాదు. 
  • పద్య బోధనా ఉద్దేశాలను ఇందులో సాధించలేం. 
  • ఇది పూర్ణ పద్ధతితో సమన్వయించి, అనుసరించదగిన ప్రభావవంతమైన వ్యూహం.
  • దీన్ని పఠన పద్ధతి అనడం కంటే పఠన విధానం అనడం నప్పుతుంది.

ప్రతిపదార్థ పద్ధతి: 

పద్యాన్ని చదివి పద విభాగం చేసి అన్వయ క్రమాన్ని ఏర్పరచి ప్రతి పదానికి అర్థాన్ని చెప్పే సందర్భంలోనే సమాస పదాలకు విగ్రహ వాక్యాలు, సంధి కార్యాలు చెబుతారు. తర్వాతి పద్యానికి తాత్పర్యం చెబుతారు. ఈ  పద్ధతిలో విద్యార్థులు కేవలం శ్రోతలుగా మిగిలిపోతారు.

తాత్పర్య పద్ధతి: ఇందులో పద్యాలను చదివి వినిపించి తాత్పర్యాన్ని తెలిపి, తిరిగి దాన్ని విద్యార్థులతో చెప్పిస్తారు.

ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి: ఇది ప్రతిపదార్థ, తాత్పర్య పద్ధతుల సమాహార పద్ధతి. ఇది కూడా పాఠశాలలో అనుసరించదగింది కాదు.

ప్రశంసా పద్ధతి: ఉపాధ్యాయుల పద్య బోధనలో చర్చను నిర్వహించేటప్పుడు విద్యార్థుల నుంచి రాబట్టడానికి వీలుకాని ధ్వని విశేషాలు, రచనా చమత్కారాలు, రసపోషణ, అలంకార విశిష్టత లాంటి అంశాలను విద్యార్థులకు విశదీకరించి వారు వాటిని ప్రశంసించేలా చేస్తూ, అందులో లీనమయ్యేలా చేయడమే ప్రశంసా పద్ధతి. కవుల పట్ల గౌరవ, ఆదరాభిమానాలను పెంపొందించడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని