రూపాలు ఎన్నయినా.. అంతిమ లక్ష్యం సమన్యాయమే!

రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. దీని కింద జిల్లాస్థాయిలో దిగువ కోర్టులు ఉంటాయి. దీనిలో భాగంగా సివిల్, క్రిమినల్‌ కోర్టులు తమ విధులు నిర్వర్తిస్తుంటాయి. ఈ కోర్టులు హైకోర్టుకు లోబడి పనిచేస్తుంటాయి.

Published : 09 Jun 2024 00:29 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ పాలిటీ
భారత న్యాయవ్యవస్థ, న్యాయసమీక్ష

రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. దీని కింద జిల్లాస్థాయిలో దిగువ కోర్టులు ఉంటాయి. దీనిలో భాగంగా సివిల్, క్రిమినల్‌ కోర్టులు తమ విధులు నిర్వర్తిస్తుంటాయి. ఈ కోర్టులు హైకోర్టుకు లోబడి పనిచేస్తుంటాయి. ఈ దిగువ కోర్టుల నిర్మాణం, పదవులు, అర్హతలు, తొలగింపులు తదితర విషయాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.

దిగువ కోర్టులు (Subordinate Courts)

భారత రాజ్యాంగంలోని జుఖివ భాగంలో ప్రకరణ 233 - 237 వరకు సబార్డినేట్‌ కోర్టులు లేదా అధీన న్యాయస్థానాల గురించి ప్రస్తావించారు.

  • హైకోర్టు తరువాత వచ్చే దిగువ కోర్టులను సబార్డినేట్‌ కోర్టులు అంటారు. జిల్లా స్థాయి న్యాయపాలనలో జిల్లా కోర్టులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. 
  • జిల్లా కోర్టులో జిల్లా జడ్జి, ఇతర జడ్జిలు ఉంటారు. వీరు జిల్లా స్థాయిలో, పట్టణ మేయర్‌ పంచాయతీల స్థాయిలో పలు బాధ్యతలను నిర్వహిస్తూ సివిల్, క్రిమినల్‌ కేసులను విచారిస్తారు.
  • జిల్లా కోర్టులు పాలనా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి, నియంత్రణకు లోబడి పనిచేస్తాయి.
  • న్యాయ విషయంలో హైకోర్టుకి లోబడి పనిచేస్తాయి. 
  • బ్రిటిష్‌ కాలం నుంచి ఈ తరహా న్యాయవ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. 
  • సబార్డినేట్‌ కోర్టులు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, స్థానిక చట్టాలను అనుసరించి బాధ్యతలను నిర్వహిస్తాయి.

  • పట్టణ, నగర పాలక సంస్థల్లో సిటీ సివిల్‌ కోర్టులు,  మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు ఉంటాయి.
  • ప్రకరణ 50 ప్రకారం, అధీన న్యాయస్థానాలను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు. హైకోర్టు కింది న్యాయస్థానాలపైన అప్పీళ్ల పర్యవేక్షణాధికారంతోపాటు కింది కోర్టుల న్యాయమూర్తులపై నియంత్రణ కలిగి ఉంటుంది.
  • ప్రకరణ 233 ప్రకారం, జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి విషయాల్లో గవర్నర్‌ హైకోర్టును సంప్రదిస్తారు.
  • ప్రకరణ 243 ప్రకారం, న్యాయమూర్తులే కాకుండా న్యాయశాఖ సర్వీసులకు చెందిన ఉద్యోగుల నియామకం, పదోన్నతి, సెలవుల మంజూరు లాంటి వ్యవహారంపై నియంత్రణను హైకోర్టుకు ఇచ్చారు.

జిల్లా జడ్జి, ఇతర జడ్జిల నియామకం, అర్హతలు

రాష్ట్ర గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జిల నియామకం, పదోన్నతులను నిర్ణయిస్తారు.

జిల్లా జడ్జిగా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉండకూడదు.
  • న్యాయవాదిగా ఏడేళ్ల అనుభవం ఉండాలి.
  • హైకోర్టు తన నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా గవర్నర్‌కుఅందజేయాల్సి ఉంటుంది.
  • గవర్నర్‌ రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను సంప్రదించి జిల్లా జడ్జిలను కాకుండా రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసుకు చెందిన ఇతర జడ్జిలను నియమిస్తారు. 
  • రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్‌ కోర్టులు ఉంటాయి.

1. సివిల్‌ కోర్టులు 2. క్రిమినల్‌ కోర్టులు

సివిల్‌ కోర్టులు:

సివిల్‌ సంబంధ వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలైన సివిల్‌ కేసులను విచారణకు స్వీకరిస్తాయి. 

  • జిల్లా జడ్జి సివిల్‌ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. 
  • జిల్లాలోని అన్ని సివిల్‌ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణాధికారాలను కలిగి ఉంటారు. 
  • జిల్లా సివిల్‌ కోర్టుకు దిగువన సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉంటాయి. 

సబార్డినేట్‌ కోర్టుల దిగువన కింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

1. ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి 

2. ఫ్యామిలీ కోర్టు/ కుటుంబ కోర్టు జడ్జి

3. ఎస్సీ/ ఎస్టీ కోర్టు జడ్జి 4. సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి

5. జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి

  • 10 లక్షల రూపాయలు అంతకు మించి ఆస్తి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్‌ జిల్లా కోర్టు విచారణ జరిపి తీర్పు ఇస్తుంది.
  • ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం ద్వారా లేదా పదోన్నతి ద్వారా నియమిస్తారు.
  • జిల్లా జడ్జి కేడర్‌ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ కోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించిన విడాకులు, మధ్యంతర భరణం, పిల్లల సంరక్షణకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.
  • షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల హక్కులను కాపాడటానికి ఎస్సీ/ ఎస్టీ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లా మొత్తానికి ఒక న్యాయస్థానం ఉంటుంది.
  • సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి 10 లక్షల్లోపు విలువైన ఆస్తి సంబంధ కేసులను విచారించి తీర్పునిస్తాయి.
  • లక్ష రూపాయల్లోపు విలువైన ఆస్తి సంబంధ కేసులను జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది.
  • స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో కింది స్థాయిలో న్యాయ పంచాయతీలు, అదాలత్‌ పంచాయతీలు ఉంటాయి.

జిల్లా న్యాయస్థానాలు

రాష్ట్ర గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత జిల్లా జడ్జిని నియమిస్తారు. 

  • జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి అత్యున్నత న్యాయాధికారి. సివిల్, క్రిమినల్‌ అంశాల్లో ప్రారంభ అధికార పరిధి, అప్పీళ్ల విచారణాధికారం కలిగి ఉంటారు.      
  • జిల్లా స్థాయి న్యాయమూర్తే సివిల్‌ కేసులను విచారించినప్పుడు జిల్లా జడ్జిగా, క్రిమినల్‌ కేసులను విచారించినప్పుడు సెషన్స్‌ జడ్జిగా వ్యవహరిస్తారు.
  • జిల్లా జడ్జి న్యాయసంబంధమైన, పాలనా సంబంధమైన అధికారాలు కలిగి ఉంటాడు. జిల్లా స్థాయిలోని సబార్డినేట్‌ కోర్టులపై పర్యవేక్షణాధికారం ఈయనదే.
  • ఒక పార్లమెంట్‌ సభ్యుడికి ఉండే అన్ని ప్రత్యేక హక్కులు, రక్షణలు పొందడానికి అటార్నీ జనరల్‌ అర్హుడు. నిర్ణీత పదవీకాలం ఉండదు.
  • పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతాడు.

అర్హతలు: అటార్నీ జనరల్‌గా నియమితులయ్యే వ్యక్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండే అర్హతలు ఉండాలి.

  • భారతదేశ పౌరుడై ఉండాలి
  • హైకోర్టు న్యాయమూర్తిగా కనీసం అయిదేళ్లు పనిచేసి ఉండాలి
  • హైకోర్టు న్యాయవాదిగా పదేళ్లు పనిచేయాలి. 
  • రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి.

జీతభత్యాలు: అటార్నీ జనరల్‌కు జీతం చెల్లించరు. రాష్ట్రపతి నిర్ణయించిన పారితోషికం మాత్రమే చెల్లిస్తారు. కానీ పారితోషికాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. 

  • అటార్నీ జనరల్‌ పారితోషికం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానం. దీన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. 

తొలగింపు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానమే అటార్నీ జనరల్‌కి కూడా వర్తిస్తుంది. 

  • రాష్ట్రపతికి రాజీనామా సమర్పించడం ద్వారా కూడా అతడు తన పదవి నుంచి వైదొలగవచ్చు.

ఏజీ అధికారాలు: కేంద్ర ప్రభుత్వం తరపున దేశ న్యాయస్థానంలో హాజరై వాదిస్తాడు.

  • రాష్ట్రపతి కోరిన ఇతర న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు చేస్తారు.
  • పార్లమెంటు శాసన కార్యక్రమాల్లో పాల్గొని సభలో తన వాదనను, అభిప్రాయాలను చెప్పవచ్చు. కానీ ఓటు వేసే హక్కు ఉండదు.

క్రిమినల్‌కోర్టులు

జిల్లాలో సెషన్స్‌ కోర్టు అత్యున్నత క్రిమినల్‌ కోర్టు.

  • క్రిమినల్‌ వివాదాలను జిల్లా స్థాయిలోనే విచారించేందుకు సెషన్స్‌ కోర్టు పనిచేస్తుంది.
  • జిల్లా స్థాయిలో కింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్‌ కేసులను విచారిస్తారు.

1. జిల్లా సెషన్స్‌ జడ్జి 2. సీనియర్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి  3. జూనియర్‌ సివిల్‌ జడ్జి 4. స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌

  • ప్రిన్సిపల్‌ జిల్లా న్యాయమూర్తి జిల్లా సెషన్స్‌ జడ్జిగా వ్యవహరిస్తారు. హత్యలు, తగాదాలు, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి దోషులకు జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. అయితే ఇటువంటి శిక్షలను ధృవీకరించాల్సి ఉంటుంది.
  • సీనియర్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చు.
  • జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏదైనా పట్టణంలో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్, క్రిమినల్‌ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడేళ్లలోపు కారాగార శిక్ష విధించవచ్చు.
  • సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రూ.500 వరకు జరిమానా లేదా ఒక సంవత్సరం కారాగార శిక్ష లేదా రెండింటినీ విధించవచ్చు.
  • స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ప్రతి పట్టణంలోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి పెట్టీ కేసులను విచారించి రూ.500 లోపు జరిమానా, 6 నెలలు కారాగార శిక్ష విధించవచ్చు.

కేంద్ర అటార్నీ జనరల్‌  

భారత రాజ్యాంగంలోని 76వ నిబంధన అటార్నీ జనరల్‌ గురించి వివరిస్తుంది. 

  • ఈయన కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి, ప్రధాన న్యాయసలహాదారుడిగా వ్యవహరిస్తాడు.

నియామకం: అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. 

  • రాష్ట్రపతి సంతృప్తి పొందినంత కాలం ఆయన ఈ పదవిలో కొనసాగుతాడు.

రచయిత
ఎం. ఈశ్వర వెంకటరావు
విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని