ఇష్టాన్ని పెంచి.. జ్ఞానాన్ని పెంపొందించి!

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రధానమైంది గద్య బోధన. ఆధునిక యుగంలో, నేటితరం పిల్లల్లో తెలుగు భాషపై ఇష్టాన్ని పెంచి, భాషాపరమైన జ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియ ఇది. వ్యక్తిత్వ వికాసంలో కీలకమైన భావప్రకటనా సామర్థ్యంతో పాటు పఠనాసక్తిని అభివృద్ధి చేయగలిగిన గద్యబోధన గురించి కాబోయే ఉపాధ్యాయులకు తగిన పరిజ్ఞానం ఉండాలి.

Published : 10 Jun 2024 01:27 IST

టీఆర్‌టీ-2024 తెలుగు

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రధానమైంది గద్య బోధన. ఆధునిక యుగంలో, నేటితరం పిల్లల్లో తెలుగు భాషపై ఇష్టాన్ని పెంచి, భాషాపరమైన జ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియ ఇది. వ్యక్తిత్వ వికాసంలో కీలకమైన భావప్రకటనా సామర్థ్యంతో పాటు పఠనాసక్తిని అభివృద్ధి చేయగలిగిన గద్యబోధన గురించి కాబోయే ఉపాధ్యాయులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. గద్య బోధన ఉద్దేశాలు, ఆ పాఠాల్లోని రకాలు, బోధనా పద్ధతులతో పాటు ఏ తరహా పాఠాన్ని పిల్లల తరగతులకు అనుగుణంగా ఏ పద్ధతిలో ఆసక్తిగా బోధించవచ్చో తెలుసుకోవాలి. తెలుగు గద్య బోధనకు ఉన్న చరిత్ర, ఈ ప్రక్రియను అభివృద్ధి చేసిన ప్రసిద్ధ కవులు, గద్య బోధనలో అవసరమయ్యే వ్యాకరణాంశాల గురించి అవగాహన పెంచుకోవాలి.

గద్య బోధన

  • భాషా బోధనకు సాహిత్యం ఆధారం.
  • సాహిత్యంలో ప్రముఖంగా ఉండే పద్య, గద్య ప్రక్రియల ద్వారానే విద్యార్థుల్లో భాషా పటిమ, భాషాభిరుచి, సాహిత్యాభిరుచులను పెంపొందించవచ్చు. 
  • ఈ ప్రక్రియల ద్వారా విద్యార్థుల జ్ఞాన పరిధులను పెంపొందించడానికి, వారిలో ఉత్తమ విలువలను స్థాపించడానికి కూడా వీలవుతుంది. 
  • పద్యబోధన ప్రధానంగా విద్యార్థుల్లో ఆనందానుభూతులను, సౌందర్యాత్మక స్పృహను, భావనాశక్తిని పెంపొందిస్తుంది. భాషా సాధికారతను పెంపొందించడానికి గద్యబోధన ఉపకరిస్తుంది.

గద్యబోధన ఉద్దేశాలు 

  • భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం. 
  • భావగ్రహణ, భావప్రకటన సామర్థ్యాలను వృద్ధి చేయడం. 
  • మౌన, ప్రకాశ పఠన శక్తులను, పఠనాసక్తిని అభివృద్ధి చేయడం. 
  • భాషా సంపదను పెంపొందించడం. 
  • భాషలోని జాతీయాలు, నుడికారం, లోకోక్తులను గుర్తించి, వాటిని విద్యార్థులు భాషణ లేఖనాల్లో   వినియోగించేలా చేయడం. 
  • విషయ జ్ఞానాన్ని పెంపొందించడం.
  • విద్యార్థుల్లో భాషాభిరుచిని కలిగించడం. 
  • ఆలోచన, విమర్శన, కల్పన, సృజనాత్మక శక్తులను  పెంపొందించడం. 
  • సముచిత మనోవైఖరులను వృద్ధి చేయడం. 
  • స్వీయ రచనాశైలిని అలవరచడం. 

గద్యపాఠాల్లోని రకాలు

గద్య పాఠాల్లో కథ, జీవిత చరిత్ర, స్వీయచరిత్ర, యాత్రా చరిత్ర, లేఖ, వ్యాసం, రేడియో ప్రసంగం, ఏకాంకిక, నాటిక, నవలిక వార్తావ్యాఖ్య, కరపత్రం, సంపాదకీయం మొదలైనవి ఉంటాయి. 

గద్యబోధన పద్ధతులు

1. కథాకథన పద్ధతి

  • బోధించాల్సిన గద్యపాఠం కథ, కథానిక, సంభాషణ, ప్రక్రియలకు చెందిందై ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ పాఠాన్ని సొంత మాటల్లో ఆసక్తికరంగా కథలాగా చెప్పాలి. 
  • కథ చెబుతున్నప్పుడు కథలోని పాత్రలు, సంఘటనలకు తగినట్లుగా ఊనికను, స్వరబేధాన్ని పాటించాలి. ముఖంపై హావభావాలను పలికించాలి. అప్పుడే విద్యార్థులు సావధానంగా విని అర్థం చేసుకుంటారు. తర్వాత ఆ పాఠాన్ని విద్యార్థులను చదువుకోమని చెప్పాలి. విద్యార్థులతో కథను చెప్పించాలి. కథారూపంలోని గద్యపాఠాలు చెప్పడానికి ఈ పద్ధతి బాగుంటుంది. ఇది ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకారి. 

2. నాటకీకరణ పద్ధతి 

ప్రాథమిక స్థాయి వాచకాల్లో గేయ నాటకాలు, నాటికల రూపంలో కూడా పాఠాలు అధికంగా ఉంటాయి. ఈ పాఠాలను బోధించే క్రమంలో నాటకీకరణ పద్ధతిని వినియోగించవచ్చు. విద్యార్థులకు పాఠంలోని సారాంశాన్ని తెలిపిన తర్వాత ఆ పాఠాన్ని సంభాషణ రూపంలోకి మార్చి వారితో అభినయింపజేసే పద్ధతిని నాటకీకరణ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఆసక్తికరంగా బోధించవచ్చు. నాటకీకరణలో విద్యార్థులే  ప్రేక్షకులు, తరగతి గదే రంగస్థలం, పిల్లలు ఆ రోజు ధరించిన దుస్తులే ఆహార్యం. ఈ పద్ధతి ద్వారా  విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని పెంపొందించవచ్చు. 

3. సంభాషణ పద్ధతి

సంభాషణ రూపంలో ఉన్న వచన పాఠాలను బోధించడానికి వినియోగించే పద్ధతి. ఈ పద్ధతిలో పాఠంలో ఎన్ని పాత్రలున్నాయో అంత మంది విద్యార్థులను ఎన్నుకుని ఒక్కొక్క పాత్రను ఒక్కో విద్యార్థికి ఇచ్చి ఆయా పాత్రల సంభాషణలు భావానుగుణమైన స్వర బేధాలను పాటింపజేస్తూ చదివించాలి. తర్వాత ఆ పాఠం మీద చర్చను నిర్వహించాలి. 

4. ప్రశ్నోత్తర పద్ధతి

  • పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించి ప్రశ్నలు వేస్తూ సమాధానాలను రాబట్టడానికి ప్రయత్నం చేసే పద్ధతి.
  • ఉపాధ్యాయుల ప్రశ్నల ద్వారా విద్యార్థులు సమాధానాలు చెప్పడం లేదా విద్యార్థులు ప్రశ్నలు వేసినప్పుడు తోటి విద్యార్థులు సమాధానాలు చెప్పడం, తోటి విద్యార్థులు చెప్పలేనప్పుడు ఉపాధ్యాయులు సమాధానాలు ఇవ్వడం. ఈ పద్ధతిలో విద్యార్థులు పాఠ్యాంశాలను నేర్చుకోవడం ప్రశ్నోత్తర పద్ధతి ప్రత్యేకత. 
  • విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించడానికి, వారిలో దాగి ఉన్న భావాలను విమర్శ, విశ్లేషణ శక్తులను బహిర్గతం చేయడానికి ప్రశ్నోత్తర పద్ధతి ఎంతో ఉపయోగకరమైంది. విద్యార్థుల భాషణ పూర్వక భావ అభివ్యక్తి నైపుణ్యాన్ని ఈ పద్ధతి మెరుగుపరుస్తుంది. 

5. చర్చాపద్ధతి

ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠ్యాంశాన్ని మౌనంగా పఠింపజేసి చర్చను నిర్వహిస్తారు. ఉపాధ్యాయుడు, విద్యార్థులు కలిసి లేదా విద్యార్థులు జట్లుగా తమలో తాముగా పాఠ్యాంశాన్ని గురించి చర్చలు జరుపుతారు. ఈ పద్ధతిలో విద్యార్థులు స్వేచ్ఛగా, నిస్సంకోచంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు. చర్చ చివరలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని సాధారణీకరణం చేస్తాడు. ఈ పద్ధతి మాధ్యమిక, ఉన్నత స్థాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

6. ఉపన్యాస పద్ధతి: ఉపాధ్యాయుడు పాఠాన్ని ఉపన్యాసధోరణిలో చెబుతుంటే విద్యార్థులు కేవలం శ్రోతలుగా వినే పద్ధతి. 

7. ఉదాహరణ పద్ధతి: నూతన పదజాలాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, పదవిభాగం చేయిస్తున్నప్పుడు వినియోగించే పద్ధతి. 

8. వివరణ పద్ధతి: అంశానికి సంబంధించిన నేపథ్యాన్ని, రచయిత వివరాలను తెలిపే సందర్భంలో ఉపయోగించే పద్ధతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని