TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా మరో రెండు పరీక్షలు రద్దు
హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష(Group 1 prelims exam)తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించింది. మిగతా పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగానే ఈ పరీక్షలను సైతం రద్దు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు.
వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్‌ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తాజాగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో నెలల తరబడి కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొత్తం 503 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.42లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 2.86లక్షల మంది రాశారు. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను సైతం టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది.
ఈ ఏడాది జూన్ 5 నుంచి 12వరకు మెయిన్స్ నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో 25,050 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపడంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. రద్దు చేసిన ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
India News
PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?
-
Movies News
Anushka Sharma: కాపీరైట్ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!