TSPSC Group2 Exams: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల కొత్త తేదీలివే..

TSPSC Group 2exams: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. 

Updated : 13 Aug 2023 18:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల(TSPSC Group 2 Exams) రీషెడ్యూల్‌ తేదీలను టీఎస్‌పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే గ్రూప్‌ 2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు మాసానికి వాయిదా వేస్తున్నట్టు నిన్న (ఆగస్టు 12న) ప్రకటించిన విషయం తెలిసిందే. TSPSC Group 2 Exams ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. 

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్‌-2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెలలో గురుకుల టీచర్‌ పరీక్షలు, స్టాఫ్‌నర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ వంటి పలు పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయాల అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేశారు.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, పరిస్థితులను సీఎంకు నివేదించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పరీక్షలను నవంబరుకు వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని