APPSC-TSPSC: ఎల్‌నినోతో అత్యధిక ఉష్ణోగ్రతలు.. లానినోతో సమృద్ధి వర్షాలు!

భారతదేశంలో నవంబరు నుంచి ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రారంభం అవుతుంది. జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

Updated : 28 May 2024 01:17 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ


భారతదేశ శీతోష్ణస్థితి

భారత శీతోష్ణస్థితి అధ్యయనానికి ఉపయోగపడే భావనలు
సూర్యుడి గమనం

భారతదేశంలో నవంబరు నుంచి ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రారంభం అవుతుంది. జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికి కారణం సూర్యుడు సెప్టెంబరు నుంచి భారతదేశ భూభాగానికి దూరంగా అంటే భూమధ్యరేఖ వైపుగా ప్రయాణించి డిసెంబరు 22 నాటికి మకరరేఖ పైకి చేరడం. 

 • మకరరేఖ ఆస్ట్రేలియా మధ్యగా  వెళుతుంది. కాబట్టి అక్కడ నవంబరు, డిసెంబరు మాసాల్లో వేసవికాలం ఉంటుంది. 
 • వేసవి కాలంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించే దేశం - ఆస్ట్రేలియా
 • సూర్యుడు తిరిగి మార్చి 21న భూమధ్యరేఖపై ప్రకాశించి అక్కడ నుంచి ఉత్తరంగా ప్రయాణించి జూన్‌ 21కి కర్కటరేఖ పైకి చేరతాడు. కర్కటరేఖ భారతదేశం మధ్యగా వెళుతుంది. కాబట్టి భారత్‌లో మార్చి నుంచి మే నెల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.

పీడనం

వాతావరణ అంశాల్లో అత్యంత అస్థిరమైన అంశం పీడనం.

 • ఏదైనా ఒక ప్రదేశం వద్ద ఉన్న వాయువుల బరువును ఆ ప్రదేశానికి సంబంధించిన వాతావరణ పీడనం అంటారు.
 • వాతావరణ పీడనాన్ని భారమితితో కొలుస్తారు. అందువల్ల దీన్ని భారమితి పీడనం అని కూడా అంటారు.
 • భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు అది ఎంత ఒత్తిడి కలిగిస్తుందో దాన్ని ‘ప్రామాణిక వాతావరణ పీడనం’ అంటారు. ఇది 1013.2 మిల్లీబార్లకు సమానం.
 • వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు - ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి. ఇవన్నీ పీడనంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
 • సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ప్రతి 10 మీటర్ల ఎత్తుకు వాతావరణ పీడనం 1 మిల్లీబార్‌ చొప్పున తగ్గుతుంది. కానీ వాతావరణ పైపొరల్లో పీడనంలో మార్పు కనిపించదు.
 • సరాసరి సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం 900 మిల్లీబార్ల నుంచి 1030 మిల్లీబార్ల వరకు ఉంటుంది.
 • ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం 1963, డిసెంబరు 31న సైబీరియాలోని అగాటా వద్ద 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది.
 • ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం 1979, అక్టోబరు 12న మరియానా ద్వీపాల్లోని ‘టిప్‌’ అనే సముద్ర చక్రవాత కేంద్రంలో 870 మిల్లీబార్లుగా నమోదైంది.

హరితగృహ ప్రభావం( GREEN HOUSE EFFECT)

భూమిని చేరుకునే సౌరశక్తి మొత్తం తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీన్నే హరితగృహ ప్రభావం అంటారు.

 • 19వ శతాబ్దం నుంచి భూగోళం వేగంగా వేడెక్కుతోంది. ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు.
 • పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి మానవ చర్యలే ప్రధాన కారణం.

AGW (Anthropogenic Glibal Warming): మానవ చర్యల వల్ల భూమి వేడెక్కడాన్ని తిబిజూ అంటారు.

ఇటీవలి కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద ఉన్న గడ్డకట్టిన టండ్రాల (మంచు పలకలు) కింద పెద్ద మొత్తంలో మీథేన్‌ వాయువు ఉందని కనుక్కున్నారు.
భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డకట్టిన మంచు ఎక్కువగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్‌ వాతావరణంలోకి విడుదల అవుతుంది. దానివల్ల భూమి మరింత వేడెక్కుతుంది.
హరితగృహ వాయువుగా (Green House Gas) కార్బన్‌ డైఆక్సైడ్‌ కంటే మీథేన్‌ మరింతగా శక్తిమంతంగా పనిచేస్తుంది.
మానవజనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడంతో భూమిపై వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి.

IPCC:Inner Governmental Panel For Climatic Change)

IPCC అనేది మానవ ప్రేరిత వాతావరణ మార్పులపై జ్ఞానాన్ని పెంపొందించే బాధ్యత కలిగిన ఐరాస అంతర్‌ ప్రభుత్వ వ్యవస్థ.

 • ప్రపంచ వాతావరణ సంస్థ (WNO), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP)దీన్ని స్థాపించాయి. 
 • IPCCప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.

వసంత్‌ గోవరికర్‌: భారత్‌లో రుతుపవనాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త వసంత్‌ గోవరికర్‌.

 • ఈయన భారత రుతుపవన ముందస్తు అంచనా నమూనాను ప్రవేశపెట్టారు.
 • ఇది మొట్టమొదటి స్వదేశీయ రుతుపవన ముందస్తు అంచనాల నమూనా. అందువల్ల ఈయనను భారత ‘రుతుపవన అంచనా పితామహుడు’ అంటారు.

కొరియాలిస్‌ ప్రభావం

కొరియాలిస్‌ ఎఫెక్ట్‌కు కారణం భూభ్రమణం. కొరియాలిస్‌ బలాలు పవనం దిశలో మార్పు కలగజేస్తాయి.

 • స్వాభావికంగా కదిలే పవనాలు, సముద్ర ప్రవాహాలు ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో ఎడమవైపునకు వంగి ప్రయాణిస్తాయి. దీన్నే కొరియాలిస్‌ ప్రభావం అంటారు. దీనివల్లే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటగానే కుడివైపునకు వంగి నైరుతి రుతుపవనాలుగా భారతదేశంపైకి వీచి అధిక వర్షాన్ని ఇస్తాయి.

అంతర ఆయనరేఖ అభిసరణ ప్రాంతం

ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకునే అల్పపీడన ప్రాంతాన్ని అంతర ఆయనరేఖ అభిసరణ ప్రాంతం ్బఖిగిద్ట్శ్రి అంటారు.

 • ఇది ఎల్లప్పుడూ సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూ, కదులుతూ ఉంటుంది. అంటే మార్చి 21న భూమధ్యరేఖ వద్ద, జూన్‌ 21న కర్కటరేఖ వద్ద, డిసెంబరు 22న మకరరేఖ వద్ద కేంద్రీకృతమై ఉంటుంది.
 • ITCZ Inner Tropical Convergenic Zone

రుతుపవనాల పుట్టుకను వివరించే సిద్ధాంతాలు

తాప సిద్ధాంతంThermal Conceptఈ సిద్ధాంతాన్ని ఇంగ్లండ్‌ దేశానికి చెందిన ఎడ్మండ్‌ హేలీ ప్రతిపాదించాడు.

 • భూమి, నీరు విభిన్నంగా వేడెక్కి చల్లారడంతో భూపవనాలు, జలపవనాలు పెద్ద ఎత్తున సంభవించి రుతుపవనాలు ఏర్పడతాయని హేలీ పేర్కొన్నాడు.

చలన సిద్ధాంతం : (Dynamic Concept)

ఈ సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందిన హెర్మాన్‌ ఫ్లోన్‌ ప్రతిపాదించాడు.

* ప్రపంచ శీతోష్ణస్థితి శాస్త్రవేత్తల్లో గొప్పవాడిగా గుర్తింపు పొందిన ఫ్లోన్‌ అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం ్బఖిగిద్ట్శ్రి, కొరియాలిస్‌ ప్రభావం ఆధారంగా రుతుపవనాల విధానాన్ని విశదీకరించాడు.

వాయు సంబంధ సిద్ధాంతం(Aerological Concept Of Monsoon):ఈ సిద్ధాంతాన్ని షేర్‌హగ్‌ ప్రతిపాదించాడు.

 • ఈయన ప్రకారం వాతావరణంలోని అన్ని దశల్లో పవనాల దిశలో మార్పునకు, వాతావరణంలో ఘర్షణ పొరపై గాలిలోని ఉష్ణోగ్రతల మార్పునకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.

భూగోళం వేెడెక్కడం, శీతోష్ణస్థితిలో మార్పు

మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేదు.

 • భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. 

దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు

1) మనం పీల్చుకునే ఆక్సిజన్‌ లభించడం

2) సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై ఉన్న ప్రాణులను కాపాడే ఓజోన్‌ పొర ఏర్పడటం

3) మనకు అవసరమైన మాంసకృత్తులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని లభించడం.

4) వాతావరణం చేసే మరో ముఖ్యమైన పని జీవులను వెచ్చగా ఉంచడం.


రుతుపవనాల క్రియాశీలతను ప్రభావితం చేసే అంశాలు

ఎల్‌నినో: ఎల్‌నినో అంటే దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా వేడెక్కడం. దీన్ని మొదటగా పెరూ దేశ మత్య్సకారులు గుర్తించారు.

 • స్పానిష్‌ భాషలో ఎల్‌నినో అంటే చిన్న బాలుడు లేదా క్రైస్తవ బాలుడు/ క్రీస్తు జననం అని అర్థం.
 • ఎల్‌నినోను ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి గమనించవచ్చు. దీనివల్ల భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షపాత పరిమాణం తగ్గుతుంది. దీంతో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయి.

లానినో: ఇది ఎల్‌నినోకు వ్యతిరేకమైంది. స్పానిష్‌ భాషలో లానినో అంటే ఆడశిశువు అని అర్థం. లానినో అనేది పెరూ తీరప్రాంతం వెంట సాధారణంగా కదిలే శీతల ప్రవాహం.

 • పెరూ తీరంలో ఈ పరిస్థితులున్నప్పుడు భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.

హిందూ మహాసముద్ర ద్విధృవ స్థితి: దీన్ని హిందూ మహాసముద్ర ఎల్‌నినో అంటారు.

 • హిందూ మహాసముద్రంలో పశ్చిమ భాగాన ఉన్న ఆఫ్రికా తూర్పు తీరాన్ని పశ్చిమ ధృవంగా, ఆస్ట్రేలియా పశ్చిమ భాగాన్ని తూర్పు ధృవంగా పరిగణిస్తారు.
 • హిందూ మహాసముద్ర పశ్చిమ ధృవంలో ఉష్ణోగ్రతలు పెరిగే స్థితిని ధనాత్మక స్థితి అంటారు. ఈ స్థితి ఉన్నప్పుడు ఆఫ్రికా తూర్పు తీరంలో, భారత భూభాగంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కవగా కురుస్తాయి.
 • హిందూ మహాసముద్ర తూర్పు ధృవంలో ఉష్ణోగ్రతలు పెరిగే స్థితిని రుణాత్మక స్థితి అంటారు. ఈ స్థితిలో వ్యాపార పవనాలు ఆస్ట్రేలియా పశ్చిమ భాగం, ఇండోనేసియాల వైపు ఆకర్షితమై అధిక వర్షాలు కురుస్తాయి. అయితే భారతదేశంలో వర్షాలు తగ్గుతాయి.

 రచయిత
 పి.కె. వీరాంజనేయులు
విషయ నిపుణులు
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని