Jobs: ఐఐటీ కాన్పూర్‌లో కొలువుల జోష్‌.. ఒకేరోజు 485మందికి జాబ్‌ ఆఫర్లు

ఐఐటీ కాన్పూర్‌లో కొలువుల జోష్‌ మొదలైంది.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తొలిరోజే 485మందికి జాబ్‌ ఆఫర్లు వచ్చాయి.

Updated : 04 Dec 2023 18:32 IST

IIT Kanpur Placement | కాన్పూర్‌: ప్రఖ్యాత కాన్పూర్‌ ఐఐటీలో కొలువుల సందడి మొదలైంది.  తొలి రోజు పలు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు అదరగొట్టారు. ఒకే రోజు 485 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌, ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు(పీపీవో) అందుకున్నారు.  మరో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లను దక్కించుకున్నారు.  కాన్పూర్‌ ఐఐటీలో 2023-24 ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్‌, నావి, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, క్వాల్కమ్‌,  డ్యుయిష్ బ్యాంక్ సంస్థలు టాప్‌ నియామక సంస్థలుగా నిలిచాయి.  216 మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు (పీపీఓ) అందుకొన్నట్లు ఐఐటీ కాన్పూర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈసారి విద్యార్థులు సాధించిన ఉద్యోగాల వార్షిక ప్యాకేజీ వివరాలు ఇంకా తెలియలేదు.

ఇకపోతే,  గతేడాది కూడా ఈ విద్యాసంస్థలో విద్యార్థులకు భారీగానే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐఐటీ కాన్పూర్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌ డిసెంబర్‌ 1 నుంచి 15వరకు జరగ్గా..  1,128 మంది ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. వీటిలో 208 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు (పీపీవో) ఉన్నాయి.  గతేడాది అత్యధిక వార్షిక వేతనం దేశీయంగా రూ.1.9కోట్లు కాగా.. 33 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అంగీకారం కుదుర్చుకున్నారు.

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో 700లకు పైగా జాబ్‌ ఆఫర్లు.. ఆరుగురికి కోటి పైనే ప్యాకేజీ

మరోవైపు, ఐఐటీ ఖరగ్‌పుర్‌ విద్యార్థులకు తొలి రోజు 700లకు పైగా ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్లు ఆ సంస్థ శనివారం ప్రకటించింది. వీటిలో 19 అంతర్జాతీయ సంస్థలు తమ విద్యార్థులను ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయని.. ఆరుగురు విద్యార్థులు రూ.కోటికి పైనే వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. 61 కంపెనీలకు పైగా తమ విద్యార్థులను వేర్వేరు స్థాయిల్లో ఉద్యోగాలకు ఆఫర్లు ఇచ్చాయని, వీటిలో ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌, అనలిటిక్స్‌, ఫైనాన్స్‌ -బ్యాంకింగ్‌, కన్సల్టింగ్‌, కోర్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన కొలువులు ఉన్నట్లు తెలిపింది. దిగ్గజ సంస్థలైన యాపిల్‌తో పాటు ఆర్థూూర్‌ డి  లిటిల్‌, డా విన్సి, క్యాపిటల్‌ వన్‌, డె షా, ఈఎక్స్‌ఎల్‌ సర్వీసెస్‌, గ్లీన్‌, గూగుల్‌, గ్రావిటాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెకెన్సీ, క్వాంట్‌బాక్స్‌, డేటా బ్రిక్స్‌, స్క్వేర్‌ పాయింట్‌, టీఎస్‌ఎమ్‌, పాలో అల్టోతో పాటు పలు ప్రఖ్యాత కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని