JEE Main 2023 Result: ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్‌(సెషన్‌-2) ఫలితాలు!

లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్‌ రెండో విడత ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Updated : 24 Apr 2023 20:46 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌(JEE Main) సెషన్‌ 2 పరీక్ష తుది సమాధానాల కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను ఈరోజు ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 29న విడుదల చేస్తారంటూ ఇటీవల వార్తలు వెలువడినప్పటికీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA)ఈరోజే విడుదల చేసే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలపై NTA మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫలితాలు విడుదలైతే.. అభ్యర్థులు ఎన్‌టీ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి తాము సాధించిన స్కోర్‌ను తెలుసుకోవచ్చు. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.  ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్‌ 21వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 

తుది సమాధానాల కీ కోసం క్లిక్‌ చేయండి

రెండుసార్లు రాస్తే.. ఉత్తమ స్కోరుతో ర్యాంకుల ప్రకటన

JEE Main session 1 పరీక్షలు జనవరిలో జరగ్గా.. ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు.  తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2).. వారిలో దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.

ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్లు..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఏప్రిల్‌ 30 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మే 7వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష జూన్‌ 4న జరుగుతుంది. పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు ; పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్‌ 11న; ఫలితాలు జూన్‌ 18న విడుదల చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్‌లో పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని