Career Guidance: వాతావరణ శాస్త్రం.. విభిన్న కెరియర్‌!

వాతావరణ శాస్త్రం.. చాలా మంది విద్యార్థులకు అంతగా అవగాహన లేని అంశం.. కానీ ఎన్నో కొత్త కొత్త ఉద్యోగాలు అందించే అవకాశం ఉన్న విభాగమిది. మీటీయరాలజీ చదివినవారు విదేశాల్లోనూ రాణించగలరు.

Published : 05 Jun 2024 00:45 IST

వాతావరణ శాస్త్రం.. చాలా మంది విద్యార్థులకు అంతగా అవగాహన లేని అంశం.. కానీ ఎన్నో కొత్త కొత్త ఉద్యోగాలు అందించే అవకాశం ఉన్న విభాగమిది. మీటీయరాలజీ చదివినవారు విదేశాల్లోనూ రాణించగలరు. ఈ కోర్సు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..!

ఉద్యోగాలు: ఈ రంగంలో కొంచెం తక్కువే ఉంటాయి. అయితే మిగిలినవాటితో పోలిస్తే ఇక్కడ పోటీ చాలా పరిమితం. ఇందులో ఉన్న అవకాశాలపై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో ఈ కోర్సు చదివినవారు సులువుగానే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. ఇందులో పరిశోధనకు ప్రాధాన్యమెక్కువ. బోధన వైపూ అడుగులు వేయొచ్చు.  స్పేస్‌ అప్లికేషన్‌ కేంద్రాలు, పోర్టులు.. ఇలా పలు చోట్ల ఉద్యోగాలు ఉంటాయి.


మీటీయరాలజీ.. భూమిమీద నేలమట్టం నుంచి 18 కిలోమీటర్ల పైన వరకూ ఉండే వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. పురాతన గ్రీకులు మేఘాలు, గాలులు, వర్షాలను గమనించి వాటి మధ్యనున్న సంబంధాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించేవారు. వ్యవసాయాన్ని 
అధికంగా ప్రభావితం చేసే అంశం కావడం.. దానిపైనే  వారు ఆధారపడి జీవిస్తూ ఉండటం  వల్ల  వాతావరణ అధ్యయనానికి  వారు  అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి ద్వారానే దీనికి మీటీయరాలజీ  అనే పేరు సంక్రమించింది.

  • ప్రస్తుతం మనం జీవిస్తున్న నవీన సమాజం వాతావరణ మార్పులతో మరింత అధికంగా ప్రభావితమవుతోంది. ఇటువంటి సమయంలో భూమి మీద నివసించే జీవరాశుల మనుగడ కోసం వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండటం అత్యంత ఆవశ్యకం. 

ఎవరు?

భూమి ఉపరితలం, సముద్రాల్లో జరిగే మార్పులు జీవరాశిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అనే అంశాన్ని తెలుసుకునే క్రమంలో శాస్త్రీయ పద్ధతులు ఉపయోగిస్తారు. ఇలా వివిధ వాతావరణ అంశాలను పరిశీలించి, గుర్తించి, అర్థం చేసుకుని, తెలియజెప్పే వారే మీటీయరాలజిస్టులు. 

ఎలా?

మీటీయరాలజిస్ట్‌ కావడానికి పీజీలో ఇందుకు సంబంధించిన కోర్సులు చదవాలి. డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ కచ్చితంగా చదివి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్‌ సైన్స్, కెమిస్ట్రీ వంటి ఏ సబ్జెక్టులు అయినా చదువుకుని ఉండొచ్చు. ఎమ్మెస్సీ మీటీయరాలజీ, ఓషనోగ్రఫీ కోర్సులు అనుబంధంగానూ చదివే వీలుంది. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

ఏం నేర్చుకుంటారు?

ఇందులో విద్యార్థులకు వాతావరణం, క్లైమేట్‌ (30 ఏళ్ల వాతావరణ పరిస్థితుల సగటు), రిసెర్చ్‌ను డాక్యుమెంట్‌ చేయడం, ఇందుకోసం పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ వంటివన్నీ నేర్పిస్తారు. వాతావరణ అంచనా చదివి అర్థం చేసుకోవడం, వివిధ రిసెర్చ్‌ మోడల్స్‌ రన్‌ చేయడం వంటివి తెలియజేస్తారు. ఏదైనా ఒక విజువలైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ గురించి వీరు కచ్చితంగా తెలుసుకోవాలి. వాతావరణానికి సంబంధించి ప్రాథమిక అంశాల నుంచి అన్నీ నేర్పిస్తారు.

ఎక్కడ?

ఈ కోర్సు మన దేశంలో ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, కొచ్చిన్‌ వర్సిటీ, ఎన్‌ఐటీ-రవుర్కెలా, ఐఐఎస్‌ఈఆర్‌ మొహాలీ వంటి కొన్ని చోట్ల ప్రత్యేకంగా పూర్తిస్థాయిలో ఉంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మిగతా కొన్ని ప్రముఖ వర్సిటీల్లో వాతావరణ అధ్యయనాలకు సంబంధించిన ఒక విభాగంగా ఉంది. వీటిలో ఎక్కడైనా విద్యార్థులు ఆ సంస్థల ప్రవేశపరీక్షల్లో ర్యాంకు తెచ్చుకుని చేరవచ్చు.

ఇంకా..

మన దేశంలో పీజీలో మీటీయరాలజీ చదివి, ఆపైన  విదేశాలు వెళ్లి పీహెచ్‌డీ చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో వాతావరణ సంబంధిత పరిశోధనకు అధిక ప్రాధాన్యం ఉంది. అటువంటి దేశాల్లో పరిశోధన, బోధన రంగాల్లో అధిక అవకాశాలు ఉంటున్నాయి. అంతేకాదు.. మనదేశంలో ఉన్న ముఖ్యమైన బోధన సంస్థలకు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలున్నాయి. ఐసీటీపీ-ఇటలీ ఏటా దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. వీటి ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించే వీలుంది. ఈ పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఆరంభంలో కనీసం 35 వేల రూపాయల జీతంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వారు ఎంతవరకూ ఇంకా సంపాదించగలరు అనేది వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రభుత్వ సహకారం

విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందే ఫెలోషిప్పులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లి యూఎస్‌లో ఫెలోషిప్‌ చేసి రిసెర్చ్‌ పేపర్‌ ప్రచురించినవారూ ఉన్నారు. సీఎస్‌ఆర్‌ నెట్, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్స్‌ వంటివి అందుకునే వీలుంది. మన దేశంలో ఈ సబ్జెక్టు బోధించే సంస్థలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద్వారా నిధులు అందుతాయి. దాంతో మరింత సమర్థంగా విద్యాసంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి.

  • ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దీనికి సంబంధించిన రిసెర్చ్‌ నిపుణులకు గిరాకీ పెరిగింది. దీన్ని అందిపుచ్చుకోవడం ద్వారా విభిన్నమైన కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు.

అవగాహన పెరగాలి

ఏయూలో మొట్టమొదట మీటీయరాలజీ విభాగాన్ని ప్రారంభించి 75 ఏళ్లుగా నిర్విరామంగా నడిపిస్తున్నారు. ఏటా 18 మంది విద్యార్థులు నిపుణులుగా ఈ క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌టీఎల్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. వంటి అనేక సంస్థల్లో వీరు కొలువుదీరుతున్నారు. ఎమ్మెస్సీ మీటీయరాలజీ, ఓషనోగ్రఫీ వంటి సబ్జెక్టులతో 5 పీజీ కోర్సులు ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులంతా ఇంజినీరింగ్‌ కోర్సులవైపు పరుగులు తీస్తున్నారు. దీనిపై అవగాహన తక్కువగా ఉంది. కానీ ఇందులో ఉన్న అవకాశాల గురించి పూర్తిగా తెలుసుకుని ప్రయత్నిస్తే చాలా మంచి కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో 500 లోపు ర్యాంకు సాధించినవారు సీటు పొందవచ్చు.  గల్ఫ్‌ దేశాలు, ప్రైవేటు ప్రొడక్ట్‌ కంపెనీలు, వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ కంపెనీలు.. ఇలా అనేక చోట్ల ఈ నిపుణుల అవసరం ఉంటుంది. భవిష్యత్తులో వీరికి మరింత ఎదిగేందుకు అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుని నివాస భవనం వైట్‌హౌస్‌ వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిశీలన బృందాన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు..  ఏయూ పూర్వవిద్యార్థి తల్లాప్రగడ విజయ్‌కుమార్‌. అంటే అర్థమవుతుందిగా.. ఎంత మంచి అవకాశాలున్నాయో! 

పి.సునీత, హెచ్‌వోడీ, ఆంధ్రా యూనివర్సిటీ మీటీయరాలజీ అండ్‌ ఓషనోగ్రఫీ విభాగం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని