economic growth: రాజకీయ స్థిరత్వం.. సుస్థిర పాలన.. ఆర్థిక వృద్ధికి సోపానాలు!

ఒక దేశ అభివృద్ధిలో విద్య పాత్ర ప్రధానమైంది. ఇది ఆ దేశ ఆర్థిక పురోగతిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానవ సామర్థ్యాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. 

Published : 06 Jun 2024 01:26 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ
ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

ఒక దేశ అభివృద్ధిలో విద్య పాత్ర ప్రధానమైంది. ఇది ఆ దేశ ఆర్థిక పురోగతిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానవ సామర్థ్యాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. విద్య అందరికీ అందుబాటులో ఉంటే లాభదాయకం అవుతుంది. అలాగే ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటే, వారి ఉత్పాదక శక్తి పెరిగి మానవ మూలధన నాణ్యత కూడా పెరుగుతుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు, సమగ్ర దేశ నిర్మాణానికి ఎంతగానో తోడ్పడుతుంది.


ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్ర

మానవ వనరుల అభివృద్ధికి విద్య, నైపుణ్య శిక్షణ అనేవి ప్రధానం. వీటికి కింది అంశాలు దోహదం చేస్తాయి.

విద్య, ఆర్థికాభివృద్ధి: విద్యపై పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. తొడారో, ఆడమ్‌స్మిత్‌ అభిప్రాయం ప్రకారం.. విద్య వల్ల పరిజ్ఞానం, నైపుణ్యం పెరుగుతాయి. ఈ క్రమంలో ఎక్కువ ఉత్పాదక శ్రామికులను సమకూర్చవచ్చు. విద్య వల్ల ఉద్యోగ, ఆదాయ సముపార్జనకు అవకాశాలు మెరుగవుతాయి. విద్య ఆధునిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా విద్యావంతులైన నాయకులు తయారవుతారు. 

ఆదాయ అసమానతల తగ్గింపు: సంపూర్ణ విద్యతో ప్రజల సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇది వారి ఆదాయాల పెంపునకు సహకరిస్తుంది.

గ్రామీణాభివృద్ధి: గ్రామీణులకు విద్య ద్వారా పరిజ్ఞానం అందుతుంది. దీనివల్ల వారు తమ అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను అధిగమిస్తారు. రైతులు, విద్యావంతులైతే కొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు. అంది పుచ్చుకున్న నైపుణ్యాలతో కుటీర పరిశ్రమలను స్థాపించే సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గుతుంది.

కుటుంబ నియంత్రణ: జీవన ప్రమాణాల స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. దీని కోసం కుటుంబ నియంత్రణ ఒక  ఉత్తమ సాధనంగా పని చేస్తుంది. ఇది నిరూపితమైంది కూడా ఎక్కువమంది మహిళలు చదువుకొని ఉపాధి కోరుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. 

ఉద్యోగ శిక్షణ: అనేక సంస్థలు వారి ఉద్యోగులకు శిక్షణను అందిస్తాయి. ఎందుకంటే మానవ మూలధనంలో మెరుగుదల ఉంటే భౌతిక మూలధన ఉత్పాదకత పెరుగుతుంది. ఉద్యోగ శిక్షణ వల్ల శ్రామికుల నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పాదకత, ఉత్పత్తి పెరుగుతాయి.

  •  విద్యాభివృద్ధితో ప్రస్తుత, భావితరాలకు సశేష ఆదాయాలు అందుతాయి. దీనివల్ల మానవ అవసరాలు తీరడంతో పాటు, విజ్ఞానశాస్త్రంలో పరిశోధన పెరుగుతుంది, బాధ్యతాయుత ప్రవర్తన అలవడుతుంది. సాంస్కృతిక వారసత్వం అందించడం, రాజకీయ సుస్థిరత సాధ్యమవుతాయి.
  • ప్రజలకు కనీస విద్య లేకపోతే, ప్రస్తుత కాలంలోనే కాకుండా భవిష్యత్తులోనూ అనేక రకాల ప్రయోజనాలను కోల్పోతారు.

ప్రాథమిక విద్యాహక్కు చట్టం - 2009

కేం రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేందుకు వీలుగా విద్యారంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఈ రెండు ప్రభుత్వాలు విద్యపై ఖర్చు చేస్తాయి. ప్రాథమిక విద్య అంశంలో రాజ్యాంగపరమైన నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించేందుకు (రాజ్యాంగంలోని 45వ క్లాజ్‌ కింద) 6-14 ఏళ్ల వయసున్న చిన్నారులకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలి. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఇందుకోసం విద్యాహక్కు చట్టం - 2009ని ఆమోదించారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ కొత్త అధికరణను చేర్చి ‘ప్రాథమిక హక్కు’ను కల్పించిన ఈ చట్టం ఏప్రిల్‌ 1, 2010 నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చింది. 11వ పంచవర్ష ప్రణాళికలో విద్యారంగానికి అధిక కేటాయింపులు చేశారు. దీన్నే విద్యా ప్రణాళికగా పేర్కొన్నారు.

నూతన విద్యా విధానం - 2020: కేంద్ర కేబినెట్‌ 2020 జులై 29న జాతీయ నూతన విద్యావిధానానికి ఆమోదం తెలిపింది. ఇది 1986 నాటి విద్యా విధానాన్ని భర్తీ చేస్తుంది. 2022 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

  • 10+ 2+ 3 పాఠశాల విద్యా వ్యవస్థ స్థానంలో 5+ 3+ 3+ 4 వ్యవస్థను చేర్చారు. విద్యార్థులను 3-8, 8-11, 11-14, 14-18 సంవత్సరాల వారీగా విభజించి వారు నేర్చుకోవాల్సిన అంశాలను పొందుపరిచారు.
  • 1960లో భారత రాజ్యాంగం 14 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. డి.ఎస్‌.కొఠారి అధ్యక్షతన 1964లో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నివేదిక ఆధారంగా 1968లో ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. 1990 నాటికి అందరికి ప్రాథమిక విద్యను, వయోజన అక్షరాస్యతను కల్పించాలని తెలిపింది. విద్యలో గుణాత్మక మెరుగుదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

యూఎన్‌ఓ సహస్రాబ్ది లక్ష్యాలు - విద్య (2000 - 15): 2000లో జరిగిన యూఎన్‌ఓ సహస్రాబ్ది శిఖరాగ్ర సమావేశంలో 189 దేశాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ పేదరికాన్ని అంతం చేసే దిశగా కృషి చేయాలని ఇందులో నిర్ణయించారు. ఈ సహస్రాబ్దిలో సాధించాల్సిన 8 లక్ష్యాల్లో రెండోది సార్వత్రిక ప్రాథమిక విద్య.

సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు - విద్య: 2015 డిసెంబరు 31తో సహస్రాబ్ది లక్ష్యాల కాలపరిధి ముగిసింది. ఈ దిశగా యూఎన్‌ఓ 2015 సెప్టెంబరు 15న నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో సభ్యదేశాల నాయకులు ప్రపంచ పేదరికం, ఆకలిని అంతం చేయడం, భూగోళాన్ని పరిరక్షించడం, మానవజాతి ఆత్మగౌరవం, శ్రేయస్సును పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. సుస్థిరాభివృద్ధిలో భాగంగా 17 లక్ష్యాలను నిర్దేశించారు. ఇందులో నాలుగో లక్ష్యం నాణ్యత గల విద్యా ప్రమాణాలు అందించడం.


ఆరోగ్యం పాత్ర

ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ అనేది తప్పనిసరి. శ్రామికులు ఆరోగ్యంగా ఉంటే జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందుకోసం ఆరోగ్య, వైద్య  సంబంధిత అంశాలపై పెట్టుబడి రూపంలో వెచ్చించి వైద్య వసతుల (వ్యాధి నివారణ, చికిత్స, పునరావాసం, పౌష్ఠికాహార స్థాయి) కల్పనకు కృషి చేస్తారు. 1993 ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధికి మెరుగైన ఆరోగ్యం కింది విధాలుగా తోడ్పడుతుంది. 

  • శ్రామికులు అనారోగ్యంతో ఉన్నందువల్ల ఉపయోగంలోకి రాని సహజవనరులను ఉపయోగించే అవకాశాన్ని మెరుగైన ఆరోగ్యం కల్పిస్తుంది.  
  • చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే పాఠశాలల్లో వారి నమోదు శాతం పెరగడంతో పాటు పాఠ్యాంశాలు చక్కగా నేర్చుకుంటారు.  
  • అనారోగ్యంపై ఖర్చు చేసే వనరులను ఇతర ప్రత్యామ్నాయ అవసరాలకు వాడటానికి, వాటి లభ్యతను పెంచడానికి తోడ్పడుతుంది. 

భారతదేశంలో ఆరోగ్య విధానాలు: 1946లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సర్వే, అభివృద్ధి కమిటీ (మోరే కమిటీ), 1961లో ఏర్పాటైన ఆరోగ్య సర్వే, ప్రణాళికా కమిటీ (మొదలియార్‌ కమిటీ)ల సూచన మేరకు ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది.

ఆశయాలు: 

1. అంటువ్యాధుల నియంత్రణకు ఏర్పాట్లు. 

2. ఆరోగ్య సేవలు అందించడం. 

3. ఆరోగ్యశాఖల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, గ్రామీణ రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడం.

  • అయిదో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య అభివృద్ధి పథకాలను కుటుంబ సంక్షేమం, పిల్లలు, గర్భిణులు, బాలింతలు పౌష్ఠికాహార పథకాలతో సమగ్రపరిచారు. 
  • ఆరో పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలకు చెందిన సమాజ ఆధారిత పథకాన్ని (కమ్యూనిటీ బేస్డ్‌ ప్రోగ్రాం) ప్రవేశపెట్టారు.
  • తొమ్మిదవ, పదో పంచవర్ష ప్రణాళికల్లో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పెంచి, మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య ప్రమాణస్థాయిని పెంచడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.
  • పదకొండో పంచవర్ష ప్రణాళిక వైయక్తిక ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, పోషణ పద్ధతుల పరిజ్ఞానం వంటి అనేక అంశాలను కలిపి సర్వతోముఖ విధానాన్ని రూపొందించింది.

రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలు: ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం, చెందకపోవడమనేది అనేక అంశాలు, ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, కెన్యా మొదలైన దేశాలు పూర్వ బ్రిటిష్‌ వలస దేశాలు. ఈ దేశాల నెమ్మది వృద్ధి ఇంగ్లండ్‌తో ముడిపడి ఉండేది.  

  • ఇంగ్లండ్‌ ఈ దేశాలను అనాలోచనతో విపరీతంగా దోచుకోవడంతో పాటు వాటి ఆర్థిక మిగులులో అధిక భాగాన్ని ఉపయోగించుకుంది.
  •  దాదాభాయ్‌ నౌరోజీ ‘పావర్టీ అండ్‌ అన్‌-బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో బ్రిటిష్‌ పరిపాలనలో భారతదేశ సంపద, మూలధనం ఏ విధంగా తరలిపోయాయో; దీనివల్ల దేశంలో ఆర్థికాభివృద్ధి ఏ విధంగా నిలిచిపోయిందో వివరించారు. 
  • ఇటువంటి అనేక పూర్వ కాలనీలు స్వేచ్ఛా, స్వాతంత్య్రం పొందిన తర్వాతే వృద్ధి క్రమంలోకి వెళ్లాయి.
  • ఆధునిక ఆర్థిక వృద్ధికి రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలు కూడా దోహదపడతాయి. 
  •  రాజకీయ స్థిరత్వం, పటిష్ఠమైన పాలనతో బ్రిటన్, జర్మనీ, యూఎస్, జపాన్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఆర్థిక వృద్ధి చేకూరింది.
  • రాజకీయ అస్థిరత, అవినీతి, బలహీన పరిపాలన వల్ల అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో ఇటలీ వృద్ధి చెందలేదు. 
  • అభివృద్ధి చెందిన దేశాలు శాంతి, రక్షణ, స్థిరత్వం అనేవి ఉద్యమిత్వ అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా సరైన ద్రవ్య, కోశ విధానాలను అమలు చేసే అవకాశాన్ని ఏర్పరిచాయి. 
  • వెనకబడిన దేశాల్లో బలహీన పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి ఆటంకాలు. ్య అవినీతి లేని, పటిష్టమైన పరిపాలన, స్థిర రాజకీయ పరిస్థితులు ఆర్థికాభివృద్ధిని మరింత ఉత్తేజపరుస్తాయి.

రచయిత
బండారి ధనుంజయ విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు