APPSC-TSPSC: నైపుణ్యాలే కొలమానం.. అభివృద్ధికి మూలాధారం!

వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, వ్యవస్థాగత మార్పులను సూచించేది ఆర్థికాభివృద్ధి. దేశం ఆర్థిక వృద్ధి,ఆర్థికాభివృద్ధిని సాధించడాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి.

Published : 30 May 2024 00:48 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, వ్యవస్థాగత మార్పులను సూచించేది ఆర్థికాభివృద్ధి. దేశం ఆర్థిక వృద్ధి,ఆర్థికాభివృద్ధిని సాధించడాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇందులో ఆర్థిక - ఆర్థికేతర అంశాలు సమప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. సేవల ఉత్పత్తి, పంపిణీ ద్వారా ద్రవ్యలాభంపై దృష్టి పెట్టేవి ఆర్థిక కార్యకలాపాలు. సంపదపోగును పరిగణనలోకి తీసుకోకుండా నిర్వహించేవి ఆర్థికేతర కార్యకలాపాలు. వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

ఆర్థికేతర అంశాలు

మానవ వనరులు: ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు ముఖ్యమైన కారకాలు. ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పని చేస్తారు. మానవ వనరులు అంటే, ఒక వ్యవస్థలోని జనాభాకు ఉన్న ఉత్పత్తి చేయగల సమర్థత. మానవ మేధా సంపత్తి, శ్రామికశక్తి ఇందులో భాగమే. మానవ వనరులు ఆర్థిక వ్యవస్థలోని సహజ వనరులను ఉపయోగించుకుని మానవ నిర్మిత వనరులను తయారు చేస్తాయి.

మానవ మేధా సంపత్తి: విద్య ద్వారా చేకూరే సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం.

మానవ శ్రామిక సంపత్తి: పనిచేసే శ్రామిక శక్తి వయసు 15 నుంచి 64 సంవత్సరాలు.

మానవ నిర్మిత వనరులు: యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలు, ఓడలు, కర్మాగారాలు, ఇతర వస్తువులు.

మేధావుల వలస: ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం ఉన్న సాంకేతిక సిబ్బంది అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోవడం.

మానవ మూలధనం: మానవులకు ఉన్న బుద్ధి బలాన్ని సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించడమే మానవ మూలధనం.

మానవ వనరుల అభివృద్ధి 

భౌతిక కారకాలైన శ్రమ, మూలధనంలోని పెరుగుదల వివిధ కారణాల వల్ల వివరించలేనంత ఎక్కువ రేటులో ఉత్పత్తి పెరిగిందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

  • విద్య, వైద్యం, నైపుణ్యంలోని మెరుగుదల వల్ల వైద్య సదుపాయాలు లభించడంతో మానవ ఉత్పాదకత పెరుగుతుంది.
  • ఆర్థికాభివృద్ధి సాధించడంలో భౌతిక మూలధన కల్పన ్బశ్త్వి(i‘్చః ‘్చ్పi్మ్చః ÷్న౯్ఝ్చ్మi్న-్శతో పాటుగా మానవ వనరుల అభివృద్ధి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది.

ప్రముఖుల భావనలు

విద్యపై పెట్టుబడి పెడితే మానవ మూలధన సామర్థ్యం ్బబ్య్ఝ్చీ- ‘్చ్పi్మ్చః ÷్న౯్ఝ్చ్మi్న-్శ పెరుగుతుందని థియోడర్‌ డబ్ల్యూ.షుల్జ్‌ వాదించారు. ఇది లేకుండా కేవలం నైపుణ్యం లేని,  చదువులేని శ్రామికుల సాయంతో ఉత్పత్తి కొనసాగిస్తే అది ఉపద్రవంగా మారి, ప్రస్తుత స్థాయి నుంచి తగ్గుతుంది. మానవుడి ఉత్పాదక శక్తిని పెంచే చర్యలు మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడతాయని షుల్జ్‌ వివరించాడు. అవి:

  • ఆరోగ్య సదుపాయాలు, సేవలు, ప్రజల ఆయుష్షు, శక్తి, సామర్థ్యం, బలం, సజీవత్వాన్ని ప్రభావితం చేసే వ్యయాలు.
  • సంస్థలు నిర్వహించే అప్రెంటిస్‌షిప్, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ.
  • ప్రాథమిక, సెకండరీ ఉన్నతస్థాయిలో నిర్వహించే విద్య.
  • సంస్థలు చేపట్టే వయోజన విద్యా పథకాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు.
  • మారుతున్న ఉద్యోగావకాశాల సర్దుబాటు కోసం వ్యక్తులు, కుటుంబాల వలస.

అమర్త్యసేన్‌: మానవ వనరుల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను తెలపడానికి అమర్త్యసేన్‌ అర్హత, సామర్థ్య సిద్ధాంతాలను పేర్కొన్నారు.

  • విద్యను ఆస్తిగా పరిగణిస్తాం. విద్య ద్వారానే అర్హతావకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలకు మెరుగైన అవకాశాలు ఉంటాయి.
  • సామర్థ్యం ఒకరి సంక్షేమ స్థితి లేదా ఆరోగ్యస్థితిని తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఆరోగ్యవంతుల పాత్ర కీలకం.
  • సరైన పోషణ లేకపోవడం వల్ల చిన్నతనం నుంచే స్త్రీలు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఎక్కువ శ్రద్ధ చూపాలి.

మానవ వనరుల అభివృద్ధి - ప్రాధాన్యత

మానవ వనరుల అభివృద్ధికి విద్య అనేది ప్రామాణికం. ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి కీలకపాత్ర పోషిస్తుంది. భౌతిక మూలధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడమనేది దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

  • భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించాలంటే సాంకేతిక, వృత్తి, పరిపాలన సంబంధ నిపుణులు అవసరం. మానవ వనరుల కోసం పెట్టుబడులు లేకపోవడంతోనే దేశాలు అభివృద్ధిలో వెనకబాటుకు గురవుతున్నాయి. ఇలాంటి దేశాల్లో ప్రజలు నిరక్షరాస్యులుగా, నైపుణ్యం లేకుండా ఉండటమే ప్రధాన కారణం.
  • మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రక్రియ రెండూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి.
  • శ్రామికుల్లో సామర్థ్యం, నైపుణ్యం అధికంగా ఉంటే ఆ దేశ వృద్ధి బాగుంటుంది. నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారు, వ్యాధిగ్రస్తులు, మూఢవిశ్వాసం ఉన్నవారి వల్ల సహజంగానే ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దేశాభివృద్ధిలో వీరి తోడ్పాటు ఎక్కువగా ఉండదు. 
  • మానవ వనరులు నిరుపయోగంగా, శ్రామిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటే ఆ దేశానికి భారంగా మారుతుంది.
  • శ్రామికశక్తి సామర్థ్యం లేదా ఉత్పాదకత ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలపై ఆధారపడుతుంది. సాంకేతిక నైపుణ్యం స్థాయి ప్రభావం ప్రత్యక్షంగా అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది.
  • అభివృద్ధి చెందిన శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవుడు ఉత్పత్తి ప్రక్రియలో కొత్త మార్గాలను అవలంబించడంతో దేశ ఉత్పాదకత పెరుగుతుంది.
  • విద్యావంతులు, శిక్షణ పొందిన శ్రామికులు అధిక ఉత్పాదకత సామర్థ్యంతో ఆర్థికాభివృద్ధికి దోహదపడతారు. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో నీతి, సమర్థత, జ్ఞానం, పనితీరుకు సంబంధించి ఉన్నత ప్రమాణాలున్న ప్రజలు చాలా ముఖ్యం. 

సామాజిక రంగాల పాత్ర

ప్రజల సంక్షేమంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న రంగాలనే సామాజిక రంగాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రధానమైనవి 

విద్య
ఆరోగ్యం
కుటుంబ సంక్షేమం
తాగునీరు
పారిశుద్ధ్యం

  • పై అంశాలు మానవ మూలధన కల్పనకు తోడ్పడి మానవ వనరుల ఉత్పాదకతను పెంచి, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి వ్యవస్థ ప్రపంచ దేశాలను మానవాభివృద్ధి ఆధారంగా, శ్రేణీకరించి సంబంధిత దత్తాంశాలను ఏటా విడుదల చేస్తోంది.
  • జాతీయ స్థాయిలో నీతిఆయోగ్‌ మానవాభివృద్ధికి (గతంలో ప్రణాళికా సంఘం - ప్రస్తుతం ఇది రద్దైంది) సంబంధించిన గణాంకాలను విడుదల చేయడంతో పాటు, మానవాభివృద్ధి సూచికలను లెక్కించి, ప్రచురిస్తోంది.

విద్య, నైపుణ్యాల ప్రాముఖ్యత

ప్రజలు కోరుకునే ఉద్దేశాలను పొందేందుకు కావాల్సిన వాస్తవమైన స్వేచ్ఛను విస్తృతపరిచేదాన్నే ఆర్థికాభివృద్ధిగా భావించవచ్చని, ఆ స్వేచ్ఛను సాధించడానికి కావాల్సిన సమర్థతను పెంపొందించడమే ఆర్థికాభివృద్ధి ప్రక్రియ ముఖ్య లక్ష్యమని జాన్‌డ్రెజ్, అమర్త్యసేన్‌ పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యాల ప్రాధాన్యతలు కింది విధంగా ఉంటాయి:

సహజంగా ఉన్న ప్రాధాన్యం

విద్యావంతులుగా, ఆరోగ్యంగా ఉండటమే విలువైన సాధనంగా భావించవచ్చు. ఒక వ్యక్తి పొందే సార్థకమైన స్వేచ్ఛకు విద్య, ఆరోగ్యం ప్రత్యక్ష ప్రాధాన్యతను సమకూరుస్తాయి.

ఆర్థికపరమైన లబ్ధి

విద్య, ఆరోగ్యం సహాయంతో ఆర్థికంగా లాభం చేకూర్చే అవకాశాలను ప్రజలు పొందవచ్చు. ఉదాహరణకు భద్రతతో కూడిన జీతం లభించే ప్రభుత్వ ఉద్యోగాలు, లాభదాయకమైన వ్యాపారాలను పొందవచ్చు. ప్రజలు కోరుకునే ఆహ్లాదకరమైన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉద్యోగం, వ్యాపారం ద్వారా లభిస్తుంది.

సామాజిక అవసరాలు

విద్యావంతులు సామాజిక అవసరాలపై ప్రజా చర్చాగోష్టిలో పాల్గొని సూచనలిస్తారు. ఆరోగ్య స్పృహ పెంచుకుంటారు. సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల లభ్యతను మెరుగుపరిచి,  ఉన్న వనరులను మెరుగైన రీతిలో వినియోగించుకునేందుకు దోహదం చేస్తారు.

దుష్ప్రభావాల నివారణ

చిన్నారులు చదువుకోవడం వల్ల బాలకార్మిక సమస్యను నివారించవచ్చు. అలాగే దివ్యాంగులైన పిల్లలను యాచక వృత్తిలోకి దింపడం లాంటి స్వార్థపరమైన చర్యలను అరికట్టవచ్చు. ప్రాథమిక, ద్వితీయ స్థాయి విద్యను తప్పనిసరి చేసి సౌకర్యాలు పెంచడం ద్వారా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు. విద్యావంతులైన యువత ఒకరి అనుభవాన్ని మరొకరితో పంచుకోవడంతో మేధోసంపత్తి విస్తృతమవుతుంది.

సమాజాభివృద్ధి

విద్యావంతులు, ఆరోగ్యవంతులు చురుగ్గా ఉండటం వల్ల మొత్తం సమాజానికి మేలు చేకూరుతుంది. వీరు చేపట్టే స్వయం ఉపాధి లేదా వ్యాపారం సమాజంలోని ఇతర పౌరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అలాకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారితో సమాజ శ్రేయస్సు క్షీణించే అవకాశం ఉంది. సత్వర వ్యక్తిగత ప్రభావాలతో పాటు విద్య, ఆరోగ్యం ఎన్నో బహిర్గత, దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉండి ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధికి తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని