SSC GD Constable: ‘పది’ అర్హతతో 26,146 ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనం!

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Published : 25 Nov 2023 02:40 IST

SSC GD Constable Recruitment| దిల్లీ: నిరుద్యోగులకు బిగ్‌ న్యూస్‌.. దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతో ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తంగా 26,146 కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం జనవరి 1 రాత్రి 11గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా; తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్‌)తో పాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో (రైఫిల్‌మ్యాన్‌) విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.

ఏ విభాగంలో ఎన్నెన్ని పోస్టులు

  • మొత్తం 26,146 ఉద్యోగాలు కాగా.. వీటిలో 23,347 పురుషులు, 2,799 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. బీఎస్‌ఎఫ్‌లో 6,174; సీఐఎస్‌ఎఫ్‌లో 11,025; సీఆర్‌పీఎఫ్‌లో 3337; ఎస్‌ఎస్‌బీలో 635; ఐటీబీపీలో 3189; ఏఆర్‌లో 1490; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 296 చొప్పున మొత్తంగా 26,146 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • వేతనం: పే లెవెల్‌ -3 కింద రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
  • అభ్యర్థుల వయసు: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. 
  • దరఖాస్తు రుసుం: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారికి మినహాయింపు)
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ/పీఎస్‌టీ/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. 60 నిమిషాల పాటు ఉండే ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది.
  • పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌; జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌; ఇంగ్లిష్‌/హిందీ సబ్జెక్టుల్లో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. 
  • ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని