Canada Student Visa: డిపాజిట్‌ పెంచిన కెనడా.. భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపేనా?

స్టూడెంట్‌ డిపాజిట్‌ను కెనడా భారీగా పెంచేసింది. ఈనేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లాలనుకున్న భారతీయ విద్యార్థులపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది?

Updated : 12 Dec 2023 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉన్నత విద్య కోసం కెనడా (Study in Canada) వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్‌ (Student visa) కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్టూడెంట్‌ డిపాజిట్‌ను భారీగా పెంచింది. దీనిని ప్రస్తుతమున్న 10,000 కెనడియన్‌ డాలర్ల నుంచి ఒకేసారి 20,635 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. స్టూడెంట్‌ డిపాజిట్‌ రెట్టింపు కంటే ఎక్కువ కావడంతో దీని ప్రభావం ప్రతి విదేశీ విద్యార్థిపైనా పడనుంది. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..

మన విద్యార్థులే ఎక్కువ

కెనడాలో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే ఎక్కువ. అక్కడి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కో విద్యార్థిపై అదనంగా రూ.6 లక్షల మేర భారం పడే అవకాశం ఉంది. 2022లో కెనడాకు 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్లగా.. అందులో 2.26 లక్షల మంది భారతీయులే. అంతేకాకుండా అప్పటికే మరో 3.2 లక్షల మంది విద్యార్థులు స్టూడెంట్‌ వీసాపై అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి ఏడాదికి రూ.6 లక్షలు ఖర్చయితే.. తాజా నిర్ణయంతో అది రూ.12 లక్షలకు చేరుతుంది. దీనికి ఏడాది ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులు అదనం. ఇవి మరో రూ.13 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అంటే సగటున ఏడాదికి రూ.25 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశముంది.

దీనిని భరించే స్తోమత లేక చాలా మంది తమ విద్యార్థుల తల్లిదండ్రులు వెనకడుగు వేయొచ్చు. కచ్చితంగా కెనడాలోనే చదవాలని ముందే నిర్ణయించుకున్న వారు వేరే అవకాశాలను పరిశీలించవచ్చు. సాధారణంగా విదేశీ విద్యార్థులు ఓ వైపు చదువుకుంటూనే, తమ ఖర్చులను గట్టెక్కించుకునేందుకు అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, కెనడాలో ఆ అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. మరోవైపు అక్కడ ఇంటి అద్దెలు ప్రధాన సమస్యగా మారాయి. కెనడాలో గత ఏడేళ్లలో ఇంటి అద్దెలు 122శాతం పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఓ వైపు స్టూడెంట్‌ డిపాజిట్‌, అద్దెలు పెరిగిపోవడం.. అందుకు సరిపడా ఆదాయ వనరులు కనిపించకపోవడంతో చాలా మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. 

స్టూడెంట్‌ వీసా.. ఓ మార్గం

దేశంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు స్టూడెంట్‌ వీసాలను కెనడా ప్రభుత్వం ఓ మార్గంగా ఎంచుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కెనడా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023లో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులతోపాటు, 5 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏడాది ప్రారంభంలో కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థి వీసాలకు అక్కడి ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. అంతర్జాతీయ విద్యార్థులను కెనడా పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నప్పటికీ.. వాళ్లు నివసించేందుకు సరైన సదుపాయాలను కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది.

అక్కడి ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు నివాస సౌకర్యాలను కల్పించడం లేదు. చిన్నపాటి ఇరుకు గదుల్లో పరిచయం లేని వ్యక్తులతో ఉంటూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో అక్కడి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బడి ముబ్బడిగా విదేశీ విద్యార్థులకు సీట్లు కేటాయించడం ఇకపై కుదరదని ప్రైవేటు సంస్థలకు దిశానిర్దేశం చేసింది. ఆయా కళాశాలల్లో చేరే విద్యార్థులకు నివాస సదుపాయాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత విద్యా సంస్థలదేనని చెప్పింది. అయితే, ఇది ఎంత వరకు అమలవుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని