Supreme Court: దేశానికి అత్యున్నత అధినేత!

దేశానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తే, వాటిని అమలుచేసేది కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ. దేశ పరిపాలనలో అత్యున్నత అధికారాలను చెలాయించే ఈ విభాగానికి దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు సంపూర్ణ అధికారాలు ఉంటాయి.

Published : 29 May 2024 00:31 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు

దేశానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తే, వాటిని అమలుచేసేది కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ. దేశ పరిపాలనలో అత్యున్నత అధికారాలను చెలాయించే ఈ విభాగానికి దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఇందులో శిఖరాగ్ర స్థాయిలో నిలిచే రాష్ట్రపతి దేశానికి అధిపతిగా,  రక్షకుడిగా, దేశ ప్రజలకు సంరక్షకుడిగా వ్యవహరిస్తారు. ఈ వ్యవస్థ నిర్మాణం, పనితీరు గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దేశ అస్థిత్వం, ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే ప్రథమ పౌరుడి ఎన్నిక విధానం, సంబంధిత రాజ్యాంగ అంశాలను ఆర్టికల్స్‌ వారీగా తెలుసుకోవాలి.

రాష్ట్రపతి

(కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ)

భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి స్ఫూర్తి పొంది భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం దేశంలో రెండురకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు.

1) రాష్ట్రపతి: దేశాధినేతగా, రాజ్యాంగరీత్యా దేశానికి అధిపతిగా వ్యవహరిస్తారు.నామమాత్రపు(De Jurry) కార్యనిర్వాహక  అధికారాలను కలిగి ఉంటారు.

2) ప్రధానమంత్రి: ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తారు. వాస్తవ(De Facto)కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్స్‌ 52 నుంచి 78 మధ్య కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరించారు. దీనిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి, అటార్నీ జనరల్‌ అంతర్భాగంగా ఉంటారు. కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ‘రాష్ట్రపతి’.

రాష్ట్రపతి: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 52 నుంచి 62 మధ్య రాష్ట్రపతి పదవికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు, షరతులు, ఎన్నిక విధానం, ప్రమాణ స్వీకారం, వసతి, జీతభత్యాలు, పదవీకాలం, తొలగింపు విధానం మొదలైన వాటిని వివరించారు.

ఆర్టికల్‌ 52: భారతదేశానికి అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఇతను దేశానికి ప్రథమ పౌరుడు. రాజ్యాంగ అధిపతిగా, సర్వసైన్యాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 53: భారతదేశ కార్యనిర్వహణాధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదుగానే నిర్వహించాలి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించే పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాష్ట్రపతి దేశ పరిపాలనను స్వయంగా లేదా ఇతర అధికారుల సహకారంతో నిర్వహిస్తారు.

ఆర్టికల్‌ 54: రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది. ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తుంది. రాష్ట్రపతిని ‘ఎలక్టోరల్‌ కాలేజీ’ సభ్యులు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్‌ కాలేజీలో పలువురు సభ్యులుగా ఉంటారు. ఎ) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు బి) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు సి) రాష్ట్రాల విధానసభకు ఎన్నికైన సభ్యులు (ఎమ్మెల్యేలు)

1992లో రూపొందించిన 70వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలనూ ‘ఎలక్టోరల్‌ కాలేజీ’లో చేర్చారు. ఇది 1995, జూన్, 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు.

‘ఎలక్టోరల్‌ కాలేజీ’లో సభ్యులు కానివారు: ఎ) రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్‌ చేసిన 12 మంది విశిష్ట వ్యక్తులు బి) లోక్‌సభకు రాష్ట్రపతి నామినేట్‌ చేసిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు సి) రాష్ట్రాల విధాన పరిషత్తు సభ్యులు (ఎమ్మెల్సీలు) డి) రాష్ట్రాల విధానసభలకు గవర్నర్‌లు నామినేట్‌ చేసిన ఆంగ్లో ఇండియన్లు

నోట్‌: 104వ రాజ్యాంగ సవరణ చట్టం - 2020 మేరకు ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానాన్ని, ఆర్టికల్‌ 333 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు. అందువల్ల ప్రస్తుతం దేశంలో ఆంగ్లో ఇండియన్లను చట్టసభలకు నామినేట్‌ చేసే విధానం అమల్లో లేదు.

ఆర్టికల్‌ 55: రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని వివరిస్తుంది. దీనిని ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీన్నే ‘దామాషా ఓటింగ్‌ పద్ధతి ప్రకారం రహస్య పేపర్‌ బ్యాలట్‌ ఎన్నిక’ అంటారు. ‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952’ ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రపతి ఎన్నికకు న్యూదిల్లీలోని పార్లమెంట్‌ హౌస్, రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెక్రటేరియట్‌లు వేదికగా ఉంటాయి. ఈ ఎన్నికలో ఆకుపచ్చ బ్యాలట్‌ పేపర్‌ను పార్లమెంటు సభ్యులకు, గులాబీ రంగు బ్యాలట్‌ పేపర్‌ను రాష్ట్రాల విధానసభల సభ్యులకు (ఎమ్మెల్యేలు) ఇస్తారు.

  • రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే ‘ఎలక్టోరల్‌ కాలేజీ’లో ఉండే ఓటర్లు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. దీనినే ‘ప్రిఫరెన్షియల్‌ ఓటింగ్‌’ అంటారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు కచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు ‘విప్‌’ జారీ చేయకూడదు.
  • రాష్ట్ర శాసనసభ రద్దు కావడం, పార్లమెంటులో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణంతో రాష్ట్రపతి ఎన్నికలను వాయిదా వేయకూడదు. 1974లో గుజరాత్‌ శాసనసభ రద్దయినప్పుడు రాష్ట్రపతి పదవికి ఎన్నికను నిర్వహించవచ్చా? లేదా? అనే అంశంపై అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహా కోరగా, ఎన్నికను యథావిధిగా నిర్వహించవచ్చని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. 1967లో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగే సమయానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356(1)(C) ప్రకారం రాజస్థాన్‌ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రొటేషన్‌ పద్ధతిలో వ్యవహరిస్తారు. 2017లో జరిగిన 14వ రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా నాటి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా వ్యవహరించారు. 2022లో జరిగిన 15వ రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రమోద్‌ చంద్ర మోదీ పనిచేశారు.
  • 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువను లెక్కిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు వేర్వేరు ఓటు విలువలు ఉంటాయి.

  • 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కి తగ్గింది. దీనికి కారణం జమ్మూ-కశ్మీర్‌ శాసనసభ మనుగడలో లేకపోవడమే. అన్ని రాష్ట్రాల ఎంపీల ఓటు విలువ ఒకే రకంగా ఉంటుంది. అలాగే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎంపీల ఓటు విలువకు దాదాపు సమానమవుతుంది. ఇది మనదేశ సమాఖ్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
  • రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 50% మించి ఓట్లను పొందిన అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 50% మించి ఓట్లను అంటే నిర్ణీత కోటా ఓట్లను ఏ అభ్యర్థి పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్య ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ చివరి ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు కొనసాగుతుంది. 1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన వి.వి.గిరికి 44.3%, నీలం సంజీవరెడ్డికి 42.2% ఓట్లు వచ్చాయి. దీంతో నిర్ణీత కోటా ఓట్ల కోసం పోటీలో చివరి స్థానంలో ఉన్న సి.డి.దేశ్‌ముఖ్‌ రెండో ప్రాధాన్య ఓట్లను బదిలీ చేయగా వి.వి.గిరి 51.5% ఓట్లు పొంది రాష్ట్రపతిగా గెలుపొందారు. నీలం సంజీవరెడ్డి 48.5% ఓట్లు మాత్రమే పొందడంతో ఓటమి పాలయ్యారు.

రాష్ట్రపతి పదవి - ఎన్నిక వివాదాలు: 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రారంభ విచారణ అధికార పరిధిలోకి వస్తుంది. ఎన్నిక ముగిసిన 30 రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ ఎలక్టోరల్‌ కాలేజీలోని కనీసం 20 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేసి సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నిక వివాదాలను సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. తన ఎన్నిక వివాదంపై రాష్ట్రపతి వి.వి.గిరి. స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

ఆర్టికల్‌ 56: రాష్ట్రపతి పదవీకాలం గురించి వివరిస్తుంది. సాధారణంగా పదవీకాలం అయిదేళ్లు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడుతుంది. అవి..

  • రాష్ట్రపతి స్వయంగా తన పదవికి రాజీనామా చేయడం.
  • అకాలమరణం. 
  • దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడం.
  • పార్లమెంటు మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం.

రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టంలో చేసిన మార్పుల ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి.

ఇంటరెగ్నం: రాష్ట్రపతి పదవీకాలం ముగిసినప్పటికీ, నూతన రాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రారంభమై, నిర్ణీత కాలవ్యవవధిలో ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్పటికే పదవీకాలం పూర్తయిన రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ‘ఇంటరెగ్నం’ అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని