Exams: పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

పోటీ పరీక్షలైనా, వార్షిక పరీక్షలైనా.. వాటిలో రాణించాలంటే తగిన ప్రణాళిక అవసరం. ముందు నుంచే ఒక షెడ్యూల్‌ ప్రకారం చదివితే ర్యాంకులు సాధించడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. కాకపోతే ప్రిపరేషన్‌లో కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated : 17 Dec 2023 16:26 IST

Exams Preparation| ఇంటర్నెట్‌ డెస్క్‌: రాబోయేదంతా పరీక్షల సీజనే. ఇప్పటికే సీబీఎస్‌ఈ(CBSE), ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డులు పరీక్షల షెడ్యూల్‌(Exams Schedule)ను ప్రకటించాయి. ఐఐటీ జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలు మొదలుకొని వార్షిక పరీక్షల దాకా.. విద్యార్థి లోకానికి మున్ముందు పెద్ద ‘పరీక్షే’. ఇప్పటినుంచే సరైన ప్రణాళిక వేసుకుంటే తప్ప మంచి స్కోరుతో రాణించడం కష్టం. అందుకే తగిన ప్రణాళికను రూపొందించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌ (Preparation) సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే విజయం సులభమేనని చెబుతున్నారు. ఇంతకీ ప్రిపరేషన్‌ టైంలో చేయకూడని పొరపాట్లేంటో కొన్ని చూద్దామా..!

వాయిదా పద్ధతి..

ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. కానీ, రేపట్నుంచి మొదలుపెడదాంలే.. ఏమవుతుంది? అనే నిర్లక్ష్య ధోరణితో చాలా మంది వాయిదా పద్దతులు అనుసరిస్తుంటారు. ఇది ఎక్కువమంది సాధారణంగా చేసే పొరపాటు. అందువల్ల, మీరు ఇప్పటినుంచే తగిన టైం టేబుల్‌ సిద్ధం చేసుకొండి. వాస్తవిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రిపేర్‌ కండి. మీ స్టడీ ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

స్టడీ మెటీరియల్స్‌పైనే ఆధారపడటం

చాలా మంది విద్యార్థులు పరీక్షలకు కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్‌ మొదలు పెడుతుంటారు. అందుకోసం పూర్తిగా స్టడీ మెటీరియల్స్‌పైనే ఆధారపడి చదువుతుంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. మనం చదివే పుస్తకమేదైనా మనలో ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచడమే కాకుండా జ్ఞానాన్ని పెంచుతుంది. ఆయా విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తాయి. పాఠ్యపుస్తకాలను చదవడంతో పాటు ఆన్‌లైన్‌లో వున్న వనరులను అన్వేషించి అధ్యయనం చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

కొన్ని చాప్టర్లపై నిర్లక్ష్యం! 

విద్యార్థులు తమ ప్రిపరేషన్‌లో కొన్ని సబ్జెక్టులు/చాప్టర్లను వదిలేసి కొన్నింటినే చదువుతుంటారు. అలాంటి నిర్లక్ష్య ధోరణితో చేటు తప్పదు. ప్రతి సబ్జెక్టూ పరీక్షలో అత్యంత కీలకమే. ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా అది మీ పూర్తి స్కోరుపై ప్రభావం చూపుతుందని మాత్రం మరిచిపోకండి.

బట్టీ పట్టి చదవడం..

ఆయా అంశాలపై అవగాహన చేసుకోకుండా కంఠస్థం చేయడం సాధారణంగా చేసే తప్పిదం.  సమాచారాన్ని బట్టీ పట్టడం స్వల్పకాలంలో మీకు సహాయపడొచ్చు.. కానీ, ఏ విషయంపైనా లోతైన అవగాహనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. అంతర్లీన భావనలను అర్థం చేసుకోవడంపై దృష్టిసారించండి. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 

రివిజన్‌, ప్రాక్టీస్‌ చేయకపోవడం

ప్రిపరేషన్‌లో రివిజన్‌, ప్రాక్టీస్‌ అనేవి ఎంతో కీలకమైన ప్రక్రియలు. గతంలో చదివిన పాఠ్యాంశాలను తిరిగి మననం చేసుకోవడం ద్వారా అవి గుర్తుండిపోతాయి. ఆ సబ్జెక్టులపై మనకు తిరుగులేని ఆధిపత్యం ఏర్పడుతుంది. అందువల్ల, చదివిన సబ్జెక్టుల్ని పునశ్చరణ చేసుకోవడం, ప్రాక్టీసు చేయడం మరిచిపోవద్దు. 

ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం.. 

ప్రిపరేషన్‌ సమయంలో కొందరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. శారీరక, మానసిక దృఢత్వమే పరీక్షలో మీ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన వ్యాయామం చేయకపోవడం వంటివి మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని