TSPSC-APPSC: పరస్పర లబ్ధియే లక్ష్యంగా.. సంయుక్త సైనిక విన్యాసాలు

భారతదేశం రక్షణ రంగ బలోపేతానికి, భద్రత  విషయంలో పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటోంది.

Published : 08 Jun 2024 01:57 IST

టీజీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

రక్షణ రంగం - డైనమిక్స్‌ 

భారతదేశం రక్షణ రంగ బలోపేతానికి, భద్రత  విషయంలో పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటోంది. రక్షణ రంగంలో కావాల్సిన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ కూటములతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది.  భారతదేశం వివిధ దేశాలతో నిర్వహించే సంయుక్త మిలటరీ విన్యాసాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 

సైబర్‌ సురక్ష 2024: ఇది మే 20 - 24 మధ్య జరిగిన సైబర్‌ డిఫెన్స్‌ ఎక్సర్‌సైజ్‌. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించింది.

  • పెరుగుతున్న సాంకేతికతలతో సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఏర్పడే ప్రమాదాలను నివారించడానికి వివిధ దేశాలకు చెందిన జాతీయ, మిలటరీ సంస్థలు దీనిలో పాల్గొన్నాయి. 
  • దిల్లీలో జరిగిన ఈ సదస్సులో భారతదేశానికి చెందిన చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. భారతదేశంలో సైబర్‌ భద్రత, సైబర్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ సామర్థ్యం పెంచడానికి అమలు చేయాల్సిన విధివిధానాల గురించి చర్చించారు.

ఎక్సర్‌సైజ్‌ శక్తి 2024: ఈ విన్యాసం మే 13 నుంచి మే 26వ తేదీ వరకు జరిగింది. 

  • ఇది భారత్, ఫ్రాన్స్‌ మధ్య ఉమ్రాయ్, మేఘాలయలో జరిగిన ఏడో విడత జాయింట్‌ మిలటరీ ఎక్సర్‌సైజ్‌. 
  • ఈ విన్యాసంలో ఫ్రెంచ్‌ రాయబారి థియర్రి మాథౌ (Thierry Mathou) మేజర్‌ జనరల్‌ ప్రసన్న సుధాకర్‌ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో చేయాల్సిన విన్యాసాలు, మేధో సంపత్తి భాగస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల అమలు, ద్వైపాక్షిక రక్షణ రంగ భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.

ఎక్సర్‌సైజ్‌ డస్ల్టిక్‌:  2024 ఏప్రిల్‌ 15 నుంచి 28 వరకు చేపట్టిన ఈ విన్యాసం ఉజ్బెకిస్థాన్లోని టేర్మజ్‌లో జరిగింది. ఇది భారత్‌ - ఉజ్బెకిస్థాన్‌ దేశాల మధ్య అయిదో విడత జాయింట్‌ మిలటరీ ఎక్సర్‌సైజ్‌. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించే ఈ వార్షిక విన్యాసాన్ని ఒక సంవత్సరం భారత్‌లో, మరో సంవత్సరం ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహిస్తారు.

ఎక్సర్‌సైజ్‌ లామిటై: 2024 మార్చి 18 నుంచి 27 వరకు ఈ విన్యాసాన్ని సీషెల్స్‌లో చేపట్టారు. ఈ పదో విడత విన్యాసంలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన గోర్ఖా రైఫిల్స్, సీషెల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సులు పాల్గొన్నాయి. 

పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన యునైటెడ్‌ పీస్‌ కీపింగ్‌ ఆపరేషన్స్‌ కోసం కావాల్సిన నైపుణ్యాలు, అనుభవాలు, మెరుగైన విన్యాసాల్లో పరస్పరం సహకరించుకోవడమే దీని ఉద్దేశం.

ఎక్సర్‌సైజ్‌ సైక్లోన్‌

  • భారత్‌ - ఈజిప్ట్‌ దేశాల మధ్య రెండో విడత సైక్లోన్‌ విన్యాసాలు ఈజిప్ట్‌లోని అన్షాస్‌ ప్రాంతంలో 2024 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. 
  • ఎడారి, మధ్యస్థ ఎడారి ప్రాంతాల్లో చేపట్టాల్సిన సైనిక ఆపరేషన్ల నైపుణ్యత, ఇరుదేశాలకు అవసరమైన సహాయ సహకారాల గురించి ఇందులో భాగంగా చర్చించారు. 
  • సైనికుల్లో నైపుణ్యత పెంపు కోసం కావాల్సిన రిహార్సల్స్‌ను ఈ విన్యాసం ద్వారా నిర్వహించారు. 
  • ఇరుదేశాల మధ్య మైత్రి, యుద్ధ ప్రాంతాల్లో ఉన్న బాధితులకు ప్రథమ చికిత్స, బందీలను కాపాడటానికి చేయాల్సిన ఆపరేషన్లు మొదలైన వాటిపై శిక్షణ కూడా ఈ విన్యాసాల్లో భాగం.

డెసర్ట్‌ సైక్లోన్‌

  • 2024 జనవరి 2 నుంచి 15 వరకు భారత్‌ - యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య ఈ విన్యాసం రాజస్థాన్‌లోని మహాజన్‌ ప్రాంతంలో నిర్వహించారు. 
  • పరస్పర భాగస్వామ్యం, ఎడారి ప్రాంతాల్లో సైనిక చర్యలు, సంయుక్త నిఘా కేంద్రాల ఏర్పాటు, సైనిక చొరబాటు నియంత్రణ కార్యకలాపాలు మొదలైనవి ఈ విన్యాసంలో భాగం.

సదా తన్సీక్‌ 

భారత్‌ - సౌదీ అరేబియా దేశాల మధ్య జరిగే సంయుక్త మిలటరీ ఎక్సర్‌సైజ్‌ సదా తన్సీక్‌. ఈ ఎక్సర్‌సైజ్‌ను 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించారు. 
ఇరుదేశాల మధ్య సైనిక భాగస్వామ్య శిక్షణను బలోపేతం చేయడం, రిఫ్లెక్స్‌ షూటింగ్, మొబైల్‌ వెహికల్‌ చెక్‌ పోస్ట్, శత్రు సమూహాల వెతుకులాట, చాకచక్యంగా వారిని చుట్టుముట్టడం తదితర అంశాలపై ద్వైపాక్షికంగా సహాయ సహకారాలు అందించుకుంటూ మైత్రిని పెంపొందించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఎక్సర్‌సైజ్‌ కంజర్‌ 

భారత్‌ - కిర్గిస్థాన్‌ దేశాలు ఎక్సర్‌సైజ్‌ కంజర్‌ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. 2024 జనవరి 22 - ఫిబ్రవరి 3 వరకు ఈ విన్యాసాలను చేపట్టారు. ఇది రెండు దేశాల వార్షిక కార్యక్రమం. ఒక సంవత్సరం భారత్‌లో, మరో ఏడాది కిర్గిస్థాన్‌లో ఈ విన్యాసాలు జరుపుతారు. 2024లో హిమాచల్‌ప్రదేశ్‌లోని బక్లో ప్రాంతంలో స్పెషల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ఈ విన్యాసాలను నిర్వహించారు. ప్రత్యేక దళాల శిక్షణ, కొండ ప్రాంతాల్లో సైనిక చర్యలకు కావాల్సిన నైపుణ్యత, అధునాతన సాంకేతికత, నూతనతరం సాంకేతికతల్లో రక్షణ రంగ నైపుణ్యత తదితర ద్వైపాక్షిక సహకారాలను ఈ విన్యాసం ద్వారా బలోపేతం చేస్తారు.


టైగర్‌ ట్రయంఫ్‌ 

  • భారత్, యూఎస్‌ల మధ్య రక్షణ రంగ బలోపేతం కోసం టైగర్‌ ట్రయంఫ్‌ విన్యాసాన్ని చేపడతారు. 2024లో మార్చి 18 నుంచి 31 వరకు భారత్‌లో ఈ విన్యాసాలను నిర్వహించారు.
  • ఇందులో భారత, అమెరికా త్రివిధ దళాలు పాల్గొంటాయి.
  • రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవటానికి, విపత్తు సమయాల్లో మానవతా చర్యలను పెంపొందించుకోవటానికి (హ్యుమానిటేరియన్‌ ఎయిడ్‌ ఇన్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌) ఈ విన్యాసాలను చేపడతారు. వీటిని హార్బర్, సముద్ర విన్యాసాలు అనే రెండు దశలుగా నిర్వహించారు.

సముద్ర లక్ష్మణ

  • భారత్‌ - మలేసియా దేశాల మధ్య సముద్ర లక్ష్మణ పేరిట విశాఖపట్నం తీరంలో ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు చేపట్టారు. వీటిని 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు నిర్వహించారు.
  • భారత నావికాదళ నౌక అయిన కిల్టన్, రాయల్‌ మలేసియన్‌ నౌక రీదీ లెకీర్‌ ఇందులో పాల్గొన్నాయి. 
  • ఇరుదేశాల నావికాదళ వ్యవస్థలను బలోపేతం చేయటానికి పరస్పరం చేపట్టాల్సిన చర్యలు, వాటి కార్యాచరణను ఈ విన్యాసాల ద్వారా రూపొందిస్తారు.

ధర్మ గార్డియన్‌

  • ఇండియా - జపాన్‌ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ధర్మ గార్డియన్‌ పేరుతో ఇరు దేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.
  • ఈ ద్వైపాక్షిక విన్యాసాలను రాజస్థాన్‌లోని మహాజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు చేపట్టారు.
  • ధర్మ గార్డియన్‌ అనేది వార్షిక విన్యాస ప్రక్రియ. ఇరుదేశ సైన్యాలకు కావాల్సిన ఉత్తమ మెలకువలు, సైనిక వ్యూహాలు, సాంకేతిక, వ్యూహాత్మక విధానాల్లో అత్యుత్తమ అభ్యాసాలు, తదితరాలు ఈ విన్యాసాల్లో భాగంగా ఉంటాయి.

భారత్‌ చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్లు

భారత త్రివిధ దళాలు రక్షణ పరంగా వివిధ దేశాలకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు దేశాల్లో ఏర్పడిన సంక్షోభ సమయాల్లో అక్కడ చిక్కుకున్న భారత పౌరులను యుద్ధ ప్రాతిపదికన మిలటరీ ఆపరేషన్స్‌ రూపంలో భారత్‌కు తీసుకువచ్చాయి. 

ఆపరేషన్‌ విజయ్, 1961: పోర్చుగీస్‌ నియంత్రణలో ఉన్న గోవాను 1961 డిసెంబరులో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య. ఫలితంగా గోవా, డామన్‌ డయ్యూ భారత్‌లో భాగమయ్యాయి.

ఆపరేషన్‌ కాక్టస్‌ లిల్లీ, 1971: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశం చేసేందుకు చేపట్టిన చర్య. భారత సహకారంతో తూర్పు పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేశారు.

ఆపరేషన్‌ ట్రైడెంట్, 1971: 1971 డిసెంబరు 4, 5వ తేదీల్లో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌లో భాగంగా భారత నావికాదళ సహాయంతో తూర్పు పాకిస్తాన్‌ను ప్రస్తుత బంగ్లాదేశ్‌గా మార్చడానికి చేపట్టిన నావికాదళ చర్య. ఈ ఆపరేషన్‌లో సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో ఏటా డిసెంబరు 4న నావికాదళ దినోత్సవం నిర్వహిస్తారు.

ఆపరేషన్‌ మేఘ్‌దూత్, 1984: భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దులో కీలకమైన సియాచిన్‌ను దక్కించుకునేందుకు ఇండియన్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌. 1984 ఏప్రిల్‌ 13న దీన్ని చేపట్టారు. 

ఆపరేషన్‌ బ్లూ స్టార్, 1984: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన సైనిక చర్య. ఆలయంలో దాక్కున్న వేర్పాటువాదులను పట్టుకునేందుకు చేపట్టిన చర్య. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ను చేపట్టారు. 

ఆపరేషన్‌ రాజీవ్, 1987: పాకిస్థాన్‌ నియంత్రణలో ఉన్న క్వాయిడ్‌ ప్రాంతాన్ని భారత్‌ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌. విజయానికి గుర్తుగా ఆపరేషన్‌కు సారథ్యం వహించిన కెప్టెన్‌ బాణా సింగ్‌ పేరును ఈ క్వాయిడ్‌ ప్రాంతానికి పెట్టారు.

ఆపరేషన్‌ పవన్, 1987: శ్రీలంక ప్రాంతంలో ఎల్‌టీటీఈ ఉగ్రవాద 
సంక్షోభ నివారణ కోసం ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ చేపట్టిన చర్య. 

ఆపరేషన్‌ కాక్టస్, 1988: 1988 నవంబరులో మాల్దీవుల ప్రెసిడెంట్‌ ఎంఏ గయూన్‌ను శ్రీలంక తీవ్రవాదుల నుంచి రక్షించడానికి భారత త్రివిధ దళాలు విజయవంతంగా చేపట్టిన సైనిక చర్య.

ఆపరేషన్‌ విజయ్, 1999: భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ సమయంలో పాక్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుని భారత్‌ విజయపతాకాన్ని ఎగరవేసిన సైనిక చర్య.

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్, 1999: కార్గిల్‌ సంక్షోభ సమయంలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చేపట్టిన చర్య.

ఆపరేషన్‌ తల్వార్, 1999: కార్గిల్‌ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో చేపట్టిన ఆపరేషన్‌. ఈ చర్యతో భారత నావికాదళ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది.

ఆపరేషన్‌ బ్లాక్‌ టోర్నడో, 2008: ముంబయిలో జరిగిన 26/11 దాడులకు వ్యతిరేకంగా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ ్బవిళీబ్శి కమాండోలు చేపట్టిన సైనిక చర్య. ఇందులో తొమ్మిది మంది ఉగ్రవాదులను చంపి, బందీలుగా ఉన్న వారిని కాపాడారు.

ఆపరేషన్‌ సెర్చ్‌ లైట్, 2014: మలేసియన్‌ బోయింగ్‌ను వెలికితీయడానికి భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్‌.

ఆపరేషన్‌ మదద్, 2018: కేరళలో వరద బాధితుల సహాయార్థం ఇండియన్‌ నేవీ చేపట్టిన ఆపరేషన్‌.

ఆపరేషన్‌ సముద్ర సేతు, 2020: కోవిడ్‌ 19 సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్‌. ఇందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి 3992 భారత పౌరులను సముద్ర మార్గం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చారు.

ఆపరేషన్‌ గంగ, 2022: రష్యా - ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్‌

ఆపరేషన్‌ దోస్త్, 2023: తుర్కియే (టర్కీ), సిరియా భూకంప బాధితులను రక్షించడానికి ఏర్పాటు చేసిన ఆపరేషన్‌.

ఆపరేషన్‌ కరుణ, 2023: మయన్మార్‌లో సిత్రాంగ్‌ తుఫాన్‌ బాధితులకు పునరావాస సహాయం కల్పించటానికి హ్యుమానిటేరియన్‌ అసిస్టెడ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ మిషన్‌లో భాగంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని