మిగ్‌జాం ఎఫెక్ట్‌.. నెల్లూరు, చెన్నైల్లో యూజీసీ నెట్‌ పరీక్షపై NTA కీలక అప్‌డేట్‌

మిగ్‌జాం తుపాను కారణంగా డిసెంబర్‌ 6న పరీక్ష రాయలేకపోయిన నెల్లూరు, చెన్నై అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.

Updated : 13 Dec 2023 17:26 IST

దిల్లీ: ఇటీవల మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో యూజీసీ  నెట్‌ (UGC NET 2023) పరీక్షకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు ఎన్‌టీఏ(NTA) గుడ్‌న్యూస్‌ చెప్పింది.  డిసెంబర్‌ 6న భారీ వర్షం కారణంగా నెల్లూరు, తమిళనాడులోని చెన్నైల్లో పరీక్ష రాయలేకపోయిన వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావం నేపథ్యంలో డిసెంబర్‌ 6న జరిగిన పరీక్షకు తమిళనాడులోని చెన్నై, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేకపోయారు.

దీంతో ఆరోజు జరిగిన  ఇంగ్లీష్‌, హిస్టరీ సహా పలు లాంగ్వేజెస్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని అభ్యర్థించారు. దీంతో వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ.. డిసెంబర్‌ 6న తుపాను కారణంగా పరీక్షలు రాయలేకపోయిన చెన్నై, నెల్లూరుకు చెందిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది. వారందరికీ డిసెంబర్‌ 14న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.  ఇటీవల మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని