Career Guidance: సాకులు వెతకటం అలవాటైతే చేటే

గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే... ఒక్కోసారి సరైన మార్కులు రాకపోవచ్చు. ఫెయిల్‌ కావొచ్చు. ఇలాంటివాటికి అసలు కారణాలను కనుక్కుని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితేనే మేటి విద్యార్థిగా నిలబడతారు.

Published : 11 Jun 2024 00:16 IST

గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే... ఒక్కోసారి సరైన మార్కులు రాకపోవచ్చు. ఫెయిల్‌ కావొచ్చు. ఇలాంటివాటికి అసలు కారణాలను కనుక్కుని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితేనే మేటి విద్యార్థిగా నిలబడతారు. కానీ లేనిపోని సాకులు చెబుతూ తప్పించుకోవాలని చూస్తే అక్కడే ఆగిపోతారు.

విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది ఇష్టపడి చదివి చక్కని ఫలితాలను సాధిస్తారు. మరికొందరు మాత్రం తక్కువ మార్కులు వచ్చినా.. విఫలమైనా అర్థంపర్థం లేని కారణాలు వెతకడం మొదలుపెడతారు. ఇలా సాకులు చెప్పాల్సిన పరిస్థితి ఏయే సందర్భాల్లో ఎదురవుతుందో చూద్దాం.

  • విద్యా సంవత్సరం మొదట్లో.. ‘ఏడాది సమయం ఉందిగా తర్వాత చూద్దాంలే..’ అన్నట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత అన్ని సబ్జెక్టులూ చదవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడతారు. పరీక్షల్లో ఊహించినదాని కంటే తక్కువ మార్కులు వస్తాయి. దాంతో సమయం సరిపోలేదనేది సాకుగా చెబుతుంటారు.
  • తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్పేవాళ్లు కొందరుంటారు. తరచూ ఆరోగ్యం బాగుండటం లేదంటారు. లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల చదవడానికి వీలుండటం లేదంటారు. ఇంటి నుంచి కాలేజీ దూరం కావడం వల్ల ప్రయాణానికే సమయం వృథా అవుతుందంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పుస్తకం తెరిస్తే చాలు.. ఇంటి సమస్యలే గుర్తొస్తున్నాయని బాధపడేవాళ్లూ ఉంటారు.
  • చదవడానికి ప్రత్యేకంగా గది లేకపోవడం, గాలీ, వెలుతురూ సరిగాలేని ఇరుకు గదుల్లో కూర్చుని చదవలేకపోతున్నామంటారు మరికొందరు. ఇంటికి వచ్చిపోయే బంధువులు, వేడుకల వల్ల చదువు మీద ధ్యాస నిలపలేకపోతున్నామంటారు కొందరు. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఏకాగ్రత కుదరడంలేదని మరికొందరు చెబుతుంటారు.
  • ‘కాలేజీలో ఎప్పుడూ లెక్చరర్ల కొరతే. కొన్ని సబ్జెక్టులకు అయితే అసలు లెక్చరర్లే లేరు. ఫీజు తక్కువని ఇష్టం లేని కాలేజీలో చేర్చారు. ఎలాంటి వసతులూ లేని కాలేజీలో చదివితే మార్కులు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయ’ని తల్లిదండ్రుల మీదకు నెపాన్ని నెట్టేసేవాళ్లూ ఉంటారు. అయినా ఇలా చెప్పుకుంటూ పోతే సాకులకు కొదవేదీ ఉండదు.
  • నిజానికి ఏరోజు చెప్పిన పాఠాలను ఆరోజే చదువుకుంటే, సకాలంలో పునశ్చరణ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ నిర్లక్ష్యంతోనో, అలసత్వంతోనో వాయిదాలు వేసుకుంటూ వెళతారు. చివర్లో పాఠ్యాంశాలన్నింటికీ సమయం సరిపోక ఒత్తిడికి గురవుతారు. అలా చదివినవి పరీక్షల్లో రాసేటప్పుడు సరిగా గుర్తుకురావు కూడా.
  • చివరిగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రముఖ కాలేజీలో సీటు, పెద్ద మొత్తంలో ఫీజు కట్టడానికి వెనకాడని తల్లిదండ్రులు, వెన్నుతట్టి ప్రోత్సహించే అధ్యాపకులు, ప్రశాంతమైన కుటుంబ వాతావరణం... ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చదువుతారు. అందులో గొప్పతనం ఏముంటుంది. కనీసావసరాలు కూడా తీరని పేదరికంలో మగ్గుతూ.. అంగవైకల్యం ఉన్నా.. పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించినవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడు ఏ సాకులూ కనపడవు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని