ఉరకల వయసులో

రకరకాల ఆరోగ్య సమస్యలతో ఏటా 26 లక్షల మంది యువతీ యువకులు మరణిస్తున్నారు... నిజానికి ఇవన్నీ నివారించదగ్గ మరణాలే!..

Published : 17 Jan 2016 12:55 IST

ఉర‌క‌ల వ‌యుసులో ఉఫ్‌ఫ్‌!

 * రకరకాల ఆరోగ్య సమస్యలతో ఏటా 26 లక్షల మంది యువతీ యువకులు మరణిస్తున్నారు... నిజానికి ఇవన్నీ నివారించదగ్గ మరణాలే!

* ఏటా కొత్తగా హెచ్‌ఐవీ బారినపడుతున్న వారిలో దాదాపు 40% మంది యుక్తవయస్కులే!

* యువజనాభాలో ఏటా కనీసం 20% మంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో ఆందోళన, కుంగుబాటే ఎక్కువ.

* రోజుకు 700 మంది యువతీయువకులు కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు.

* కేవలం యువజనాభాలోనే పొగాకు బానిసలు 15 కోట్లు!

ఉరకలెత్తే ఉత్సాహం..  వూరించే ఉల్లాసం.. 

ఉడికించే ఉద్వేగం..  వూపేసే ఉద్రేకం..  యువత ప్రత్యేకం!

యువత అంటే అదో అమోఘ శక్తి. భూమ్యాకాశాలను దద్దరిల్లగొట్ట గల ఉద్ధృత సామాజిక, సామూహిక శ్రేణి. 

ఒంట్లో హార్మోన్ల ఉరవడి రేగుతుంటే.. ఆ ధాటికి ఇంటాబయటా సంచలనాలూ, సంభ్రమాలూ సృష్టించగల సత్తా.. యువత సొత్తు! అందుకే యుక్త వయసన్నా.. యువ తరమన్నా మన మనసు ఉప్పొంగిపోతుంది. అయితే నాణేనికి ఇదో పార్శ్వం మాత్రమే. ఇంత శక్తిమంతమైన యువతరం కూడా చిన్నచిన్న భ్రమల్లో, బానిసత్వాల్లో కూరుకుపోయి చేజేతులారా సమస్యల వలయాల్లో చిక్కుకుంటోంది. సామాజికంగా విలయాలు సృష్టిస్తోంది. యువత సజావుగా లేని ప్రపంచానికి.. భవిత ఏముంటుంది?అందుకే యువతపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ వారం సుఖీభవ!

* 15-24 సంవత్సరాల మధ్య వయసు వారిని ‘యువత’గా పరిగణిస్తోంది ఐక్యరాజ్యసమితి. ఈ విషయంలో దేశాల వారీగా కొద్దిపాటి తేడాలుంటున్నాయి. మనదేశంలో 15-35 ఏళ్ల వారిని యువతగా గుర్తిస్తున్నారు.

* ప్రపంచ జనాభాలో కేవలం యువత శాతం ఇప్పుడు 18%. అంటే దాదాపు 120 కోట్లు!

* 87% యువత మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. 62% మన ఆసియా ఖండంలోనే ఉన్నారు.

* మన దేశ జనాభాలో యువత 40% కంటే ఎక్కువే. 2020 నాటికి 64% మించిపోతారనీ గణాంకాలు చెబుతున్నాయి.

  ఆరోగ్య సమస్యలంటే అదేదో వయసుడిగిన ‘ముసలి’ వ్యవహారమనుకుంటుంటాం. ఎదిగే వయసులో ఇబ్బందులేముంటాయని వాదిస్తుంటాం. యువతరానికేం జబ్బులొస్తాయని జబ్బలు చరుచుకుంటుంటాం. కానీ లెక్కలు చూస్తే... ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 26 లక్షల మంది యుక్తవయస్కులు... అర్ధాంతరంగా... అర్థరహితంగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. వీరంతా కౌమారం నుంచి యవ్వనంలోపే.. 10-24 ఏళ్ల మధ్య వయసు వారే. ఈ 26 లక్షలన్నది కేవలం మరణిస్తున్న వారి సంఖ్య. ఇంతకు మించి.. కొన్ని కోట్ల మంది యువతీయువకులు నిత్యం రకరకాల ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుపోయి.. శారీరకంగా, మానసికంగా నలిగిపోతూ.. సంపూర్ణ వికాసం లేకుండా అర్థాయుష్కులుగా మిగిలిపోతున్నారు. పొగాకు వినియోగం.. శారీరక శ్రమ, వ్యాయామాల్లేకపోవటం.. లైంగికంగా ప్రమాదకరమైన ప్రవర్తనలను ఒంటబట్టించుకోవటం.. భావోద్వేగాలకు బానిసలై మానసిక సమస్యల్లో హింసాత్మకంగా తయారవటం.. చాలామంది యువతీయువకుల భవిష్యత్తును అంధకారంలో ముంచుతున్న సమస్యలివి. నిజానికి ఈ సమస్యలేవీ అప్పటికప్పుడు ప్రభావం చూపించకపోవచ్చు. యువత తమకేం ఢోకాలేదని నమ్ముతుండొచ్చు. కానీ లెక్కలు చూస్తే... నేడు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో మూడింట రెండొంతుల మరణాలకూ.. మొత్తం జబ్బుల బెడదలో మూడోవంతు భారానికి.. బీజాలు యుక్తవయసులోనే పడుతున్నాయి. అంటే నడివయసులో తలెత్తే చాలా జబ్బులకు మూలాలూ, పునాదులూ యుక్తవయసులోనే ఉంటున్నాయి. నేడు ప్రపంచాన్ని కుంగదీస్తున్న అతి పెద్ద సమస్య ఇది! అందుకే యువతీయువకుల్లో ఆరోగ్య స్పృహ పెంచటం.. ఆనారోగ్యకరమైన అలవాట్లలో కూరుకుపోకుండా వారిని కాపాడుకోవటం.. నేటి ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్‌! అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు దీనిపై లోతుగా దృష్టి పెడుతున్నాయి. విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తూ.. ప్రపంచవ్యాప్త గణాంకాలను విశ్లేషిస్తూ.. దేశాలు, ప్రాంతాలవారీగా ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. ఒక్కో అంశాన్నీ పరిశీలిస్తూ.. నివారణ మర్గాలేమిటన్నది అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి యువతను కుంగదీస్తున్న ఆరోగ్య సమస్యలేమిటి? వీటిని సమర్థంగా ఎదుర్కొనేదెలా? అన్నది వివరంగా చూద్దాం.

పొంగటం.. కుంగటం యువతకేం చీకూచింతా ఉండదు, రికామీగా తిరుగుతారన్న ధోరణి మన సమాజంలో బలంగా ఉంది. కానీ వాస్తవానికి ఏటా ఎంతలేదన్నా 20% మంది యువతీయువకులు మానసిక సమస్యలను అనుభవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు యువతలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. హింస, అవమానం, అగౌరవం, నిరాదరణ వంటివి ఎదురైన కొద్దీ యువతలో ఈ మానసిక సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పేదరికం మనోవేదనను మరింత పెంచుతోంది. వీటన్నింటి కారణంగా యువతలో ‘ఆత్మహత్య’లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన దేశంలో యువత మరణానికి రెండో అతి ముఖ్య కారణం- ఆత్మహత్యలే! మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పురుషుల్లో దాదాపు 40%, స్త్రీలలో దాదాపు 60 శాతం 15-29 ఏళ్ల మధ్య వయసువారే. ఈ నేపథ్యంలో యువత ఆత్మహత్యలపై దృష్టిపెట్టటం తక్షణావసరం. యుక్తవయసులో రకరకాల మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉండటం, తీవ్రమైన భావోద్వేగాలు, రిస్కు తీసుకునే స్వభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీరిలో ఆత్మహత్యలు ఎక్కువగా కనబడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. చిన్నవయసులో, ముఖ్యంగా కౌమారంలో మానసిక సమస్యలను సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చెయ్యటం వల్ల యుక్తవయసులో ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నది ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో పిల్లల్లో చిన్నవయసు నుంచే సమ్యక్‌ దృక్పథం, జీవన నైపుణ్యాలు, సానుకూల ఆలోచనాధోరణి పెంచటం చాలా అవసరం. శరీరం యువతకు శరీరం పట్ల, దారుఢ్యం పట్ల శ్రద్ధ ఎక్కువనుకుంటాంగానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకవైపు చాలామంది యువతీయువకులు పోషకాహార లోపంతో బాధపడుతుంటే మరోవైపు ఎంతోమంది వూబకాయంలోకి జారిపోతున్నారు. చాలామంది యువతీయువకులకు ఆరోగ్యకరమైన, పోషకాహారం గురించి అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా యువతలో ‘ఫాస్ట్‌ ఫుడ్స్‌’ పట్ల వ్యామోహం ఎక్కువగా కనబడుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయంలో స్నేహితులను అనుకరించటం, ఒత్తిళ్లు కూడా ఎక్కువే. ఎదిగే వయసులో ఉండే యువత... ఆరోగ్యకరమైన ఆహారం గురించీ, వ్యాయామ ప్రాధాన్యం గురించీ,  క్రీడల ప్రాముఖ్యం గురించీ తెలుసుకోవటం చాలా అవసరం.సృజనాత్మకత, తపన, ప్రేమ, అంకితభావం, సాంకేతిక ప్రతిభ, సమర్థత, దేన్నైనా సాధించే పట్టుదల... ఇవన్నీ యువతకున్న ప్రత్యేక లక్షణాలు! అందుక యువత మీద దృష్టిపెట్టటమంటే దేశ భవిష్యత్తును కాపాడుకోవటమే!

యువత చక్కటి బాటలో ఉండేందుకు- సంగీతం వంటి సృజనాత్మక వ్యాపకాలు, క్రీడలు, తరచూ విహార యాత్రలు, స్వచ్ఛంద సేవ వంటివి బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల శారీరక, సామాజిక, భావోద్వేగ, వైజ్ఞానిక, నైతిక, సాంస్కృతిక వికాసం సాధ్యమవుతుంది. లైంగిక ప్రయోగాలు హార్మోన్ల ఉరవడితో శృంగార భావనల మధ్య ఉక్కిరిబిక్కిరి కావటం యువతకు సహజమే. కానీ.. కళ్లేలు లేని భావోద్వేగాలే తప్పించి సరైన లైంగిక విజ్ఞానం, అవగాహన లేకపోవటం మూలంగా నేడు ప్రపంచ యువత తీవ్ర విపత్తుల్లో చిక్కుకుపోతోంది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఒక్కటి చాలు, యువతను పూర్తిగా నిర్వీర్యం చెయ్యటానికి! 2009లోనే మొత్తం హెచ్‌ఐవీ కేసుల్లో యువత 40% కంటే ఎక్కువున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొత్తగా 2400 మంది హెచ్‌ఐవీ బారినపడుతున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీతో సతమతమవుతున్న యుక్తవయస్కుల సంఖ్య 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా. లైంగిక సంబంధాల విషయంలో సురక్షితంగా వ్యవహరించటమెలాగన్నది యువతకు తెలియటం, ఆ విజ్ఞానాన్ని పెంచుకోవటం చాలా అవసరం. దీనిపై ఐరాస నిర్వహించిన సర్వేల్లో కేవలం యువకుల్లో 36%, యువతుల్లో 24% మందికే ఈ రకమైన సురక్షిత శృంగారంపై అవగాహన ఉంటోందని వెల్లడైంది. హెచ్‌ఐవీ వైరస్‌ బారినపడకుండా తమను తాము రక్షించుకోవటమెలా? ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా, ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది? దీన్ని అడ్డుకోవటానికి ఏం చెయ్యాలి? అవసరమైతే హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకునేదెలా? వీటిపై యువతలో అవగాహన పెరగటం చాలా అవసరం. మద్యం యువతీయువకులు ప్రమాదకర స్థాయిలో మద్యానికి బానిసలవుతుండటం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కనిపిస్తున్న పెద్ద సమస్య. ఇదేదో సంపన్నుల వ్యవహారం అనుకోవద్దు. చిత్రంగా మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా ఉన్న మనలాంటి వర్ధమాన దేశాల్లో కూడా- 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఆడపిల్లల్లో 14%, మగపిల్లల్లో 18% మద్యానికి అలవాటు పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

మద్యంతో పెద్ద సమస్యేమంటే ఇది మనిషి అదుపు కోల్పోయి, ప్రమాదకర ప్రవర్తనల్లోకి జారిపోయేలా చేస్తుంది. చాలా ప్రమాదాలకు, హింసకు, అకాల మరణాలకు ఇదే మూలం. యుక్తవయసు నుంచే పిల్లల్లో మద్యం తెచ్చిపెట్టే ప్రమాదాల గురించి అవగాహన పెరిగేలా చెయ్యటం చాలా అవసరం. బాల్య, యవ్వనాల్లో వ్యసనాలకు కుటుంబం పాత్రా తక్కువేం కాదు. ఇంట్లో పెద్దలకు మద్యం, పొగ వంటి అలవాట్లున్నప్పుడు అవి తేలికగా పిల్లలకూ సంక్రమిస్తున్నాయి. కాబట్టి కుటుంబమూ బాగుండాలి. గర్భస్రావాలు కాన్పులు 15-19 ఏళ్ల ఆడపిల్లల్లో కాన్పులు, గర్భస్రావాలు కూడా పెద్ద ఆరోగ్య సమస్యగా పరిణమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కాన్పుల్లో 11% ఈ వయసులోనే జరుగుతున్నాయి. ఈ వయసు వారిలో కాన్పు సంబంధ సమస్యలతో మరణించే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి యుక్తవయసు ఆడపిల్లల్లో గర్భనిరోధకాల గురించి అవగాహన పెంచటం, లైంగిక విజ్ఞానాన్ని పెంపొందించటం చాలా అవసరం. ముఖ్యంగా యువతలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధుల పట్ల విజ్ఞానాన్ని పెంచేందుకు ఉద్దేశించిన చాలా కార్యక్రమాలు, పథకాలు మనలాంటి దేశాల్లో ఆడపిల్లల వరకూ చేరటం లేదు. పొగాకు బానిసలు ప్రపంచవ్యాప్తంగా ధూమపానానికి, పొగాకు వినియోగానికి బానిసలైన వారిని విశ్లేషించినప్పుడు- వీరిలో చాలామంది కౌమారంలోనే దాన్ని ఆరంభించినట్టు గుర్తించారు. చాలామంది విషయంలో ఇది చిన్న సరదాలా, ఉత్సుకతగా, ఓ చిన్నప్రయోగంలా ఆరంభమైనట్టు గుర్తించారు.మొత్తానికి నేడు ప్రపంచ యువతలో 15 కోట్ల మంది పొగాకు బానిసలే. వీరిలో సగానికి సగం మంది అకాలమరణం పాలవటం తథ్యమని వైద్యరంగం చెబుతోంది. పొగాకు ప్రచారాన్ని అడ్డుకోవటం, బహిరంగ ప్రదేశాల్లో నిషేధించటం, ఖరీదు పెంచటం తదితర చర్యలతో ఫలితం ఉంటుందిగానీ పొగాకుతో తలెత్తే నష్టాల గురించి యువతలో అవగాహన పెంచటం మరింత అవసరం. దానివల్ల దీర్ఘకాలిక ఫలితాలు బాగుంటాయి. హింస యువతకు, ముఖ్యంగా యుక్తవయసు మగపిల్లల్లో ఉద్రేకాలు ఎక్కువేగానీ... చాలాసార్లు అవి అదుపు తప్పి హింసకు, మరణాలకు దారితీస్తుండటం పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా 10-24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కేవలం స్పర్థలు, ఘర్షణలు, గొడవల కారణంగానే రోజుకు 430 మంది మరణిస్తున్నారు. తరచి చూస్తే ఒక్కో మరణంతో పాటుగా.. దాదాపు 20-40 మంది రకరకాల గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మద్యం వల్ల హింస మరింత పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచీ చక్కటి ప్రేమాభిమానాలను నేర్పించటం, పరస్పరం గౌరవించుకునే లక్షణాన్ని పెంపొందించటం చాలా అవసరం. ప్రమాదాలు 10-24 సంవత్సరాల మధ్య వయసు యువతలో మరణాలకు ప్రప్రథమ కారణం రోడ్డు ప్రమాదాలే. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 700 మంది యువతీయువకులు కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే అసువులు బాస్తున్నారు. రహదారి సౌకర్యాలు, రవాణా విధానాలు అస్తవ్యస్తంగా ఉండే మనలాంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న యువతకు అంతు ఉండటం లేదు. తాగి బండ్లు నడపటం, ఒకరిని చూసి ఒకరు పోటీలు పడటం, రేసింగులకు దిగటం.. ముఖ్యంగా ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అస్సలు శ్రద్ధ లేకపోవటం.. ఇవన్నీ యువతను ప్రమాదాల బారినపడేస్తున్నాయి. రక్తంలో మద్యం చాలా తక్కువగా అంటే 0.05% ఉన్నా కూడా.. దానివల్ల వాహనం నడిపేప్పుడు ప్రమాదాల బారినపడే అవకాశం 2.5% పెరుగుతోంది. కాబట్టి మద్యం వంటి అలవాట్లకు బానిసలు కాకుండా చూడటం, చిన్న వయసు నుంచే డ్రైవింగ్‌ విషయంలో సురక్షితమైన పద్ధతులు నేర్పించటం, వాళ్లు కచ్చితంగా పాటించేలా చట్టాలను సమర్థంగా అమలు చెయ్యటం ముఖ్యం. ప్రజా రవాణాను మెరుగుపరచటం కూడా చాలా అవసరం.

 దేన్నీ లక్ష్యపెట్టకపోవటం చాలామంది యువతీయువకుల్లో కనిపించే లక్షణం. కాబట్టి యువతను ఉద్దేశించిన ఏ విధానాలైనా వారిని భయపెట్టి బెదరగొట్టేలా కాకుండా.. వారికి రుచించేలా, వారిని భాగస్వాములను చేసేలా, కాస్త సృజనాత్మకంగా, సానుకూల దృక్పథంతో ప్రోత్సాహకరంగా ఉండటం ముఖ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని