చకాచక్‌.. చెక్‌మేట్‌!

హాయ్‌ నేస్తాలూ... మీకు చెస్‌ ఆడటం వచ్చా! రాకున్నా ఫర్లేదు. నెమ్మదిగా నేర్చుకోండి సరేనా. ఇప్పుడు చెస్‌ ప్రస్తావన ఎందుకంటే... ఓ చెస్‌బోర్డ్‌ గురించి తెలుసుకుంటారని.

Updated : 18 Jan 2023 05:32 IST

హాయ్‌ నేస్తాలూ... మీకు చెస్‌ ఆడటం వచ్చా! రాకున్నా ఫర్లేదు. నెమ్మదిగా నేర్చుకోండి సరేనా. ఇప్పుడు చెస్‌ ప్రస్తావన ఎందుకంటే... ఓ చెస్‌బోర్డ్‌ గురించి తెలుసుకుంటారని. ‘ఓస్‌ చెస్‌బోర్డేనా!’ అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే ఇది స్మార్ట్‌ చెస్‌బోర్డు మరి. ‘స్మార్ట్‌ ఫోన్‌ తెలుసు.. స్మార్ట్‌ చెస్‌ బోర్డు ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.

ఇద్దరు ఉంటేకానీ చెస్‌ ఆడలేం కదా! ‘అదేం లేదు.. ఆన్‌లైన్‌లో ఒక్కరే ఆడుకోవచ్చు’ అని సమాధానం చెబుతారేమో! ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డు మన దగ్గర ఉంటే ఎంచక్కా ఒక్కరమే ఆడుకోవచ్చు. ఎందుకంటే మన ఎత్తులకు స్మార్ట్‌ చెస్‌బోర్డే పై ఎత్తులు వేస్తుంది కాబట్టి. అవును విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డును ఎవరు తయారు చేశారో తెలుసా! ఏ విదేశీయులో కాదు. మన భారతీయులే.

ఇద్దరూ ఇద్దరే!

మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన బహ్వ్యా గోహెల్‌, రాథోడ్‌ మెహతా అనే ఇద్దరు అన్నయ్యలు ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డుకు ప్రాణం పోశారు. వీళ్లు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు. ఈ చెస్‌బోర్డు మీద ఆడుతున్నప్పుడు మన ఎదురుగా మరో వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పని బోర్డే చేస్తుంది కాబట్టి. చెస్‌ను ప్రపంచానికి మన భారతదేశమే బహుమతిగా ఇచ్చింది. ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డును కూడా మన దేశానికి చెందిన వారే తయారు చేయడం విశేషం.

ఎలా ఆడాలంటే...

ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డు ఎలా ఆడాలంటే... మామూలు చెస్‌బోర్డు మీద ఆడినట్లే ముందుగా మనం ఎత్తు వేయాలి. తర్వాత స్మార్ట్‌ చెస్‌బోర్డు మీదున్న అవతలి పావులు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) సాయంతో కదులుతాయి. మనం వేసిన ఎత్తుకు సరిపడా పై ఎత్తును వేస్తుంది. ఎవరైనా కొత్తవారు పావులు వాటంతట అవే కదలడం చూస్తే... భయానికి కూడా గురవుతారు. చెస్‌ నిజానికి మెదడుకు సంబంధించిన ఆట. అంటే ఓ రకంగా స్మార్ట్‌ చెస్‌బోర్డుకు కూడా మెదడున్నట్లే!

ఎలా పనిచేస్తుందంటే...

స్మార్ట్‌ చెస్‌బోర్డును టెలీ రోబోటిక్స్‌ అనే టెక్నాలజీని వాడి తయారు చేశారు. బోర్డు లోపల ఓ రోబోటిక్‌ పరికరం ఉంటుంది. పావుల్లోనేమో అయస్కాంతం ఉంటుంది. బోర్డులో కూడా ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఉంటుంది. రోబోటిక్‌ పరికరం ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ల సమన్వయంతో బోర్డు మీద పావులు కదులుతాయి. అలాగే ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డులో బ్లూటూత్‌, ఆర్మ్‌ ప్రాసెసర్‌ కూడా ఉంటుంది. యాప్‌ సాయంతో పావుల కదలికలను ప్రాసెస్‌ చేస్తాయి. ఏ పావు ఎప్పుడు కదలాలనేది కూడా ఆర్మ్‌ ప్రాసెసరే నిర్ణయిస్తుంది. ఈ చెస్‌బోర్డు అంతా కర్రతోనే తయారైంది. పావులు కూడా కలపతోనే తయారు చేశారు.

ఖరీదు ఎక్కువే!

ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డు ధర కూడా చాలా ఎక్కువ. అందుకే దీన్ని మన భారతదేశంలో కేవలం 20 మంది మాత్రమే కొనగలిగారు. అందులో బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ కూడా ఉన్నారట. ఈ ఇద్దరు అన్నయ్యలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల వరకు స్మార్ట్‌ చెస్‌బోర్డులను అమ్మారు. ప్రస్తుతం వీళ్లు మరిన్ని బోర్డు ఆటల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ చెస్‌బోర్డు ఉపరితలాన్ని మార్చి యాప్‌ అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుందట. ఇప్పటికైతే కేవలం చెస్‌ మాత్రమే ఆడుకోవచ్చు. నేస్తాలూ మొత్తానికి ఈ స్మార్ట్‌ చెస్‌ బోర్డు సంగతులు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని