అరచేయంత సొరచేపను!

ఏంటి శీర్షిక వైపు అలాగే చూస్తుండి పోయారు..! మీరు చదివింది నిజమే! అక్షర దోషం ఏమీ లేదు! సొరచేప అనగానే మీ కళ్లముందు భారీ రూపం కదలాడుతుంది...

Published : 30 Aug 2021 00:24 IST

ఏంటి శీర్షిక వైపు అలాగే చూస్తుండి పోయారు..! మీరు చదివింది నిజమే! అక్షర దోషం ఏమీ లేదు! సొరచేప అనగానే మీ కళ్లముందు భారీ రూపం కదలాడుతుంది. దాని పెద్ద పెద్ద పళ్లు, భయంకరమైన కళ్లు, పే..ద్ద ఆకారం.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ! కానీ నేను మాత్రం కేవలం మీ అరచేతిలో ఇమిడిపోతాను.. ఇంతకీ నేను ఎవరంటే...

నా పేరు.. డార్ఫ్‌ లాంటర్న్‌ షార్క్‌... పలకడం కాస్త కష్టంగా ఉంది కదూ! అందుకే మీరు ఎంచక్కా నన్ను బుజ్జి షార్క్‌ అని పిలిచేసుకోండి.. సరేనా! ప్రపంచంలోకెల్లా అతి చిన్న షార్క్‌ను నేనే మరి. నన్ను చూసి ఇప్పటికే ఆ విషయం మీరు కనిపెట్టేసి ఉంటారు! 

పెన్సిలంత షార్క్‌ను
నేను మహా అయితే 20 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను అంతే. అంటే దాదాపు మీ దగ్గర ఉండే పెన్సిల్‌ అంత అన్నమాట. మాలో మగవాటికన్నా.. ఆడవే కాస్త ఎక్కువ పొడవు పెరుగుతాయి. నేను కొలంబియా, వెనిజులాను ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తాను. నాకు పై దవడకు 25 నుంచి 32 వరకు, కింది దవడకు 30 నుంచి 34 వరకు దంతాలుంటాయి.

పెద్ద పెద్ద కళ్లతోటి..
నా మొత్తం శరీరంలో నా తలే, మొప్పలతో సహా కలుపుకొని మూడోవంతు ఉంటుంది. ఇంకా నా కళ్లు పెద్దగా.. ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇంతకీ నేను ఏం తింటానో చెప్పనేలేదు కదూ..! క్రిల్‌ (రొయ్యల వంటి జీవులు), రొయ్యలు, చిన్న చిన్న చేపల్ని ఆహారంగా తీసుకుంటాను. మాలో ఆడవి ఒకసారికి రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తాయి. నిజానికి మేం చాలా అరుదైన జీవులం. అందుకే బాహ్య ప్రపంచానికి పెద్దగా మా గురించి తెలియదు. సరే ఫ్రెండ్స్‌.. ఉంటామరి.. అప్పుడనగా మీ దగ్గరకు వచ్చాను. నాకిప్పుడు తెగ ఆకలి వేస్తోంది. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని