మా కాళ్లకు చక్రాలొచ్చాయోచ్‌!

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలకు ఆటలంటే కర్రాబిళ్లా, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా.. ఇవే కదా! వీటినే ఎప్పట్నుంచో ఆడుతూ వస్తున్నారు. మరి కర్ణాటకలోని ఉద్బర్‌ అనే ఊరు వెళ్లండి. స్కేటింగ్‌ చేసే

Updated : 22 Sep 2021 04:15 IST

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలకు ఆటలంటే కర్రాబిళ్లా, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా.. ఇవే కదా! వీటినే ఎప్పట్నుంచో ఆడుతూ వస్తున్నారు. మరి కర్ణాటకలోని ఉద్బర్‌ అనే ఊరు వెళ్లండి. స్కేటింగ్‌ చేసే చిన్నారులు కనిపిస్తారు. కాంక్రీట్‌ రోడ్డు మీద రివ్వున దూసుకుపోతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అదెలా అంటారా! ఆ సంగతేంటో తెలుసుకుందామా!

కర్ణాటకలోని ఉద్బర్‌.. ఓ పల్లెటూరు. ఇక్కడ ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు, మొన్నటి వరకూ అందరిలానే సంప్రదాయ ఆటలే ఆడుకునేవారు. కానీ ఇప్పుడు రోలర్‌ స్కేటింగ్‌లో సాధన చేస్తూ అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు. స్కేటింగ్‌లో ప్రతిభ చూపి, పోటీల్లో పాల్గొంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

అలా మొదలైంది..

2018లో మైసూర్‌లోని గ్రాస్‌రూట్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వకేసీ మూవ్‌మెంట్‌ (GRAAM) అనే రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదేంటంటే సమగ్ర పాఠశాల అభివృద్ధి కార్యక్రమం. అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా అన్ని క్రీడలు తెలిసుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వీళ్లు ఉద్బర్‌లోని పిల్లలకు ‘అర్బన్‌ స్కేటింగ్‌’ పేరుతో రోలర్‌ స్కేటింగ్‌ నేర్పిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈవెంట్స్‌ పెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు కావాల్సిన పరికరాలు, వసతులు అన్నింటిని వారే చూసుకుంటున్నారు. పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకునే చిన్నారులు కూడా స్కేటింగ్‌ సాధన తమకెంతో నచ్చిందని, కాంక్రీట్‌ రోడ్ల మీద కూడా స్కేటింగ్‌ చేయగలమని, మా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారనీ మురిసిపోతూ చెబుతున్నారు. అంతేకాదు పోటీల్లో పాల్గొని వాళ్ల గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాం అని ధీమాగా చెబుతున్నారు. ఇంత మంచి అవకాశం వాళ్లకు రావడం నిజంగా అభినందనీయమే కదా నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు