ఔరా.. ఇస్లా జ్ఞాపకశక్తి..!

మనకు స్కూల్లో టీచర్‌ చెప్పిన రైమ్స్‌, రంగులు, వస్తువుల పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఒక రెండుమూడు రోజులు మళ్లీ మళ్లీ చెబితే కానీ ఎక్కువ రోజులు గుర్తుండదు అంతే కదా..!

Updated : 15 Feb 2024 05:07 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు స్కూల్లో టీచర్‌ చెప్పిన రైమ్స్‌, రంగులు, వస్తువుల పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఒక రెండుమూడు రోజులు మళ్లీ మళ్లీ చెబితే కానీ ఎక్కువ రోజులు గుర్తుండదు అంతే కదా..! కానీ ఓ చిన్నారి మాత్రం రెండేళ్లు కూడా పూర్తవకుండానే తన జ్ఞాపకశక్తితో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసు కుందామా..!

 అమెరికాలోని కెంటుకీ ప్రాంతానికి చెందిన ఇస్లా మక్‌నాబ్‌కు ప్రస్తుతం మూడు సంవత్సరాలు. ఈ వయసు పిల్లలంటే.. ఇప్పుడిప్పుడే మాట్లాడటం, నడవటం నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం.. తనకు రెండేళ్లు ఉన్నప్పుడే వరల్డ్‌ యంగెస్ట్‌ మెన్సా మెంబర్‌గా ఎంపికైంది. ఎక్కువ ఐక్యూ ఉండి.. అన్ని విషయాలనూ బాగా గుర్తుపెట్టుకునే వారికే ఈ మెన్సా ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌లో స్థానం కల్పిస్తారు. చిన్న వయసులోనే అంతటి స్థానాన్ని దక్కించుకుందంటే.. ఇస్లా చాలా గ్రేట్‌ కదూ..!

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

ఇస్లాకు అందరు పిల్లల్లా కాకుండా.. కాస్త ఎక్కువ ఐక్యూ ఉందని ముందుగా ఆమె తల్లిదండ్రులే గుర్తించారట. తనకు ఏడాది పూర్తయినప్పటి నుంచే.. అంకెలు, రంగుల పేర్లు, అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించిందట. ప్రస్తుతం తను పుస్తకం కూడా చదివేస్తుందట. ఈ వయసులో బొమ్మలతో ఆడుకోవడానికే సమయం సరిపోదంటే.. పుస్తకం చదవడమా.. అని ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ..! తన ప్రతిభతో ప్రపంచంలోనే ‘స్మార్టెస్ట్‌ కిడ్‌’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. ఇంకో విషయం ఏంటంటే.. తనకు పలకరాని పదాలు ఏవైనా ఉంటే.. ఆ అక్షరాలను సైగల రూపంలో అమ్మనాన్నలకు తెలియజేస్తుందట ఈ చిన్నారి. పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, తన పిల్లితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమట. ఇలాగే ఇస్లా మరింత స్మార్ట్‌గా రికార్డులు సాధించాలని ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని