నేను ఒక సముద్ర పక్షిని..!

హాయ్‌ నేస్తాలూ! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ‘ఏంటి ఇది కాళ్లకు షూ వేసుకుని భలేగా ఉంది’ అనుకుంటున్నారా! నేను షూ ఏం వేసుకోలేదు

Updated : 23 Mar 2024 00:57 IST

హాయ్‌ నేస్తాలూ! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ‘ఏంటి ఇది కాళ్లకు షూ వేసుకుని భలేగా ఉంది’ అనుకుంటున్నారా! నేను షూ ఏం వేసుకోలేదు.. నా కాళ్లు సహజంగానే అలా ఉంటాయి.. నా పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలనుంది కదూ! అయితే వెంటనే ఈ కథనం చదివేయండి మరి!

నా పేరు ‘బ్లూ ఫూటేడ్‌ బూబీ’. నా కాళ్ల ఆకారం, రంగు వల్ల నాకు ఆ పేరు వచ్చింది. నేను ఒక రకమైన సముద్ర పక్షిని. పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటాను. అమెరికా, కొలంబియా, మెక్సికో వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. ఇంత వరకు మీరు చూసిన అన్ని పక్షుల కంటే.. నేను కాస్త కొత్తగా ఉంటాను. బ్రౌన్‌ రంగులో ఉన్న నా రెక్కలు పెద్ద ఆకారంలో ఉంటాయి. కళ్లు పసుపు, ముక్కు నలుపు, మిగిలిన శరీరమంతా తెలుపు రంగులో ఉంటుంది.

 చేపలే కారణం..

 నేను పుట్టినప్పుడు తెల్లని రంగులో భలే అందంగా ఉంటాను. అప్పుడు నా కాళ్లు కాస్త గోధుమ రంగులో ఉంటాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ నా శరీర రంగులో మార్పు వస్తుందన్నమాట. నేను సముద్ర పక్షిని కాబట్టి రకరకాల చేపలను ఆహారంగా తీసుకుంటాను. వాటిలోని కొన్ని విటమిన్ల వల్లనే.. నా కాళ్లు నీలం రంగులోకి మారతాయి. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ.. నాకు డైవింగ్‌ అంటే చాలా ఇష్టం. సముద్రం లోపలికి దాదాపు 25 మీటర్ల లోతు వరకు వెళ్లగలను. నా తలలో ఒత్తిడిని తట్టుకునే ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది.. అందుకే గంటకు 97 కిలో మీటర్ల వేగంతో ఈదగలను. నేను ఎక్కువ సమయం నీటిలో ఉండటానికే ఇష్టపడతాను.

సంఖ్య తగ్గుతోంది..

ప్రస్తుతం మా సంఖ్య 6,423 మాత్రమే. వాతావరణ మార్పుల వల్ల మా జనాభా చాలా వరకు తగ్గిపోతోంది. నా బరువు 2 కిలోల వరకు ఉంటుంది. పొడవు 81 నుంచి 90 సెంటీ మీటర్ల వరకు పెరుగుతాను. నేను దాదాపు 17 నుంచి 18 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు.. మీకు నచ్చే ఉంటాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని