అమ్మ చెప్పినట్లు వింటా..!

హలో ఫ్రెండ్స్‌..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! నన్ను చూశాక మీరు ఏమనుకుంటున్నారో అర్థమైంది. ‘దీని ముఖంలో కళ్లు తప్ప మరేమీ కనిపించట్లేదు’ అనే కదా! ఏం చేస్తాం మరి..

Published : 24 Apr 2024 00:23 IST

హలో ఫ్రెండ్స్‌..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! నన్ను చూశాక మీరు ఏమనుకుంటున్నారో అర్థమైంది. ‘దీని ముఖంలో కళ్లు తప్ప మరేమీ కనిపించట్లేదు’ అనే కదా! ఏం చేస్తాం మరి..నా రంగే అంత! నా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది కదూ..అయితే ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి!

 నా పేరు రెడ్‌ రఫ్ఫ్‌డ్‌ లేమర్‌. మాలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేమర్లు కూడా ఉంటాయి. మేము మడగాస్కర్‌కు చెందిన జీవులం. అక్కడ తప్ప ఇంకెక్కడా.. కనిపించం. ఎందుకంటే ఆ వాతావరణమే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. నా శరీరం మీరు ఆడుకునే టెడ్డీ బేర్‌లా.. గుబురుగా చాలా మెత్తగా ఉంటుంది. నా ముఖం, కాళ్లు, శరీరం కింది భాగం, తోక నలుపు రంగు.. మెడ మీద తెలుపు, మిగతా అంతా లేత ఎరుపు రంగులో ఉంటుంది. కళ్లు లేత పసుపు రంగులో ఉంటాయి. నా చేతులు మీ మనుషుల్లాగే ఉంటాయి. అందుకే చెట్లు అలవోకగా ఎక్కేయగలను. నేను పుట్టిన తర్వాత 3 నుంచి 7 వారాల వరకు గూడులో ఉంటూ.. మా అమ్మ చెప్పినవన్నీ నేర్చుకుంటాను.

అలాగే ఇష్టం..!

నేను గుంపుతో కలిసి ఉండటానికే ఇష్టపడతాను. ఒక్కో గుంపుకు 18 నుంచి 32 లేమర్లు ఉంటాయి. ఆహారం కోసం.. ఇంకా చిన్న బృందాలుగా విడిపోతాం. పగటి సమయంలోనే ఆహార వేట కొనసాగిస్తాను. నేను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు.. నా తోటి జీవులకు తోకతో సంకేతాలు అందిస్తాను. ఒకవేళ అవి దూరంగా ఉంటే.. గట్టి గట్టిగా అరుస్తాను. నేను ఎక్కువగా పండ్లు, విత్తనాలు, ఆకులు, పువ్వులు తినడానికే ఇష్టపడతాను. మీకో విషయం తెలుసా.. నాకు వాసన పసిగట్టే గుణం, వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఎంత చిన్న జీవులనైనా నా కంటి చూపుతో ఇట్టే గుర్తుపట్టగలను. ప్రస్తుతం మా సంఖ్య చాలా తక్కువగానే ఉంది. నా బరువు 3 నుంచి 3.6 కిలోలు ఉంటుంది. పొడవు 53 సెంటీ మీటర్లు ఉంటాను. దాదాపు 15 ఏళ్లు.. రక్షణ కల్పిస్తే 20 సంవత్సరాలు జీవిస్తాను. ఇవి నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని