తెలివైన చేపను నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు కదూ! ఓ సారి మిమ్మల్ని పలకరిద్దామని ఇలా వచ్చాను. నేనో సముద్ర చేపను. చాలా తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాను. 

Updated : 22 May 2024 00:55 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు కదూ! ఓ సారి మిమ్మల్ని పలకరిద్దామని ఇలా వచ్చాను. నేనో సముద్ర చేపను. చాలా తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాను. కష్టపడకుండానే సముద్రంలో ప్రయాణిస్తుంటాను. ‘అలా ఎలా?’ అని మీరు అడగాలనుకుంటున్నారు కదా! ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది... సరేనా! 

నా పేరు రెమోరా. సక్కర్‌ఫిష్, షార్క్‌సక్కర్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. నాలో మళ్లీ కొన్ని జాతులున్నాయి. నేను 30 నుంచి 110 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నా శరీరంలో ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. దీని సాయంతో పెద్ద పెద్ద చేపలు, షార్క్‌లు, తిమింగలాలకు నేను అతుక్కొని ఉంటాను. కొన్నిసార్లు చిన్న చిన్న బోట్లకు, డైవర్లకు కూడా అతుక్కుంటాను. ఇలా నేను తేలిగ్గా సముద్రంలో ప్రయాణిస్తూ, ఆహారాన్నీ సంపాదించుకుంటాను. మొత్తానికి చాలా తెలివిగా బతికేస్తాను. 

నాకు ఈత వచ్చోచ్‌!

ప్రయాణంలో ఇతర జీవులపై ఆధారపడటమే కాకుండా, సొంతంగానూ ఈదగలను. కానీ ఎక్కువగా పెద్ద పెద్ద జలచరాల చర్మానికి అతుక్కోవడానికే ఆసక్తి చూపుతాను. మాలో ఆడ చేపలు  జూన్, జులైలో అట్లాంటిక్‌ మహా సముద్రం మధ్యలో గుడ్లను పెడతాయి. మధ్యదరా సముద్రంలో మాత్రం ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ జరుగుతుంది. మాలో చిన్న చేపలు 1 సెంటీమీటర్‌ పొడవుకు చేరుకునేటప్పటికీ అతుక్కునే డిస్క్‌ బయటకు కనిపించడం ప్రారంభం అవుతుంది. 3 సెం.మీ. పొడవుకు చేరుకున్నప్పుడు ఈ డిస్క్‌ పూర్తిగా కనబడుతుంది. అప్పటి నుంచి ఇతర చేపల శరీరాలకు అవి అతుక్కోగలుగుతాయి. మాలో చిన్న చిన్న రెమోరాలు.. ట్యూనాలు, తాబేళ్లకు కూడా అతుక్కొని జీవనం సాగిస్తుంటాయి. 

డాల్ఫిన్లతో తూచ్‌!

మేం షార్క్‌లు, తిమింగలాలు, తాబేళ్లు, పెద్దపెద్ద చేపలకు చక్కగా అతుక్కుంటాం. కానీ డాల్ఫిన్ల దగ్గర మా పప్పులు ఉడకవు! వాటికి అతికితే ఏమాత్రం ఊరుకోవు. అవి తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. కొందరు తాబేళ్ల వేటకోసం మమ్మల్ని వాడుతుంటారు. అవి కనిపించినప్పుడు మమ్మల్ని నీటిలోకి వదులుతారు. అప్పుడు మేం తాబేళ్లను గట్టిగా పట్టుకుంటాం. తర్వాత పడవలోని వారు మమ్మల్ని పైకి లాగుతారు. మాతోపాటు తాబేళ్లూ పడవలోకి వచ్చేస్తాయి. మేం చిన్న చిన్న  జీవుల్ని, ఆల్గేను ఆహారంగా తీసుకుంటాం. మా జీవితకాలం మాత్రం తక్కువే. మేం 2 నుంచి 8 సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని