వెలిగే పుట్టగొడుగునండీ నేను!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా! మీకు పుట్టగొడుగులంటే తెలుసు కదా! మరి వెలిగే మష్రూమ్‌ గురించి విన్నారా? లేదు కదా! కానీ తెలుసుకోవాలని ఉంది కదూ!

Updated : 09 Jun 2024 07:43 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా! మీకు పుట్టగొడుగులంటే తెలుసు కదా! మరి వెలిగే మష్రూమ్‌ గురించి విన్నారా? లేదు కదా! కానీ తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.. సరేనా!

నా పేరు ఒంఫాలోటస్‌ నిడిఫోర్మిస్‌. పలకడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంది కదూ! నన్ను గోస్ట్‌ ఫంగస్‌ అని కూడా పిలుస్తుంటారు. నేను ఎక్కువగా దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మేనియాలో పెరుగుతుంటాను. మీ భారతదేశంలోనూ నా ఉనికి ఉన్నట్లు గుర్తించారు! నేను మామూలు పుట్టగొడుగులా కాకుండా విచ్చుకున్న పువ్వులా కనిపిస్తుంటాను. ఆరెంజ్, గోధుమ, ఊదా, నీలం, నలుపు, తెలుపు, గంధం రంగుల్లో ఉంటాను. 

అవతార్‌ సినిమాలోలా..!

నేను గరిష్ఠంగా 20 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. పగటిపూట మామూలుగానే ఉంటాను. కానీ రాత్రైతే మాత్రం ఆకుపచ్చ రంగులో మెరుస్తుంటాను. ఆ వెలుగు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అవతార్‌ సినిమాలో అడవిని తలపించేలా కాంతులు విరజిమ్ముతానన్నమాట. 

చెట్లే ఆసరాగా...

 నేను చెట్ల కాండాలు.. విరిగిపోయి, తేమ చేరి ఉన్న వృక్షసంబంధ పదార్థాలపై పెరుగుతుంటాను. ముఖ్యంగా పైన్‌ చెట్లంటే నాకు భలే ఇష్టం. ఆ పరిసరాల్లోనే ఎక్కువగా జీవిస్తుంటాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... నేను, మీరు తినే రకానికి చెందిన పుట్టగొడుగును కాదు. కాస్త విషపూరితాన్ని. అలా అని మీ ప్రాణాలను తీయను కానీ.. తీవ్ర ఇబ్బందులకు మాత్రం గురిచేస్తా. ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు కలిగిస్తాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై..!! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు