Leopard shark: చూడచక్కని సొరచేపను నేను!

హాయ్‌... ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నా పేరు లెపర్డ్‌ షార్క్‌. అంటే చిరుతపులి సొరచేపను అన్నమాట.

Published : 06 Jun 2024 01:13 IST

హాయ్‌... ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నా పేరు లెపర్డ్‌ షార్క్‌. అంటే చిరుతపులి సొరచేపను అన్నమాట. ‘చిరుత ఏంటి? సొరచేప ఏంటి?’ అని కాస్త అయోమయంగా ఉంది కదూ! ఈ గందరగోళాన్ని దూరం చేయడానికేగా నేనొచ్చింది! నా వివరాలేంటో, విశేషాలేంటో నా మాటల్లోనే తెలుసుకుంటారా మరి. 

నేను ఉత్తర అమెరికాలోని పసిఫిక్‌ తీరం వెంబడి, ఒరెగాన్‌ నుంచి మెక్సికోలోని మజాట్లాన్‌ వరకు జీవిస్తుంటాను. 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు పొడవు పెరుగుతాను. 15 నుంచి 18 కిలోల వరకు బరువు తూగుతాను. ఓ రకంగా చెప్పాలంటే నేను చిరు సొరచేపను అన్నమాట. నా చర్మం మీద ఉన్న చారలు, చుక్కల వల్ల నాకు చిరుతపులి సొరచేప అనే పేరు వచ్చింది. సముద్ర తీరానికి సమీపంలో నాలుగు మీటర్ల కన్నా తక్కువ లోతైన నీటిలోనే బతుకుతుంటాను. గరిష్ఠంగా 91 మీటర్ల లోతు వరకు కనిపిస్తుంటాను. అయినా మీరు ‘అయ్య.. బాబోయ్‌!’ అని భయపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నా వల్ల మీ మనుషులకు ఏ ప్రమాదమూ లేదు. నేను మీ మీద అస్సలు దాడి చేయను తెలుసా! పైగా మీరు కనిపిస్తే చాలు.. తుర్రుమని పారిపోతా. శీతాకాలంలో వెచ్చదనం కోసం తీరం నుంచి దూరంగా వెళ్లిపోతాను. 

ఏం తింటానంటే...

పీతలు, రొయ్యలు, చేపలు, సముద్రంలోని ఇతర చిన్న చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాను. పుట్టినప్పుడు 20 సెం.మీ. పొడవుంటాను. నాలో పెరుగుదల వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. సంవత్సరానికి కేవలం 2 సెం.మీ. మాత్రమే పెరుగుతాను. అందుకే నన్ను పెద్ద పెద్ద అక్వేరియాల్లో పెంచుతుంటారు. ఇందుకోసం మమ్మల్ని వేటాడుతుంటారు. దీని కారణంగానే మా జనాభా కాస్త తగ్గుతోంది. నా జీవిత కాలం 30 సంవత్సరాలు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని