ఆకు ‘కూర’ లు... నోరూరేలా!

ఆకుకూరలతో పప్పు, కూర, పచ్చడి లాంటివి చేసుకోవడం ఎప్పుడూ ఉండేదే. అందుకే వాటికి మరికొన్ని పదార్థాలను చేర్చి కాస్త మార్చి వండితే... అన్నం, పులావ్‌, రోటీలకు మంచి కాంబినేషన్‌ అవుతాయి.

Updated : 18 May 2024 23:33 IST

ఆకుకూరలతో పప్పు, కూర, పచ్చడి లాంటివి చేసుకోవడం ఎప్పుడూ ఉండేదే. అందుకే వాటికి మరికొన్ని పదార్థాలను చేర్చి కాస్త మార్చి వండితే... అన్నం, పులావ్‌, రోటీలకు మంచి కాంబినేషన్‌ అవుతాయి.


మేథీ ఎగ్‌ కర్రీ

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఆరు, నూనె: పావుకప్పు, మెంతికూర తరుగు: రెండున్నర కప్పులు, జీలకర్ర: చెంచా, యాలకులు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంపచ్చిమిర్చి పేస్టు: చెంచా, టొమాటోలు: రెండు,
దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, కారం: పెద్ద చెంచా, పసుపు: అరచెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేయాలి. ఇందులో పావుచెంచా ఉప్పు, కొద్దిగా కారం, పావుచెంచా పసుపు, ఉడికించిన గుడ్లు వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, యాలకులు వేయించి ఉల్లిపాయ ముక్కలు, అల్లంపచ్చిమిర్చి పేస్టు, టొమాటో తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు ఒకటిన్నర కప్పుల నీళ్లు, మెంతికూర తరుగు, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, మిగిలిన పసుపు, కారం, తగినంత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్లు కూడా వేసి కూర దగ్గరకు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరి.


చింతచిగురు - సెనగపప్పు కూర

కావలసినవి: సెనగపప్పు: ఒకటిన్నర కప్పు (ఉడికించుకోవాలి), ఉల్లిపాయలు:  రెండు, చింతచిగురు: కప్పు, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత, కారం: చెంచా, పసుపు: అరచెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, దనియాలపొడి: చెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లిపేస్టు: టేబుల్‌స్పూను. 

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుని ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగుతున్నప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు చింతచిగురుతోపాటు మిగిలిన పదార్థాలను వేసి అన్నింటినీ కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. చింతచిగురు మెత్తబడి కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.


హరియాలీ పనీర్‌

కావలసినవి: పాలకూర- పుదీనా- కొత్తిమీర: కట్ట చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: చెంచా, జీడిపప్పు: అయిదు (పావుకప్పు పాలల్లో నానబెట్టుకోవాలి), పనీర్‌ ముక్కలు: పెద్ద కప్పు, ఉల్లిపాయముక్కలు: పెద్ద కప్పు, టొమాటో తరుగు: అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను, గరమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ముందుగా పాలకూర, పుదీనా, కొత్తిమీరను కడిగి మిక్సీలో వేయాలి. ఇందులో పచ్చిమిర్చి, అరచెంచా జీలకర్ర కూడా వేసి పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా జీడిపప్పును పాలతో సహా పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి మిగిలిన జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టును వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి బాగా వేగాక టొమాటో తరుగు వేయాలి. రెండు నిమిషాలయ్యాక పసుపు, దనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, కారం వేసి అన్నింటినీ కలపాలి. ఇందులో - చేసిపెట్టుకున్న పాలకూర పేస్టు కూడా వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు జీడిపప్పు పేస్టు, పనీర్‌ముక్కలు, నెయ్యి వేసి కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.


మీల్‌మేకర్‌ - పాలక్‌ మసాలా

కావలసినవి: పాలకూర: మూడు కట్టలు (ఉడికించుకుని, గుజ్జులా చేసుకోవాలి), మీల్‌మేకర్‌: కప్పు, నూనె: పావుకప్పు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి తరుగు: చెంచా, అల్లంతరుగు: చెంచా, టొమాటో: ఒకటి, టొమాటో పేస్టు: పావుకప్పు, దనియాలపొడి: ఒకటిన్నర టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత. 

తయారీ విధానం: ముందుగా మీల్‌మేకర్‌ను పావుగంటసేపు వేడినీళ్లలో నానబెట్టుకుని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి.. మీల్‌మేకర్‌ను దోరగా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి జీలకర్రను వేయించి, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, టొమటో ముక్కలు వేసి అన్నింటినీ వేయించాలి. టొమాటో ముక్కలు మగ్గాక టొమాటో పేస్టు, దనియాలపొడి, పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, వేయించుకున్న మీల్‌మేకర్‌ వేసి పావుకప్పు నీళ్లు పోసి అన్నింటినీ కలపాలి. ఇందులో పాలకూర పేస్టు కూడా వేసి కలిపి కూర దగ్గరకు అయ్యాక స్టవ్‌ని కట్టేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..