ఆర్ట్స్‌ కాలేజీలో అరకు కాఫీ..!

స్టార్టప్‌ అన్న పదం వినగానే... ఇంజినీరింగ్‌ కాలేజీలూ, అక్కడి ఇంక్యుబేషన్‌ సెంటర్‌లూ, అందులో చదువుకుంటున్నవాళ్ళూ, తాజా మాజీ విద్యార్థులూ... వీళ్ళే గుర్తొస్తుంటారుకదా మనకి!

Published : 26 May 2024 00:50 IST

స్టార్టప్‌ అన్న పదం వినగానే... ఇంజినీరింగ్‌ కాలేజీలూ, అక్కడి ఇంక్యుబేషన్‌ సెంటర్‌లూ, అందులో చదువుకుంటున్నవాళ్ళూ, తాజా మాజీ విద్యార్థులూ... వీళ్ళే గుర్తొస్తుంటారుకదా మనకి! అలాంటి స్టార్టప్‌ సంస్కృతిని నిరుపేద విద్యార్థులకూ చేరువ చేస్తోంది- రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజి. పట్టాతోపాటూ చక్కటి వ్యాపారానుభవాన్ని చేతికిస్తోంది... ప్రపంచాన్ని దీటుగా ఎదుర్కొనే శక్తినీ అందిస్తోంది. ఆ కాలేజీ స్టార్టప్‌ల వరసలో ఇప్పుడు తాజాగా వచ్చి చేరింది... అరకు కాఫీ!

 ఇవాళ ఆదివారం కదా. నలభై ఎకరాల రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ క్యాంపస్‌లోని మైదానం ఉదయం సాయంత్రాల్లో కిక్కిరిసి పోతుంది. ఓ వైపు వాకర్సూ, మరోవైపు క్రికెటర్సూ హల్‌చల్‌ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడో కొత్త అడ్డాగా మారింది ‘అరకు కాఫీ’. ఇది- పేద విద్యార్థుల కోసం, పేద విద్యార్థులే నడుపుతున్న ఔట్‌లెట్‌. ఆర్ట్స్‌ కాలేజీల్లో మనకు అరుదుగా కనిపించే స్టార్టప్‌. విదేశాల్లోలా ‘స్పాన్సర్డ్‌ కాఫీ’ అన్న పద్ధతి ఉంది ఇక్కడ. మీరో కాఫీ తాగి- ఈ క్యాంపస్‌లోని విద్యార్థులకి ఉచితంగా కాఫీల్ని ఆఫర్‌ చేయొచ్చు. మీ పేరుతో ఓ టోకెన్‌ తీసి వీళ్ళకిస్తే- వాటిని హాస్టల్‌లో చదివే పేద విద్యార్థులకి అందిస్తారు! అంతేకాదు, 20 రూపాయల ధర ఉన్న కాఫీని విద్యార్థులకైతే రూ.15కే ఇస్తున్నారు. వాటర్‌ బాటిల్‌ తాగి ఖాళీ సీసా తిరిగిచ్చేస్తే రూ.1 మీకిస్తారు. గిరిజన కార్పొరేషన్‌ ద్వారా ఆదివాసీల ఉత్పత్తుల్నీ అమ్మి వాళ్ళకి సాయపడుతున్నారు. అలా ప్రారంభించిన రెండు నెలల్లోనే కాఫీ ప్రియుల మనసు గెలిచేసిందీ ఔట్‌లెట్‌. నెలకి లక్షన్నర రూపాయల రాబడిని సొంతం చేసుకుంటోంది. ఆ లాభంలో సగభాగాన్ని కాలేజీలో పేద విద్యార్థుల ఫీజులు కట్టేందుకు అందిస్తోంది! అసలు ఇదంతా ఎలా మొదలైందంటే...

వీళ్ళు సైతం...

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీది 140 ఏళ్ళ చరిత్ర. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణలాంటివాళ్ళు పనిచేసిన విశిష్ట సంస్థ ఇది. దేశవ్యాప్తంగా ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల హవా పెరిగి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీల ప్రభ తగ్గుతున్న వేళలో... తన ప్రాభవాన్ని ఏమాత్రం కోల్పోని కాలేజీ ఇది. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఏడువేలు! అటానమస్‌ కాలేజీ కాబట్టి యూజీ, పీజీల్లో వినూత్న కోర్సుల్ని రూపొందిస్తూ దూసుకెళుతోంది. ఒక్క గోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా- ఇటు విశాఖ, అటు తెలంగాణ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వీరిలో 80 శాతం పేద కుటుంబాలకి చెందినవాళ్ళే. ట్యూషన్‌ ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక, మంచి దుస్తులూ లేక సతమతమయ్యేవాళ్ళే. ఇలాంటివాళ్ళ కోసమే ఈ కాలేజీలో ఐదేళ్ళకిందట ‘పూర్‌ స్టూడెంట్స్‌ ఫండ్‌’ అని మొదలుపెట్టారు. కాలేజీలోని సిబ్బందికి జీతం వచ్చేరోజు ఊప్రతి క్లాసులోనూ ఓ బాక్సుని పెడతారు. అందులో తమకు తోచిన నగదుని వేయమంటారు. కాస్త డబ్బున్న విద్యార్థులూ సాయపడొచ్చు. దీనితో ఏటా 150 మంది విద్యార్థుల విద్యా అవసరాలు తీరుస్తున్నారు. కాకపోతే- ప్రతిసారీ దానంలా కాకుండా- ఈ విద్యార్థులు తమ సొంతకాళ్ళపైన నిలబడేలా ఏదైనా చేయాలన్న మేథోమథనం కాలేజీ కౌన్సిల్‌ సభ్యుల్లో మొదలైంది. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేస్తున్నట్టు వాళ్ళ చేత స్టార్టప్‌లు పెట్టించాలన్న ఆలోచనా వచ్చింది. అలా, గత డిసెంబర్‌లో- ఎనిమిది మంది విద్యార్థులకి రకరకాల జ్యూట్‌ బ్యాగుల తయారీపైన శిక్షణ ఇప్పించి- వాళ్ళ చేతే ‘జ్యూట్‌ మేకింగ్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను పెట్టించారు. అది క్లిక్‌ అయ్యింది. ఆర్టిఫిషియల్‌ జ్యువెలరీ తయారీకి సంబంధించి మరో స్టార్టప్‌ పెడితే అది కూడా సక్సెస్‌ అయ్యింది. ఆ విజయాలతో ఇంకాస్త పెద్ద స్టార్టప్‌ని ఏర్పాటు చేయాలనుకున్నారు- కాలేజీ ప్రిన్స్‌పల్‌ ఆర్‌కే రామచంద్రరావు. అప్పుడే ఆయన దృష్టి ‘అరకు కాఫీ’పైన పడింది.

సూపర్‌హిట్‌...

అరకు కాఫీ స్టార్టప్‌ కోసం పదిమంది విద్యార్థులు ఆసక్తి చూపించారు. గుంటూరులోని అరకు బేవరేజస్‌ సంస్థ నుంచి రాయితీలపైన మెషిన్‌లనూ, ఇతర పరికరాలనూ తీసుకున్నారు. ఉన్నతస్థాయి శుచీశుభ్రత పాటించేలా ఔట్‌లెట్‌లో పనిచేసే ప్రతి విద్యార్థీ ప్రత్యేక యూనిఫార్మ్‌, క్యాప్‌, గ్లవ్స్‌ వేసుకునేలా నియమావళి (ఎస్‌ఓపీ) రాసుకున్నారు. రోజూ ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకూ, మళ్లీ సాయంత్రం నాలుగు నుంచి ఆరుదాకా విద్యార్థులుంటే మిగతా సమయాల్లో కాలేజీ సిబ్బంది ఉండేలా చూసుకున్నారు. వారంపాటు రిహార్సల్స్‌ చేసి- గత మార్చి 24న అరకు కాఫీని ప్రారంభించారు. విద్యార్థులే కాకుండా క్యాంపస్‌లో ప్రతిరోజూ వాకింగ్‌కి వచ్చే వాళ్ళనీ లక్ష్యంగా చేసుకున్నారు.

తొలి నెలలోనే 1.67 లక్షల రూపాయలు వచ్చింది. ఖర్చులుపోగా మిగిలిన సొమ్ములో సగం ‘పూర్‌ స్టూడెంట్‌ ఫండ్‌’కి అందించారు. మిగతా మొత్తాన్ని స్టార్టప్‌ నిర్వాహకులుగా ఉన్న విద్యార్థులు పంచుకున్నారు!
ఈ అరకు కాఫీ ఔట్‌లెట్‌తో వచ్చే ఏడాది తమ ట్యూషన్‌ ఫీజుకి ఢోకా ఉండదని విద్యార్థులు అంటుంటే- పూర్‌ స్టూడెంట్‌ ఫండ్‌ ద్వారా కొత్తగా కనీసం 50 మంది పేదవిద్యార్థుల అవసరాలు తీరొచ్చని ఆనందిస్తున్నారు ప్రిన్స్‌పల్‌! ఆలోచన అదిరింది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..