సహజ సమీరం

స్టూడెంట్స్‌లో ఇంకెవరికీ తెలీదు. మీ సమీర్‌ నందా ఎవరికీ చెప్పకుండా మీరు చూడాలి... అది మీ బాధ్యత. ప్లీజ్‌ మాకు హెల్ప్‌ చేయండి. వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని.

Updated : 21 Apr 2024 00:21 IST

- ఉమాబాల చుండూరు

అనంత్‌రామ్‌కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు... కొడుకు ‘సమీర్‌ నందా’ని చూస్తుంటే.కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మిగిలిన అందరి పిల్లల్లా ఉండటం లేదు.
ఒక ఆట లేదు... స్నేహితుల్లేరు. మొబైల్‌ ఫోన్‌ చూడడు. టీవీ చూడడు. మొత్తానికి ఈ కాలపు పిల్లల్లా లేడు. అందుకనే అనంత్‌రామ్‌కి వ్యథగా ఉంది.
కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళాలి. అనంత్‌రామ్‌ తండ్రి విశ్వనాథ్‌గారికి అనంత్‌రామ్‌ కాకుండా ఒక కూతురు. ఆయన అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్‌. అనంత్‌రామ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.
అనంత్‌రామ్‌ తండ్రి శిక్షణలోనే, ఇంటర్‌ తరవాత ఎంసెట్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. తండ్రి ఒకటే చెప్పాడు అనంత్‌కి- ‘నువ్వు ఇంటర్‌లోని నీ సబ్జెక్ట్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటే చాలు. ఏ పేజీలో ఏముందో తెలిసేటంతగా చదవాలి- ఎక్కడ నుండి ప్రశ్న ఇచ్చినా జవాబు ఇచ్చేట్టు. ఇక ఎంసెట్‌ పద్ధతి తెలుసుకుంటే చాలు. నీకు నామీద నమ్మకం లేకపోతే, నిన్ను తప్పక కాకినాడలోగానీ విజయవాడలోగానీ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ చేస్తాను.నేను డబ్బు ఆదా గురించి ఆలోచించి కాదు చెప్తోంది. నామీద నమ్మకం, నీమీద నమ్మకం అంతే, ఆలోచించు’ అని. చిన్నప్పటి నుంచీ తండ్రి గురించి తెలిసిన అనంత్‌ ‘మీరు చెప్పండి నాన్నా’ అని తండ్రికి వదిలేశాడు. తండ్రే అప్పుడప్పుడూ టెస్ట్‌లు పెట్టేవాడు- ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో. తన శక్తినంతా ధారపోసి కొడుకు పరిణతి సాధించేలా తర్ఫీదు ఇచ్చాడు.
కొడుక్కి రిలాక్స్‌ అయ్యే టైమ్‌ కూడా ఇచ్చేవాడు. ఆటలకి పంపించేవాడు. కొడుకుని దీటుగా తయారుచేశారు.
కాకినాడ సెంటర్‌ కాబట్టి, అక్కడే హోటల్‌లో ఒక రూమ్‌ తీసుకుని ముందురోజే వెళ్ళి అక్కడుండి, మర్నాడు కొడుకు చేత పరీక్ష రాయించారు. అద్భుతమేంటంటే కొడుక్కి ఎంసెట్‌లో రెండువందల నలభై ఎనిమిదో ర్యాంక్‌ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు.
కోచింగ్‌ సెంటర్స్‌ వాళ్ళందరూ వెనకపడ్డారు. వాళ్ళ దగ్గర చదివినట్టు చెప్తే, లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు. విశ్వనాథంగారు ససేమిరా ఒప్పుకోలేదు. కొడుక్కి హైదరాబాద్‌ ఉస్మానియాలో ‘ఫ్రీ సీట్‌’ వచ్చింది.

అనంత్‌ ఇంజినీరింగ్‌ కంప్లీట్‌ చేశాక ‘గేట్‌’ ఎంట్రన్స్‌ పరీక్ష రాసి, సీట్‌ తెచ్చుకుని చెన్నైలో ఎంటెక్‌ చదివాడు. అనంత్‌కి మొదటి నుండీ విదేశాల్లో చదవాలని లేదు.
విశ్వనాథంగారు కొడుకు పైచదువు విషయం కొడుకు ఇష్టానికే వదిలేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో అనంత్‌కి ముంబైలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
తరవాత ఒక రెండు కంపెనీలు మారిన అనంతరం, హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది.
అనంత్‌ తన క్లాస్‌మేట్‌ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే కూడా అభ్యంతరం లేకపోయింది విశ్వనాథంగారికి.
కోడలు పంజాబీ అయినా వెజిటేరియన్‌ అవడంతో, అస్సలు సమస్య లేకపోయింది. లేకపోతే, ఆయన భార్యకి కొంచెం నచ్చచెప్పి,  ఒప్పించాల్సి వచ్చేది, అంతే.
అనంత్‌కి ఒక కొడుకు. పేరు ‘సమీర్‌ నందా’. ఆ అబ్బాయి రెండో తరగతి చదువుతుంటే, అనంత్‌ ‘డైరెక్టర్‌’ అవడం వలన, ఒక ప్రాజెక్ట్‌ మీద యూఎస్‌ పంపించారు.
‘ఒక రెండేళ్ళు ఉండాల్సి రావొచ్చు అక్కడ సుమారుగా’ అని చెప్పారు. అప్పటికి అనంత్‌ భార్య ‘ఉన్ముక్త’ అయిదో నెల గర్భవతిగా ఉంది.
రెండేళ్ళ కోసం ఇక్కడ చదువు మాన్పించి, కొత్త వాతావరణంలో పిల్లాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని- తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళదామని, అనంత్‌ అనుకున్నాడు. ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది.
తన పేరెంట్స్‌ చండీఘర్‌లో ఉంటారు. కొడుక్కి అది ఇంకా కొత్త వాతావరణం అవుతుందనుకుంది. తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి, తాతా బామ్మలతో సమీర్‌కి కూడా బాగానే సాన్నిహిత్యం ఉంది. దాంతో వాళ్ళ దగ్గర ఉండేందుకు సమీర్‌కేమీ అభ్యంతరం లేకపోయింది. అనంత్‌ వాళ్ళు తండ్రి దగ్గర కొడుకుని నిశ్చింతగా వదిలి, అమెరికాకి వెళ్ళిపోయారు.
సమీర్‌ తాతగారి ఊళ్ళో స్కూల్లో చేరాడు. అప్పటికి ఆయనకి ఇంకో రెండేళ్ళు సర్వీస్‌ ఉంది. మనవడితో వాళ్ళకి కాలక్షేపం బాగా ఉండేది. సమీర్‌కి కూడా ఆ ఊరూ పరిసరాలూ పచ్చదనమూ చెరువులూ కాలవలూ బాగా నచ్చేశాయి. ఇంటికి వచ్చి హోమ్‌వర్క్‌ చేసుకుని, బాగా ఆడేవాడు పిల్లలతో. ఈలోపు అమెరికాలో అనంత్‌కి ఆడపిల్ల పుట్టింది. ‘విశ్వంభర’ అని తండ్రిపేరు కలసి వచ్చేట్టు పెట్టాడు. విశ్వనాథంగారు ఒక నలుగురు పిల్లలకి ట్యూషన్‌ చెప్పేవారు. తాతగారే మనవడి చదువు పర్యవేక్షించేవారు. ప్రత్యేకంగా ట్యూషన్స్‌కి వెళ్ళకుండా, స్కూల్‌కి మాత్రమే వెళ్ళొచ్చి రాత్రి ఒక గంట చదువూ హోమ్‌వర్క్‌ చేస్తే సరిపోయేది సమీర్‌కి. స్వతహాగా చురుకైన వాడవడంతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయేది.
‘కాన్సెప్ట్‌ని ముందు బాగా అర్థం చేసుకుని నీకు అర్థమైనది నువ్వు సొంతంగా రాయి, టీచర్‌ చెప్పినట్టే మక్కీకి మక్కీ బట్టీపట్టి రాయనవసరం లేదు’ అని చెప్పేవారు ఆయన.
చిన్నచిన్న కథల పుస్తకాలు ఇంగ్లిష్‌, తెలుగులో ఉన్నవి తెచ్చి ఇచ్చేవారు చదవమని. నెమ్మదిగా కథల పుస్తకాలనుండి, మంచి మంచి పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాడు.
తరవాత లైబ్రరీకి వెళ్ళి గంటలు గంటలు ఉండేవాడు సెలవు రోజుల్లో. అది అలవాటుగా మారిపోయింది సమీర్‌కి. అనంత్‌కి ఆఫీసు పని పొడిగించారు. ఇంకో మూడేళ్ళు ఎక్కువ ఉండాల్సి
వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుతో, తండ్రితో.
విశ్వనాథంగారు రిటైర్‌ అయిపోయారు. ఆయన దగ్గర చాలా పాత మోడల్‌ ఫోన్‌ ఉండేది. ఫోన్‌ మాట్లాడడానికి మాత్రమే పనికొచ్చేది. కొత్త మోడల్‌ ఫోన్‌ కొనమన్నా, ఆయన కొట్టి పడేసేవారు ఆ మాటని.
‘ఇంట్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉంది, బయటికి వెళ్తే ఈ ఫోన్‌ చాల్లే’ అనేవారు. సమీర్‌కి కూడా ఈ ఫోన్స్‌ మీద వ్యామోహం ఉండేది కాదు. సమీర్‌ ఎనిమిదో క్లాస్‌కి వచ్చాక, అనంత్‌ వాళ్ళు తిరిగి వచ్చేశారు హైదరాబాద్‌కి. ఆ ఏడాది ఎగ్జామ్స్‌ పూర్తికాగానే సమీర్‌ని హైదరాబాద్‌ తీసుకొచ్చి, మంచి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో తొమ్మిదో క్లాస్‌లో చేర్చారు.
స్కూల్‌ వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్‌లో టాపర్‌గా రావడం... అనంత్‌ ఉన్న పొజిషన్‌ బట్టి, సమీర్‌కి ఈజీగానే సీట్‌ వచ్చేసింది. తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటే, ఆయన ‘ఇంకొంతకాలం పోయాక వస్తాంలే’ అని చెప్పారు. ఆయనకి ట్యూషన్స్‌, స్నేహితులతో కాలక్షేపం బాగానే అవుతోంది. ఒక పల్లెటూరులో దగ్గర దగ్గరగా ఒక ఆరేళ్ళు ఉండి రావడం వలన, సమీరే ఇంకా ఇక్కడ స్కూల్‌ వాతావరణానికీ పిల్లలకీ అలవాటు పడలేదు. స్నేహితులు ఎవరూ ఏర్పడలేదు. ఎలా తెలిసిందో... ఒక ఆదివారం తండ్రి బయటికి వెళ్ళినప్పుడు,  అబిడ్స్‌ వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాలు అన్నీ చూసి, కొన్ని కొని తెచ్చుకున్నాడు.
తండ్రి ‘అలా ఎందుకురా..? మామూలు షాప్‌కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా’ అంటే... ‘లేదు నాన్నా, నాకు ఫలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ, పాత పుస్తకాలు కనుక్కోవడం నాకు చాలా బావుంది’ అన్నాడు.
‘ఎలా వెళ్ళావు అంతదూరం... కార్‌లో వెళ్ళలేదట కదా’ అంటే, ‘సిటీని చూసి చాలా ఏళ్ళయింది కదా, ఒకసారి అంతా చూడాలనిపించింది. మెట్రోలో కొంత దూరమూ ఆర్టీసీ బస్‌లో కొంత దూరమూ నడుచుకుంటూ కొంత దూరమూ వెళ్ళాను. అలా జనాల్ని చూసుకుంటూ వెళ్తే బావుంది. వచ్చేటప్పుడు క్యాబ్‌లో వచ్చేశాలే’ అన్నాడు.
అనంత్‌ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏ రచయిత పుస్తకాలు బావుంటాయో తండ్రికి చెప్పేవాడు సమీర్‌. తెలుగులో శ్రీశ్రీ, తిలక్‌ ఇష్టమనేవాడు. శ్రీశ్రీ కవితలు కొన్ని నోటికి వచ్చని కూడా చెప్పాడు. ‘హ్యారీ పోటర్‌ బుక్స్‌ చదివావా..?’ అని అడిగాడు అనంత్‌.

సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదివారని విని ఉన్నాడు అనంత్‌... అందుకే అడిగాడు. ‘నాకు తెలీదు నాన్నా... బావుంటాయా అవి, ఈసారి కొనుక్కుంటా’ అన్నాడు.
‘ఏ హీరో ఇష్టంరా’ అంటే, ‘ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలో హీరో ఇష్టమనిపిస్తాడు’ అని చెప్పేవాడు. ‘అమీర్‌ఖాన్‌ సినిమాలు బావుంటాయి అంటాడు. రణ్‌ధీర్‌ కపూర్‌ అందంగా ఉంటాడు... మంచి ఫిజిక్‌’ అని చెప్పాడు.
తన సహోద్యోగులు అందరూ తమ పిల్లలు ఫోన్‌కీ ఐ-పాడ్‌కీ టీవీలకీ బానిసలైపోయారనీ వీడియో గేమ్స్‌, ఇంటర్నెట్‌లో మునిగి తేలుతున్నారనీ బాధపడేవారు.
మరి, ‘సమీర్‌ ఏజ్‌ పిల్లలు అలా ఉంటే, వీడెందుకు ఇలా ఉన్నాడని’ అనుకునేవాడు. ‘వీడు సరైన దారిలోనే వెళ్తున్నాడా... నేను నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానా... ఈ పోటీ ప్రపంచంలో వీడు నెగ్గుకు రాగలడా’ అనిపించేది అనంత్‌రామ్‌కి.
‘నా గురించి నాన్న కూడా ఇలా అనుకుని ఉంటారా...’ ఈసారి కలిసినప్పుడు ఈ విషయం నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు అనంత్‌.
అలా అని చదువు విషయంలో సమీర్‌ వెనకబడి ఉండేవాడు కాదు... మంచి మార్కులే వచ్చేవి.
ఆటల్లో ఫుట్‌బాల్‌ ఇష్టపడేవాడు. ‘కోచింగ్‌కి వెళ్ళరా’ అంటే, ‘కోచింగ్‌ ఎందుకు నాన్నా, కొద్దిరోజులాగండి, నేను ఒక టీమ్‌ని తయారుచేసి ఆడతాను కదా’ అనేవాడు.
టీవీ పెడితే చూడకుండా, ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు.
ముఖ్యంగా ఆగస్ట్‌ 15కూ రిపబ్లిక్‌డేలకూ స్కూల్లో జరిగే ఏ సెలబ్రేషన్స్‌కీ వెళ్ళేవాడు కాదు. ‘ఎందుకురా?’ అంటే... ‘అబ్బా ఎండలో చాలాసేపు నిలబడాలి నాన్నా. హాయిగా ఇంట్లో కూర్చుని ఒక బుక్‌ చదువుకుంటే హాయిగా ఉంటుంది నాకు’ అంటాడు.
స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనకపోవడం వల్లనేమో ‘ఆ రోజుల్లో స్కూల్‌కి వెళ్ళకపోయినా టీచర్లు గమనించడం లేదేమో’ అనుకునేవాడు అనంత్‌.
‘స్విమ్మింగ్‌ నేర్చుకోరా’ అంటే... ‘నేర్చుకోవడమేంటి నాన్నా, నేను తాతగారి ఊళ్ళో కాలవల్లో ఈత కొట్టాను. నేను నాలుగో క్లాసులో ఉండగానే నేర్చుకున్నాను’ అన్నాడు.
ఒకరోజు తోటమాలితో మాట్లాడుతుంటే చూశాడు సమీర్‌ని. తరవాత ఎప్పుడో మాలిని అడిగాడు అనంత్‌... ‘ఏవంటున్నాడు మా అబ్బాయి’ అని.
అనంత్‌కి- అందరి దగ్గరనుండీ కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది.
‘మా పిల్లలు ఏం సదూతున్నారని’ అడిగారండీ బాబుగారు. నేను సెప్పాను. ‘గవర్నమెంట్‌ స్కూల్లో బాబూ... అక్కడ ఈల్లే శ్రద్ధగా సదూకోవాలి. టీసర్లు అంతగా పట్టించుకోరు. మాకేమో ఆళ్ళేం సదూతున్నారో తెల్వదు అని.’ ‘బాబుగారన్నారూ... ఏ స్కూల్‌ అయినా మంచిదే... స్కూల్‌ను బట్టి సదువు ఉండదు... ఎక్కడైనా ఎవరికి వాళ్ళు సదూకోవాలి అన్నారండీ.’
‘వాళ్ళకి ఏమైనా తెలియకపోతే నా దగ్గరికి తీసుకురా... నే సెప్తా అన్నారండీ’ అన్నాడు.
‘అయ్యబాబో... సిన్నాయనైనా పెద్ద ఆలోసనలండీ అబ్బాయిగారివి’ అన్నాడు. అనంత్‌కయితే... ‘సమీర్‌, తెలుగు సినిమాల్లో ముది మాటలు మాట్లాడే బాలనటుడిలా’ అనిపించాడు.
‘నాన్నా, నాకు ఇది కావాలి కొనవా’ అని అడుగుతాడేమో అని చూసేవాడు అనంత్‌.
ఏమీ అడిగేవాడు కాదు... అదేంటో. ఇవన్నీ చూసి అనంత్‌కి దిగులు పట్టుకుంది. సైకాలజిస్ట్‌ని కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ తమాయించుకున్నాడు.
భార్యతో చెప్తే, ఆమె అతని మాటలు కొట్టి పడేసింది. ‘నాతో బాగానే మాట్లాడతాడు... స్కూల్లో విషయాలు అన్నీ చెప్తాడు. విశ్వతో ఆడతాడు. నందూ విషయంలో నాకేమీ
భయం లేదు. వాడికి హిందీ వచ్చు, పంజాబీ అర్థం చేసుకుంటాడు. మా అమ్మా నాన్నలతో కూడా కొంచెం కొంచెం మాట్లాడతాడు. తెలుగు, ఇంగ్లిష్‌ ఎలాగూ వచ్చు. వాడు బాగానే ఉన్నాడు. చిన్నవాడు... వేరే వాతావరణంలో అడ్జస్ట్‌ అవ్వడానికి టైమ్‌ పడుతుందిలే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు’ అనేసింది.
‘ముక్త అంతే... అన్నీ తేలికగా తీసుకుంటుంది’ అనుకున్నాడు అనంత్‌.
ఇలా ఉండగా ఒకరోజు అనంత్‌కి స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఫోన్‌ చేసింది- ఒకసారి వచ్చి కలవమని. అప్పటికప్పుడు ఆఫీస్‌లో చెప్పేసి భార్యని తీసుకుని మరీ వెళ్ళాడు అనంత్‌. కొడుకు గురించి ఏమి చెప్తారో అని ఆందోళనగా ఉంది అనంత్‌కి.
తను అనుకున్నట్టే వీళ్ళూ చెప్తే ఏం చేయాలో అని కంగారుగా కూడా ఉంది. ప్రిన్సిపల్‌ వాళ్ళిద్దరినీ కూర్చోమంది.
‘వాటర్‌ కావాలా’ అని అడిగి, స్టార్ట్‌ చేసింది చెప్పడం... ‘‘చూడండి అనంత్‌... మీరిద్దరూ రావడం మంచిదయ్యింది. మీ అబ్బాయి సమీర్‌ నందా గురించి మాట్లాడాలి. మీవాడు చురుకైనవాడే... బాగా చదువుతాడు... బుద్ధిమంతుడు. అయితే అన్నింటికీ లాజికల్‌గా ప్రశ్నిస్తాడు. టీచర్‌ డిక్టేట్‌ చేసింది రాయడు. ఎగ్జామ్‌లో... తను ఓన్‌గా రాస్తాడు ఏ ప్రశ్నకైనా ఆన్సర్‌. అడిగితే ‘తప్పు రాశానా టీచర్‌?’ అని అడుగుతాడట.
తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే ఇతనొక్కడూ వేరేలా ఉండటమేంటి? ‘అసలు ఈ ఎగ్జామ్స్‌ ఎందుకు టీచర్‌’ అంటాడట. ‘ఒక్కరోజులో చదివి పాస్‌ అవ్వొచ్చు...
ఒక వారం చదివితే ఫస్ట్‌ క్లాస్‌లో కూడా పాస్‌ అవ్వొచ్చు. వీటి ద్వారా ఎలా డిసైడ్‌ చేస్తారు- స్టూడెంట్‌ ఎబిలిటీని’ అంటాడట.
‘మీరు ఇయర్‌ అంతా అన్ని టెస్ట్‌ల్లో పెర్ఫామెన్స్‌బట్టి నెక్స్ట్‌ క్లాస్‌కి పంపించండి... ఈ పరీక్షలూ ఇదంతా ట్రాష్‌- శుద్ధ వేస్ట్‌’- అన్నట్లు వాదిస్తాడట.
వచ్చే సంవత్సరం టెన్త్‌కి వస్తాడు...అదొక బెంచ్‌మార్క్‌ లైఫ్‌లో. మేము చెప్పినట్లు విని, ఎగ్జామ్స్‌లో రాస్తే బాగుంటుంది.’’ ‘‘అన్నట్లు, మీ వాడికి బయట ట్యూషన్‌ ఉందా?’’ అని అడిగింది ఆవిడ. ‘‘లేదు’’ అన్నారు ఇద్దరూ. ‘‘అవునా’’ అని ఆశ్చర్యపోయిందావిడ. ‘‘నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను ప్రత్యేకంగా... ఇండిపెండెన్స్‌ డేకి రాడు... రిపబ్లిక్‌ డేకి రాడు... ఏ స్కూల్‌ ఫంక్షన్‌కీ రాడు... వేరే ఏ ఆక్టివిటీస్‌లోనూ పార్టిసిపేట్‌ చెయ్యడు’’ అంటూ ఫిర్యాదు. క్లాస్‌ టీచర్‌ వచ్చింది ఈలోపు... ఆమెని అడిగారు ‘‘క్లాస్‌లో ఎలా ఉంటాడు?’’ అని. ఆమె ఏమీ కంప్లైంట్‌గా చెప్పలేదు. పాఠాలు శ్రద్ధగా వింటాడట... సందేహాలు అడుగుతాడట... ఇద్దరు ముగ్గురితో బాగానే ఉంటాడట... అమ్మాయిలతో కూడా మాట్లాడతాడట... సహ విద్యార్థులనుండి కూడా సమీర్‌ మీద ఏమీ కంప్లైంట్స్‌ లేవని చెప్పింది టీచర్‌.
కాకపోతే తక్కువ మాట్లాడతాడనీ... అందరిలా అల్లరి చేయడనీ కూడా చెప్పింది. అయితే మాథ్స్‌ చెప్పే టీచర్‌ని స్కూల్‌ వాళ్ళు తీసేశారట. అది తెలిసి సమీర్‌ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చి, ప్రిన్సిపల్‌ని అడిగాడట... ‘ఎందుకు ఆమెని తీసేశారు?’ అని. ఆమెని లీవ్‌ వేకెన్సీలో తీసుకున్నారట... క్వాలిఫైడ్‌ కాదట. ‘క్వాలిఫైడ్‌ కాకపోతే ఏమైంది బాగా చెప్తున్నారు కదా... మాకు బాగా అర్థమవుతున్నాయి... ఆమెని ఉంచండి’ అని అడిగాడట.
‘మాకు కొన్ని రూల్స్‌ ఉంటాయి... పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అడగడం సరికాదు’ అందావిడ. అనంత్‌రామ్‌తోపాటు ఉన్ముక్త కూడా చెప్పింది... ‘‘లేదు మేడమ్‌,  మేము మా అబ్బాయికి నచ్చ చెప్తాం’’ అని. ప్రిన్సిపల్‌ క్లాస్‌ టీచర్‌ని వెళ్ళిపొమ్మని... ‘‘మీతో అసలు ఇంకో ముఖ్య విషయం మాట్లాడాలి, అందుకే పిలిచాను. ఈమధ్య మా స్కూల్‌లో ఒక సంఘటన జరిగింది... జరగకూడనిదే... మా స్కూల్లో మేల్‌ పీటీ టీచర్‌ ఒక టెన్త్‌క్లాస్‌ అమ్మాయితో మిస్‌ బిహేవ్‌ చేశాడట... ఆ టైమ్‌లో మీ సమీర్‌ ఆ రూమ్‌లోకి వెళ్ళాడట బాల్‌ తీసుకోడానికి. ఆ టీచర్‌ ఇద్దరినీ బెదిరించారట- ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని. ఆ అమ్మాయి ఏడుస్తుంటే... ‘ప్రిన్సిపల్‌కి చెపుదాం ఏం భయలేదని’ ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, సమీర్‌ ఆ అమ్మాయిని తీసుకుని, నా దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. మేము వెంటనే ఆ టీచర్‌కి వార్నింగ్‌ ఇచ్చి, టెర్మినేట్‌ చేసేశాం. నెక్స్ట్‌డే ఆ అమ్మాయి పేరెంట్స్‌ని పిలిచి జరిగింది చెప్పి, పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వొద్దనీ మా స్కూల్‌ పరువు పోతుందనీ ప్రాధేయపడ్డాం. ఇకముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా నచ్చచెప్పాం. వాళ్ళు వినకుండా... వాళ్ళమ్మాయికి మా స్కూల్‌ నుండి టీసీ తీసుకుని తీసుకెళ్ళిపోయారు. మేమెంత చెప్పినా వాళ్ళు ఈ స్కూల్‌లో ఉంచడానికి ఇష్టపడలేదు... ఇది దురదృష్టకర సంఘటన. అయితే మీ అబ్బాయికి ఈ విషయం తెలుసు.

స్టూడెంట్స్‌లో ఇంకెవరికీ తెలీదు. మీ సమీర్‌ నందా ఎవరికీ చెప్పకుండా మీరు చూడాలి... అది మీ బాధ్యత. ప్లీజ్‌ మాకు హెల్ప్‌ చేయండి.
వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని. కానీ ఈ విషయం తెలిసినవాడు మీ అబ్బాయి. తన మనసుకు నచ్చిందే చేస్తాడు తప్ప మేము చెప్పింది వినడు. అందుకే మిమ్మల్ని పిలిచాను’’ అందావిడ. రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని, తెరిచి చెప్పాడు అనంత్‌ స్పష్టంగా... ‘‘మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి మావాడి గురించి చెప్పడం చాలా మంచిదయ్యింది.
ఈరోజు నాకు అద్భుతమైన రోజు... ఇంతకాలం నన్ను ఒక సందేహం పీడిస్తూ ఉండేది... మా సమీర్‌ అందరి పిల్లల్లా ఉన్నాడా తేడాగా ఉన్నాడా అని. మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పుపని చేశానా అని కూడా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు అందరు పిల్లల్లాగే ఉన్నాడు. ఒక అడుగు ముందుకే ఉన్నాడు.
వాడు ప్రశ్నిస్తున్నాడు- అది చాలు నాకు.
తెలివిగా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి భయపడటం లేదు. అన్యాయాన్ని కూడా ఎదిరించగలడు ఇంకొంచెం పెద్దయితే... ఎంతోకొంత సమాజానికి మంచి చేస్తాడు. సమాజానికి ఉపయోగపడతాడు.
వాడు ఈ పోటీ ప్రపంచంలో బతకగలడా అనుకున్నాను. హాయిగా బతుకుతాడు... ఇప్పుడున్న విద్యావ్యవస్థలో తోటి పిల్లలతో సమానంగా పోటీ పడలేకపోవచ్చు... ఫర్వాలేదు. వాడే అనేక మంచి మార్గాలు వెతుక్కోగలడు... గౌరవంగా బతకగలడు.
ఆగస్ట్‌ 15కీ జనవరి 26కీ జెండాలు పట్టుకుని స్కూల్‌కి వస్తేనే, దేశభక్తి ఉందనీ దేశానికి ఏదో చేస్తారనీ అనుకోవడం తప్పు. ప్రశ్నించే ఆలోచనా, ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి.
నాకు ఎంతో భరోసా వచ్చింది.
నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను... నా కొడుకుని ‘సాన పెట్టి వజ్రంలా చేసి’ నా చేతిలో పెట్టారు నాన్న. దాని విలువ నాకు ఇప్పుడే తెలుస్తోంది.
పోతే- మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని, మమ్మల్ని చెప్పమంటున్నారు. ‘సారీ... తప్పుని.. తప్పని చెప్పకు’ అని నేను చెప్పను. వాడంతట వాడు మరచిపోయి ఊరుకుంటే సరే. కావాలంటే మీ స్కూల్‌ నుండి తీసుకుపొమ్మంటే తీసుకుని వెళ్ళిపోతా. వాడిని ఏ స్కూల్‌లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు. ఫైనల్‌గా ఒక విషయం చెప్పి ముగిస్తా... ఇక్కడ చెప్పడం అవసరం.
అమితాబ్‌ బచ్చన్‌కి పదహారేళ్లప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే, అమితాబ్‌ బచ్చన్‌ తల్లి స్నేహితురాలు చూసి, అమితాబ్‌ తల్లికి చెప్పిందట- ‘మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు... జాగ్రత్త’ అని. అది విని అమితాబ్‌ తల్లి తేజీ బచ్చన్‌గారు అన్నారట... ‘థాంక్‌ గాడ్‌... నా కొడుకు పదహారేళ్ళ అబ్బాయి ఎలా ఉండాలో, అలానే ఉన్నాడు...’ అని.
ఈమధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాను. ఇప్పుడు నాకు కూడా తెలిసింది... మా అబ్బాయి అందరు అబ్బాయిల్లాగే ఉన్నాడు- మరింత పరిణతితో..!
వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను. కిటికీలోంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని గుర్తించి అస్వాదించకుండా, గది తలుపులు మూసేసి, కూర్చుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అనవసరంగా. మీరు మా అబ్బాయి గురించి చెప్పి, నాకు చాలా సహాయం చేశారు... నమస్తే’’ అని, ప్రిన్సిపల్‌ ఆశ్చర్యంగా చూస్తుండగా, భార్యతో బయటికి అడుగు వేశాడు.
అతని నడకలో కొడుకు భవిష్యత్తు పైన ఎంతో నిశ్చింత కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..